Jump to content

ఓజోన్ క్షీణత

వికీపీడియా నుండి
(ఓజోన్ రంధ్రం నుండి దారిమార్పు చెందింది)
2006 సెప్టెంబరులో దక్షిణ ధ్రువంపై అతిపెద్ద అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రపు చిత్రం
వాతావరణపు పొరలు (స్కేలు ప్రకారం కాదు). ఓజోన్ పొర ప్రధానంగా స్ట్రాటోస్ఫియరు దిగువ భాగంలో సుమారు 20 నుండి 30 కి.మీ. ఎత్తున ఉంది.
External audio
“Whatever Happened to the Ozone Hole?”, Distillations Podcast Episode 230, April 17, 2018, Science History Institute

సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను దిగువ స్ట్రాటోస్ఫియరులో ఉండే ఓజోన్ వాయువు శోషించుకుని (పీల్చుకుని) భూమిని రక్షిస్తుంది. ఓజోన్ సాంద్రత అధిక మోతాదులో ఉండే ఈ ప్రాంతాన్ని ఓజోన్ పొర అని, ఓజోన్ కవచం అనీ అంటారు. ఈ ఓజోన్ పొరలో ఓజోన్ సాంద్రత తగ్గడాన్ని ఓజోన్ క్షీణత అని అంటారు. ఓజోన్ క్షీణతకు సంబంధించి 1970 ల చివరి నుండి గమనించిన రెండు సంఘటన లున్నాయి: భూ వాతావరణంలోని మొత్తం ఓజోన్‌లో (ఓజోన్ పొర) నాలుగు శాతం క్రమంగా తగ్గడం ఒకటి, వసంతకాలంలో భూమి ధ్రువ ప్రాంతాల చుట్టూ స్ట్రాటోస్ఫియరు లోని ఓజోన్‌లో పెద్దయెత్తున తగ్గుదల రెండోది. [1] ఈ రెండో దృగ్విషయాన్ని ఓజోన్ రంధ్రం అంటారు. ఈ స్ట్రాటోస్ఫియరు సంఘటనలతో పాటు వసంతకాలంలో ధ్రువీయ ట్రోపోస్పిరిక్ ఓజోన్ క్షీణించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

"ఓజోన్ రంధ్రం" 1982 లో మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పటి నుండి 2019 లోనే అత్యంత చిన్న పరిమాణంలో ఉందని నాసా ప్రకటించింది. [2] [3]

ఓజోన్ క్షీణతకు, ఓజోన్ రంధ్రం ఏర్పడడానికీ ప్రధాన కారణం కృత్రిమ రసాయనాలు - ముఖ్యంగా హేలోకార్బన్ రిఫ్రిజెరంట్లు, ద్రావకాలు, చాలకాలు, క్లోరోఫ్లూరోకార్బన్‌లు (CFC లు), హేలోన్‌లు HCFC లు. వీటిని ఓజోన్ హారక పదార్థాలు (ODS) అని అంటారు. ఈ సమ్మేళనాలు ఉపరితలం నుండి విడుదలైన తరువాత టర్బ్యులెంట్ మిక్సింగు ద్వారా అణువులు స్థిరత్వం పొందే వేగం కంటే చాలా వేగంగా కలసి పోయి, స్ట్రాటోస్ఫియరు లోకి రవాణా అవుతాయి. [4] స్ట్రాటోస్ఫియరు లోకి చేరాక, కాంతివిశ్లేషణం (ఫోటో డిస్సోసియేషను) ప్రక్రియ ద్వారా అవి హేలోజన్ అణువులను విడుదల చేస్తాయి. ఇవి ఉత్ప్రేరకంగా పనిచేసి, ఓజోన్ (O3) ను ఆక్సిజన్ (O2) గా మారుస్తాయి.

ఓజోన్ క్షీణత కారణంగా క్యాన్సరు వాటిల్లే ప్రమాదం పెరగడం పట్ల, ఇతర ప్రతికూల ప్రభావాల పట్లా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన తలెత్తింది. ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలను భూ వాతావరణం గుండా చొచ్చుకుని రాకుండా నిరోధిస్తుంది. ఈ కిరణాలు చర్మ క్యాన్సరుకు, వడదెబ్బకు, కంటిశుక్లానికీ కారణమవుతాయి. అలాగే మొక్కలు. జంతువులకు హాని కలిగిస్తాయి. ఓజోన్ పొర పల్చబడటం వలన ఈ కిరణాలు నాటకీయంగా పెరుగుతాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో 1987 లో ప్రపంచదేశాలన్నీ మాంట్రియల్ ప్రోటోకోల్‌ను అమలు చెయ్యాలని తీర్మానించాయి. ఈ ప్రోటోకోల్ CFC లు, హేలోన్లు, ఇతర ఓజోన్-హారక రసాయనాల ఉత్పత్తిని నిషేధించింది.

ఈ నిషేధం 1989 లో అమల్లోకి వచ్చింది. 1990 ల మధ్యలో ఓజోన్ స్థాయి తగ్గకుండా నిలబడిపోయింది. 2000 లలో ఓజోన్ పొర పుంజుకోవడం మొదలైంది. ఈ పుంజుకోవడం 21 వ శతాబ్ది లోనూ కొనసాగి, 2075 నాటికి ఓజోన్ రంధ్రం 1980 పూర్వం నాటి స్థాయికి చేరుకుంటుందని అంచనా. [5] మాంట్రియల్ ప్రోటోకోల్‌ను ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందంగా భావిస్తారు. [6] [7]

ఓజోన్ చక్రం అవలోకనం

[మార్చు]

ఓజోన్-ఆక్సిజన్ చక్రంలో ఆక్సిజన్ మూడు రూపాల్లో (అల్లోట్రోపులు లేదా భిన్నరూపాలు) పాల్గొంటుంది: ఆక్సిజన్ అణువులు (O లేదా అణు ఆక్సిజన్), ఆక్సిజన్ వాయువు (O
2
లేదా డయాటోమిక్ ఆక్సిజన్), మూడోది ఓజోన్ వాయువు (O
3
లేదా ట్రైయాటోమిక్ ఆక్సిజన్). స్ట్రాటోస్ఫియరులో ఉన్న ఆక్సిజన్ అణువులు అతినీలలోహిత ఫోటాన్‌లను గ్రహించి ఫోటోడిసోసియేట్ అయి, ఓజోన్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో ఒక O
2
రెండు ఆక్సిజన్ రాడికల్‌లుగా మారుతుంది. ఈ రెండు అణు ఆక్సిజన్ రాడికల్‌లు రెండు వేరువేరు O
2
మోలిక్యూళ్ళతో కలిసి రెండు O
3
మోలిక్యూళ్ళు ఏర్పడతాయి. ఈ ఓజోన్ మోలిక్యూళ్ళు అతినీలలోహిత (UV) కాంతిని పీల్చుకుంటాయి. దాంతో ఓజోన్, O
2
మోలిక్యూలు గాను, ఆక్సిజన్ అణువుగాను విడిపోతుంది. ఈ ఆక్సిజన్ అణువు ఆక్సిజన్ మోలిక్యూలుతో కలిసి మళ్ళీ ఓజోన్ ఏర్పడుతుంది. ఆక్సిజన్ అణువు ఓజోన్ మోలిక్యూలుతో కలిసి రెండు O
2
మోలిక్యూళ్ళు తయారయ్యేంత వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.

O + O
3
→ 2 O
2

స్ట్రాటోస్ఫియరు లోని ఓజోన్ పరిమాణం, ఫోటోకెమికల్ ఉత్పత్తి పునఃసంయోగాల మధ్య ఏర్పడే సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది.

అనేక స్వేచ్ఛా రాడికల్ ఉత్ప్రేరకాలు ఓజోన్‌ను నాశనం చేస్తాయి. వీటిలో హైడ్రాక్సిల్ రాడికల్ (OH·), నైట్రిక్ ఆక్సైడ్ రాడికల్ (NO·), క్లోరిన్ రాడికల్ (Cl·), బ్రోమిన్ రాడికల్ (Br·) చాలా ముఖ్యమైనవి. ఈ రసాయనిక నామాలకు పక్కన ఉన్న "చుక్క" గుర్తుకు అర్థం, ఆయా రాడికల్‌లో ఒక స్వేచ్ఛా ఎలక్ట్రాన్ ఉందని. ఇది చాలా రియాక్టివ్ అని సూచించడానికి ఇది ఒక గుర్తు. ఇవన్నీ సహజంగాను, మానవ నిర్మితం గానూ ఏర్పడతాయి. ప్రస్తుత కాలంలో స్ట్రాటోస్ఫియరులో ఉన్న OH·, NO·లు సహజంగా ఏర్పడినవే. అయితే మానవ కార్యకలాపాల వలన క్లోరిన్, బ్రోమిన్ స్థాయిలు విపరీతంగా పెరిగాయి. ఈ మూలకాలు స్థిరమైన సేంద్రీయ సమ్మేళనాలలో, ముఖ్యంగా క్లోరోఫ్లోరోకార్బన్లలో, ఉంటాయి. వీటి తక్కువ రియాక్టివిటీ లక్షణం కారణంగా ట్రోపోస్పియరులో నాశనం కాకుండా స్ట్రాటోస్ఫియరుంలోకి వెళ్తాయి. స్ట్రాటోస్ఫియరు చేరుకున్నాక, అతినీలలోహిత కాంతి చర్య వలన మాతృ సమ్మేళనాల నుండి Cl, Br అణువులు విడుదల అవుతాయి. ఉదా.

