మాడుగుల నాగఫణి శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Madugula Nagaphani Sarma

నాగఫణిశర్మ అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా, పుట్లూరు మండలంలోని కడవకొలను గ్రామంలో మాడుగుల 1959, జూన్‌ 8 న జన్మించారు వీరి తల్లిదండ్రులు నాగభూషణశర్మ, సుశీలమ్మ . జన్మస్థలంలోనే పదో తరగతి పూర్తి చేసి 'సాహిత్య శిరోమణి' పట్టా కోసం తిరుపతి వెళ్ళారు. అశేష భక్తులు గోవిందా గోవిందా అంటూ నిత్యం నడుచుకొంటూ వెళ్లే కపిల తీర్థం వీధిలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ప్రాచ్య కళాశాల ఆయనలోని అక్షర దీప్తిని జాగృతం చేసింది. అక్కడే వెలుగులు ప్రసరించడం మొదలైనా, అవి ప్రపంచాన్ని తాకడం మాత్రం ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పి.ఓ.ఎల్‌. చదివే సమయంలోనే. తర్వాత మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ., కొత్త ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌ నుంచి 'శిక్షాశాస్త్రి', తిరుపతి రాష్ట్రీయ విద్యా పీఠం నుంచి పి.హెచ్‌.డి. పట్టా పొందిన మాడుగుల జీవిక కోసం 1985-90 మధ్య కాలంలో కడప రామకృష్ణ జూనియర్‌ కళాశాలలో సంస్కృతోపన్యాసకుడిగా, 90-92 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తు అడిషనల్‌ కార్యదర్శిగా పనిచేశారు.

భారత మాజీ ప్రధానులు పి.వి. నరసింహారావు, అతుల్‌ బిహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ వంటి వారి సమక్షంలో అవధానులు నిర్వహించి 'సెహభాష్‌' అనిపించుకొన్న మాడుగుల నాగఫణిశర్మ అవధాన సహస్రఫణి, బృహత్‌ ద్వి సహస్రావధాని, శతావధాని సమ్రాట్‌, శతావధాన చూడామణి, కళాసాహిత్య కల్పద్రుమ, వంటి అనేక బిరుదాలు పొందారు. పలుచోట్ల కనకాభిషేకాలు, స్వర్ణశారదా ముద్రిక, ముత్యాలజల్లు, ఆందోళికా భోగం, స్వర్ణ కంకణం, గండపెండేరం వంటివి పొందారు.