ఆదిల్‌షాహీ వంశం

వికీపీడియా నుండి
(ఆదిల్‌షాహీ వంశము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
1620లో రెండవ ఇబ్రహీం ఆదిల్‌షా పాలనలో బీజాపూర్ రాజ్యము

ఆదిల్‌షాహీ వంశం 1490 నుండి 1686 వరకు బీజాపూరు కేంద్రంగా దక్కన్ పీఠభూమి పశ్చిమ ప్రాంతాన్ని యేలిన షియా ముస్లిం[1] సుల్తానుల వంశం. బీజాపూరు 1347 నుండి 1518 వరకు బహమనీ సుల్తానుల రాజధానిగా ఉంది. 15వ శతాబ్దం చివరలో ఈ సామ్రాజ్యం క్షీణించి, తుదకు 1518లో అంతరించిపోయింది. బహమనీ సుల్తానుల సామంతులుగా ఉన్న ఆదిల్‌షాహీలు బహమనీ సామ్రాజ్య పతననము తరువాత స్వతంత్ర రాజులైనారు. 'ఆదిల్‌షాహీ వంశపు స్థాపకుడు యూసుఫ్ ఆదిల్‌షా. బీజాపూరు సల్తనత్ 1686, సెప్టెంబరు 12న ఔరంగజేబుతో యుద్ధంలో ఓడిపోయి, మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది.[2]

బీజాపూర్ స్వతంత్ర రాజ్యంగా కాక ముందు ఈ వంశ వ్యవస్థాపకుడు యూసఫ్ ఆదిల్ షా (1490–1510), బీజాపూర్ రాజ్యవిభాగానికి గవర్నర్ గా నియమింపబడ్డాడు. యూసఫ్ ను, అతని కొడుకు ఇస్మాయిల్ ను ఆదిల్ ఖాన్ బిరుదుతో వ్యవహరిస్తారు. ఖాన్ అంటే పర్షియన్, మంగోలియన్ భాషల్లో నాయకుడు అని అర్ధం. షా బిరుదు కన్నా తక్కువ స్థాయి కలిగినదే అయినా ఖాన్ అనేది రాచ మర్యాద కలిగిన బిరుదు. యూసఫ్ మనవడు ఇబ్రహిం ఆదిల్ షా 1 (1534–1558), తో "ఆదిల్ షా" బిరుదు సామాన్య వాడుకలోకి వచ్చింది.

బీజాపూర్ సుల్తానుల సరిహద్దులు కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. ఈ రాజ్య ఉత్తరపుటెల్లలు ఎప్పుడూ స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుత దక్షిణ మహారాష్ట్ర నుంచి ఉత్తర కర్ణాటక వరకూ ఈ రాజ్యం విస్తరించి ఉంది. రాయచూరు అంతర్వేది ప్రాంతాన్ని గెలవడంతో దక్షిణం వైపు వారి విస్తరణ ప్రారంభమైంది. 1565లో తళ్ళికోట యుద్ధంలో గెలుపుతో విజయనగర సామ్రాజ్యాన్ని గెలుచుకుని ఇంకా దక్షిణానికి జరిగారు. మొహమద్ ఆదిల్ షా (1627–1657), తరువాతి దండయాత్రలతో బీజాపూర్ అధికారపు సరిహద్దు మరింత దక్షిణాన ఉన్న బెంగళూరు వరకూ వచ్చాయి. పశ్చిమాన పోర్చుగీస్ పరిపాలనలో ఉన్న గోవా, తూర్పున కుతుబ్ షాహీ వంశం పాలిస్తున్న గోల్కొండ రాజ్యం వరకూ బీజాపూర్ రాజ్యం విస్తరించి ఉంది.

బహమనీ ప్రావిన్సు రాజధాని అయిన బీజాపూర్ నే వీరు కూడా చివరి వరకూ రాజధానిగా కొనసాగించారు. ఇబ్రహీం ఆదిల్ షా I (1534–1558), అలీ ఆదిల్ షా I (1558–1579) బీజాపూర్ నగరాన్ని పునర్నిర్మించారు. వీరిద్దరి పరిపాలనా కాలంలో నగరానికి ప్రహారీ, కాంగ్రిగేషన్ మసీదు, రాజభవనాలు, ప్రధాన నీటి సరఫరా మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపట్టారు. వారి వారసులు అయిన ఇబ్రహం ఆదిల్ షా II (1580–1627), ఆదిల్ షా (1627–1657), అలీ ఆదిల్ షా II (1657–1672) లు బీజాపూర్ ను సుందరమైన రాజభవనాలు, మసీదులు, సమాధులు, ఇతర కట్టడాలతో మరింత అలంకరించారు. దక్కన్ సుల్తనేట్, ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలికి అత్యుత్తమ ఉదాహరణాలలో ఒకటిగా నిలిచింది బీజాపూర్ నగరం.

