కె. చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్రవర్తి

సంగీత దర్శక గాయకుడు - కొమ్మినేని అప్పారావు
జన్మ నామంకొమ్మినేని అప్పారావు
జననం (1936-09-08)1936 సెప్టెంబరు 8
పొన్నెకల్లు గ్రామం
తాడికొండ మండలం
గుంటూరు జిల్లా
మరణం 2002 ఫిబ్రవరి 3(2002-02-03) (వయసు 65)
క్రియాశీలక సంవత్సరాలు 1936–2002
భార్య/భర్త రోహిణీ దేవి
పిల్లలు నలుగురు కుమారులు
నంది అవార్డులు
ఉత్తమ సంగీత దర్శకుడిగా ‘నేటిభారతం’ (1983), ‘శ్రావణ మేఘాలు’ (1986)

చక్రవర్తి గా సుపరిచితుడైన సంగీత దర్శక గాయకుడు. చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు.(1936 -2002): వీరు దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. అతను 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు.

జననం, విద్య[మార్చు]

చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. అప్పారావుది గుంటూరు జిల్లా, పొన్నెకల్లు గ్రామం. 1936 సెప్టెంబరు 8వ తేదీన జన్మించాడు. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, బసవయ్య. వారిది వ్యవసాయ కుటుంబం. ప్రాథమిక విద్య సొంతవూరు పొన్నెకల్లులో చదివారు. గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ చదివారు. వీరి తల్లిదండ్రులు సంగీతజ్ఞానం కలవారు. తండ్రి రంగస్థల నటుడు కూడా. తల్లి మంచి గాయని. ఆమె ప్రభావం చక్రవర్తి మీద ఎంతో వుంది. ఆ కారణంగా అతనికి సంగీతంపై ఆసక్తి కలిగింది. అతని ఉత్సాహంచూసి తండ్రిగారు గుంటూరులో ఉన్న మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించారు. ఒక పక్క చదువు, మరో పక్క సంగీతాభ్యాసం నిరాటంకంగానే సాగాయి. అతను ఉత్సాహం పట్టలేక వినోద్ ఆర్కెస్ట్రా అనే బృందాన్ని ఏర్పాటు చేసి పాటలు, పద్యాలు పాడుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో 1954-58ల మధ్య కె.అప్పారావు కంఠం పాటలతో ప్రతిధ్వనించేది. నాటి శ్రోతలకి అతని కంఠం బాగా పరిచయం. 1958లో బి.ఏ.లో డిగ్రీ తీసుకున్నా, హిందీ పరీక్షలో విశారదుడైనా ఉన్న ఉత్సాహం సంగీతాన్ని ఎన్నుకున్నాడు, నమ్ముకున్నాడు కానీ ఉద్యోగ ప్రయత్నం మాత్రం చేయలేదు.

తన మేనమామ కుమార్తె అయిన రోహిణి దేవిని వివాహం చేసుకొని 1958లో కుటుంబంతో మద్రాసు చేరాడు. వీరికి నలుగురు కుమారులు. దర్శకుడిగా రాణించిన కొమ్మినేని శేషగిరిరావు చక్రవర్తి గారి తమ్ముడే. చక్రవర్తి రెండవ కుమారుడు శ్రీ కూడా తెలుగు సినిమా సంగీతకారుడిగా విశేషంగా రాణించాడు.

నేపథ్య గాయకుడు[మార్చు]

అప్పారావు మద్రాసు వచ్చి హెచ్.ఎమ్.వి. వారికి గ్రామఫోను పాటలు పాడటం మొదలుపెట్టాడు. ఒక రికార్డింగులో సంగీతదర్శకులు రాజన్, నాగేంద్రలు అవకాశం ఇప్పించి పాడించారు. బి.విఠలాచార్య ఆప్పారావుకి తన సినిమా జయ విజయ (1959)లో ఆడాలి ... పెళ్ళాడాలి అనేపాటను పాడించారు, ఆ పాటను చిత్రంలో హాస్యనటుడు బాలకృష్ణ పాడతాడు. ఇదే అప్పారావు సినిమాలలో పాడిన మొదటి పాట. అప్పారావు సినిమాలలో 200లకు పైగా పాటలు పాడాడు. కొన్ని కలిసి పాడినవి ఐతే, కొన్ని యుగళ గీతాలు. పరమానందయ్య శిష్యుల కథ (1966)లో ఘంటసాలతో పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా అనే పాటను పాడారు. బంగారు సంకెళ్ళు (1968)లో రాజబాబుకి తొలగండెహే అనే తాగుడు పాటని పాడారు. నిలువు దోపిడి (1968)లో ఎన్.టి.రామారావుకి ఒక పద్యం చదివినప్పుడు, నాగార్జున పద్యాలు, శ్లోకాలు చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. గాయకునిగా ‘తల్లీ కూతుళ్ళు’, ‘దేవి లలితాంబ’, ‘నిలువుదోపిడీ’, ‘ రాముని మించిన రాముడు’, ‘పక్కింటి అమ్మాయి’, ‘స్వరాజ్యం’ వంటి సినిమాలలో చక్రవర్తి పాటలు పాడారు.

