అతడు అడవిని జయించాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అతడు అడవిని జయించాడు
రచయిత(లు)డా. పి. కేశవరెడ్డి
దేశంభారతదేశం
భాషతెలుగు
శైలికాల్పనిక సాహిత్యం
ప్రచురణ సంస్థ1984 (ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికగా)
ప్రచురణ కర్తవిశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
మీడియా రకంముద్రణ
పుటలు115
పురస్కారాలుపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవల (1988)

అతడు అడవిని జయించాడు, డా.పి. కేశవరెడ్డి రాసిన తెలుగు నవల. మొదట 1984 లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. నవలగా 1985 లో తొలిసారి విజయవాడ నవోదయ పబ్లిషర్స్‌ సంస్థ ప్రచురించింది. ఆ తరువాత పలు సంస్థలు ఈ నవలను ప్రచురించాయి. పరిమాణం రీత్యా చిన్న నవల అయిన దీన్ని నవలిక అనవచ్చు. నేషనల్ బుక్ ట్రస్టు వారు ఈ నవలను 14 భారతీయ భాషల్లోకి అనువదింపజేసి ప్రచురించారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దీన్ని రేడియో నాటకంగా ప్రసారం చేసింది. ఇద్దరు తెలుగు సినిమా దర్శకులు ఈ నవలను సినిమాగా రూపొందించాలని సంకల్పించారు.

కథ[మార్చు]

ఒక సూర్యాస్తమయం నుండి మరుసటి సూర్యోదయం వరకూ జరిగే కథ, అతడు అడవిని జయించాడు. రెండే మానవ పాత్రలున్న చిన్న నవలిక ఇది. అందులోనూ ఒకటి చాలా చిన్న పాత్ర కాబట్టి, ఒకే పాత్ర అని అనుకోవచ్చు. ఆ పాత్రకూ పేరు లేదు -ముసలివాడు అని సంబోధిస్తాడు రచయిత. ముసలివాని పందులను అతని మనుమడు మేతకని అడవికి తోలుకుపోతాడు. సాయంకాలానికి తిరిగి వచ్చాక చూస్తే ఆ మందలో ఒక సూడి పంది లేనట్లు ముసలివాడు గ్రహిస్తాడు. నెలలు నిండి, ఈనేందుకు సిద్ధంగా ఉన్న ఆ పంది అడవిలో ఎక్కడో చాటు చూసుకుని ఈని ఉంటుందని భావించి, దాన్ని వెతికి తెచ్చేందుకు ఒంటరిగా, ఒక ఈటె తీసుకుని "అస్తమిస్తున్న సూర్యునిపై దండెత్తిన వాడి వలె" బయలుదేరుతాడు.

ఆ రాత్రి అడవిలో ఒకచోట ఈనిన పందిని చూస్తాడు. దాన్నీ, "సందమావల్లాంటి" ఆ పందిపిల్లల్నీ నక్కలు తదితర అడవి జంతువుల బారి నుండి రక్షించి ఇంటికి తీసుకువెళ్ళడం అతడి లక్ష్యం. అయితే ఈనిన పంది, తన పిల్లలని తినజూచే నక్కల్నే కాదు, వాటిని రక్షించాలనుకుంటున్న ఆ ముసలివాణ్ణి కూడా దగ్గరికి రానివ్వదు. అతడు తనను తాను దాన్నుండి రక్షించుకుంటూ పంది పిల్లలను నక్కల బారి నుండి రక్షించుకునే ప్రయత్నం చెయ్యడం మిగతా కథ.

కథన శైలి, భాషా శైలి[మార్చు]

అడవిని, అందులోని చెట్లు, మొక్కలు, తీగలు, జంతువులు, పక్షులు మొదలైనవాటిని, వాటి స్వభావాలను, ప్రవర్తనలనూ సవివరంగా వర్ణించడం ఈ నవల ప్రత్యేకత. రచయిత స్వయంగా అడువుల్లో సన్నిహితంగా జీవించి ఉంటే తప్ప, ఇంత విపులంగా రాయడం సాధ్యం కాదని కొందరు అన్నారు. అదే విషయాన్ని నిజామాబాదు ఆకాశవాణి కేంద్రానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగినపుడు కేశవరెడ్డి, "ఈ ప్రశ్న చాలామంది అడిగారు. దాన్లో అంత గొప్పేముంది అని అనిపిస్తుంది. చిన్నప్పటినుండి మా పొలాల్లో తిరిగినవాణ్ణి. అక్కడే అనేక జంతువులు పక్షులనూ చూసాను, ఆ అనుభవాలను అడవికి అన్వయించాను, అంతే" అన్నాడు. [1]

