Jump to content

మల్లంపల్లి సోమశేఖర శర్మ

వికీపీడియా నుండి
(మల్లంపల్లి సోమశేఖరశర్మ నుండి దారిమార్పు చెందింది)
మల్లంపల్లి సోమశేఖర శర్మ
జననం(1891-12-09)1891 డిసెంబరు 9
వృత్తిచారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్రవేత్త
పిల్లలుఆదిత్య శర్మ
తల్లిదండ్రులు
  • భద్రయ్య (తండ్రి)
  • నాగమ్మ (తల్లి)

మల్లంపల్లి సోమశేఖర శర్మ సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్రజ్ఞుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని మినిమించిలిపాడులో డిసెంబరు 9 వ తేదిన శ్రీమతి నాగమ్మ, భద్రయ్య గార్లకు 1891లో జన్మించాడు. ఈయన గృహ నామమైన మల్లంపల్లి అనే గ్రామం తెలంగాణలోని "పాలకూరు"కి "బమ్మెర"కు సమీపమున నున్న గ్రామం కాకతీయ పతనానంతరం శర్మ గారి పూర్వీకులు అక్కడ నుంచి గోదావరి మండలానికి తరలి వచ్చారని తెలుస్తుంది. సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి. సాహిత్యరంగంలోను, రాజకీయ రంగంలోను ప్రసిద్ధి గాంచాడు. బిపిన్ చంద్రపాల్ ప్రసంగాల ప్రభావం ఈయన మీద ఉండటం వల్ల రాజమహేంద్రవరంలో విద్యార్థులు వందేమాతర ఉద్యమం చేపట్టాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించాడు. కథలు, నాటకాలు, నవలలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించాడు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని మద్రాసు నగరానికి మారింది. ఆరోజులలో చరిత్ర చతురాననుడుగా ప్రసిద్ధి చెందిన చిలుకూరి వీరభద్రరావుతో శర్మకు పరిచయమైంది. అతనికి సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు వ్రాశాడు. అనంతరం విజ్ఞాన సర్వస్వం కృషిలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, రాయప్రోలు సుబ్బారావు వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు.

అప్పటికి ఆంధ్ర దేశంలో చరిత్ర పరిశోధన ప్రాథమిక దశలోనే ఉండేది. చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలైన శాసనాలను రక్షించి, వెలుగులోకి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను శర్మ తలకెత్తుకొన్నాడు. ఒంటరిగాను, మిత్రుడు నేలటూరి వెంకట రమణయ్యతో కలిసీ నెల్లూరు జిల్లాలోను, రాయలసీమ ప్రాంతంలోనూ అన్వేషణా యాత్రలు సాగించాడు. ఇతనిని శాసనాల శర్మ అని ప్రజలు సాదరంగా గౌరవించేవారు. ఈ అన్వేషణ ఫలితంగా అశోకుని ఎర్ర గుడిపాడు శాసనం, పల్లవ, తెలుగు చోడ, రెడ్డి, విజయనగర రాజుల కాలంనాటి ఇతర శాసనాలు వెలుగులోకి వచ్చాయి.

తాము సేకరించిన శాసనాలను విశ్లేషించి వివిధ అంశాలను వివరిస్తూ ఎపిగ్రాఫియా ఇండియా, భారతి, శారద, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాశాడు. ఘంటసాల ప్రాకృత శాసనాల గురించి శర్మ వ్రాసిన వ్యాసం అతని మరణానంతరం ప్రచురితమయ్యింది. శాసనాల లిపిని పరిశోధించడంలోనూ అఖిలభారత పరిగణన పొందిన ఆంధ్ర చరిత్రకారుడు శర్మ మాత్రమే అనవచ్చును. ఏ సమస్యనైనా భిన్న దృక్కోణాల నుండి పరిశిలించి సమన్వయ శాస్త్రీయ దృష్టితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు వెల్లడించేవాడు[1]. అహదహనకర శాసనంలోని ఒక అక్షరాన్ని శర్మ "ఱ"గా గుర్తించగా వేటూరి ప్రభాకర శాస్త్రి దానిని "ష+జ" ('ష' క్రింద 'జ' వత్తు) అని అన్నాడు. ఈ విషయమై వారిద్దరికీ ఆసక్తికరమైన వాదోపవాదాలు నడచాయి. అయితే ఎంతటి పాండిత్యమూ, పట్టుదలా ఉన్నా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి సరిదిద్దుకోవడానికీ, ఎదుటివారి సూచనలను గౌరవించడానికీ ఆయన సిద్ధంగా ఉండేవాడు.

