Jump to content

ఇందిరా రాజన్

వికీపీడియా నుండి
ఇందిరా రాజన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఇందిరా రాజన్
జననం1939
కరైకల్, తమిళనాడు, భారతదేశం
మరణం2022 ఏప్రిల్ 29
చెన్నై, భారతదేశం
సంగీత శైలినాట్యం
వృత్తిభరతనాట్యం కళాకారిణి
క్రియాశీల కాలం1955 - 2022

ఇందిరా రాజన్ (1939 - 2022 ఏప్రిల్ 29) భరతనాట్య కళాకారిణి.[1]

ఆమె భరతనాట్యం నర్తకి మాత్రమే కాక ఉపాధ్యాయురాలు కూడా. ఆమె నృత్య రంగంలో ఆమె చేసిన సేవలకు గాను 1996 సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డు దక్కింది. చెన్నైలోని తన డ్యాన్స్ అకాడమీలో 1000 మందికి పైగా విద్యార్థులకు బోధించింది.[2]

విశేషాలు

[మార్చు]

ఈమె 1939లో తమిళనాడు, కరైకల్ పట్టణంలో ఇసై వెల్లాల కులానికి చెందిన సంగీత, నృత్య కళాకారుల కుటుంబంలో జన్మించింది.[3] ఆ కాలంలో పేరుపొందిన భరతనాట్య కళాకారిణి సుందరంబాళ్ మనుమరాలు ఈమె. నట్టువనార్‌గా పేరు గడించిన కె.ఎన్.దండాయుధపాణి పిళ్ళై, కె.ఎన్.పక్కీరస్వామి పిళ్ళైలు ఈమె బాబాయిలు. ఈమె మేనమామ బాలసుబ్రమణియన్ మృదంగ కళాకారుడు. ఈమె తన 5వ యేట కుట్రాలం గణేశన్ పిళ్ళై వద్ద భరతనాట్యాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టింది. తన 9వ యేట ఈమె మొట్టమొదటి నాట్యప్రదర్శనను ఇచ్చింది. అది మొదలు ఈమె ఫ్రాన్స్, స్విట్జర్‌లాండ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, లండన్, దుబాయి, సింగపూర్, హాంగ్‌కాంగ్, మలేసియా, దక్షిణ ఆఫ్రికా, శ్రీలంక మొదలైన దేశాలు పర్యటించి అనేక ప్రదర్శనలు ఇచ్చింది. నట్టువనార్‌గా ఈమె ప్రతిభను విమర్శకులు మెచ్చుకున్నారు. ఈమె వైజయంతిమాల, యామినీ కృష్ణమూర్తి, అలర్మెల్ వల్లి వంటి నాట్యకళాకారిణులకు నట్టువాంగం సమకూర్చింది. 1968లో ఈమె "వాదిని నాట్యాలయ" అనే సంస్థను స్థాపించి దానిద్వారా నాట్యగురువుగా ఈమె వందలాది మంది శిష్యులకు పందనల్లూరు బాణీలో భరతనాట్యం నేర్పించి వారిని నాట్యకళాకారిణులుగా తయారు చేసింది. మైథిలీ కుమార్, శుభా పర్మర్, చారులత జయరామన్, సావిత్రి మొదలైన వారు ఈమె వద్ద నాట్యం నేర్చుకున్న వారిలో మచ్చుకు కొందరు. ఈమె చెన్నైలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నృత్య అధ్యాపకురాలిగా పనిచేసింది. ఈమె తేవరం, తిరువసాగం, నాలాయిర దివ్యప్రబంధం మొదలైన తమిళ కావ్యాలను నృత్యనాటికలుగా రూపొందించింది.

పురస్కారాలు

[మార్చు]

ఈమ భరతనాట్యంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈమెకు అనేక పురస్కారాలు, బిరుదులు లభించాయి.

వాటిలో ముఖ్యమైన కొన్ని:

  • కళైమామణి - తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రం - 1991
  • సంగీత నాటక అకాడమీ అవార్డు - కేంద్ర సంగీత నాటక అకాడమీ - 1995
  • నాట్య కళారత్నం - తమిళనాడు ప్రభుత్వం - 1976
  • నాట్య కళాభూషణ్ - భారత ప్రభుత్వం - 1991
  • ఆచార్య చూడామణి - శ్రీకృష్ణ గానసభ, చెన్నై - 2004
  • నాట్య సెల్వి - తమిళనాడు ప్రభుత్వం - 1978
  • నాట్య బోధక అరసి - దండాయుధపాణి నాట్యకళాలయం - 1986
  • దేవనర్తకి - కరైకల్ సప్తస్వరం - 2003
  • ఇ.కృష్ణ అయ్యర్ మెడల్ - శృతి ఫౌండేషన్ - 2016

మరణం

[మార్చు]

ఆమె 2022 ఏప్రిల్ 29న 78 సంవత్సరాల వయస్సులో మరణించింది. యాదృచ్ఛికంగా, ఆమె అంతర్జాతీయ నృత్య దినోత్సవం రోజున మరణించింది. ఆమె విద్యార్థిని ఒకరు, "అంతర్జాతీయ నృత్య దినోత్సవం రోజున ఆమె మరణం కళతో ఆమెకు ఉన్న దైవిక సంబంధాన్ని తెలియజేస్తుంది" అని చెప్పింది.[4]

మూలాలు

[మార్చు]
  1. web master. "Indira Rajan". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.
  2. "Guru Mahima- A tribute to Guru Indira Rajan". Abhinaya Dance Company of San Jose (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 7 ఫిబ్రవరి 2024. Retrieved 7 February 2024.
  3. Narada Gana Sabha Trust. "Indra Rajan". నర్తకి. Retrieved 22 April 2021.
  4. "Remembering guru Indra Rajan". The Hindu (in Indian English). 5 May 2022. ISSN 0971-751X. Archived from the original on 7 June 2022. Retrieved 7 February 2024.