CFCl
3
+ విద్యుదయస్కాంత వికిరణం → Cl· + ·CFCl
2

ఓజోన్ చాలా రియాక్టివ్‌గా ఉండే అణువు. ఇది ఉత్ప్రేరకం సహాయంతో మరింత స్థిరమైన ఆక్సిజన్ రూపానికి సులభంగా మారుతుంది. Cl, Br అణువులు ఓజోన్ మోలిక్యూళ్ళను వివిధ రకాల ఉత్ప్రేరక చక్రాల ద్వారా నాశనం చేస్తాయి. అటువంటి చక్రానికి సరళమైన ఉదాహరణ ఒకటి చూస్తే, [8] ఒక క్లోరిన్ అణువు ఓజోన్ మోలిక్యూలు (O
3
) తో చర్య జరిపి, ఒక ఆక్సిజన్ అణువును తీసుకుని క్లోరిన్ మోనాక్సైడ్ (ClO) ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఒక ఆక్సిజన్ మాలిక్యూలు (O
2
) విడుదల అవుతుంది. ClO మరొక ఓజోన్ మోలిక్యూలుతో చర్య జరిపి, ఒక క్లోరిన్ అణువును, రెండు ఆక్సిజన్ మోలిక్యూళ్ళనూ విడుదల చేస్తుంది. ఈ వాయు రూప రసాయనికచర్యలకు సమీకరణాలు ఇవి:

  • Cl · + O
    3
    → ClO + O
    2

క్లోరిన్ అణువు ఓజోన్ మోలిక్యూలు నుండి ఒక ఆక్సిజన్ అణువును తొలగించి, ClO మోలిక్యూలును ఏర్పరుస్తుంది

  • ClO + O
    3
    → Cl · + 2 O
    2

ఈ ClO మరొక ఓజోన్ మోలిక్యూలు నుండి ఆక్సిజన్ అణువును తొలగిస్తుంది; ఈ చర్యలో వెలువడ్డ క్లోరిన్ ఈ రెండు-దశల చక్రాన్ని పునరావృతం చేస్తుంది.

ఈ రసాయనిక చర్యల ప్రభావం వలన ఓజోన్ పరిమాణం తగ్గుతుంది. అయితే ఈ ప్రక్రియల వేగాన్ని శూన్య చక్రాల ప్రభావంతో తగ్గించవచ్చు. దిగువ స్ట్రాటోస్ఫియరులో ఓజోన్ నాశనానికి దారితీసే మరింత క్లిష్టమైన విధానాలను కూడా కనుగొన్నారు.

ఓజోన్ చక్రం
నెలవారీ సగటు ఓజోన్
ఏటా ఓజోన్ రంధ్రంలో TOMS కొలిచిన ఓజోన్ అతి తక్కువ విలువలు

హైడ్రోజన్ క్లోరైడ్, క్లోరిన్ నైట్రేట్ వంటి సమ్మేళనాలు ఏర్పడే చర్యల్లో క్లోరిన్ అణువులు ఖర్చైపోతాయి. ఈ చర్యలు గనక జరక్కపోతే, ఒక్క క్లోరిన్ అణువు రెండు సంవత్సరాల పాటు నిరంతరంగా ఓజోన్‌ను నాశనం చేస్తుంది. ఈ విషయంలో క్లోరిన్ కంటే బ్రోమిన్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం వాతావరణంలో బ్రోమిన్ చాలా తక్కువ. క్లోరిన్, బ్రోమిన్ లు రెండూ ఓజోన్ క్షీణతకు గణనీయంగా దోహదం చేస్తున్నాయి. ఫ్లోరిన్, అయోడిన్ అణువులు కూడా ఇలాంటి ఉత్ప్రేరక చక్రాలలో పాల్గొంటాయని ప్రయోగశాల అధ్యయనాల్లో తేలింది. అయితే, ఫ్లోరిన్ అణువులు నీరు, మీథేన్‌లతో చురుగ్గా చర్య జరిపి స్ట్రాటోస్ఫియరులో హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. అయోడిన్ కలిగిన సేంద్రియ మోలిక్యూళ్ళు దిగువ వాతావరణంలో ఎంత వేగంగా చర్య జరుపుతాయంటే, వీటిలో అసలు స్ట్రాటోస్ఫియరుకు చేరేవి బాగా తక్కువ.

ఉత్ప్రేరక చక్రం నుండి బయటికి పోయే లోపు, ఒక్క క్లోరిన్ అణువు సగటున 1,00,000 ఓజోన్ అణువులతో చర్య జరపగలదు. ఇదీ, దీనితో పాటు క్లోరోఫ్లోరోకార్బన్లు (సిఎఫ్‌సిలు), హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్‌ల (హెచ్‌సిఎఫ్‌సి) ద్వారా ఏటా వాతావరణంలోకి విడుదలయ్యే క్లోరిన్ పరిమాణమూ - ఈ రెంటినీ కలిపి చూస్తే, సిఎఫ్‌సిలు, హెచ్‌సిఎఫ్‌సిలు మొత్తం పర్యావరణానికి ఎంత చేటు తెస్తున్నాయో అర్థమౌతుంది. [9] [10]

ఓజోన్ రంధ్రం, దాని కారణాలు

[మార్చు]
1984 లో ఉత్తర అమెరికాలో ఓజోన్ రంధ్రం (అసాధారణంగా వెచ్చగా ఉన్న సంవత్సరం - ఓజోన్ క్షీణత తగ్గింది), అదే 1997 లో (అసాధారణంగా చల్లగా ఉన్న సంవత్సరం - ఫలితంగా ఓజోన్ క్షీణత పెరిగింది). మూలం: నాసా [11]

అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం అంటార్కిటిక్ స్ట్రాటోస్ఫియరులో ఒక ప్రాంతం. దీనిలో ఇటీవలి ఓజోన్ స్థాయిలు 1975 కి పూర్వం ఉన్న స్థాయిల్లో 33 శాతానికి తగ్గాయి. అంటార్కిటిక్ వసంతకాలంలో, సెప్టెంబరు నుండి డిసెంబరు ఆరంభం వరకు ఓజోన్ రంధ్రం సంభవిస్తుంది, ఎందుకంటే బలమైన పడమటి గాలులు ఖండం చుట్టూ తిరుగుతూ ఒక వాతావరణ కంటెయినరును సృష్టిస్తాయి. అంటార్కిటిక్ వసంతకాలంలో, ఈ ధ్రువ సుడిగుండంలో పడి దిగువ స్ట్రాటోస్ఫియరు లోని ఓజోన్, 50 శాతానికి పైగా నాశన మవుతుంది.

పైన వివరించినట్లుగా, ఓజోన్ క్షీణతకు ప్రధాన కారణం క్లోరిన్ కలిగిన వాయువులు (ప్రధానంగా CFC లు, వాటికి సంబంధించిన హేలోకార్బన్లు). UV కాంతి సమక్షంలో, ఈ వాయువులు విభజన చెంది, క్లోరిన్ అణువులను విడుదల చేస్తాయి. ఇవి ఓజోన్ నాశనాన్ని ఉత్ప్రేరకపరుస్తాయి. Cl- ఉత్ప్రేరక ఓజోన్ క్షీణత వాయురూపంలో జరుగుతుంది. అయితే ఇది ధ్రువీయ స్ట్రాటోస్ఫియరు మేఘాల (పిఎస్‌సి లు) సమక్షంలో నాటకీయంగా బలోపేతమౌతుంది. [12]

ఈ ధ్రువీయ స్ట్రాటోస్ఫియరు మేఘాలు శీతాకాలంలో, తీవ్రమైన చలిలో ఏర్పడతాయి. ధ్రువాల వద్ద శీతాకాలాలు చీకటిగా ఉంటాయి. మూడు నెలల పాటు అసలు సౌర వికిరణమే (సూర్యకాంతి) ఉండదు. సూర్యరశ్మి లేకపోవడం చేత ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు −80 °C కు అటూ ఇటూగా ఉంటాయి, ఇంకా తక్కువ కూడా ఉండవచ్చు. ఈ తక్కువ ఉష్ణోగ్రతల వలన మేఘ కణాలు ఏర్పడతాయి. పిఎస్‌సి మేఘాల్లో మూడు రకాలున్నాయి -నైట్రిక్ యాసిడ్ ట్రైహైడ్రేట్ మేఘాలు, నెమ్మదిగా చల్లబడే నీరు-మంచు మేఘాలు, వేగంగా చల్లబడే నీరు-మంచు (నాక్రియస్) మేఘాలు. ఈ మేఘాల ఉపరితలాలపై రసాయనిక చర్యలు జరిగి, తద్వారా ఏర్పడే రసాయనాలు వసంతకాలంలో ఓజోన్ నాశనానికి దారితీస్తాయి. [13]

దీనిలో ఇమిడి ఉన్న ఫోటోకెమికల్ ప్రక్రియలు సంక్లిష్టంగా ఉంటాయి గానీ, వీటి గురించి శాస్త్రవేత్తలకు బాగా అవగాహన ఉంది. ముఖ్యమైన పరిశీలన ఏమిటంటే, సాధారణంగా, స్ట్రాటోస్ఫియరులోని క్లోరిన్ చాలావరకు దాని సమ్మేళనాలలో ఉంటుంది. ప్రధానంగా క్లోరిన్ నైట్రేట్ (ClONO
2
) అలాగే హెచ్‌సిఎల్ వంటి స్థిరమైన అంతిమ ఉత్పత్తులు. ఈ అంతిమ ఉత్పత్తులు ఏర్పడేటపుడు, ఓజోన్ క్షీణత ప్రక్రియలో పాల్గొనే Cl ను తొలగిస్తాయి. అయితే, అంటార్కిటిక్ శీతాకాలం, వసంతకాలాల్లో, ధ్రువీయ స్ట్రాటోస్ఫియరు మేఘాల ఉపరితలంపై ఈ సమ్మేళనాలు చర్య జరిపి, బాగా చురుకైన ఫ్రీ రాడికల్స్ ను (Cl, ClO) ఉత్పత్తి చేస్తాయి. మేఘాలు స్ట్రాటోస్ఫియరు లోని NO
2
ను నైట్రిక్ అమ్లంగా మార్చి, తొలగించడాన్ని డెంట్రిఫికేషన్ అంటారు. కొత్తగా ఏర్పడ్డ ClO, తిరిగి ClONO
2
గా మారకుండా ఇది అడ్డుపడుతుంది.