సంగీత దర్శకుడు[మార్చు]

ఫలోమా అనే మలయాళ చిత్రం హిందీ దబ్బింగుకి వచ్చింది, దానికి అప్పారావుని సంగీత దర్శకునిగా తీసుకున్నారు. టైటిల్స్‌లో అన్నీ హిందీ పేర్లే ఉన్నాయి, వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకని సినిమావారు అతనుకు చెప్పి చక్రవర్తిగా వేశారు. మూగ ప్రేమ (1970) చిత్రంకి అతను సంగీత దర్శకత్వం వహించారు, అందులోనూ చక్రవర్తి పేరు ఖాయమైంది. ఈ విధంగా అప్పారావు చక్రవర్తిగా మారాడు. మూగ ప్రేమలో పాటలు బాగున్నాయి అని పేరు వచ్చిన తరువాత, భలే గూఢచారి (1970), తల్లీ కూతుళ్ళు (1971)లకు సంగీత దర్శకత్వం వహించారు. మూగ ప్రేమలో ఈ సంజెలో..., నాగులేటి వాగులోన... పాటలు పేరు తెచ్చినట్లు, తల్లీ కూతురు పాటలు కూడా పేరు తెచ్చాయి. అయినా అతను అంతగా పేరు తెచ్చుకోలేదు. కొంత కాలం ప్రయత్నాలు అటూ-ఇటూ సాగాయి. వీటి మధ్య దర్శకుడు సి.ఎస్.రావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరి నిలువు దోపిడి, మళ్ళీపెళ్ళి, కంచుకోట, పెత్తందార్లు సినిమాలకు పనిచేశాడు. మధ్య మధ్యలో తనకి ఇష్టమైన శాఖ సంగీతాన్ని విడవకుండా పాటలూ పాడేవాడు. శారద చిత్రంతో సినీ రంగంలో స్థిరపడ్డారు.

1976 -88 మధ్య కాలంలో అద్భుతమైన అవకాశాలు చక్రవర్తి వెంట నడిచాయి. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్‌ నడుపుతున్న ఎన్‌.టి.రామారావు చిత్రాలు ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘యమగోల’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘వేటగాడు’, ‘ఛాలెంజ్‌ రాముడు’ వంటి చిత్రాలకు చక్రవర్తి అద్భుత సంగీతాన్ని సమకూర్చారు.1977 లో వచ్చిన యమగోల తో మంచి పేరు పొందారు. హిందీలో గురుదత్‌ నిర్మించిన ‘ప్యాసా’ (1957)ను చటర్జీ ‘మల్లెపూవు’ (1978) పేరుతో పునర్నిర్మించినప్పుడు చక్రవర్తి సమకూర్చిన సంగీతం అబ్బుర పరచింది. హిందీ మాతృకలో ఒక్క పాటను కూడా అనుకరించకుండా పాటలను చక్రవర్తి స్వరపరచిన విధానం ఎందరో నిర్మాతలు, దర్శకులకు స్పూర్తి దాయకమైంది. నటులకు అనుగుణంగా చక్రవర్తి పాటలు స్వరపరచి సినిమాలు హిట్లయ్యేందుకు సహకరించారు. కేవలం వ్యాపార చిత్రాలకే కాకుండా మాదాల రంగారావు నిర్మించిన ‘ఎర్రమల్లెలు’,విప్లవశంఖం’, ‘ప్రజారాజ్యం’ ‘మహాప్రస్థానం’. టి. కృష్ణ నిర్మించిన ‘నేటిభారతం’, ‘వందేమాతరం’, ‘రేపటి పౌరులు’ వంటి ప్రబోధాత్మక చిత్రాలకు కూడా అర్ధవంతమైన సంగీతాన్ని అందించడం చక్రవర్తి ప్రత్యేకత.

