అరిపిరాల నారాయణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరిపిరాల నారాయణరావు
జననం (1949-06-10) 1949 జూన్ 10 (వయసు 75)
వృత్తితెలుగు రీడర్, వై.ఎస్.కళాశాల, నరసాపురం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సాంస్కృతిక కార్యకర్త
గుర్తించదగిన సేవలు
తెలుగు వెలుగు వ్యాస మంజూష
జీవిత భాగస్వామిమహాలక్ష్మి
పిల్లలువేంకట రవి, శేషసాయికుమారి
తల్లిదండ్రులుఅరిపిరాల సత్యవతి,బ్రహ్మాజీరావు

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శ్రీ వై.ఎన్.కళాశాల రిటైర్డ్ రీడర్ డాక్టర్ అరిపిరాల నారాయణరావు ఎన్నో జాతీయ, రాష్ట్ర సదస్సులు నిర్వహించిన సాహితీ దిగ్గజం.ప్రముఖులచేత అవధానాలు నిర్వహింపజేయడమే కాదు,మాడుగుల నాగఫణి శర్మ వంటి ఉద్దండుల అవధానాల్లో పాల్గొని తనదైన ముద్రవేశారు. విభిన్న కోణాల్లో తన సాహితీ ప్రతిభను చూపిన డాక్టర్ అరిపిరాల ఇల్లే ఓ లైబ్రెరీగా ఉంటుందని చెప్ఫాలి.నరసాపురం {వై.ఎన్.కళాశాల}లో తెలుగు వెలుగు కార్యక్రమ నిర్వహణతో జాతీయస్థాయిలో కూడా తన సత్తా చాటారు.

జననం - కుటుంబ నేపధ్యం

[మార్చు]

అరిపిరాల సత్యవతి,బ్రహ్మాజీరావు దంపతులకు10-6-1949లో ఉండేశ్వరపురంలో జన్మించిన నారాయణరావు రాజమండ్రి మున్సిపల్ కాలనీలొని ప్రాధమిక పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తిచేసి,గౌతమి విద్యాపీఠం ఒరియంటల్ హైస్కూల్,గౌతమి ఒరియంటల్ కళాశాలలో విద్యను పూర్తిచేసారు.ప్రభుత్వ శిక్షణ కళాశాలలో పండిట్ శిక్షణ పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ప్రైవేటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు.ఈయనకు భార్య మహాలక్ష్మి,ఒక కుమారుడు వేంకట రవి,ఒక కుమార్తె శేషసాయికుమారి ఉన్నారు. 1970నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్.ఆర్.పి.అగ్రహారం గరగపర్రు, దొడ్డిపట్ల, చాగల్లు జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసారు. 1981లో లెక్సరర్ గా శ్రీ వై.ఎన్.కళాశాలలో చేరి,1994లో రీడర్ గా పదోన్నతి పొందారు. 1995సెప్టెంబరు నుంచి అదే కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా సేవలందించారు.

సాధించిన విజయాలు

[మార్చు]

1983లో క్రొవ్విడి లింగరాజు అశీతి(80వ జన్మదినోత్సవం) మహోత్సవం మొదలుకుని 2016లో జరిగిన ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకులు యాతగిరి శ్రీరామ నరసింహారావు అశీతి వరకూ ఎన్నో ప్రత్యేక సంచికలకు డాక్టర్ అరిపిరాల సంపాదకత్వం వహించారు. ఆంధ్రకేసరి యువజన సమితి రజతోత్సవ సంచిక,స్వర్ణోత్సవ సంచిక ఇలా 50కి పైగా సావనీర్లకు సంపాదకత్వం వహించి,వాటిని అందంగా తీర్చిదిద్దారు. సామినేని ముద్దు నరసింహనాయుడు 200సంవత్సరాల క్రితం ప్రకటించిన 'హితసూచని' ఆరుద్ర పీఠికతో పునర్ముద్రించారు. సభలు సమావేశాల నిర్వహణలోనే కాదు, ఉపన్యాసాలు ఇవ్వడంలోనూ డాక్టర్ అరిపిరాల దిట్టే. 1980నుంచి ఈనాటి వరకూ ఎన్నో సభల్లో ఆయన అర్ధవంతమైన ప్రసంగాలు చేసి, మన్ననలు అందుకున్నారు. ఎదురీత వంటి ఎన్నో పుస్తకాలను సంకలనం చేసారు.

