సూర్యదేవర సంజీవదేవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యదేవర సంజీవదేవ్
Sanjeevdev.jpg
సూర్యదేవర సంజీవదేవ్
జననంసూర్యదేవర సంజీవదేవ్
జూలై 3, 1914
మరణంఆగష్టు 25, 1999
ప్రసిద్ధితత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి

డా.సూర్యదేవర సంజీవ దేవ్ (ఆంగ్లం: Suryadevara Sanjeevdev) (1914 జూలై 3 - 1999 ఆగష్టు 25) తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. తన స్వీయ చరిత్రను తెగిన జ్ఞాపకాలు పేరిట రచించాడు. మంగళగిరి, తెనాలికి మధ్యన గల తుమ్మపూడిలో జన్మించాడు.

ఈయన జీవితమే మహత్తరమైనది. బాల్యంలోనే ఇల్లు విడిచి పెట్టి దేశ సంచారం చేసాడు. హిమాలయాలలో కొంత కాలమున్నారు. అక్కడ ప్రకృతి చిత్రాలను వేయడం జరిగింది. ప్రకృతి ఆస్వాదన వారికెంతో ఇష్టం. 20 ఏళ్ళ లోపలే హిమాలయాలతో సహా ఉత్తర భారతదేశం మొత్తం తిరిగాడు. హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచ్, జపానీస్ నేర్చుకున్నాడు.[1]. ఎస్పరాంటో అనే కృత్రిమ అంతర్జాతీయ భాషలో కూడా ఈయనకు ప్రవేశం ఉంది. లక్నోలో అసిత్ కుమార్ హాల్దార్ వద్ద చిత్రలేఖనం అభ్యసించాడు. ఇతని కలం స్నేహం అపరితమైనది. సమకాలీన ప్రపంచ మేధావులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపేవాడు. అమెరికాలోని ఆల్డస్ హక్స్‌లీ నుంచి అమెరికాలో స్థిరపడిన చిత్రకారుడు రామారావు వరకూ వారి మిత్ర మండలి సువిశాలమైనది. జిడ్డు కృష్ణమూర్తి నుంచి బుచ్చిబాబు, గోపీచంద్ ల వరకూ వారికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండేవి. రాహుల్ సాంకృత్యయన్ నుంచి బెర్ట్రాండ్ రస్సెల్ వరకూ రవీంద్రనాధ టాగోర్ నుండి దేవులపల్లి కృష్ణశాస్త్రి వరకూ అధ్యయనం చేయటమే కాక వారితో ఇతనికి మంచి మైత్రి కూడా ఉండేది. ఇతను నివసించే తుమ్మపూడి గ్రామానికి దేశ విదేశాల కళాకారులు, సాహిత్యోపాసకులు వారికోసం వచ్చేవారు. సంజీవదేవ్ వల్ల తెలుగు ప్రాంతం గౌరవం పెరిగింది అని ఆ ప్రాంత ప్రజలు అనేవారు.

మానవతావాది అయిన సంజీవదేవ్ ఏ ప్రాంతమూ పరాయిది కాదు. ఏ మనుషులూ పరాయివారు కారనే వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలోపెట్టాడు. ఈయన 1999 ఆగస్టు 25న మరణించాడు.

రచనలు, చిత్రాలు[మార్చు]

1963లో 'ఆంధ్రజ్యోతి'లో ప్రతి ఆదివారం 'తెగిన జ్ఞాపకాలు' అని తమ జీవిత చరిత్రను రాసాడు. తరువాత అది పుస్తకంగా వచ్చింది. 2011 మార్చిలో రాజా చంద్ర ఫౌండేషన్, తిరుపతి- దుర్గా ప్రసాద్ వారు 'తుమ్మపూడి' అనే పేరుతో సంజీవదేవ్ స్వీయ చరిత్రను 704 పేజీలతో మంచి ఆకర్షణతో పుస్తకంగా ప్రచురించారు.