రీరికార్డింగు చెయ్యడంలో చక్రవర్తిది మేటి చేయి. ‘సర్దార్‌ పాపారాయుడు’ వంటి చిత్రాల్లో థీమ్‌ మ్యూజిక్‌ వంటి అంశాన్ని ప్రవేశపెట్టారు. ‘తీర్పు’ చిత్రంలో అతి తక్కువ వాద్యాలతో పాటలు స్వరపరచి సినీ సంగీతానికి కొత్త అర్ధం తెచ్చారు. అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాభిషేకం, ఎన్.టి.రామారావు‌తో కొండవీటి సింహం వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించి 850 తెలుగు చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 1989 లో తెలుగులో 95 సినిమాలు విడుదల అయితే  వాటిలో 66 చిత్రాలకు చక్రవర్తి గారే సంగీతాన్ని కూర్చటం ప్రపంచ చిత్ర పరిశ్రమలోఒక రికార్డ్. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’, ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ పాటలకు సంగీత సొబగులద్ది రికార్డులుగా విడుదలచేస్తే నేటికీ అవే పాటలను ఎన్నికల ప్రచారంకోసం ఆ పార్టీ పెద్దలు వాడుకుంటున్నారు.

చిత్ర దర్శకుడు[మార్చు]

చక్రవర్తి దృష్టి కొంతకాలం దర్శకత్వం వైపు మొగ్గింది. గుత్తా రామినీడు, సి.ఎస్‌.రావు వద్ద పనిచేశారు. సి.ఎస్‌.రావు దర్శకత్వం వహించిన ‘కంచుకోట’, ‘పెత్తందారు’్ల, ‘నిలువు దోపిడీ’, ‘దేశోద్ధారకుడు’ చిత్రాలకు సహాయ దర్శకుడు చక్రవర్తే. చక్రవర్తి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. చివరిసారిగా నిన్నే ప్రేమిస్తా చిత్రంలో సౌందర్య నాన్నగారిగా నటించారు.

డబ్బింగ్ చిత్రాలకు గాత్రం[మార్చు]

సంగీతానికి ప్రత్యామ్నాయంగా డబ్బింగ్‌ రంగమయితే బాగుంటుందని, అటువైపు అడుగులు వేశాడు చక్రవర్తి. ఆ కాలంలో అనువాద చిత్రాలు ఎక్కువగా ఉండేవి, అందులో అప్పారావుకి అవాకాశాలు వచ్చాయి, నాటకాలలో అనుభవం ఉండడం చేత అతను సంభాషణలను బాగా చెప్పగలిగారు.ఈ విధంగా అప్పారావు పాటలు పాడడంతో పాటు అనువాద చిత్రాలలో పాత్రలకు గాత్రం అందించటం మొదలుపెట్టాడు. అతని కంఠం, చెప్పే విధానం బాగా ఉండడంతో హీరో పాత్రలకు గాత్రదానం చేసే స్థాయికి ఎదిగాడు. అతను ఎం.జి.రామచంద్రన్, జయశంకర్, జెమిని గణేశన్ లకు గాత్రం అందించాడు. హాస్యనటులైన నగేష్, కులదైవం రాజగోపాల్ లకూ అతను గాత్రదానం చేసారు. ముఖ్యంగా అతను నగేష్కు బాగా డబ్బింగు చెప్పేవారు. కమల హాసన్, రజనీకాంత్, హిందీ నటుడు సంజీవకుమార్, కన్నడ రాజకుమార్‌ వంటి నటులకు కూడా గాత్రదానం చేశాడు. సంగీత దర్శకుడుగా వుంటూనే డబ్బింగ్‌ ఆర్టిస్టుగా 1978-85 మధ్యకాలంలో సుమారు మూడు వందల చిత్రాలకు పైగా చక్రవర్తి పనిచేశారు. వాటిలో ‘కన్నెపిల’్ల, ‘సర్వర్‌ సుందరం’, ‘ఊర్వశి’, ‘కల్పన’, ‘మన్మధలీల’ వంటి చిత్రాలున్నాయి. దాదాపు 600 చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు.

సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు[మార్చు]