ఓజోన్ క్షీణతలో సూర్యరశ్మి పాత్ర చాలా ఉండడం వల్లనే, శీతాకాలంలో పిఎస్‌సిలు అధికంగా ఉన్నప్పటికీ, అంటార్కిటిక్ ఓజోన్ క్షీణత శీతాకాలంలో కంటే, వసంతకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో రసాయనిక చర్యలు జరిపేందుకు సూర్యరశ్మి ఉండదు. వసంతకాలంలో నైతే, సూర్యరశ్మి ఉంటుంది, ఇది ఫోటోకెమికల్ చర్యలను నడపడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది, ఈ చర్యలు ధ్రువీయ స్ట్రాటోస్ఫియరు మేఘాలను కరిగిస్తాయి. దాంతో ClO విడుదలౌతుంది. ఈ ClO ఓజోన్ రంధ్రాన్ని ఏర్పరచే రసాయనిక చర్యల్లో పాల్గొంటుంది. వసంత ఋతువు చివరిలో మరింత పెరిగే ఉష్ణోగ్రతలు డిసెంబరు మధ్య నాటికి సుడిగుండాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఆ తరువాత, తక్కువ అక్షాంశాల నుండి వెచ్చటి, ఓజోన్, NO
2
సహిత గాలి వీచడంతో, పిఎస్‌సిలు నాశనమవుతాయి, చురుగ్గా సాగిన ఓజోన్ క్షీణత ప్రక్రియ ఆగిపోతుంది, ఓజోన్ రంధ్రం మూసుకుపోతుంది.

ఓజోన్ పొర క్షీణతపై ఆసక్తి

[మార్చు]

ఓజోన్ క్షీణత వంటి సంక్లిష్ట సమస్యలపై ప్రజలకు అపోహలూ అపార్థాలూ ఉండడం మామూలు. ప్రజలకు ఉండే పరిమిత శాస్త్రీయ పరిజ్ఞానం వలన గ్లోబల్ వార్మింగ్ [14]కు దీనికీ మధ్య కొంత గందరగోళానికి దారితీసింది. గ్లోబల్ వార్మింగ్ అనేది "ఓజోన్ రంధ్రం" సమస్యలోని భాగంగా భావించారు. [15] ప్రారంభంలో, గ్రీన్ ఎన్జీఓలు తమ ప్రచారంలో సిఎఫ్సి గురించి చెప్పలేదు; ఆ విషయం చాలా క్లిష్టంగా ఉంటుందని భావించడం వలన. [16] చాలా కాలం తరువాత గానీ వాళ్ళు క్రియాశీలకంగా మారలేదు. ఉదా. పాత తూర్పు జర్మనీకి చెందిన కంపెనీ VEB dkk షార్ఫెన్‌స్టెయిన్ తయారు చేసిన CFC రహిత ఫ్రిడ్జికి గ్రీన్‌పీస్ మద్దతు తెలపడం. [17]

CFC చర్చల్లో ఉపయోగించే ఓజోన్ కవచం, ఓజోన్ రంధ్రం వంటి రూపకాలు శాస్త్రీయ కోణంలోంచి చూస్తే "ఖచ్చితమైనవి" కావు. "ఓజోన్ రంధ్రం" అనేది ఒక "రంధ్రం" కాదు, అసి పలచబడడం, అంతే. కారు విండ్‌షీల్డుకు పడే రంధ్రం లాంటిది అసలే కాదు. పొర లోంచి ఓజోన్ పూర్తిగా అదృశ్యమై పోదు. అసలు పొర పలచబడడం అంతటా ఏకరీతి గానూ ఉండదు. వీటి శాస్త్రీయ అర్థాలు ఎలా ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు కాని సాధారణ ప్రజల ఆందోళనల్లో ఈ పదాలు బాగా ఇమిడిపోయాయి. [18] ఓజోన్ రంధ్రాన్ని "తక్షణ సమస్య" గాను ముంచుకొస్తున్న ముప్పు గానూ చూసారు. [19] చర్మ క్యాన్సర్, కంటిశుక్లం, మొక్కలకు నష్టం వంటి తీవ్రమైన వ్యక్తిగత పరిణామాలకు మామూలు ప్రజలు భయపడ్డారు. విధాన నిర్ణాయక స్థాయిలో మాత్రమే కాకుండా, ప్రజల్లో కూడా వాతావరణ మార్పు కంటే ఓజోన్ నియంత్రణ పట్లనే ఎక్కువ సానుకూల అభిప్రాయం ఉంది. ఏరోసోల్ స్ప్రేలను వాడరాదనే చట్టం అమల్లోకి రావడానికంటే ముందే అమెరికన్లు వాటిని వాడడం స్వచ్ఛందంగా మానేసారు. గ్లోబల్ వార్మింగు ప్రజల్లో ఈ రకమైన ఆందోళనను, సానుకూల చర్యలను సాధించ లేక పోయింది. ఒక పెద్ద "రంధ్రం" ఉందని 1985 లో ఆకస్మికంగా గుర్తించడం పత్రికలలో విస్తృతంగా వచ్చింది.

గ్లోబల్ ఓజోన్‌పై అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం ప్రభావం చాలా తక్కువ ఐనప్పటికీ, ఈ రంధ్రం ప్రజల్లో చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే:

  • అప్పటి వరకు గమనించిన అతిపెద్ద ఓజోన్ క్షీణత ఉత్తర ధ్రువం చుట్టూ ఆర్కిటిక్ వసంతకాలంలో ఏర్ప్డిన ఒక చిన్న ఓజోన్ "చొట్ట "మాత్రమే అయినప్పటికీ, ఓజోన్ రంధ్రాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా మొదలౌతాయని చాలామంది ఆందోళన చెందారు. మధ్య అక్షాంశాల వద్ద ఓజోన్ క్షీణించినప్పతికీ, అది చాలా తక్కువ స్థాయిలో ఉంది (సుమారు 4–5 శాతం తగ్గుదల).
  • స్ట్రాటోస్ఫియరు పరిస్థితులు మరింత తీవ్రంగా మారితే (చల్లటి ఉష్ణోగ్రతలు, ఎక్కువ మేఘాలు, మరింత చురుకైన క్లోరిన్), ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ ఎక్కువ వేగంతో తగ్గుతుంది. స్ట్రాటోస్ఫియరు చల్లబడుతుందని ప్రామాణిక గ్లోబల్ వార్మింగ్ సిద్ధాంతం అంచనా వేసింది. [20]
  • ప్రతి సంవత్సరం అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం విడిపోయినప్పుడు, ఓజోన్ తక్కువగా ఉన్న గాలి సమీప ప్రాంతాల్లోకి వీస్తుంది. అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం విడిపోయిన తరువాతి నెలలో న్యూజిలాండ్‌లో ఓజోన్ స్థాయిలో 10 శాతం వరకు తగ్గుదల నమోదైంది. [21] అతినీలలోహిత-బి రేడియేషన్ తీవ్రత 1970 ల స్థాయి కంటే 15 శాతానికి పైగా పెరిగింది. [22] [23]

ఓజోన్ క్షీణత పర్యవసానాలు

[మార్చు]

సూర్యుడి నుండి వచ్చే UVB అతినీలలోహిత కాంతిని ఓజోన్ పొర శోషిస్తుంది. ఈ పొర క్షీణించడం వలన భూ ఉపరితలం మీద UVB స్థాయిలు పెరుగుతాయి.ఇది చర్మ క్యాన్సరు పెరగడం వంటి నష్టాలకు దారితీస్తుంది. మాంట్రియల్ ప్రోటోకోల్‌ను రూపొందించడానికి కారణం ఇదే. స్ట్రాటోస్ఫియరు ఓజోన్ తగ్గుదల, CFC లు, ఉపరితల UVB లో పెరుగుదల -ఇవన్నీ ఒకదాంతో ఒకటి బాగా ముడిపడి ఉన్నప్పటికీ, ఓజోన్ క్షీణతకు చర్మ క్యాన్సరుకు, కళ్ళు దెబ్బతినడానికీ సంబంధన్ని నిరూపించే ప్రత్యక్ష పరిశీలనా ఆధారాలు లేవు. దీనికి కారణం, కొన్ని రకాల చర్మ క్యాన్సర్లలను కలిగించే UVA కిరణాలను ఓజోన్ పీల్చుకోదు. పైగా కాలక్రమేణా జీవనశైలిలో వచ్చే మార్పుల గణాంకాలను నియంత్రించడం దాదాపు అసాధ్యం.

