అమ్మోరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మోరు
దర్శకత్వంకోడి రామకృష్ణ
రచనసత్యానంద్ (మాటలు), ఎం. ఎస్. ఆర్ట్స్ యూనిట్ (కథ)
నిర్మాతశ్యామ్ ప్రసాద్ రెడ్డి
తారాగణంసురేష్,
సౌందర్య,
రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
కూర్పుకె. వి. కృష్ణారెడ్డి
సంగీతంశ్రీ కొమ్మినేని, చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1995 నవంబరు 23 (1995-11-23)
సినిమా నిడివి
124 ని
భాషతెలుగు

అమ్మోరు 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా.[1] ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్, రామిరెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎం. ఎస్. రెడ్డి సమర్పణలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఎం. ఎస్. ఆర్ట్స్ యూనిట్ కథ సిద్ధం చేయగా సత్యానంద్ మాటలు రాశాడు. తండ్రీ తనయులు చక్రవర్తి, శ్రీ కొమ్మినేని ఈ చిత్రానికి సంగీతాన్నందించారు. ఈ చిత్ర సమర్పకుడైన మల్లెమాల ఈ చిత్రంలో పాటలు కూడా రాశాడు.[2]

కథ[మార్చు]

ఒక ఊరిలో మహమ్మారి రోగంతో చాలామంది చనిపోతుంటారు. అందరూ కలిసి అమ్మోరు జాతర జరుపుతారు. ఆ జాతరకు అమ్మోరే స్వయంగా దిగివచ్చి ప్రసాదం పెట్టమంటుంది. ఊర్లో వాళ్ళంతా నైవేద్యం పెట్టందే ప్రసాదం పెట్టమంటారు. కానీ ఒకావిడ మాత్రం ఆమెకు పిడికెడు మెతుకులు పెడుతుంది. దాన్ని స్వీకరించిన అమ్మోరు మానవరూపం ధరించి మహమ్మారిని ఊరి నుంచి పారద్రోలడానికి తనకు అన్నం పెట్టిన మహిళకు వేపనీరు ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా ఊరంతా చల్లేసి తిరిగి రమ్మని చెబుతుంది. అప్పటి దాకా తన ఇంటిని జాగ్రత్తగా చూస్తూ ఉంటానని చెబుతుంది. కానీ ఆమె తన ఇంటికి వచ్చిన అమ్మోరు తిన్నదో లేదో తెలుసుకుందామని తిరిగి ఇంటికి రాగా అక్కడ అమ్మోరు నిజస్వరూపంలో కనిపిస్తుంది. దాంతో ఆమె అమ్మోరును ఊర్లోనే ఉంచేస్తే ఊరికి మంచిదని భావించి బావిలో పడి మరణిస్తుంది. ఆమె త్యాగాన్ని గుర్తించిన అమ్మోరు అదే ఊర్లో అమ్మోరు తల్లిగా వెలుస్తుంది.

అదే ఊర్లో భవాని ఒక అనాథ అమ్మాయి ఉంటుంది. అమ్మోరుని ఆరాధిస్తూ ఉంటుంది. లీలమ్మ అనే ఆమెకు సూర్యం తమ్ముడు ఉంటాడు. లీలమ్మ కూతురు సుందరిని అతనికిచ్చి పెళ్ళి చేసి ఆస్తిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. సూర్యం పట్నంలో వైద్యవిద్యనభ్యసిస్తూ ఉంటాడు. లీలమ్మ కొడుకు గోరక్ ఒక మాంత్రికుడు. చండా అనే శక్తిని ఆవాహనం చేసుకుని మట్టిని బంగారం చేసే విద్యను సాధించాలనుకుంటాడు. చండా ఒక పెళ్ళికాని కన్యను తనకు బలి ఇస్తే ఆ విద్య గోరక్ సొంతమవుతుందని చెబుతాడు. గోరక్ తన దగ్గరకు వచ్చిన ఓ అమ్మాయిని లొంగదీసుకుని ఆ అమ్మాయిని మట్టిలో పూడ్చిపెట్టి చండాకి బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అది చూసిన భవాని చూసి అతన్ని పోలీసులకు పట్టిస్తుంది. గోరక్ జైలుకు వెళతాడు. అతనికి శిక్ష పడుతుంది. ఘోరక్ తల్లి భవానిని ఎలాగైనా నాశనం చేయాలని చూస్తుంది. ఆమెను దేవత పేరు చెప్పి నగ్నంగా ఊరేగించాలని చూస్తుంది. కానీ అదే సమయానికి సూర్యం వచ్చి ఆమెను పెళ్ళి చేసుకుని ఆమెను రక్షిస్తాడు. సూర్య పై చదువుల కోసం భవానిని ఒంటరిగా వదిలేసి వెళతాడు. ఘోరక్ తల్లియైన లీలమ్మ భవానిని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కాపాడటం కోసం అమ్మోరు భవాని ఇంట్లో పనిచేసే చిన్న పాపరూపంలో వాళ్ళింట్లో ఉంటుంది. సూర్య విదేశాల నుంచి రాగానే లీలమ్మ అతనికి భవానిపై అనుమానం కల్పిస్తుంది కానీ అమ్మోరు ఆమెను కాపాడుతుంది. ఘోరక్ భవాని మీద హత్యా ప్రయత్నాలు చేస్తాడు కానీ అమ్మోరు వాటిని అడ్డుకుంటుంది. ఘోరక్ ఆమెను దైవశక్తి ఆదుకుంటుందని గ్రహించి ఆ శక్తి భవాని నుంచి దూరమయ్యేలా చేసి ఆమెను చంపాలని చూస్తాడు. కానీ అమ్మోరు చివరకు ఆమెను కాపాడి ఘోరక్ ను అంతమొందించడంతో కథ ముగుస్తుంది.