  1. మూగ ప్రేమ (1971)
  2. తల్లీ కూతుళ్లు (1971)
  3. జ్యోతిలక్ష్మి (1973)
  4. శారద (1973 సినిమా)
  5. ఇదా లోకం (1973)
  6. హారతి (1974)
  7. అనగనగా ఒక తండ్రి (1974)
  8. సత్యానికి సంకెళ్ళు (1974)
  9. తిరుపతి (1974)
  10. ఆడంబరాలు - అనుబంధాలు (1974)
  11. దీర్ఘ సుమంగళి (1974)
  12. ఊర్వశి (1974)
  13. ఇంటి కోడలు (1974)
  14. అభిమానవతి (1975)
  15. బాబు (1975 సినిమా)
  16. భారతి ( ఎస్పి కోదండపాణితో) (1975)
  17. చీకటి వెలుగులు (1975)
  18. అన్నదమ్ముల అనుబంధం (1975)
  19. బలిపీఠం (1975)
  20. జేబుదొంగ (1975)
  21. తీర్పు (1975)
  22. యవ్వనం కాటేసింది (1976)
  23. ఇద్దరూ యిద్దరే (1976)
  24. నా పేరే భగవాన్ (1976)
  25. జ్యోతి (1976)
  26. పొరుగింటి పుల్లకూర (1976)
  27. రాజా (1976)
  28. ముగ్గురు మూర్ఖులు (1976)
  29. గంగా యమున సరస్వతి (1977)
  30. జీవితంలో వసంతం (1977)
  31. జీవనతీరాలు (1977)
  32. కల్పన (1977)
  33. ఖైదీ కాళిదాసు (1977)
  34. మా ఇద్దరి కథ (1977)
  35. రంభ ఊర్వశి మేనక (1977)
  36. ఆమె కథ (1977)
  37. యమగోల (1977)
  38. చరిత్రహీనులు (1977)
  39. దేవతలారా దీవించండి (1977)
  40. ఈ తరం మనిషి (1977)
  41. అడవిరాముడు (1977)
  42. ఇంద్రధనస్సు (1978)
  43. ముగ్గురూ ముగ్గురే (1978)
  44. విచిత్ర జీవితం (1978)
  45. బొమ్మరిల్లు (1978)
  46. అల్లరి బుల్లోడు (1978)
  47. అతనికంటే ఘనుడు (1978)
  48. మల్లెపూవు (1978)
  49. రాముడు రంగడు (1978)
  50. సింహగర్జన (1978)
  51. జగన్మోహిని (1978)
  52. సీతాపతి సంసారం (1978)
  53. ప్రాణం ఖరీదు (1978)
  54. పదహారేళ్ల వయసు (1978)
  55. ముగ్గురు మూర్ఖురాళ్లు (1978)
  56. మార్పు (1978)
  57. అమరప్రేమ (1978)
  58. డ్రైవర్ రాముడు (1979)
  59. తాయారమ్మ - బంగారయ్య (1979)
  60. ఏడడుగుల అనుబంధం (1979)
  61. శివకేశవులు (1979)
  62. మరో సీత కథ (1979)
  63. నగ్నసత్యం (1979)
  64. ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
  65. బొట్టు కాటుక (1979)
  66. జూదగాడు (1979)
  67. వేటగాడు (1979)
  68. ఇల్లాలి ముచ్చట్లు (1979)
  69. కోతల రాయుడు (1979)
  70. శంఖు తీర్థం (1979)
  71. బుర్రిపాలెం బుల్లోడు (1979)
  72. నిండు నూరేళ్లు (1979)
  73. ముద్దు ముచ్చట (1979)
  74. మా ఊరి దేవత (1979)
  75. శాంతి నివాసం (1979)
  76. రగిలే గుండెలు (1979)
  77. ఛాలెంజ్ రాముడు (1980)
  78. బడాయి బసవయ్య (1980)
  79. మామా అల్లుళ్ళ సవాల్ (1980)
  80. కక్ష (1980)
  81. ఏడంతస్తుల మేడ (1980)
  82. శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యం (1980)
  83. పటాలం పాండు (1981)
  84. అనసూయమ్మ గారి అల్లుడు (1986)
  85. కృష్ణ గారడీ (1986)
  86. ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ (1988)
  87. చెవిలో పువ్వు (1990)
  88. ఆయుధం (1990)
  89. అల్లుడు దిద్దిన కాపురం (1991)
  90. గోల్‌మాల్ గోవిందం (1992)
  91. అమ్మోరు (1995)

మరణం[మార్చు]

చక్రవర్తి సంగీత దర్శకత్వం అందించిన చిత్రాల సంఖ్య 959. ఆ మిగిలిన సంఖ్య కూడా పూర్తిచేసి 1000 చిత్రాల దర్శకుడిగా రికార్డు నెలకొల్పాలని చక్రవర్తికి ఆశగా వుండేది. అమ్మోరు చిత్రానికి చివరి సారిగా సంగీతాన్ని అందించిన చక్రవర్తి 2002 ఫిబ్రవరి 3న కన్నుమూశారు.

ఉత్తమ సంగీత దర్శకుడిగా ‘నేటిభారతం’ (1983), ‘శ్రావణ మేఘాలు’ (1986) చిత్రాలకు నంది బహుమతులు లభించాయి.

వీరి శిష్యుడు ఏ.ఆర్.రెహమాన్ ఆస్కార్ అవార్డు పొందాడు. చక్రవర్తి రెండవ కుమారుడు అయిన శ్రీ సినీ సంగీత రంగంలో పనిచేస్తున్నాడు.

భారత తపాలశాఖ వారు గుంటూరులో 2014 సెప్టెంబర్ 9న చక్రవర్తి గారిపై ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు.[1]

మూలాలు[మార్చు]

  1. "సంగీత దర్శకుడు చక్రవర్తి గారికి స్మారక తపాలా కవరు". STAMPS OF ANDHRA. September 12, 2014. Retrieved 2021-07-06.

వెలుపలి లంకెలు[మార్చు]