Jump to content

ఆదూరి సత్యవతీదేవి

వికీపీడియా నుండి
ఆదూరి సత్యవతీదేవి
ఆదూరి సత్యవతీదేవి
జననం(1948-12-08)1948 డిసెంబరు 8
India గుంటూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2008 అక్టోబరు 16
ప్రసిద్ధిగేయ రచయిత్రి, కవయిత్రి
మతంహిందూ
భార్య / భర్తఆదూరి వెంకట సీతారామమూర్తి

ఆదూరి సత్యవతీదేవి ప్రముఖ రచయిత్రి. ఈమె గేయం, కవిత, కథ, వ్యాసం, రేడియో నాటిక, సంగీత రూపకం, పుస్తకసమీక్ష, చిత్రసమీక్ష, పీఠిక వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేసింది.

విశేషాలు

[మార్చు]

ఈమె 1948, డిసెంబరు 8వ తేదీన గుంటూరులో జన్మించింది. 1969లో ఈమె ప్రముఖ రచయిత ఆదూరి వెంకటసీతారామమూర్తిని వివాహం చేసుకున్న తరువాత విశాఖపట్నంలో స్థిరపడింది. ఈమె గీత రచయిత్రిగా తన 13వ యేటనే కలం పట్టింది. సుమారు 200 లలితగీతాలు, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, బాలగేయాలు రచించింది. సుమారు 50 లలితగేయాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. కవయిత్రిగా ఈమె 150కి పైగా కవితలు వ్రాసి పలువురు సాహిత్య విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆకాశవాణి, దూరదర్శన్ కవిసమ్మేళనాలలో పాల్గొన్నది. ఈమె కవితలు హిందీ, ఇంగ్లీషు భాషలలో అనువదించబడి "ఇండియన్ లిటరేచర్", "సమకాలీన్ భారత్ సాహిత్య" వంటి ప్రఖ్యాత పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె 2008, అక్టోబరు 16వ తేదీన అనారోగ్యగ్రస్తురాలై మరణించింది.[1][2]

రచనలు

[మార్చు]
  1. వెన్నెల్లో వేణుగానం
  2. రెక్కముడువని రాగం
  3. జలపాతగీతం
  4. వేయిరంగుల వెలుగు రాగం
  5. వెన్నెల సౌరభాలు మొదలైనవి.

ఈమె రచనలు హిందీ, ఇంగ్లీషు భాషలలోనికి తర్జుమా అయ్యాయి. ఈమె కవిత "వేయిరెక్కల పావురం" ఆంగ్లానువాదం Myriad winged bird 2008 నుండి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విశ్వవిద్యాలయాల డిగ్రీ తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయించబడింది.

పురస్కారాలు

[మార్చు]

ఈమె సాహితీకృషికి గుర్తింపుగా పలు అవార్డులు, పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:

  • 1993లో రెక్కముడువని రాగం కవితా సంపుటికి ఎస్.టి.వి.డి.కళాసమితి అవార్డు
  • 1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి 'ఉత్తమ రచయిత్రి' ప్రతిభా పురస్కారం.
  • 1998లో ఆంధ్రలలితకళాసమితి (సికిందరాబాదు) నుండి కృష్ణశాస్త్రి పురస్కారం.
  • 2000లో యునెస్కో లిటరరీ అవార్డు.
  • 2002లో జైముని అకాడమీ (పానిపట్) వారి నుండి రామవృక్ష బేణీపూరి జన్మశతాబ్ది పురస్కారం.

మూలాలు

[మార్చు]