ఉత్తమఉపాధ్యాయ అవార్డు గ్రహీత

[మార్చు]

సాహిత్య సాంఘిక సంస్కర్త గురజాడ,కందుకూరి సాహిత్యం, గురజాడ సాహిత్యం,డాక్టర్ చేబోలు చిన్మయ బ్రహ్మకవి సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం,తాపీ ధర్మారావు రచనలు,ఎంకి పాటలు ... ఇలా విభిన్న అంశాలపై ప్రసంగాలు చేసిన డాక్టర్ అరిపిరాల,ఎన్నో పురస్కారాలు, గౌరవాలు కూడా అందుకున్నారు.1998లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం స్వీకరించారు. అంతేకాదు, రాజమండ్రి వీరేశలింగం పురమందిరం,తణుకు ప్రభుత్వ కళాశాల,నర్సాపురం రీడర్స్ ఫోరం, పాలకొల్లు రసధుని రాజమండ్రి శరన్మండలి, రాజోలు సాహితీ హేమంతం, మలికిపురం డిగ్రీ కళాశాల ఇలా పలుచోట్ల సత్కారాలు అందుకున్నారు.

తెలుగువెలుగు వ్యాస మంజూష

[మార్చు]

సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్వీయ చరిత్ర పూర్తి గ్రంధాన్ని మిత్రుల సహకారంతో పునర్ముద్రణ చేయడం ద్వారా అందరి మన్ననలు పొందిన డాక్టర్ అరిపిరాల నరసాపురం వై.ఎన్.కళాశాలలో 1985నుంచి నిర్వహించిన తెలుగు వెలుగు కార్యక్రమం ద్వారా వెలుగులు పూయించిన డాక్టర్ అరిపిరాల అక్కడితో వదలకుండా దివాకర్ల వేంకటావధాని,మల్లంపల్లి శరభేశ్వరశర్మ,ఆరుద్ర, కాళీపట్నం రామారావు, డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు వంటి ప్రముఖుల ఉపన్యాసాలను క్రోడీకరించి, సీడీల్లో, ఆడియో టేపుల్లో రికార్డు చేసిన ఉపన్యాసాలకు అక్షర బద్దం చేసారు. ఇందుకోసం దాదాపు రెండేళ్లపాటు శ్రమించి వెయ్యి పేజీలతో "తెలుగువెలుగు వ్యాస మంజూష" గ్రంధంగా తీసుకొచ్చారు. ఈ గ్రంధం ఇటీవలే నరసాపురం శ్రీ వై.ఎన్.కళాశాలలో ఆవిష్కరణోత్సవం జరుపుకుంది. రాజమహేంద్రవరంమిత్రులంతా కల్సి సుహృన్మండలి ఆధ్వర్యాన ఏ.వి. అప్పారావు రోడ్డులోని దాట్ల సుభద్రాయమ్మ కళాంగణంలో జనవరి 20 ఉదయం 'తెలుగు వెలుగు వ్యాస మంజూష' పరిచయ సభ నిర్వహించి,అరిపిరాల దంపతులను ఘనంగా సత్కరించారు.[1]

శ్రీగౌతమీ లైబ్రెరీ లో గ్రంథాల డిజిటలైజేషన్

[మార్చు]

రాజమండ్రిలో పురాతన గ్రంధాలయంగా వెలుగొందుతున్న శ్రీగౌతమీ ప్రాంతీయ గ్రంధాలయం లో అపురూప గ్రంధాలను పరిరక్షించే ఉద్దేశ్యంతో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ సహకారంతో పుస్తకాల డిజిటలైజేషన్ కి డాక్టర్ అరిపిరాల నడుంకట్టారు. దాదాపు 30వేల పుస్తకాలను డిజిటలైజేషన్ చేసే అరుదైన కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్వచ్ఛందంగా శ్రమిస్తూ, పలువురి మన్ననలు అందుకుంటున్నారు. నరసాపురం వై.ఎన్.కళాశాలలో సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ రావు ఏవిధంగా ప్రోత్సాహం ఇచ్చారో, ఇక్కడ శ్రీగౌతమీ గ్రంధాలయ అభివృద్ధికి డాక్టర్ ఆకుల సత్యనారాయణ కూడా అలాగే ప్రోత్సాహం అందిస్తున్నారని డాక్టర్ అరిపిరాల చెబుతూ, ఇది పూర్వ జన్మ సుకృతమని అంటుంటారు.

