ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రత్యేక హోదా ఆందోళన
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఒక ఆందోళన

ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఐతే, అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి, దీన్ని పొందడానికి రాష్ట్రాలలో ఉండవలసిన పరిస్థితులు ఏమిటి. దేశంలో హోదా ఉన్న రాష్ట్రాలు పొందుతున్న ప్రత్యేక లాభాలు/సదుపాయాలు ఏమిటన్నది ఈ వ్యాసం తెలియజేస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్, బీజేపీలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాలు[1][మార్చు]

1969లో ఆర్థికంగా అననుకూలతలు గల రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర నిధుల కేటాయింపు, వివిధ రకాల పన్నులలో మినహాయింపు ద్వారా ఆ రాష్ట్రాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఐదవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును ఆనాటి జాతీయ అభివృద్ధి మండలి అంగీకరించడంతో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా భావన అమలులోకి వచ్చింది. అప్పటికి దేశంలో ఉన్న17 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఇవ్వబడింది. ఆ తరువాత మరో ఎనిమిది రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఐతే, ప్రస్తుతం మొత్తం 11 రాష్ట్రాలు ఈ హోదాను కలిగి ఉన్నాయి.ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకూ ప్రత్యేక హోదా ఉంది.[2]

ప్రత్యేక హోదా ఎలా వస్తుందంటే[1][3][మార్చు]

5వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 1969లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రస్తుత నియమాల ప్రకారం ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే, ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా నీతి ఆయోగ్‌ను ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేక హోదా అనేది నిధుల కేటాయింపులతో సంబంధం ఉండటం వల్ల కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయం కూడా ఇందులో కీలకంగా మారింది.ప్రత్యేకహోదా పొందడానికి రాష్ట్రానికి ఉండవలసిన ప్రమాణాలు/పరిస్థితులను కేంద్రప్రభుత్వం ఇలా పేర్కొంది. 1. కొండ ప్రాంతాలు, కఠిన భూభాగాలు; 2. తక్కువ జనసాంద్రత లేదా అధిక గిరిజన జనాభా; 3. పొరుగు దేశాల సరిహద్దు వెంబడి ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలు; 4. ఆర్థిక, మౌలిక సదుపాయాలలో వెనుకబాటుతనం; 5. స్థిరంగా లేని రాష్ట్ర ఆర్థిక వనరులు. అంటే అతి తక్కువ వనరులు కలిగి వుండి, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ తమ అభివృద్ధికి వనరులను సమీకరించుకోలేని స్థితిలో ఉన్న రాష్ట్రాలుగా ఈ రాష్ట్రాలను పేర్కొనవచ్చు.

ప్రత్యేక హోదాయే రాష్ట్రానికి సంజీవని[1][మార్చు]

విభ‌జ‌నతో ఆర్థికంగా కుదేలయిన ఆంధ్ర ప్రదేశ్  అభివృద్ధి చెందాలంటే అది ఒక్క ప్రత్యేకహోదాతోనే సాధ్యమవుతుంది. అభివృద్ధి అంతా హైదరాబాదులోనే కేంద్రీకృతమై ఉండడం వల్ల ఏపీకి తీరని నష్టం చేకూరింది. కష్టాల కడలి నుంచి గట్టెక్కాలంటే రాష్ట్రానికి ప్రాణవాయువైన ప్రత్యేకహోదాను సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉద్యోగాలైనా, పరిశ్రమలైనా, పన్నురాయితీలైనా ఇలా ఏదైనా ప్రత్యేకహోదాతోనే సాధించగలం. 

విభ‌జ‌న స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని (మన్మోహన్ సింగ్) పార్ల‌మెంటు సాక్షిగా ఏపీకి ఐదేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌కటించారు. దీన్ని సమర్థించిన నాటి ప్రతిపక్షమైన బీజేపీ హోదా ఐదేళ్ళు కాదు పదేళ్లు ఇవ్వాలని పట్టుబట్టింది. ఆ విధంగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ కలిసి రాష్ట్రాన్ని విభజించాయి.

ప్రత్యేక హోదా వల్ల లాభాలు[1][3][మార్చు]

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. * కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30 శాతం నిధులను మొదట ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే పంచుతారు. ఆ తర్వాతే మిగిలిన 70 శాతం నిధులను ఇతర రాష్ట్రాలకు అందిస్తారు.[4] ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర నిధులు 90 శాంతం గ్రాంట్లు గాను, 10 శాతం అప్పుగాను వస్తాయి. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు. లోన్ ద్వారా ఐతే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.  ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇస్తారు.100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఇన్ కమ్ ట్యాక్స్ లో కూడా 100 శాతం రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపులు, ప్రైట్ రీయింబర్స్ మెంట్ లు దక్కితే... పారిశ్రామికవేత్తలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతారు. ప్ర‌త్యేక హోదాతో పెద్ద సంఖ్య‌లో ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయి.  లక్షల సంఖ్యలో ఉద్యోగఅవకాశాలు సమకూరుతాయి. పదేళ్ల ప్రత్యేకహోదాతో ఏపీలోని 13 జిల్లాలు ఒక్కో హైదరాబాదుగా మారతాయి. అప్పుడు ఎవరూ ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు.  ప్రతికంపెనీ నిరుద్యోగుల కోసం వాంటెడ్ బోర్డులు పెట్టేస్తాయి. అంతేగాకుండా పన్నురాయితీలు, ప్రోత్సహకాల వల్ల మనం కొనుగోలు చేస్తున్న అనేక వస్తువుల ధరలు సగానికి తగ్గుతాయి. కరెంటు సగం ధరకే 20 ఏళ్ల పాటు లభ్యమవుతుంది. వీటితో పాటు ఇంకా అనేక లాభాలు హోదాతో పొందవచ్చు.

హోదాతో లబ్ధి పొందిన రాష్ట్రాలు[1][మార్చు]

ప్రత్యేకహోదా ఉండడం వల్లే ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో 2 వేల పరిశ్రమలు వచ్చాయి. తద్వారా ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ కంటే వెనకబడిన రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేకహోదా వల్ల 10 వేల పరిశ్రమలు వచ్చాయి. అలాంటిది 5 కోట్ల ప్రజానీకం గల 972 కి.మీ. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లభిస్తే అది పెద్ద సంజీవనే అవుతుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 http://www.andhrajyothy.com/
  2. https://www.sakshi.com/news/education/general-essay-on-special-status-to-states-110963
  3. 3.0 3.1 http://ysrcongress.com/
  4. https://www.bbc.com/telugu/india-43326502

వెలుపలి లంకెలు[మార్చు]