Jump to content

ఆయనే ఉంటే మంగలెందుకు

వికీపీడియా నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
పొడుపు కథలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు



ఆయనే ఉంటే మంగలెందుకు అనేది తెలుగు భాషలో వాడే ఒక సామెత. అనవసరపు సలహాలు ఇవ్వరాదు అనే దానికి ఈ సామెత ఉదాహరణ.

సామెత వెనుక కథ

పాత కాలం నాటి ఒక ఆచారం ఆధారంగా వాడుక లోకి వచ్చిన సామెత ఇది. పూర్వకాలంలో భర్త చనిపోయిన స్త్రీ బొట్టు, పూలు, ఆభరణాలను విసర్జించటంతో పాటు తలనీలాలను కూడా త్యజించవలసి వచ్చేది. (వితంతువులు జుట్టు పెంచుకోకూడదనే నియమముండేది.) నిందార్థకంగా వాడే "బోడి ముండ" అనే మాట కూడా ఈ ఆచారంలో నుంచి పుట్టిందే. వాళ్ళకున్న కట్టుబాట్లకు తోడు వీధిలో వాళ్ళకు ఎదురైన వాళ్ళు "అపశకునం" అని ఈసడించుకునే వాళ్ళు. అందువల్ల జుట్టు పెరిగినప్పుడల్లా వితంతు స్త్రీలు గుండు చేయించుకోవడానికి మంగలి దగ్గరకు వెళ్ళలేరు. అందుబాటులో ఉన్న చిన్న పిల్లలను పంపి మంగలిని ఇంటికి పిలుచుకురమ్మనే వాళ్ళు. ఒకసారి అలా జుట్టు పెరిగిన వితంతువు ఒకామె మంగలికి కబురు చేయబోతే, అందుబాటులో చిన్న పిల్లలెవరూ లేరట. అప్పుడామె "నా మొగుడే బ్రతికి ఉన్నట్లైతే వెళ్ళి పిలుచుకు వచ్చేవాడు కదా?" అని వగచిందట - ఆయనే ఉంటే తాను గుండు చేయించుకోవలసిన అవసరమే ఉండేది కాదని మరిచిపోయి.

ఒకవితంతువు గుండు చేయించుకోవటం కోసం మంగలిని పిలువవలసిందిగా దారిన పోయే దానయ్యను అడిగింది. అతను విసుగుగా నాకు చెప్పకపోతే మీ ఆయనకు చెప్పరాదా అన్నాడు. దానికి ఆవిడ ఆయనే ఉంటే మంగలి ఎందుకు అని అన్నది. అంటే ఆయన (భర్త) ఉంటే మంగలిని పిలిచి గుండు చేయించుకునే అవసరమే రాదుకదా! ఉచిత సలహాలు ఇవ్వటం ఎందుకు? అనేదానికి ఈ సామెత చెబుతారు.

వాడుక

ఇలా కార్య-కారణ సంబంధాన్ని మరచిపోయి ఆలోచించేటప్పుడు ఈ సామెతను వాడుతారు.

'ఆయన' (అనగా ఆమె భర్త) ఉన్నప్పుడు మంగలితో అవసరమేమిటి? ఏదైనా పూర్తికాని పనిని ఇలా ఫలాన వస్తువుతోనో, ఫలానా వ్యక్తుల సహాయ సహకారాలతో, ఇలాకాకుండా వేరే విధంగా సాధించవచ్చుకాదా అన్నవారికి అసహనంతో ఈ సామెతను ఉదహరిస్తారు. ఉదాహరణకు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే, గ్యాసు పొయ్యిమీద చెయ్యవచ్చుగదా అంటే "గ్యాసు పొయ్యే ఉంటే కట్టెల పొయ్యి ఖర్మ యెందుకు"?

ఒక వ్యక్తి బాగా డబ్బు అవసరం ఉండి బ్యాంకుకు వెళ్ళి అప్పు అడిగాడు. అప్పుకు హామీగా ఏవైనా "ఫిక్స్‌డ్ డిపాజిట్లు" చూపగలరా అని బ్యాంకు మేనేజరు అడిగాడు. ఆయనే ఉంటే మంగలెందుకు? - నా దగ్గర డబ్బులు నిలవ ఉంటే అప్పు ఎందుకడుగుతాను? అని అర్ధం.