తెలుగులో మొదటి అంత్యానుప్రాస నిఘంటువు

[మార్చు]
అంత్యానుప్రాస పుస్తకావిష్కరణ సభ.

డాక్టర్ అరిపిరాల ఆరేళ్లపాటు శ్రమించి తెలుగులో మొదటి అంత్యానుప్రాస నిఘంటువు రూపొందించారు. పదముల చివర గానీ,,వాక్యాల చివర గానీ అలాగే పద్య పాదాల చివర గానీ ఒకే విధమైన అక్షరం రావడమే అంత్యానుప్రాస అంటారు. మైసూరు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సిఐఐఎల్) ఆధ్వర్యాన 2005లో అంత్యానుప్రాస నిఘంటు నిర్మాణంపై నరసాపురం శ్రీవై.ఎన్.కళాశాలలో వర్క్ షాప్ పెట్టాలని డా. కరణ సభ అరిపిరాలను సంప్రదించారు. అయితే యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ వారు లెక్సికోగ్రఫీ మీద ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించడంతో "నీడ్ ఆఫ్ రైమింగ్ డిక్షనరీ ఇన్ తెలుగు లాంగ్వేజ్" అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. అప్పటికే ఆంగ్లంలో 50 వేల పదాలతో అంత్యానుప్రాస నిఘంటువు ఉండగా, హిందీలో కూడా 16 వేల పదాలతో తయారయింది. తమిళంలో కూడా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుసుకుని తెలుగులో తయారుచేయాలని డా అరిపిరాల భావించారు. అనకాపల్లి డిగ్రీ అండ్ పిజి కళాశాల ఆధ్వర్యంలో విశ్వనాథ సాహిత్యంపై జాతీయ సదస్సు నిర్వహించిన సందర్భంలో కిన్నెరసాని పాటలు - అంత్యానుప్రాస పదాలు' అంశంపై డా అరిపిరాల పత్ర సమర్పణ చేశారు. పదవీ విరమణ తర్వాత సిఐఐఎల్ కోరిక మేరకు రాజమండ్రిలో తెలుగు అధ్యాపక మిత్ర బృందంతో కల్సి 2008, 2009, 2010 సంవత్సరాలలో వారం రోజుల చొప్పున డా అరిపిరాల అంత్యానుప్రాస నిఘంటువుపై సదస్సులు నిర్వహించారు.

2018లో శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్ లో భాగంగా 1937లో అచ్చయిన శబ్ద రత్నాకరం నిఘంటువు డిజిటలైజేషన్ చేస్తూ, దాని ఆధారంగా పద సేకరణ చేసారు. 4వ శతాబ్దంలో 'నానార్ధ మాల' పేరిట ఇరుగప దండనాధుడు 1273 శ్లోకాలతో తెచ్చిన నిఘంటువును సంస్కృతంలో తొలి అంత్యానుప్రాస నిఘంటువుగా చెబుతుంటారు. పూర్వం పద్య రూపంగానో, శ్లోక రూపంలోనో నిఘంటువులుండేవి. తెలుగులో ప్రాసాక్షర నిఘంటువులు లాంటి లఘుపుస్తకాలుగా వచ్చినప్పటికీ అంత్యానుప్రాస అక్షరాలతో మొట్టమొదటి నిఘంటువు డాక్టర్ అరిపిరాలదే.50 వేల పదాలతో 700పేజీలతో రూపొందించిన ఈ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం 23-08-2024 న రాజమండ్రి ప్రకాశంనగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలులో నిర్వహించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (ఇంచార్జి) డాక్టర్ వై.శ్రీనివాసరావు పుస్తకావిష్కరణ చేసారు. మల్కిపురం డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డా. పొన్నపల్లి శ్రీరామారావు సమీక్ష చేసారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్,రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.రాష్ట్రపతి పురస్కార గ్రహీత, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి పురస్కార గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్,మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, నరసాపురం శ్రీ వై.ఎన్. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా. చినమిల్లి సత్యనారాయణరావు గౌరవ అతిథులుగా విచ్చేసారు. పెరుమాళ్ళ రఘునాథ్ స్వాగతం పలుకగా, తలారి వాసు వందన సమర్పణ చేసారు.

మూలాలు

[మార్చు]

http://www.anandbooks.com/Edureeta-Telugu-Book-By-Dr-Aripirala-Narayana-Rao Archived 2018-02-09 at the Wayback Machine https://plus.google.com/u/0/114307724867267928627/posts/aof18x7jD4s