Jump to content

అటుకులు

వికీపీడియా నుండి
అటుకులు
అటుకుల ఉప్మా

అటుకులు అనేవి వరి ధాన్యం నుండి తయారుచేయబడే ఆహారపదార్ధం. అటుకులలో కాల్షియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. [1] అటుకులను అల్పాహారంగానూ, అనేక రకాలైన చిరుతిండ్లు (స్నాక్స్) చేయడానికి ఉపయోగిస్తారు. పండుగలలో అటుకులు, బెల్లం కలిపి ప్రసాదంలా కూడా వాడుతారు.

దక్షిణాసియా

[మార్చు]

దక్షిణాసియాలో అటుకులు ప్రధానమైన అల్పాహారంగా వాడుతారు. వీటిని చియురా , పోహా , అవలక్కి ( ಅವಲಕ್ಕಿ కన్నడ ), అవల్ (తమిళం , మలయాళం ), అటుకులు (తెలుగు), చుడా (ఒడియా ), చిరా (బెంగాలీ ), సిరా (అస్సామీ ), స్థానిక భాషను బట్టి ఇతర పేర్లతో పిలుస్తారు. ఇవి భారతదేశం, శ్రీలంక , నేపాల్, బంగ్లాదేశ్‌లో విరివిగా తయారు చేస్తారు. వీటితో తయారు చేసే 'పోహా' వంటకం యొక్క ఔత్సాహికులు, ముఖ్యంగా భారతదేశంలో, జూన్ 7న అంతర్జాతీయ పోహా దినోత్సవంగా జరుపుకుంటారు.[2]

తయారుచేయు విధానం

[మార్చు]

వరి ధాన్యాన్ని నానబెట్టి 24 గంటల తరువాత నీరు తీసివేసి, 60 - 70 సెల్సియస్ వద్ద వేయించవలెను. ఆ తరువాత రోటిలో వేసి రోకలితో దంచి చెరిగినచో అటుకులు సిద్దం. ఇవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. ప్రస్తుతం అటుకులు దంచడానికి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. వీటిని పాలతో కలిపి మిశ్రమం చేసుకోని తీసుకొనవచ్చు. అవి సాధారణంగా సన్నని, మధ్యస్థ, మందపాటి రకాల్లో వస్తాయి. సన్నని రకాలు వంటలు అల్పాహారాల్లో వాడకానికి అనువైనవి, అలాగే మందమైన రకాలు మిక్చర్ లాంటి చిరుతిండ్లు చేయడానికి ఉపయుక్తం.

అటుకులు తినడం వల్ల ప్రయోజనాలు

[మార్చు]

అటుకుల్లో అత్యధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్ తేలికగా జీర్ణమై పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అటుకులలో ఉండే ఐరన్, రక్తం తక్కువగా ఉన్న వారిలో రక్తహీనతను తగ్గించడానికి కూడా దోహతపడతాయి. స్త్రీలకు గర్భధారణ సమయంలో శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గుతుంది, కాబట్టి వీటిని గర్భిణీలు ఉపయోగించడం మంచిది. [3]

అటుకులు తినడం వల్ల అనర్ధాలు

[మార్చు]

అయితే అటుకులను మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అటుకులలో ఫైబర్ ఎక్కువ స్థాయిలో ఉండడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు, అజీర్ణం, మలబద్దకం, ఎసిడిటీ, ఇంటబుల్ బవెల్ సిండ్రోమ్ మొదలైన సమస్యలు ఉన్నవారు తినకూడదు. అటుకులలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అలాగే రైస్ అలర్జీ ఉన్నవారు కూడా అటుకులను తినకూడదు. [4]

అటుకులతో చేయబడు పదార్ధాలు

[మార్చు]
అటుకుల ఉప్మా (పోహా)
  1. ఈ అటుకులను హిందువుల పండుగలలో ప్రముఖమైందిగా పరిగణింపబడే శివరాత్రి నాడు నానబెట్టి బెల్లం కలిపి నైవేధ్యం పెట్టడం ఆచారంగా వస్తుంది.
  2. పోహా లేదా అటుకుల ఉప్మా
  3. అటుకుల పులిహోర

మూలాలు

[మార్చు]
  1. "అటుకులు తింటే ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు". TV9. Retrieved 23 June 2023.
  2. "On International Poha Day, we give you 3 reasons to have this (healthy) bowl of goodness!". The Economic Times. 2023-06-08. ISSN 0013-0389. Retrieved 2025-12-10.
  3. Rao, Chandrasekhar (2025-08-01). "అటుకుల్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?". వన్ ఇండియా. Retrieved 2025-12-11.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. ABN (2024-08-17). "Poha: అటుకులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎవరు తినచ్చు? ఎవరు తినకూడదు?". Andhrajyothy Telugu News. Retrieved 2025-12-11.
"https://te.wikipedia.org/w/index.php?title=అటుకులు&oldid=4688835" నుండి వెలికితీశారు