పెరిగిన అతినీలలోహిత వికిరణం (యువి)

[మార్చు]

భూమి వాతావరణంలో ఓజోన్ భాగం బహు స్వల్పమే అయినప్పటికీ, UVB రేడియేషనులో సింహభాగాన్ని ఇది పీల్చుకుంటుంది. ఓజోన్ పొర ద్వారా చొచ్చుకుపోయే UVB రేడియేషను, పొర గుండా అది ప్రయాణించే దూరమూ, పొర సాంద్రతా పెరిగే కొద్దీ విపరీతంగా తగ్గుతుంది. స్ట్రాటోస్ఫియరులో ఓజోన్ స్థాయిలు తగ్గినప్పుడు, అధిక స్థాయిలో UVB భూమి ఉపరితలానికి చేరుతుంది. [1] [24] చెట్ల కాండాల్లో ఏర్పడే వలయాలలో (ట్రీ రింగ్స్) UV తో ఏర్పడే ఫినోలిక్ నిర్మాణాన్ని పరిశీలించినపుడు ఉత్తర అక్షాంశాలలో ఓజోన్ క్షీణత 1700 ల చివరిలో మొదలైనట్లు తెలిసింది. [25]

2008 అక్టోబరు లో, ఈక్వెడార్ అంతరిక్ష సంస్థ HIPERION అనే నివేదికను ప్రచురించింది. ఈక్వెడార్ లోని భూస్థిత పరికరాల నుండి వచ్చిన డేటాను, వివిధ దేశాలకు చెందిన 12 ఉపగ్రహాల నుండి గత 28 సంవత్సరాలుగా వచ్చిన డేటానూ ఉపయోగించి చేసిన ఈ అధ్యయనంలో భూమధ్యరేఖ అక్షాంశాల వద్ద చేరుకున్న UV రేడియేషన్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉందని తెలిసింది. ఈక్వడార్ రాజధాని క్విటోలో UV సూచిక 24 కు చేరుకుంది; ప్రపంచ ఆరోగ్య సంస్థ, UV సూచిక 11 ను తీవ్రమైనదిగా, ఆరోగ్యానికి గొప్ప ప్రమాదంగా పరిగణిస్తుంది. భూమి మధ్య అక్షాంశాల చుట్టూ క్షీణించిన ఓజోన్ స్థాయిలు ఇప్పటికే ఈ ప్రాంతాల లోని జనాభాను ప్రమాదంలోకి నెడుతున్నాయని నివేదిక తేల్చింది. తరువాత, పెరూ అంతరిక్ష సంస్థ అయిన కొనిడా తన స్వంత అధ్యయనాన్ని ప్రచురించింది. ఇది కూడా దాదాపు ఈక్వెడార్ అధ్యయనంలో చూపిన ఫలితాలనే చూపింది.

జీవ ప్రభావాలు

[మార్చు]

ఓజోన్ రంధ్రానికి సంబంధించిన ప్రధాన ప్రజా ఆందోళన -మానవ ఆరోగ్యంపై పెరిగిన ఉపరితల UV రేడియేషన్ చూపించే ప్రభావాలు. ఇప్పటివరకు, చాలా ప్రదేశాలలో ఓజోన్ క్షీణత సాధారణంగా కొద్ది శాతంగా ఉంది. చాలా అక్షాంశాలలో ఆరోగ్య నష్టానికి ప్రత్యక్ష ఆధారాలు అందుబాటులో లేవు. ఓజోన్ రంధ్రంలో కనిపించే అధిక స్థాయి క్షీణత ప్రపంచవ్యాప్తంగా ఉండి ఉంటే, ప్రభావాలు గణనీయంగాను మరింత నాటకీయంగానూ ఉండేవి. అంటార్కిటికాపై ఓజోన్ రంధ్రం కొన్ని సందర్భాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిలీ, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా ప్రాంతాలను ప్రభావితం చేసేంత పెద్దదిగా పెరిగినందున, ఉపరితల UV పెరుగుదల గణనీయంగా ఉండవచ్చని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. [26]

ఓజోన్ క్షీణత వలన మానవ ఆరోగ్యంపై UV చూపించే ప్రభావాలన్నీ పెరుగుతాయి -సానుకూల (విటమిన్ డి ఉత్పత్తి వంటివి), ప్రతికూల (వడదెబ్బ, చర్మ క్యాన్సర్, కంటిశుక్లంతో సహా). ప్రభావాలు రెండూ కూడా వీటికి తోడు, ఉపరితల UV పెరగడం వలన ట్రోపోస్పిరిక్ ఓజోన్‌ పెరుగుతుంది. ఇది మానవులకు ఆరోగ్యానికి చేటు.

బేసల్, కణ క్యాన్సర్

[మార్చు]

మానవులలో చర్మ క్యాన్సరుకు అత్యంత సాధారణ రూపాలు, బేసల్, స్క్వామస్ సెల్ కార్సినోమా. ఈ రెండూ UVB తో బలంగా ముడిపడి ఉన్నాయి. UVB ఈ క్యాన్సర్లను ప్రేరేపించే విధానం పట్ల శాస్త్రవేత్తల్లో అవగాహన బాగా ఉంది -UVB రేడియేషన్ గ్రహించడం వలన DNA అణువులోని పిరిమిడిన్ స్థావరాలు డైమర్‌లను ఏర్పరుస్తాయి, ఫలితంగా DNA ప్రతిరూపించేటపుడు ట్రాన్స్క్రిప్షన్ లోపాలు ఏర్పడతాయి . ఈ క్యాన్సర్లు సాపేక్షికంగా తక్కువ ప్రమాదకారులు. చాలా అరుదుగా ప్రాణాంతక మౌతాయి. అయితే, స్క్వామస్ సెల్ కార్సినోమా చికిత్సకు కొన్నిసార్లు విస్తృతమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్స అవసరం. దీర్ఘకాలిక స్ట్రాటోస్ఫియరు ఓజోన్‌ ఒక్క శాతం తగ్గితే, ఈ క్యాన్సర్లు సోకడం 2% పెరుగుతుందని వివిధ అధ్యయనాల ద్వారా గ్రహించారు. [27]

ప్రాణాంతక మెలనోమా

[మార్చు]

చర్మ క్యాన్సరుకు మరొక రూపం, ప్రాణాంతక మెలనోమా. ఇది చాలా తక్కువగా సంభవిస్తుంది గానీ, చాలా ప్రమాదకరమైనది. రోగ నిర్ధారణ చేసిన కేసులలో 15-20 శాతం ప్రాణాంతక మౌతాయి. ప్రాణాంతక మెలనోమా, అతినీలలోహిత కిరణాల మధ్య సంబంధం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కాని UVB, UVA లు రెండూ దీనికి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అనిశ్చితి కారణంగా, మెలనోమా సంభవంపై ఓజోన్ క్షీణత ప్రభావాన్ని అంచనా వేయడం కష్టం. యువిబి రేడియేషన్‌లో 10 శాతం పెరుగుదల వలన పురుషులలో మెలనోమా అవకాశం 19 శాతం, మహిళల్లో 16 శాతం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది. [28] చిలీ దక్షిణ కొన వద్ద ఉన్న పుంటా అరేనాస్ ప్రజలపై జరిపిన అధ్యయనంలో, ఓజోన్ తగ్గడం, యువిబి స్థాయిలు పెరగడం వలన ఏడు సంవత్సరాల కాలంలో మెలనోమాలో 56 శాతం, నాన్‌మెలనోమా చర్మ క్యాన్సరులో 46 శాతం పెరుగుదల ఉన్నట్లు గమనించారు. [29]

కంటిశుక్లం

[మార్చు]

కంటిశుక్లానికి, యువిబికి గురవడానికీ మధ్య అనుబంధాన్ని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చెసాపీక్ బే వాటర్‌మెన్‌పై చేసిన ఒక అధ్యయనంలో సగటు వార్షిక UVB ఎక్స్‌పోజరు పెరిగే కొద్దీ, కంటి చూపు మందగించడం పెరుగుతుందని తెలిసింది. [30] ఎక్కువగా శ్వేతజాతి మగవారు ఉన్న ఈ సమూహంపై చేసిన పరిశీలన, కనుగుడ్డుపై ఉండే పొర బూజురు కావడానికీ సూర్యరశ్మికీ మధ్య ఉన్న సంబంధానికి బలమైన సాక్ష్యంగా ఉంది. ఈ ఫలితాల ఆధారంగా, ఓజోన్ క్షీణత 2050 నాటికి వందల వేల అదనపు కంటిశుక్లాలకు కారణమవుతుందని అంచనా వేసారు. [31]

ట్రోపోస్పిరులో ఓజోన్ పెరుగుదల

[మార్చు]

ఉపరితల UV పెరిగితే, ట్రోపోస్పియరులో ఓజోన్‌ పెరుగుతుంది. ఓజోన్‌కు ఉన్న బలమైన ఆక్సిడెంట్ లక్షణాల వల్ల అది విషప్రాయం. అందుచేత, భూతలంపై ఉండే ఓజోన్ ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఉబ్బసం లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం మరీ ఎక్కువ. ప్రస్తుత కాలంలో, వాహనాల ఎగ్జాస్ట్‌ల నుండి వెలువడే దహన వాయువులపై UV రేడియేషన్ చర్య వలన నేలపై ఓజోన్ ఉత్పత్తి అవుతోంది. [32]

విటమిన్ డి ఉత్పత్తి పెరుగుదల

[మార్చు]

అతినీలలోహిత కాంతి ద్వారా చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అందువల్ల, దానిలో లోపం ఉన్నవారిలో అధిక UVB విటమిన్ డి పెరిగేందుకు దోహదపడుతుంది. ఇటీవలి పరిశోధనల్లో (ప్రధానంగా మాంట్రియల్ ప్రోటోకోల్ తరువాత) చాలా మంది మానవుల్లో విటమిన్ డి స్థాయి ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. రక్తంలో విటమిన్ డి స్థాయి 100 ng / ml కంటే ఎక్కువ ఉంటే, రక్తంలో కాల్షియం స్థాయి పెరుగుతుంది. ఇది మరణావకాశాలను పెంచుతుంది. శరీర అవసరాలకు మించి విటమిన్ డి ఉత్పత్తి చేయకుండా సూర్యరశ్మిని నిరోధించే విధానాలు శరీరంలో ఉన్నాయి. [33]

జంతువులపై ప్రభావాలు

[మార్చు]

లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జువాలజీ శాస్త్రవేత్తలు తమ 2011 నవంబరు నివేదికలో, కాలిఫోర్నియా తీరంలోని తిమింగలాలు వడదెబ్బ తిన్నట్లు చెప్పారు. "ఓజోన్ పొర పల్చబడడమే దీనికి కారణమేమో"నని వారి ఉద్దేశం. [34] ఈ అధ్యయనం గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలోని 150 కి పైగా తిమింగలాల నుండి చర్మాలను ఫోటోలు తీసి, బయాప్సీ చేసి, చేసినది. "తీవ్రమైన వడదెబ్బ వలన చర్మానికి ఎలాంటి నష్టం కలుగుతుందో చూపే ఆధారాలు" కనుగొన్నారు. UV రేడియేషన్ ద్వారా DNA దెబ్బతిన్నప్పుడు ఏర్పడే కణాలు కనిపించాయి. పరిశోధనలు "ఓజోన్ క్షీణత ఫలితంగా పెరిగే UV స్థాయిల వలన మానవుల్లో చర్మ క్యాన్సరు పెరుగుతున్నట్లే, తిమింగిలాల చర్మంలోనూ జరుగుతోంది." [35]

పంటలపై ప్రభావాలు

[మార్చు]

UV రేడియేషన్ పెరుగుదల పంటలను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. బియ్యం వంటి ఆర్థికంగా ముఖ్యమైన అనేక జాతుల మొక్కలు నత్రజనిని నిలుపుకోవటానికి వాటి వేర్లపై నివసించే సయనోబాక్టీరియాపై ఆధారపడి ఉంటాయి. సైనోబాక్టీరియా UV రేడియేషన్‌ను తట్టుకోలేదు. అది పెరిగితే ఇవి ప్రభావితమౌతాయి. [36] "పెరిగిన అతినీలలోహిత వికిరణపు ప్రభావాలను తగ్గించడానికి లేదా మరమ్మత్తు చేయడానికీ మొక్కల్లో యంత్రాంగం ఉన్నప్పటికీ, పెరిగిన UVB స్థాయికి అనుకూలీకరించే సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. కాబట్టి మొక్కల పెరుగుదల UVB రేడియేషన్ ద్వారా నేరుగా ప్రభావితమవుతుంది."

ప్రభుత్వ విధానం

[మార్చు]
క్లోరోఫ్లోరోకార్బన్‌లను నిషేధించక పోతే స్ట్రాటోస్ఫియరు ఓజోన్ సాంద్రతలు ఎలా ఉంటాయో చూపే నాసా అంచనాలు

ఓజోన్ పొరకు CFC లు కలిగించిన నష్టం ఏ స్థాయిలో ఉందో పూర్తిగా తెలియదు. రాబోయే మరికొన్ని దశాబ్దాల పాటు తెలియదు కూడా; అయితే, ఓజోన్‌లో గణనీయమైన తగ్గుదలను ఇప్పటికే గమనించారు. శాస్త్రీయ ఏకాభిప్రాయం ఏర్పడటానికి, సైన్స్ రంగంలో ముఖ్యమైన అనిశ్చితులను పరిష్కరించటానికీ చాలా కాలం ముందే మాంట్రియల్, వియన్నా సమావేశాలు జరిపారు. [16] ఓజోన్ కవచం లేదా ఓజోన్ రంధ్రం వంటి పదాలు ఓజోన్ కేసును సామాన్యులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. [18] అమెరికన్లు స్వచ్ఛందంగా ఏరోసోల్ స్ప్రేలను వాడడం మానేసారు. దీని ఫలితంగా అక్కడ చట్టం అమలులోకి రాకముందే 50 శాతం అమ్మకాలు తగ్గాయి.

యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి 1976 నివేదికలో ఓజోన్ క్షీణత పరికల్పనకు విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలున్నాయని తేల్చాక, [37] యునైటెడ్ స్టేట్స్, కెనడా, స్వీడన్, డెన్మార్క్, నార్వేలతో సహా కొన్ని దేశాలు ఏరోసోల్ స్ప్రే డబ్బాల్లో CFC ల వాడకాన్ని తొలగించడానికి నడుం కట్టాయి. [38] మరింత సమగ్ర నియంత్రణ విధానానికి మొదటి మెట్టుగా దీన్ని పరిగణించారు. అయితే వివిధ రాజకీయ కారణాల వలన (హేలోకార్బన్ పరిశ్రమ నుండి నిరంతర ప్రతిఘటన, పర్యావరణం పట్ల రీగన్ ప్రభుత్వ వైఖరిలో మార్పు), శాస్త్రీయ పరిణామాల వలనా (ఓజోన్ క్షీణత పై మొదట వేసిన అంచనాలు ఎక్కువగా ఉన్నాయని జాతీయ అకాడమీ చెప్పింది) ఆ తరువాత ఈ దిశలో పురోగతి మందగించింది. యునైటెడ్ స్టేట్స్ 1978 లో ఏరోసోల్ డబ్బాల్లో CFC ల వాడకాన్ని నిషేధించింది. ఈ నిషేధాన్ని విధించాలనే ప్రతిపాదనలను యూరోపియన్ కమ్యూనిటీ తిరస్కరించింది. US లో, CFC లను రిఫ్రిజిరేటర్ల లోను, సర్క్యూట్ బోర్డులను శుభ్రపరచడానికీ ఉపయోగించడం కొనసాగించారు. యుఎస్ ఏరోసోల్ నిషేధం తరువాత ప్రపంచవ్యాప్తంగా సిఎఫ్‌సి ఉత్పత్తి బాగా పడిపోయింది. కాని 1986 నాటికి దాదాపు 1976 స్థాయికి తిరిగి వచ్చింది. 1993 లో, డుపోంట్, కెనడా లోని తన CFC కర్మాగారాన్ని మూసివేసింది.

1983 లో యునైటెడ్ స్టేట్స్ ఎన్వైరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నిర్వాహకులుగా ఆన్ ఎమ్. బర్ఫోర్డ్ స్థానంలో విలియం రుకెల్షాస్ నియామకం జరిగాక, అమెరికా ప్రభుత్వ వైఖరి మళ్లీ మారడం మొదలైంది. రుకెల్షాస్, అతని వారసుడు లీ థామస్ ల ఆధ్వర్యంలో హేలోకార్బన్ నిబంధనలకు అంతర్జాతీయ విధానం కోసం EPA ముందుకు వచ్చింది. 1985 లో, ప్రధాన సిఎఫ్‌సి ఉత్పత్తిదారులతో సహా ఇరవై దేశాలు ఓజోన్ పొరల రక్షణ కోసం వియన్నా కన్వెన్షన్‌లో సంతకం చేశాయి. ఇది ఓజోన్ హారక పదార్థాలపై అంతర్జాతీయ నిబంధనలను చర్చించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. అదే సంవత్సరం, అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రాన్ని కనుగిన్నట్లు ప్రకటించారు. దాంతో ఈ సమస్య మళ్ళీ ప్రజల దృష్టిలో పడింది. 1987 లో, 43 దేశాల ప్రతినిధులు మాంట్రియల్ ప్రోటోకోల్‌పై సంతకం చేశారు. ఇంతలో, హేలోకార్బన్ పరిశ్రమ తన అభిప్రాయాన్ని మార్చుకుని, CFC ఉత్పత్తిని పరిమితం చేసే ప్రోటోకోల్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. అయితే, డుపాంట్ దాని యూరోపియన్ ప్రత్యర్థుల కంటే త్వరగా ఈ పనిచేయడంతో ఈ మార్పు ఐరోపాలో కంటే అమెరికాలో ముందు జరిగింది. పెరిగిన చర్మ క్యాన్సరు పై కోర్టు తీసుకొనబోయే చర్యలకు డుపాంట్ భయపడి ఉండవచ్చు. ముఖ్యంగా 1986 లో EPA ప్రచురించిన ఒక అధ్యయనంలో రాబోయే 88 సంవత్సరాలలో అదనంగా 4 కోట్ల క్యాన్సరు కేసులు, 800,000 మరణాలు అమెరికాలో సంభవించనున్నాయని పేర్కొన్నారు. [39] జర్మనీ, CFC పరిశ్రమను కాపాడడాన్ని విడిచిపెట్టి నియంత్రణకు మద్దతు ఇవ్వడం ప్రారంభించిన తరువాత, EU కూడా తన ధోరణిని మార్చుకుంది. మాంట్రియల్ ప్రోటోకోల్‌పై సంతకం చేసిన తరువాత కూడా ఫ్రాన్స్, యుకేల్లోని ప్రభుత్వాలు, పరిశ్రమలు తమ సిఎఫ్‌సి ఉత్పత్తి పరిశ్రమలను రక్షించుకోడానికే ప్రయత్నించాయి. [40]

మాంట్రియల్‌లో 1986 స్థాయిలలో CFC ల ఉత్పత్తిని స్తంభింపచేయడానికి, 1999 నాటికి ఉత్పత్తిని 50 శాతం తగ్గించడానికీ సభ్యులు అంగీకరించారు. [38] అంటార్కిటిక్‌కు వరుసగా చేసిన శాస్త్రీయ యాత్రల్లో ఓజోన్ రంధ్రం మానవ నిర్మిత ఆర్గానో హేలోజెన్ల నుండి వెలువడ్డ క్లోరిన్, బ్రోమిన్ వల్లనే సంభవించిందనడానికి విశ్వసనీయ సాక్ష్యాలు లభించిన తరువాత, 1990 లో లండన్‌లో జరిగిన సమావేశంలో మాంట్రియల్ ప్రోటోకోల్‌ను బలోపేతం చేసారు. ఆర్టికల్ 5 లో లేని దేశాలు 2000 నాటికీ, ఆర్టికల్ 5 లో ఉన్నవి (తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు) 2010 నాటికీ సిఎఫ్‌సిలు, హేలోన్‌లను పూర్తిగా తొలగించడానికి (ఉబ్బసం ఇన్హేలర్ల వంటి కొన్ని "ఆవశ్యకతలకు" అవసరమైనంత తప్ప) అంగీకరించాయి. 1992 లో కోపెన్‌హాగన్‌లో జరిగిన సమావేశంలో, తుది గడువును 1996 కు మార్చారు. అదే సమావేశంలో, ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తిలో ఉపయోగించే ఫ్యూమిగెంట్ అయిన మిథైల్ బ్రోమైడ్ (మీబిఆర్) ను నియంత్రిత పదార్థాల జాబితాలో చేర్చారు. ప్రోటోకోల్ క్రింద నియంత్రించిన అన్ని పదార్ధాల నిలిపివేత గడువును, తక్కువ అభివృద్ధి చెందిన ('ఆర్టికల్ 5 (1) ') దేశాలకు పొడిగించారు. ఈ దేశాలకు ఇందుకు అవసరమైన నైపుణ్యం, సాంకేతికత, ధనసహాయం ఆర్టికల్ 5 (1) లో లేని దేశాలు అందజేస్తాయి.