శాసన పరిశోధనలు

[మార్చు]

లిపి శాస్త్రంలోనే గాక ఆంధ్ర వాస్తు శిల్ప స్వభావ నిరూపణలో, ప్రతిమా స్వరూప నిర్ణయంలో శర్మ నిష్ణాతుడు. అమరావతీ స్తూపము అన్న అతని రచన ఇందుకు తార్కాణము. మొగల్‌రాజపురంలోని దుర్గ గుహలో మూలవిరాట్ స్థానంలో అస్పష్టంగా ఉన్న కుడ్య శిల్పాన్ని గుర్తించి అది అర్ధ నారీశ్వర మూర్తి అని సహేతుకంగా నిరూపించాడు.

సోమశేఖర శర్మ తన అధ్యయనాన్ని ఎక్కువగా మధ్య ఆంధ్ర యుగ చరిత్రపై సాగించాడు. సమస్యా భూయిష్టమైన వేంగి చాళుక్యుల కాల నిర్ణయంపై కూలంకషంగా కృషిచేశాడు. కాకతీయులు అన్నా, తెలంగాణమన్నా శర్మకు ప్రత్యేక అభిమానం. ఆ ప్రాంతం రాజవంశాలకు సంబంధించి 80కి పైగా శాసనాలను లఘు వ్యాఖ్యలతో ప్రచురించాడు. తన మిత్రుడు నేలటూరు వెంకటరమణయ్యతో కలిసి ఆచార్య యజ్దానీ సంపాదకత్వంలో వెలువడిన 'Early History of Deccan'లో సమగ్రమైన కాకతీయుల చరిత్రను వ్రాశాడు. కాకతీయుల తరువాత సాగిన అంధకార యుగం అనుకొనే సమయం గురించి పరిశోధించాడు. సా.శ. 1323-1336 కాలంలో ముసునూరు కాపయ నాయకుడు, ముసునూరు ప్రోలయ నాయకుడు తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన Forgotten Chapter of Andhra Historyలో వివరించాడు. ఈ "ముసునూరు యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు.[1]

అయితే సోమశేఖర శర్మ పరిశోధనలలో అగ్రస్థానం వహించే రచన The History of Reddi Kingdom and Kondaveedu and Rajahmundry. అసంఖ్యాకమైన శాసనాలనూ, కవుల కావ్యాలనూ, ముస్లిం చరిత్రకారుల రచనలనూ పరిశోధించి, నమ్మదగిన సమాచారాన్ని నిగ్గుదేల్చి తయారు చేసిన ఉత్తమ రచన ఇది. ఆంధ్ర దేశానికి చెందిన విజయనగర, వెలమ, బహమనీ, ముసునూరు రాజ్యాల చరిత్రనూ, ఆ రాజ్యాల మధ్య సంబంధాలనూ వివరించే ఆంధ్ర చరిత్ర ఇది.

శాసనములను ప్రకతించుటయందు ముఖ్యముగ వారి నిదానము, పాఠనిర్ణయము, సంపూర్ణమైన చక్కని వ్యాఖ్య ప్రతి శాసన పరిశోధకుడును నేర్వవలసియున్నది. తొందరపాటు అనునదే వారెరుగరు. పాఠ నిర్ణయమున తుదకొక్క అక్షర విషయమున చిన్న మార్పును సుచించినవారినైనా పెద్దగా ప్రశంసించుట వారికలవాటు. కేవలము '''భారతి'''లో వారు ప్రకటించిన శాసనములు సుమారు 30; ఎపిగ్రాఫియా ఇండికాలోనివి 4-ఆంధ్రపత్రిక రజితోత్సవ సంపుటములు, తెలంగాణా శాసనములు ప్రకటించియున్నారు. ఆంధ్ర దేశానికి సంబంధించిన ముఖ్య శాసనములు కొన్ని ఆంగ్లములో ఇత్రరత్రా ప్రకటించినప్పుడు వాటిని ఆయా వ్యాసకర్తల పేరనే మరల భారతిలో చక్కగా సంస్కరించి ఆంధ్రావనికంద జేయుచుండెడివారు. శాసన పరిశోధనలో ప్రకటించిన శాసనముల సంఖ్య ముఖ్యముకాదు; వానిపాఠనిర్ణయము, వ్యాఖ్య ముఖ్యముగ గమనించదగినవి. శర్మ గారు వ్యాఖ్యలే అందుకు నిదర్శనములు.