బహమనీ సామ్రాజ్యం పతనం కావడంతో బీజాపూర్ లో అస్థిరత నెలకొంది. విజయనగర సామ్రాజ్యం, ఇతర దక్కన్ సుల్తానేట్ లతో నిరంతర యుద్ధాల కారణంగా రాజ్యంలో అభివృద్ధి క్షిణించింది. దక్కన్ సుల్తానేట్ మిత్ర రాజ్యాలన్నీ కూటమిగా కలసి 1565లో తళ్ళికోటలో విజయనగర రాజుల్ని ఓడించి, సామ్రాజ్యాన్ని గెలుచుకున్నారు. బీజాపూర్ ఎన్నో ప్రయత్నాల తరువాత ఆఖరుకి పొరుగు సుల్తనేట్ అయిన బీదర్ను 1619లో గెలుచుకున్నారు. పోర్చుగీస్ సామ్రాజ్యం గోవాలోని ఆదిల్ షాహికి చెందిన రేవు పట్టణంపై తీవ్ర ఒత్తిడి కొనసాగించేవారు. ఈ రేవుపై పోర్చుగీస్ వారు పెత్తనం చెలాయించేవారు. ఆఖరుకి ఇబ్రహిం II పరిపాలనాకాలంలో ఆ రేవు పట్టణాన్ని పోర్చుగీస్ వారు గెలుచుకున్నారు. ఛత్రపతి శివాజీ తిరుగుబాటుతో కొంత ఇబ్బంది ఎదుర్కున్నా, కొన్నాళ్ళు బీజాపూర్ రాజ్యం స్థిరంగానే కొనసాగింది. శివాజి తండ్రి షాజీ బోన్స్ లే ఆదిల్ షా పాలనలో మరాఠా ప్రాంతానికి ప్రధాన సేనాధిపతిగా పనిచేశాడు. తరువాతి కాలంలో శివాజీ మరాఠా ప్రాంతాన్ని గెలుచుకుని స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బ్రిటీష్ సామ్రాజ్యానికి ముందు మరాఠా సామ్రాజ్యం భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యంగా నిలిచింది. 16వ శతాబ్దం చివరి భాగంలో బీజాపూర్ సామ్రాజ్యానికి మొఘల్ సామ్రాజ్యం దక్కన్ ప్రాంతంలో విస్తరణ ప్రారంభం వల్ల అతిపెద్ద ముప్పు మొదలైంది. నిజానికి శివాజీ తిరుగుబాటుతో బలహీనపడిన బీజాపూర్ సామ్రాజ్యంపై మొఘల్ రాజులు సులువుగా అదుపు సంపాదించగలిగారు. ఆదిల్ షాహీ సామ్రాజ్యంపై వివిధ ఒప్పందాలు విధించడం ద్వారా మొఘలులు బీజాపూర్ లో విదేశీ పరిపాలన చేయడం ప్రారంభించారు. కొన్ని దశల అనంతరం 1636లో బీజాపూర్ రాజ్యం అధికారికంగా మొఘలుల అధీనంలోకి పాక్షికంగా వెళ్ళిపోయింది. 1686లో బీజాపూర్ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ముందు నుంచీ ఆదిల్ షాహీల ఖజానాను ఖాళీ చేస్తూ వచ్చారు మొఘలులు.

చారిత్రక అవలోకనం

[మార్చు]
యూసఫ్ ఆదిల్ షా వంశవృక్షం
ఇబ్రహిం ఆదిల్ షా II
పులిని వేటాడుతున్న సుల్తాన్ అలీ ఆదిల్ షా II c 1660
ఆదిల్ షాహి వంశ ఆఖరి రాజు సికిందర్ ఆదిల్ షా పరిపాలనా కాలం 1680లో పూర్తి అయిన "బీజాపూర్ ఆస్థాన" పెయింటింగ్.

ఆదిల్ షాహీ వంశ వ్యవస్థాపకుడు, ఆదిల్ షా జార్జియన్ బానిస అయి ఉండవచ్చు అని కొందరి చరిత్రకారుల అంచనా[3][4] అతన్ని ఇరాన్‌కు చెందిన మహ్మద్ గౌన్ కొనుగోలు చేశాడని వారి అభిప్రాయం. కానీ సల్మా అహ్మద్ ఫరూకీ అనే చరిత్రకారుని ప్రకారం యూసఫ్ ఒట్టోమన్ సుల్తాన్ మురాద్ II కొడుకు.[5] మిర్ రఫి-ఉద్దీన్ ఇబ్రహమ్-ఇ షిరజి అనే చరిత్రకారుడు యూసఫ్ అసలు పేరు సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా సవాహిగా ప్రతిపాదించాడు. రఫీ ప్రకారం యూసఫ్, ఇరాన్ లోని సవాకు చెందిన మహ్మద్ బేగ్ కొడుకు. రఫీ, ఆదిల్ షా వంశ చరిత్రను ఇబ్రహీం ఆదిల్ షా II అభ్యర్ధన మేరకు రచించాడు. భారతీయ చరిత్ర పండితుడు టి.ఎన్.దేవర్, బహమనీ వంశం గురించి రఫీ రాసిన చరిత్రలో కాల నిర్ణయం అస్థిరంగా ఉందనీ, అందులో అవకతవకలు ఉన్నాయనీ చెప్పాడు. కానీ ఆదిల్ షాహీ వంశ చరిత్ర కచ్చితంగా, కూలంకషంగా, అలీ I గురించీ, ఇబ్రహం II గురించి విలువైన సమాచారం ఉందనీ దేవర్ అభిప్రాయపడ్డాడు. రఫీ ఆ తరువాతి కాలంలో బీజాపూర్ కు గవర్నర్ గా 15ఏళ్ళ పాటు పనిచేశాడు.

సుల్తానుల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Salma Ahmed Farooqui, A Comprehensive History of Medieval India: From Twelfth to the Mid-Eighteenth Century, (Dorling Kindersley Pvt Ltd., 2011), 174.
  2. The Peacock Throne by Waldemar Hansen. ISBN 978-81-208-0225-4. Page 468.
  3. Chaurasia, Radhey Shyam (2002). History of Medieval India: From 1000 A.D. to 1707 A.D. p. 101.
  4. Subrahmanyam, Sanjay (2012). Courtly Encounters: Translating Courtliness and Violence in Early Modern Eurasia. p. 101.
  5. Salma Ahmed Farooqui, A Comprehensive History of Medieval India: From Twelfth to the Mid-Eighteenth Century, (Dorling Kindersley, 2011), 174.