వియన్నా కాన్ఫరెన్స్, మాంట్రియల్ ప్రోటోకోల్ సమావేశాలు ఏర్పాటు చెయ్యడం లోను, ఆ తరువాత వాటి అమలును అంచనా వేయడంలోనూ అన్ని దశలలోను ఎన్జీఓలతో సహా పౌర సమాజం కీలక పాత్ర పోషించింది. [41] [42] [43] [44] ప్రధాన కంపెనీలైతే హెచ్‌ఎఫ్‌సికి ప్రత్యామ్నాయాలే లేవని పేర్కొన్నాయి. జర్మనీలోని హాంబర్గ్ లోని ఓ సాంకేతిక సంస్థలో ఓజోన్-సురక్షిత హైడ్రోకార్బన్ రిఫ్రిజెరంట్‌ను అభివృద్ధి చేసారు. 1992 లో ఇది ప్రభుత్వేతర సంస్థ (ఎన్జిఓ) గ్రీన్ పీస్ దృష్టికి వచ్చింది. దీని పేటెంటును గ్రీన్‌పీస్‌కు ఇచ్చారు. దీనిని " గ్రీన్‌ఫ్రీజ్ " అని పిలుస్తారు. ఈ పేటెంట్‌ను ఓపెన్ సోర్స్‌గా విడుదల చేసారు. [45] ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక చిన్న సంస్థతో కలిసి పనిచేసి గ్రీన్‌పీస్ మొదట ఐరోపాలో, తరువాత ఆసియాలోను, ఆ తరువాత లాటిన్ అమెరికాలోనూ ఒక ఉపకరణాన్ని విజయవంతంగా మార్కెటింగు చేసింది. ఇందుకు గాను 1997 UNEP అవార్డును అందుకుంది. 1995 నాటికే, జర్మనీ CFC రిఫ్రిజిరేటర్లను చట్టవిరుద్ధం చేసింది. 2004 నుండి, కోకాకోలా, కార్ల్‌బెర్గ్, ఐకియా వంటి సంస్థలు ఓజోన్-సురక్షిత గ్రీన్‌ఫ్రీజ్ యూనిట్లను ప్రోత్సహించడానికి ఒక సంకీర్ణ సంస్థను ఏర్పాటు చేస్తున్నాయి. ఎలక్ట్రోలక్స్, బాష్, ఎల్జీ వంటి సంస్థలు కూడా ఈ ఉత్పత్తి చేపట్టడంతో 2008 నాటికి అమ్మకాలు 30 కోట్ల రిఫ్రిజిరేటర్లకు చేరుకున్నాయి. లాటిన్ అమెరికాలో, ఒక అర్జెంటీనా సంస్థ 2003 లో గ్రీన్‌ఫ్రీజ్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఒక సంవత్సరం తరువాత బ్రెజిల్‌లో బాష్ మొదలు పెట్టింది. 2013 నాటికి దీనిని 70 కోట్ల రిఫ్రిజిరేటర్లు ఉపయోగిస్తున్నాయి. ఇది మొత్తం మార్కెట్లో 40 శాతం.

అయితే, అమెరికాలో మార్పు చాలా నెమ్మదిగా జరిగింది. కొంతవరకు, CFC ల కంటే తక్కువ నష్టం కలిగించే హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్లకు (HCFC లు) మారినప్పటికీ HCFC లకు సంబంధించి కూడా ఆందోళనలు ఉన్నాయి. కొన్ని ఉపకరణాల్లో, CFC ల స్థానంలో హైడ్రోఫ్లోరోకార్బన్‌లను (HFC లు) ఉపయోగిస్తున్నారు. క్లోరిన్ గాని, బ్రోమిన్ గానీ లేని హెచ్‌ఎఫ్‌సిలు ఓజోన్ క్షీణతకు ఏమాత్రం దోహదం చేయవు గాని, అవి శక్తివంతమైన గ్రీన్‌హౌస్ వాయువులు. ఈ సమ్మేళనాలలో బాగా తెలిసినది బహుశా HFC-134a ( R-134a ). దీన్ని అమెరికాలో ఎక్కువగా ఆటోమొబైల్ ఎయిర్ కండిషనర్లలో CFC-12 ( R-12 ) స్థానంలో వాడారు. ప్రయోగశాలల్లో ఓజోన్ హారక పదార్థాల స్థానంలో వివిధ ఇతర ద్రావకాలను వాడవచ్చు. డుపాంట్ వంటి రసాయన కంపెనీల ప్రతినిధులు గ్రీన్‌ఫ్రీజ్‌ను "ఆ జర్మన్ టెక్నాలజీయా" అని చులకనగా మాట్లాడారు కూడా. ఆ సాంకేతికత అమెరికాలోకి రాకుండా నిరోధించడానికి 2011 వరకు EPA ను ప్రభావితం చేసారు. ఈ సాంకేతికతపై యూనిలీవర్, జనరల్ ఎలక్ట్రిక్ లు 2008 లో అధికారికంగా ఆసక్తిని వ్యక్తం చేశాయి. EPA తుది ఆమోదంలో ఈ సంగతి ఉంది.

ఓజోన్ సంరక్షక కార్యక్రమాలను, శీతోష్ణస్థితి సంరక్షక కార్యక్రమాలతో అనుసంధించాలని ఇటీవల విధాన నిపుణులు సలహా ఇచ్చారు.[46][47] చాలా ఓజోన్ హారక పదార్థాలు గ్రీన్‌హౌస్ వాయువులే. స్వల్ప, మధ్య కాలావధుల్లో రేడియేటివ్ ఒత్తిడి కలిగించడంలో కార్బన్ డయాక్సైడు కంటే ఇవి వేల రెట్లు శక్తివంతమైనవి. అంచేత, ఓజోన్ పొరను సంరక్షించే విధానాలు శీతోష్ణస్థితి మార్పును ఎదుర్కోవడం లోనూ దోహదపడతాయి. ఒక రంగంలో తీసుకునే విధాన నిర్ణయాలు రెండో రంగంలో తీసుకునే చర్యలపై, ఖర్చులపై ప్రభావం చూపుతాయి.

భవిష్యత్తులో ఓజోన్ క్షీణత అంచనాలు

[మార్చు]
మాంట్రియల్ ప్రోటోకోల్ తరువాత 1990 లలో ఓజోన్ స్థాయిలు పడిపోకుండా ఆగి, కోలుకోవడం ప్రారంభించాయి. 2075 నటికి ఇవి 1980 కంటే ముందు ఉన్న స్థాయికి చేరుకుంటాయని అంచనా. [5]
ఓజోన్‌ను క్షీణింపజేసే గ్యాస్ పోకడలు

మాంట్రియల్ ప్రోటోకోల్‌ను బలోపేతం చేసాక, CFC ల ఉద్గారాలు తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుండి, వాతావరణలో అత్యంత ముఖ్యమైన సమ్మేళనాల సాంద్రతలు తగ్గుతున్నాయి. 1994 లో గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటి నుండి, వాతావరణంలో ఎఫెక్టివ్ ఈక్వివలెంట్ క్లోరిన్ (ఇఇసిఎల్) స్థాయి 2008 నాటికి 10 శాతం పడిపోయింది. బ్రోమిన్ కలిగిన రసాయనాల తగ్గుదల వలన కూడా ఓజోన్-క్షీణింపజేసే రసాయనాలు తగ్గాయి. దశల వారీగా CFC లు తగ్గుతూండడంతో ప్రస్తుతం నైట్రస్ ఆక్సైడ్ ( N
2
O
) అత్యధికంగా ఓజోన్ను క్షీణింప జేసే పదార్థంగా మారింది. 21 వ శతాబ్దం అంతా ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు. N
2
O
మాంట్రియల్ ప్రోటోకోల్ పరిధిలోకి రాదు,

ఓజోన్ పరిశీలనలు, వివిధ మోడల్‌లు తేల్చిన లెక్కలను 2005 లో సమీక్షించాక, ప్రపంచ మొత్తంలో ఓజోన్ స్థాయి దాదాపుగా స్థిరంగా ఉందని ఐపిసిసి తేల్చింది. క్షీణత ఎక్కువగా ఉన్న ధ్రువ ప్రాంతాలతో సహా, ఓజోన్ హారక పదార్ధాల సాంద్రతలు తగ్గడం వలన రాబోయే దశాబ్దాలలో, మాంట్రియల్ ప్రోటోకోల్‌ను అమలు చేస్తూనే ఉంటే, ఓజోన్ పొర కోలుకోవడం మొదలవుతుందని భావిస్తున్నారు. [48]

అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. అంటార్కిటికాపై దిగువ స్ట్రాటోస్ఫియరులో ఓజోన్ సాంద్రతలు 2020 నాటికి 1980 పూర్వ స్థాయి కంటే 5-10 శాతం పెరిగి, 2060–2075 నాటికి తిరిగి ఆ స్థాయికి చేరుకుంటాయి. ఇది మునుపటి అంచనాలలో ఊహించిన దానికంటే 10-25 సంవత్సరాల ఆలస్యం. వాతావరణంలో ఓజోన్ హారక పదార్థాల సాంద్రతల అంచనాలను సవరించడం వలన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో భవిష్యత్తులో ఆయా పదార్థాల వాడుక ఎక్కువవుతుందనే అంచనాల వలనా ఈ ఆలస్యం జరుగుతుందని అంచనా వేసారు. ఓజోన్ క్షీణతను పొడిగించే మరో అంశం ఏమిటంటే, మారుతున్న గాలి ప్రవాహాల వల్ల స్ట్రాటోస్ఫియరు పైన నుండి నత్రజని ఆక్సైడ్లను కిందికి లాక్కోవడం. [49] 2016 లో ఇచ్చిన ఒక నివేదికలో పరిస్థితి క్రమంగా పుంజుకుంటోందని చెప్పారు. [50] 2019 లో గమనించిన ఓజోన్ రంధ్రం గత ముప్పై సంవత్సరాలలో కెల్లా అత్యంత చిన్నది.

ఓజోన్ క్షీణత - గ్లోబల్ వార్మింగ్

[మార్చు]

ఓజోన్ క్షీణత, గ్లోబల్ వార్మింగ్ ల సైన్స్ విశ్లేషణ లోను, నియంత్రణ ప్రయత్నాల లోనూ రాబర్ట్ వాట్సన్‌కు పాత్ర ఉంది. [16] 1980 లకు ముందు, EU, NASA, NAS, UNEP, WMO, బ్రిటిష్ ప్రభుత్వం తదితరుల మధ్య భిన్నాభిప్రాయాలుండేవి. వీటి మధ్య అంగీకారం కోసం వాట్సన్ పనిచేసాడు. ఓజోన్ కేసుతో ఉన్న అనుభవం ఆధారంగా, విధాన రూపకర్తలకు తన సారాంశాన్ని అందించే ముందు, ఏకాభిప్రాయానికి రావడానికి ఐపిసిసి ఏకీకృత రిపోర్టింగ్, సైన్స్ అసెస్‌మెంట్ పై పనిచేసింది.

ఓజోన్ క్షీణతకు, గ్లోబల్ వార్మింగ్ సైన్సుకూ మధ్య వివిధ అంశాల్లో సంబంధం ఉంది:

వివిధ గ్రీన్‌హౌస్ వాయువుల నుండి, ఇతర వనరుల నుండి రేడియేటివ్ ఒత్తిడి
  • గ్లోబల్ వార్మింగుకు కారణమైన CO
    2
    రేడియేటివ్ ఒత్తిడే స్ట్రాటోస్ఫియరును చల్లబరుస్తుంది కూడా. ఈ శీతలీకరణ వలన ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్ క్షీణత పెరుగుతుందని, ఓజోన్ రంధ్రాలు ఏర్పడే తరచుదనం కూడా పెరుగుతుందనీ భావిస్తున్నారు.
  • దీనికి విరుద్ధంగా, ఓజోన్ క్షీణత శీతోష్ణస్థితి వ్యవస్థపై ఉన్న రేడియేటివ్ ఒత్తిడిని సూచిస్తుంది. ఇక్కడ రెండు వ్యతిరేక ప్రభావాలను గమనించాలి: ఓజోన్ తగ్గడం వలన స్ట్రాటోస్ఫియరు తక్కువ సౌర వికిరణాన్ని పీల్చుకుంటుంది. తద్వారా స్ట్రాటోస్ఫియరు చల్లబడగా, ట్రోపోస్పియరు వేడెక్కుతుంది. ఫలితంగా చల్లటి స్ట్రాటోస్ఫియరు తక్కువ దీర్ఘ-తరంగ వికిరణాన్ని క్రిందికి విడుదల చేస్తుంది, తద్వారా ట్రోపోస్పియరును చల్లబరుస్తుంది. మొత్తమ్మీద, శీతలీకరణానిదే ఆధిపత్యం; IPCC " గత రెండు దశాబ్దాలుగా గమనించిన స్ట్రాటోస్ఫియరు O
    3
    నష్టాలు ఉపరితల-ట్రోపోస్పియర్ వ్యవస్థపై ప్రతికూల ఒత్తిడికి కారణమయ్యాయి
    " ప్రతి చదరపు మీటరుకు సుమారు −0.15 ± 0.10 వాట్స్ (W / m 2 ). [48]
  • గ్రీన్‌హౌస్ ప్రభావం గురించిన గట్టి అంచనాలలో ఒకటి స్ట్రాటోస్ఫియరు చల్లబడడం. ఈ చల్లబడడాన్ని గమనించినప్పటికీ, గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రత, ఓజోన్ క్షీణతలో మార్పుల ప్రభావాలను వేరు చేయడం చిన్నవిషయం కాదు; ఈ రెండూ కూడా శీతలీకరణకు దారితీస్తాయి కాబట్టి. అయితే, న్యూమరికల్ స్ట్రాటోస్ఫియరు మోడలింగ్ ద్వారా దీనిని సాధించవచ్చు. అమెరికా వారి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన జియోఫిజికల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లాబొరేటరీ పరిశీలన ఫలితాల్లో 20 కి.మీ. కంటే ఎత్తున, గ్రీన్‌హౌస్ వాయువులు శీతలీకరణంపై ఆధిపత్యం వహిస్తాయి అని తేలింది.
  • ఓజోన్‌ను హరించే చాలా రసాయనాలు గ్రీన్‌హౌస్ ప్రభావానికి కూడా కారణ మౌతూంటాయి. ఈ రసాయనాల సాంద్రత లోని పెరుగుదల వలన 0.34±0.03 W/m2 రేడియేటివ్ ఒత్తిడి ఉత్పత్తి అవుతుంది. మొత్తం గ్రీన్‌హౌస్ వాయువుల వలన ఏర్పడే మొత్తం రేడియేటివ్ ఒత్తిడిలో ఇది 14 శాతం.
  • ప్రక్రియ యొక్క దీర్ఘకాలిక మోడలింగ్, దాని కొలత, అధ్యయనం, సిద్ధాంతాల రూపకల్పన, పరీక్షించడం, అక్షర బద్ధం చెయ్యడం, విస్తృత ఆమోదం పొందడం, చివరికి ఒక ఆధిపత్య నమూనాగా మారడం.. వీటన్నిటికీ దశాబ్దాలు పడుతుంది. ఓజోన్ నాశనం గురించి 1980 లలో అనేక సిద్ధాంతాలు కల్పించారు, 1990 ల చివరలో ప్రచురించారు. ప్రస్తుతం వీటిని పరీక్షిస్తున్నారు. నాసా గొడ్డార్డ్ అంతరిక్ష కేంద్రానికి చెందిన డాక్టర్ డ్రూ షిండెల్, డాక్టర్ పాల్ న్యూమాన్ లు 1990 ల చివరలో ఓజోన్ విధ్వంసానికి నమూనాగా కాంప్యుటేషనల్ మోడలింగ్ పద్ధతులను ఉపయోగించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నాశనమైన మొత్తం ఓజోన్‌లో 78 శాతం వరకూ అది వివరించింది. ఆ నమూనాను మరింత మెరుగు పరచాక, 89 శాతం వరకూ వివరించగలిగింది. కానీ ఏర్పడ్డ ఓజోన్ రంధ్రం పూడిపోయేందుకు పట్టే కాలాన్ని మాత్రం 75 సంవత్సరాల నుండి 150 సంవత్సరాలకు వెనక్కి నెట్టింది.

అపోహలు

[మార్చు]

CFC బరువు

[మార్చు]

CFC మోలిక్యూళ్ళు గాలి కంటే బరువుగా ఉంటాయి కాబట్టి (R12 కి 120.91 g / mol, R-225cb కి 206.28 g / mol - నత్రజని, ఆక్సిజన్ లు 28-32 g / mol), CFC అణువులు స్ట్రాటోస్ఫియరులోకి పెద్దగా చేరలేవని సాధారణంగా అనుకుంటారు. [51] అయితే, వాతావరణ వాయువులు బరువు ద్వారా క్రమబద్ధీకరించబడవు; గాలి బలానికి వాతావరణంలోని వాయువులు బాగా కలిసిపోతాయి. తేలికైన CFC లు టర్బోస్ఫియరు అంతటా సమానంగా వ్యాపించి, ఎగువ వాతావరణానికి చేరుతాయి. [52] కొన్ని భారీ CFC లు సమానంగా వ్యాపించవు. [53] వాతావరణంలో CFC లు 10-60 pptv (పార్ట్స్ పర్ ట్రిలియన్ బై వాల్యూమ్) స్థాయిలో ఉంటాయి. అయితే, స్ట్రాటోస్ఫియరు పైభాగంలో వాతావరణ పీడనం సముద్ర మట్టం వద్ద ఉండే పీడనంలో 1/1000 వ వంతు ఉంటుంది. CFC మోలిక్యూళ్ళ సంఖ్య, గాలి మోలిక్యూళ్ళ సంఖ్య అధిక ఎత్తుల్లో దామాషా ప్రకారం తక్కువగానే ఉంటాయి.