ఆంధ్ర దేశములోని మౌర్య అశోకుని బ్రాహ్మీశిలా శాసనము మొదలుకొని ఇక్ష్యాక, శాలంకాయన, విష్ణుకుండిన, పల్లవ, తూర్పు చాళుక్య, గాంగవంశ, కాకతీయ, మునుసూరి, రెడ్ది, విజయనగర రాజుల శాసనలిపులన్నింటినీ వారు చక్కగా చదివి పరిష్కరించిరి. భారతిలో ప్రకటించిన అశోకుని రాయలసీమ, శాలంకాయన నందివర్మ పెదవేగి, వినయాదిత్యుని కర్నూలు, అరికేసరి కొల్లిపర్రు, దేవేంద్రవర్మకంబికాయ, హస్తివర్మ నర్సింగపల్లి, ముసునూరి ప్రోలనాయకుని విలస శాసనములు ఆయా రాజవంశముల చరిత్రకు కడుముఖ్యమైనవి.ఈ శాసనముల ఆధారంగా వారనేక చక్కని చారిత్రక లఘువ్యాసములు భారతిలో రచించిరి. అందు కడపటి పల్లనుల కాల నిర్ణయము, వేంగి చాళుక్యులు, వాతాపిచాళుక్యులు, కళింగకదంబులు, త్రిలోచన పల్లవుడు, వడ్డవారము, బౌద్ధమత పరిణామము, పాల్కూరికి సోమన, జక్కన కవుల కాల నిర్ణయము, కులములుకుల సంఖ్య, చారిత్రక శతకములు, తంజావూరి మహారాష్ట్ర భూపతులు-ఆంధ్ర సాహిత్యము, యూరోపియనులు-ఆంధ్రభాషా చరిత్రసేవ మున్నగువానిలో ఆంధ్రదేశ సంస్కృతికి సంబంధించిన వివిధ రంగములలోని విజ్ఞాన విశేషములు కరతలామలకము గావించిరి.

"భారతీయ లిపి శాస్త్రము", "ఆంధ్రదేశమున మాండలికుల పరిపాలన" అను రెండు గ్రంథములు శర్మగారి రచించదలపెట్టిరి, కాని మల్లంపల్లి సోమశేఖర శర్మ 1963లో మరణించారు అందువల్ల ఆంధ్రులకు అవిలభించె అదృష్టము పోయింది.

సోమశేఖర శర్మ రచనలు

[మార్చు]
  • అమరావతి స్థూపము, ఇతర వ్యాసములు - 1932
  • కొన్ని చారిత్రిక వ్యాసాలు 'ఆంధ్రభారతి' వెబ్‌సైటులో చూడవచ్చును
  • నా నెల్లూరు జిల్లా పర్యటన - శాసనాన్వేషణా యాత్రలలో ఎదుర్కొన్న సమస్యలు, కష్ట నష్టాలు, ప్రజల నమ్మకాలు గురించి.
  • Corpus of inscriptions in the Telangana District part IV (Archaeological series) - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ (1973)
  • సోమశేఖర శర్మ విరచితము - ఆంధ్రవీరులు - 1920
  • రాగతరంగిణి - విచారకరమైన చిన్న కథ - 1916 - మనోరమ ప్రెస్
  • విజయ తోరణము - రేడియో నాటికలు
  • ఆంధ్ర సంస్కృతి తరంగిణి (Archaeological series) - 1976 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ
  • ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము - ప్రచురణ: ఆధునిక వాఙ్మయ కుటీరము, 22 దివాన్ రామ్ అయ్యంగార్ రోడ్డు, మద్రాసు-7, 1948, 128 పేజీలు - వెల రూ.1-8 [1]
  • రెడ్డి రాజ్యాల చరిత్ర ('హిస్టరీ ఆఫ్ రెడ్డీ కింగ్‌డమ్స్' ఆంగ్ల రచనకు ఆర్.వెంకటేశ్వరరావు తెలుగు అనువాదం) [2]
  • బౌద్ధ యుగము అంశంపై ఆయన రాసిన వ్యాసాలను చారిత్రకవ్యాసములు[2] పుస్తకం రూపంలో 1944లో ప్రచురించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, బయటి లింకులు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు వ్యాఖ్య. బౌద్ధము-ఆంధ్రము అనే వ్యాస సంకలనం నుండి
  2. సోమశేఖరశర్మ, మల్లంపల్లి. చారిత్రిక వ్యాసములు.