సంజీవదేవ్ 'రసరేఖ' పుస్తకాన్ని రచించాడు. తమ ఇంటికి 'రసరేఖ' అని పేరు పెట్టారు. వీరు చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్లినప్పుడు ఎంతోమంది మేధావులతో, ప్రముఖులతో పరిచయాలు పొందాడు. ఎన్నో పుస్తకాలు, తెలుగు, ఇంగ్లీషులలో రాసాడు. ఇతను చదివింది 8వ తరగతి. కాని 14 భాషలు రాసేవాడు. చదివేవాడు. ఇతని చేతిరాత అచ్చం అచ్చువలె వుండేది. ప్రతిదినం పలువురు అభిమానుల దగ్గర నుండి కట్టలుగా వుత్తరాలు వచ్చేవి. చిన్నా పెద్దా అని చూడకుండా అందరికి ఆప్యాయంగా జవాబులు రాసేవారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి వారింట తుమ్మపూడిలో కవిసమ్మేళనాలు జరిగేవి. పెద్దపెద్ద కవులు, రచయితలు వచ్చేవారు. గొట్టిపాటి బ్రహ్మయ్య, గొఱ్ఱెపాటి వెంకటసుబ్బయ్య, ఆచంట జానకిరామ్, నాగభైరవ కోటేశ్వరరావు మొదలైనవారు వచ్చేవారు.

'విద్యార్థి' అనే మాసపత్రిక 1963 అక్టోబరు సంచికలో సంజీవదేవ్ 'కీర్తి-తృష్ణ' అనే వ్యాసాన్ని రాసాడు. అందులో- 'కాంతను, కనకాన్ని, పదవిని, సుఖాన్ని మొదలగునవన్నిటిని మానవుడు త్యజించగలడు గాని కీర్తిని మాత్రం త్యజించలేడు. ఐహిక సంబంధాలన్నిటిని త్యజించిన తాపసులు కూడా ప్రశంసలకు సంతోషించటం, నిందకు బాధపడటం జరుగుతూనే ఉంది. కీర్తి మీద గనుక కాంక్షలేని యెడల ఈ జగత్తులో ఎన్నో ఘనకార్యాలు జరిగేవే కావు' అని రాసాడు.

 • తెగిన జ్ఞాపకాలు. ఇతని రచనలలో ప్రాచుర్యం పొందినది.
 • రసరేఖలు.
 • కాంతిమయి
 • దీప్తి ధార.
 • రూపారూపాలు
 • సమీక్షా రేఖలు.
 • బయో సింఫోనీ (ఆంగ్లంలో) మొదలైనవి ఉన్నాయి.
 • భారతీయ చిత్రకళ - సి.శివరామమూర్తి ఆంగ్ల రచనకు సంజీవదేవ్ అనువాదం[2].

ఇతర విశేషాలు[మార్చు]

 • ఇతని పేరు మీద 1999లో ఈతని సన్నిహితులూ, స్నేహితులూ సంజీవదేవ్ అవార్డును స్థాపించారు. ఇది తత్వ, కళా, సాహిత్య రంగాలలో కృషి చేసిన వాళ్ళకు ఇవ్వబడుతుంది.
 • శ్రీ సంజీవదేవ్ శతజయంతి ముగింపు వేడుకలను, 2014, జూలై-3న, తుమ్మపూడిలో నిర్వహించారు. [ఈనాడు గుంటూరు రూరల్; 2014, జూలై-4; 16వ పేజీ.]

మూలాలు[మార్చు]

 1. refhttps://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97/
 2. శివరామమూర్తి, పి.; (అనువాదకుడు), సంజీవదేవ్. భారతీయ చిత్రకళ. న్యూఢిల్లీ: నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా. Retrieved 9 December 2014. CS1 maint: discouraged parameter (link)

బయటి లంకెలు[మార్చు]