నటవర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • అమ్మోరు మా తల్లి , రచన:రసరాజు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చల్లని మా తల్లి అమ్మోరు , రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి , గానం.కె ఎస్ చిత్ర
  • దండాల దండాలు, రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి , గానం.కె ఎస్ చిత్ర, మనో, లలితా సాగర్, మాధవపెద్ది రమేష్
  • ఏమని పిలవను నేను , రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి, గానం.కె ఎస్ చిత్ర, మనో
  • కాపాడు దేవతా , రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి, గానం . వందేమాతరం శ్రీనివాస్
  • ఎదురు తిరిగి నిలువలేక , రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి , గానం కె ఎస్ చిత్ర .

సాంకేతికవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

ఈ సినిమా 1992 లో పశ్చిమ గోదావరి జిల్లాలోని అయినవిల్లి ప్రాంతంలో మొదలైంది. ఈ సినిమాని కోటి 80 లక్షల బడ్జెట్ తో తీశారు. ఈ సినిమాకి సౌందర్యకు 40 వేల రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇచ్చారు.

మొదట్లో ఈ సినిమాలో సూర్యం అక్క లీలమ్మగా సీనియర్ నటి నాగమణి, క్షుద్ర మాంత్రికుడిగా నటుడు చిన్నా నటించగా కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డికి అవుట్ పుట్ నచ్చకపోవడంతో, క్షుద్ర మాంత్రికుడి పాత్రలో రామిరెడ్డిని, లీలమ్మ పాత్రలో వడివుక్కరసిని పెట్టి రీ షూట్ చేశారు.[3]

స్పందన[మార్చు]

అమ్మోరు సినిమా విడుదలై తర్వాత ఎన్నో రికార్డులు సృష్టించడమేకాకుండా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అమ్మోరు సినిమా సౌందర్యకు చాలా పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో సౌందర్య స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఈ సినిమాలోని నటనకు సౌందర్యకు పారితోషకంగా ఇంకొక లక్ష రూపాయలను నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఇవ్వబోతుంటే, సౌందర్య ఆ డబ్బులు తీసుకోకుండా, తనకి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు శ్యాం ప్రసాద్ రెడ్డికి థాంక్స్ చెప్పింది.[3]

పురస్కారాలు[మార్చు]

అవార్డు విభాగం విజేత
నంది ఉత్తమ నటి సౌందర్య
ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి – తెలుగు సౌందర్య
నంది ఉత్తమ డబ్బింగు కళాకారిణి సరిత
నంది ఉత్తమ బాలనటీమణి బేబి సునయన

మూలాలు[మార్చు]

  1. Movies, iQlik. "Ammoru a Telugu Classic movie fo 1995". iQlikmovies. Retrieved 2020-06-23.
  2. "అమ్మోరు". www.youtube.com. Retrieved 2020-06-24.
  3. 3.0 3.1 Priya, Mohana (2020-12-24). "ఆ ఇద్దరి పాత్రలను మార్చి...సినిమా మొత్తం మళ్లీ షూట్ చేసారంట.? "అమ్మోరు" వెనకున్న ఇంటరెస్టింగ్ స్టోరీ!". Telugu Adda. Retrieved 2020-12-25.
"https://te.wikipedia.org/w/index.php?title=అమ్మోరు&oldid=4031399" నుండి వెలికితీశారు