పుస్తకంలో కథనపు భాష శైలి పత్రికా భాష లోనే సాగుతుంది. నిరక్షరాస్యుడైన ముసలివాని మాటలు, సహజం గానే, చిత్తూరు జిల్లా మాండలికంలో ఉంటాయి. అయితే ముసలివాని స్వగతం ఆ మాండలికంలో కాక, ప్రామాణికమైన పత్రికా భాష లోనే సాగుతుంది. అతడు అంతరంగంలో అనుకునే మాటలు అతని యాసలో కాకుండా ప్రౌఢమైన భాషలో ఉన్నాయెందుకు అనే వ్యాఖ్యకు సమాధానంగా కేశవరెడ్డి, "ముసలివాడు బయటికి చెప్పే మాటలు కావవి, అవి నిశ్శబ్ద సంభాషణలు, కేవలం ఆలోచనలే. ఆలోచనలకు భాషేమీ ఉండదు", అని చెప్పాడు. [1]

ప్రచురణలు, ముందుమాటలు, సమీక్షలు[మార్చు]

నవోదయ పబ్లిషర్స్, ఆర్మూరుకు చెందిన నందిని పబ్లికేషన్స్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ (ISBN:TELVPH0018) నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వంటి పలు సంస్థలు ఈ పుస్తకాన్ని ప్రచురించాయి. ఆయా సంస్థలు వివిధ సైజుల్లో ప్రచురించడం విశేషం. ఈ పుస్తకంపై పుస్తకం.నెట్, పొద్దు.నెట్, గుడ్‌రీడ్స్.కామ్ వంటి జాలపత్రికలు, వెబ్‌సైట్లలో పలు సమీక్షలు వచ్చాయి.

నవల గురించి రచయిత[మార్చు]

నిజామాబాదు ఆకాశవాణి కేంద్రానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేశవరెడ్డి, నవల గురించి తన ఆలోచనలను చెప్పాడు. "నవలాంతాన ముసలివాడు పంది పిల్లలను రక్షించుకోవడంలో తాను ఓడిపోయానని అనుకుంటాడు గానీ, నిజానికి అతడు అడవిని జయించాడు. ఆ మాటను రచయితగా నేను అన్నాను" అని చెప్పాడు. ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన "ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ" నవల స్పూర్తి తోనే ఈ నవల రాసానని కేశవరెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. [1]

ముందుమాటలు[మార్చు]

ఈ పుస్తకానికి వివిధ సంస్థలు ప్రచురించినపుడు వివిధ వ్యక్తులు ముందుమాటలు వెనుకమాటలూ రాసారు. వీటిలో ముఖ్యమైనవి సంజీవదేవ్ రాసిన "సింహావలోకనం", శ్రీనివాస ప్రసాద్ రాసిన "అధోమానవుడు అధిమానవుడైన వేళ".

అనువాదాలు[మార్చు]

నేషనల్ బుక్ ట్రస్టు వారు ఈ నవలికను 14 భారతీయ భాషల్లోకి అనువదింపజేసి ప్రచురించారు. వీటిలో హిందీ అనువాదాన్ని జె. లక్ష్మీ రెడ్డి "ఉస్‌నే జంగల్ కో జీతా" పేరుతో చెయ్యగా, యతిరాజులు "అవన్ కాట్టయ్ వెండ్రాన్" పేరుతో తమిళం లోకి అనువదించాడు. మరాఠీ లోకి వసంత్ కేశవ్ పాటిల్ "ఉస్‌నే జంగల్ కో జీత్" అనే పేరుతోటి, చాగంటి తులసి ఒడియా లోకి "అరణ్య జయ్" అనే పేరుతోటీ అనువదించారు. [2] సి.ఎల్.ఎల్. జయప్రద ఈ పుస్తకాన్ని "హి కాంకర్‌డ్ ది ఫారెస్ట్" పేరుతో ఇంగ్లీషు లోకి అనువదించగా చెన్నై లోని మాక్‌మిలన్ ఇండియా వారు ప్రచురించారు. [3]

పురస్కారాలు[మార్చు]

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1988 సంవత్సరానికి ఈ పుస్తకాన్ని ఉత్తమ నవలగా ఎంపిక చేసింది.

