ఎర్రగుడి శాసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రగుడి మొదటి శిలాశాసనం

ఎర్రగుడి శాసనాలు లేదా అశోకుని ఎర్రగుడి శాసనాలు ఆంధ్రప్రదేశ్ లో లభ్యమైన అశోకుడి కాలం నాటి శాసనాలు. కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకాలో‌ గుత్తి(అనంతపురం జిల్లా) కి 10 కి.మీ. దూరంలోనున్న ఎర్రగుడి పొలాల్లో గుట్టల్లోని రాళ్ళపైనున్న అశోకుని శాసనాలను మొదట 18వ శతాబ్దం చివర్లో మెకంజీ, ఆయన సహాయకులు గుర్తించారు.[1] 1928-29 లో భూగర్భశాఖకు చెందిన ఎ. ఘోష్ ఈ శాసనాల వివరాలను పురాతత్వ శాఖ డైరెక్టరు జనరల్ హెచ్ ఆర్ గ్రీన్స్ కు తెలియచేస్తే, అప్పుడు ఎర్రగుడిలో అశోకుని శాసనాలున్నాయని తెలిసింది. ఇక్కడ మొత్తం రెండు లఘు శిలాశాసనాలు, పద్నాలుగు శిలాశాసనాలు లభించాయి.[2]

శిలాశాసనాలు[మార్చు]

ఈ శిలాశాసనం బయల్పడిన విషయం తెలుసుకున్న పురాతత్త్వ శాఖ హెచ్ ఆర్ గ్రీన్స్ ఈ పనిని శ్రీదయారాం సహానీకి అప్పగించగా, ఆయన నాటి శాసనపరిశోధన శాఖాధ్యక్షులైన శ్రీహరప్రసాదశాస్త్రితో కలిసి 1929 ఫిబ్రవరిలో ఎర్రగుడిని దర్శించారు. ఈ శాసనాల ముద్రలను తీసుకొని 4,12 తప్ప మిగితావన్ని తీసుకున్నారు, తర్వాత కొద్ది కాలానికి విశ్వనాధ ఈ మిగిలిన శాసనాలను కనిపెట్టారు. ఈ శాసనముల ప్రాముఖ్యతతో వారు పత్రికలలో ప్రకటించి పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే పరిశోధనలు ఆటంకాలతో అసలు విషయాలు బయటకి రాలేదు. ఇది గమనించిన మల్లంపల్లి సోమశేఖరశర్మ నేలటూరు వేంకటరమణయ్యతో కలిసి వెళ్ళి స్వయంగా పరిశీలించి వచ్చి భారతి పత్రిక 1929 సెప్టెంబర్ సంచికలో వివరాలు వెల్లడించారు. ఈ శాసనాల పరిశోధనను ఎపిగ్రాఫియా ఇండికాలో ప్రచురించాలని పురాతత్త్వశాఖ నిశ్చయించి, ఆ పనిని హరిప్రసాదశాస్త్రికి అప్పగించినా ఆయన ఉద్యోగ పదవీవిరమణ వలన ఆ పని పూర్తి కాలేదు, ఆపైన ఈ పని దయారాం సహాని చేయవలసి వచ్చింది, అయితే ఆయన హఠాత్తుగా చనిపోవటం వలన ఈ పని మూలన పడింది. ఆ తరువాత ఎస్.పి. చక్రవర్తి ఈ పనిని చేపట్టి తిరిగి ఎర్రగుడి వెళ్ళి శాసనాల చిత్రాలు తీసి పరిశోధన పత్రం వ్రాయటం మొదలుపెట్టారు, అది పూర్తయే లోపే ఆయన కూడా చనిపోయారు. ఈయన సగంలో ఆపేసిన పనిని బేణి మాధవ బారువా తన గ్రంథం అశోకుని శాసనములలో చేర్చగా, పూర్తి శాసన పరిశోధన పత్రాన్ని డి.సి. సర్కార్ 1957-58 లో ఎపిగ్రాఫియా ఇండియా లో ప్రచురించారు. ఈ శాసనాలను మొదట పరిశోధన చేసిన సహానీ శాసనాలకు A, B, C, D, E, F అని నామకరణం చేసారు. అయితే ఈ శాసనాలు చెక్కిన రాళ్ళు నునుపుదేర్చకుండానే చెక్కారు గనుక అక్షరాలను పోల్చుకోవడం కష్టమయింది. A శిల ఇరవై అడుగుల ఎత్తున కొండ కొనపై ఉంది, దీని కింద భాగం విరిగిపోయింది. ఈ శిల తూర్పు వైపు 17 అడుగుల 6 అంగుళాల వెడల్పుతో అశోకుని ధర్మలిపులలో I, II, III, XIV శాసనాలు కలిగి ఉంది. శాసనములు చెక్కినపుడు రెండు శాసనాల మధ్య ఖాళీ వదలకపోవటం వలన ఏది ఎక్కడ మొదలవుతుందో, ముగుస్తుందో పోల్చుకోవటం కష్టం. శాసనం F ఒక్కటి చదవడానికి వీలుగా విడిగా ఉంది.[3]

మూలాలు[మార్చు]

  1. ది జాగ్రఫిక్ ఫాక్టర్ ఇన్ ఆంధ్ర హిస్టరీ అండ్ ఆర్కలజి, బి. సుబ్బారావు , బులెటిన్ ఆఫ్ ది డెక్కన్ కాలేజ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాల్యూమ్. 9, నెం. 1/2 (డిసెంబర్, 1948), పేజీలు. 167-183
  2. అశోకుని ఎఱ్ఱగుడి శిలాశాసనములు, డా. రాయప్రోలు సుబ్రహ్మణ్యము, విషయసూచిక. పేజీ 4
  3. అశోకుని ఎఱ్ఱగుడి శిలాశాసనములు, డా. రాయప్రోలు సుబ్రహ్మణ్యము, విషయసూచిక. పేజీ VII, VIII, IX