Jump to content

ఒంటరి పోరాటం

వికీపీడియా నుండి
ఒంటరి పోరాటం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రాఘవేంద్రరావు
రచన పరుచూరి సోదరులు (సంభాషణలు)
తారాగణం వెంకటేష్, ఫరా
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
భాష తెలుగు

ఒంటరి పోరాటం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1989 లో విడుదలైన సినిమా.[1] ఇందులో వెంకటేష్, ఫరా( శ్వేత), రూపిణి ప్రధాన పాత్రలలో నటించారు. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు.[2]

రాజా నిరక్షరాస్యుడైన ఓ కూలీ. ధనవంతుడైన సుదర్శన్ రావు కూతురు ప్రియాంక ధనగర్వంతో విర్రవీగుతుంటుంది. లెక్చరర్ అయిన రాజేశ్వరి దేవి ప్రియాంకను ఎప్పుడూ రెచ్చగొడుతూ ఉంటుంది. ప్రియాంక ఇంటికి ఎదురుగా ఓ గదిలో నిరుద్యోగియైన ఇందు తన స్నేహితులైన ఓ సైంటిస్టు, ఇంజనీరుతో కలిసి నివసిస్తూ ఉంటుంది. రాజాతో కలిసి వీరందరూ మంచి స్నేహితులవుతారు. రాజా, ప్రియాంక ఇద్దరూ ఎప్పుడు ఒకరితో ఒకరు చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు.

ఒకరోజు రాజేశ్వరి దేవి ఒక షాపింగ్ కాంప్లెక్స్ సమస్యను పరిష్కరించమని ప్రియాంకకు సవాల్ విసురుతుంది. ప్రియాంక ఇందు సహాయం కోరుతుంది. అదే సమయంలో రాజా తన స్నేహితుడైన సిద్ధప్ప తల్లి చికిత్స కోసం డబ్బు కోసం ప్రయత్నిస్తుంటాడు. ప్రియాంక ఆ సమస్యను పరిష్కరిస్తే డబ్బులు ఇస్తానని చెబుతుంది. రాజా తన తెలివితేటలతో ఆ సమస్యను పరిష్కరిస్తాడు. కానీ ప్రియాంక డబ్బు ఇవ్వకపోవడంతో స్నేహితుడి తల్లి మరణిస్తుంది. రాజా ఆవేశంలో ప్రియాంకను అవమాన పరచాలని అందరి ముందు ముద్దు పెట్టుకుంటాడు. దాంతో సుదర్శన్ రావు, ప్రియాంక కలిసి అతన్ని కొడతారు. దాంతో రాజా అవమానంతో తాను సుదర్శన్ రావు కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తానని చాలెంజ్ చేస్తాడు. అలా చేస్తే ప్రియాంకనిచ్చి పెళ్ళి చేయాలని పందెం విసురుతాడు. సుదర్శన్ రావు కూడా అందుకు అంగీకరిస్తాడు. ఇదంతా ఓ పక్క నుంచి రాజేశ్వరి దేవి గమనిస్తూ ఉంటుంది.

రాజేశ్వరి దేవి రాజాకు చదువు చెప్పించి తన చాలెంజ్ లో నెగ్గేలా చేస్తానని మాటిస్తుంది. ఆమె చెప్పినట్లే రాజా చదువుకుని వ్యాపారంలో ప్రవేశించి అనతి కాలంలోనే తన తెలివితేటలతో సుదర్శన్ రావుకు పోటీగా ఎదుగుతాడు. అప్పుడే సుదర్శన్ రావుకు రాజా విజయం వెనుక రాజేశ్వరి దేవి ఉన్నదని తెలుస్తుంది. అప్పుడే వారిద్దరికి పూర్వం ఉన్న వైరం గురించి తెలుస్తుంది. అంతేకాకుండా సుదర్శన్ రావు రాజా తల్లియైన భాగ్యలక్ష్మికి స్వయానా అన్న అనీ అతను తన చెల్లెల్లి దారుణంగా అవమానించిన సంగతి కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రియాంకకు కూడా రాజా మంచితనం గురించి తెలుసుకుని అతన్ని ఆరాధించడం మొదలుపెడుతుంది. మరో వైపు రాజా సుదర్శన్ రావు అక్రమ వ్యాపారాలను బయటపెడుతూ అతన్ని ఊపిరి సలపనీకుండా చేస్తుంటాడు. సుదర్శన్ రావు సివంగి శివరామకృష్ణ అనే వ్యక్తిని రాజేశ్వరిదేవి భర్తగా పరిచయం చేసి అందరి ముందు అవమానిస్తాడు. రాజా ప్రశ్నించడంతో రాజేశ్వరి దేవి గతంలో తాను కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నప్పుడు ఛైర్మన్ గా ఉన్నపుడు సుదర్శన్ అక్రమాలను బయటపెట్టి ఎలా బయటకు పంపించిందీ, అందుకు అతను సివంగి శివరామకృష్ణ ను పావుగా వాడుకుని తన్ను ఎలా అవమానించిందీ వివరిస్తుంది. వారికి సరైన గుణపాఠం చెప్పి తన గురుదక్షిణగా ఇమ్మంటుంది. రాజా సుదర్శన్ రావు అక్రమ వ్యాపారాలన్నింటినీ బయటపెట్టి అతన్ని జైలు పాలు చేస్తాడు. చివరికి సుదర్శన్ రావు రాజేశ్వరి దేవిని, ఇందును బంధించడంతో వారిని విడిపించడంతో కథ సుఖాంతమవుతుంది.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • నువ్వురెడీ నేను రెడీ , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • పడాలి ప్రేమలోన , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • తిప్పు టాప్ సోకులాడి , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి .
  • మేడలోద్దు మిద్దెలోద్దు , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ జానకి
  • పెదవి మీద ముద్దు, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "ఒంటరి పోరాటం నటవర్గం". telugumoviepedia.com. Retrieved 2 October 2016.[permanent dead link]
  2. "ఒంటరి పోరాటం పాటలు". naasongs.com. Archived from the original on 24 సెప్టెంబరు 2016. Retrieved 2 October 2016.

బయటి లింకులు

[మార్చు]