విమర్శ[మార్చు]

ఈ పుస్తకంపై వచ్చిన విమర్శల్లో ముఖ్యమైనది భాష శైలి. నిరక్షరాస్యుడు, పల్లెటూరివాడూ అయిన ముసలివాడి అంతరంగం లోని ఆలోచనలు అంత ప్రౌఢమైన ప్రామాణిక భాషలో ఎలా ఉంటాయి, అతడు మాట్లాడినపుడు వాడే మాండలికంలో ఎందుకుండవూ అనేది ఆ విమర్శ. అది ఒక లోపంగా భావించి కొందరు కటువుగా విమర్శించగా, [4] అలా ఎందుకుంది అని కొందరు మృదువుగా ప్రశ్నించారు. ఉదాహరణకు సంజీవదేవ్ ఈ పుస్తకానికి రాసిన సింహావలోకనంలో ఈ అంశాన్ని లేవనెత్తి, దానికి తానే సమాధానం చెప్పాడు. పైగా అదేమంత పెద్ద విషయం కాదులే అని కూడా అన్నాడు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ఒక సమీక్ష, నవలలో ముసలివాని భాషను విమర్శిస్తూనే, కేశవరెడ్డి పందుల గురించి రాసిన విశేషాల్లో కొన్ని తప్పులున్నాయని చెప్పింది. పందిపిల్లలను ఆ వయసులో "సలుగులు" అనకూడదని, వాటిని "గున్నలు" అనాలనీ, పందులను "గూచ్ గూచ్" అని అదిలించాలని, ఈ నవలలో లాగా "హూచ్ హూచ్" అనకూడదనీ, ఈనిన పంది, తన పిల్లలను వదలి 20 అడుగుల దూరానికి మించి పోదని, కానీ ఈ పుస్తకంలో అంతకంటే ఎక్కువ దూరం పోయిందనీ అంటూ చేసిన ఆ విమర్శ, "అతడు అడవిని జయించలేకపోయాడు" అనే పేరుతో వచ్చింది. [4]

ఇతర మాధ్యమాల్లో[మార్చు]

అతడు అడవిని జయించాడు నవలను ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో రేడియో నాటకంగా ప్రసారం చేసారు. దీనికి 1992 సంవత్సరపు ఆల్ ఇండియా రేడియో వార్షిక పోటీల్లో రెండవ బహుమతి వచ్చింది. [5] దీనికి రేడియో అనుసరణ విరియాల లక్ష్మీపతి చెయ్యగా ఎస్.కె.మిశ్రో ముసలివానిగా నటించాడు. నవల్లో ముసలివాడు చిత్తూరు మాండలికంలో మాట్లాడగా రేడియో అనుసరణలో దీన్ని ఉత్తరాంధ్ర మాండలికానికి మార్చారు.

ఇద్దరు తెలుగు సినిమా దర్శకులు దీన్ని సినిమాగా తీయాలని సంకల్పించారు. దూలం సత్యనారాయణ దర్శకత్వంలో ఈ నవలను సినిమాగా నిర్మించేందుకు డిఎస్.ఎన్ ఫిల్స్మ్ వారు 2017 లో హక్కులను తీసుకున్నారు.[6] ఆ తరువాత క్రిష్ జాగర్లమూడి కూడా దగ్గుబాటి వెంకటేష్‌తో ఈ నవలను సినిమాగా నిర్మించేందుకు తలపెట్టినప్పటికీ, ఆ హక్కులు అప్పటికే వేరేవారు కొనుక్కున్న సంగతి తెలిసి తన ప్రతిపాదనను విరమించుకున్నాడు. [7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 All India Radio, Nizamabad (2014-06-02), DR. Keshava Reddy - Interview, retrieved 2022-06-04
  2. Reddy, Kesava (2014-01-01). Atadu Adavini Jayinchadu (in Telugu). Visalandhra Publishing House. pp. వెనుక అట్ట. Archived from the original on 2022-06-04.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  3. Kēśavareḍḍi; Jayaprada, C. L. L. (1998). He conquered the jungle =: Athadu adavini jayinchadu. Macmillan modern Indian novels in translation. Chennai: Macmillan India Ltd. ISBN 978-0-333-93186-8. Archived from the original on 2022-06-04.
  4. 4.0 4.1 D, Sreenivasulu (2018-01-01). "అతడు అడవిని జయించలేక పోయాడు". వివిధ, ఆంధ్రజ్యోతి. Archived from the original on 2022-06-05.
  5. "కేశవరెడ్డి సంస్మరణ" (PDF). మిసిమి. Archived from the original (PDF) on 2022-06-04. Retrieved 2022-06-04.
  6. "తెరపైకి 'అతడు అడవిని జయించాడు' | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Archived from the original on 2022-06-04. Retrieved 2022-06-04.
  7. "క్రిష్‌ ఏమరుపాటు!". lit.andhrajyothy.com. Archived from the original on 2022-06-04. Retrieved 2022-06-04.

బయటి లింకులు[మార్చు]