మానవ నిర్మిత క్లోరిన్ శాతం

[మార్చు]
స్ట్రాటోస్ఫియరు లోని క్లోరిన్‌కు మూలాలు

మరొక అపోహ ఏమిటంటే, "ట్రోపోస్ఫియరులో క్లోరిన్‌ను ఉత్పత్తి చేసే సహజ వనరులు మానవనిర్మితమైన వాటి కంటే నాలుగైదు రెట్లు పెద్దవి." ఈ ప్రకటన కచ్చితంగా వాస్తవమే. కానీ, ఓజోన్ క్షీణతకూ "ట్రోపోస్పియరులో" క్లోరిన్‌కూ సంబంధమే లేదు; ఓజోన్ క్షీణతను ప్రభావితం చేసేది "స్ట్రాటోస్ఫియరు" లోని క్లోరిన్. ఓషన్ స్ప్రే నుండి వచ్చే క్లోరిన్, నీటిలో కరుగుతుంది. ఇది స్ట్రాటోస్ఫియరుకు చేరే లోపే వర్షంలో కొట్టుకుపోతుంది. కానీ, CFC లు కరగవు. పైగా దీర్ఘకాలం పాటు వాతావరణంలో ఉంటాయి. దాంతో ఇవి స్ట్రాటోస్ఫియరుకు చేరుకోవడానికి వీలౌతుంది. దిగువ వాతావరణంలో, ఉప్పు పిచికారీతో వచ్చే హెచ్‌సిఎల్‌లో ఉన్నదానికంటే సిఎఫ్‌సీల్లోను, హేలోఆల్కేనుల్లోనూ చాలా ఎక్కువ క్లోరిన్ ఉంటుంది. స్ట్రాటోస్ఫియరులో హేలోకార్బన్‌లు ప్రబలంగా ఉంటాయి. [54] ఈ హేలోకార్బన్‌లలో ఒకటైన మిథైల్ క్లోరైడ్‌లో మాత్రమే సహజంగా క్లోరిన్ ఉంది. [55] ఇది స్ట్రాటోస్ఫియరులోని క్లోరిన్‌లో 20 శాతం మాత్రమే; మిగిలిన 80 శాతం మానవ కార్యకలాపాల జనితమే.

చాలా తీవ్రమైన అగ్నిపర్వత విస్ఫోటనాలు హెచ్‌సిఎల్‌ను స్ట్రాటోస్ఫియరుంలోకి విరజిమ్ముతాయి. కాని దీని ప్రభవం CFC లతో పోలిస్తే చెప్పుకోదగ్గదేమీ కాదని పరిశోధనల్లో తేలింది. [56] ఇలాంటిదే మరొక తప్పుడు అభిప్రాయం, అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలోని మౌంట్ ఎరేబస్ అగ్నిపర్వత ప్లూమ్ నుండి వెలువడే హేలోజన్ సమ్మేళనాలు అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రానికి ప్రధాన కారణమని చెప్పడం.

ఏదేమైనా, 2015 లో చేసిన అధ్యయనంలో అంటార్కిటిక్ ఓజోన్ క్షీణతలో మౌంట్ ఎరేబస్ అగ్నిపర్వతపు పాత్రను బహుశా తక్కువగా అంచనా వేసారేమో ననే ఆధారాలు కనిపించాయి . [57] గత 35 సంవత్సరాలుగా NCEP / NCAR పునఃవిశ్లేషణ డేటా ఆధారంగాను, NOAA HYSPLIT పథం నమూనాను ఉపయోగించడం ద్వారానూ, ఎరేబస్ అగ్నిపర్వత వాయు ఉద్గారాలు ( హైడ్రోజన్ క్లోరైడ్ (HCl తో సహా), పై అక్షాంశాల్లో వచ్చే తుఫానుల వెంబడి కొట్టుకు పోయి, అంటార్కిటిక్ స్ట్రాటోస్ఫియరుకు చేరుకోగలవని పరిశోధకులు చూపించారు. ఎరేబస్ నుండి స్ట్రాటోస్ఫియరులోకి ప్రవేశించే అదనపు హెచ్‌సిఎల్ ద్రవ్యరాశి సంవత్సరానికి 1.0 నుండి 14.3 కిలో టన్నుల వరకు ఉంటుంది.

ఓజోన్ రంధ్రం ఎక్కడుంది

[మార్చు]

సిఎఫ్‌సిలు భూమ్మీద ఏ ప్రాంతం నుండి పైకి ఎగుస్తాయో ఆ ప్రాంతానికి పైనే ఓజోన్ రంధ్రం ఉంటుందని కొందరు భావిస్తూంటారు. అయితే, CFC లు ప్రపంచవ్యాప్తంగా ట్రోపోస్పియర్, స్ట్రాటోస్ఫియరులో బాగా మిశ్రితమై పోతాయి. అంటార్కిటికా పైన ఓజోన్ రంధ్రం సంభవించడానికి కారణం అక్కడ ఎక్కువ సిఎఫ్‌సిలు కేంద్రీకృతమై ఉండటం కాదు, తక్కువ ఉష్ణోగ్రతల వలన ధ్రువీయ స్ట్రాటోస్ఫియరు మేఘాలు ఏర్పడడమే అందుకు కారణం. [58]

ప్రపంచ ఓజోన్ దినోత్సవం

[మార్చు]

1987 లో మాంట్రియల్ ప్రోటోకోల్ సంతకం చేసిన జ్ఞాపకార్థం సెప్టెంబరు 16 ను ఓజోన్ పొర పరిరక్షణకు అంతర్జాతీయ దినోత్సవం లేదా "ప్రపంచ ఓజోన్ దినోత్సవం"గా ప్రకటిస్తూ, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 1994 లో ఓటు వేసింది. [59]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Twenty Questions and Answers About the Ozone Layer" (PDF). Scientific Assessment of Ozone Depletion: 2010. World Meteorological Organization. 2011. Retrieved March 13, 2015.
  2. https://www.wsj.com/articles/ozone-hole-above-antarctica-shrinks-to-smallest-size-on-record-11571847944
  3. https://nypost.com/2019/10/22/antarctic-ozone-hole-shrinks-to-smallest-size-on-record-due-to-rare-event/
  4. Andino, Jean M. (October 21, 1999). "Chlorofluorocarbons (CFCs) are heavier than air, so how do scientists suppose that these chemicals reach the altitude of the ozone layer to adversely affect it ?". Scientific American. 264: 68.
  5. 5.0 5.1 "The Antarctic Ozone Hole Will Recover". NASA. June 4, 2015. Retrieved 2017-08-05.
  6. "The Ozone Hole-The Montreal Protocol on Substances that Deplete the Ozone Layer". Theozonehole.com. 16 September 1987. Archived from the original on 2012-09-12. Retrieved 2019-05-15.
  7. "Background for International Day for the Preservation of the Ozone Layer - 16 September". Retrieved 2019-05-15.
  8. Newman, Paul A. "Chapter 5: Stratospheric Photochemistry Section 4.2.8 ClX catalytic reactions". In Todaro, Richard M. (ed.). Stratospheric ozone: an electronic textbook. NASA Goddard Space Flight Center Atmospheric Chemistry and Dynamics Branch. Retrieved May 28, 2016.
  9. "Stratospheric Ozone Depletion by Chlorofluorocarbons (Nobel Lecture)—Encyclopedia of Earth". Eoearth.org.
  10. Scientific Assessment of Ozone Depletion 2010, National Oceanic & Atmospheric Administration
  11. Nash, Eric (September 19, 2001). "NASA Confirms Arctic Ozone Depletion Trigger". Image of the Day. NASA. Retrieved April 16, 2011.
  12. Parson, Robert (December 16, 1997). "Antarctic ozone-depletion FAQ, section 7". Faqs.org. Retrieved April 16, 2011.
  13. Toon, Owen B.; Turco, Richard P. (June 1991). "Polar Stratospheric Clouds and Ozone Depletion" (PDF). Scientific American. 264 (6): 68–74. Bibcode:1991SciAm.264...68T. doi:10.1038/scientificamerican0691-68. Archived from the original (PDF) on 2011-02-25. Retrieved April 16, 2011.
  14. Boyesa, Edward; Stanisstreeta, Martin (1992). "Students' perceptions of global warming". International Journal of Environmental Studies. 42 (4): 287–300. doi:10.1080/00207239208710804.
  15. Compare Sheldon Ungar, 2000 and various web sites such as Gavin Schmidt's realclimate complaint in Ozone depletion and global warming 2005 or the UCS FAQ on the topic
  16. 16.0 16.1 16.2 Reiner Grundmann Technische Problemlösung, Verhandeln und umfassende Problemlösung, generic problem solving capability) Archived 2016-03-03 at the Wayback Machine in Gesellschaftliche Komplexität und kollektive Handlungsfähigkeit (Societys complexity and collective ability to act), ed. Schimank, U. (2000). Frankfurt/Main: Campus, p.154-182 book summary at the Max Planck Gesellschaft Archived 2014-10-12 at the Wayback Machine
  17. Gunkel, Christoph (September 13, 2013). "Öko-Coup aus Ostdeutschland". Der Spiegel (in జర్మన్). Retrieved 4 September 2015.
  18. 18.0 18.1 Ungar, Sheldon (1 July 2000). "Knowledge, ignorance and the popular culture: climate change versus the ozone hole". Public Understanding of Science. 9 (3): 297–312. doi:10.1088/0963-6625/9/3/306.
  19. Grundmann, Reiner (14 May 2007). "Climate Change and Knowledge Politics" (PDF). Environmental Politics. 16 (3): 414–432. CiteSeerX 10.1.1.535.4984. doi:10.1080/09644010701251656. Archived from the original (PDF) on August 26, 2014.
  20. "Climate Change 2001: Working Group I: The Scientific Basis". Intergovernmental Panel on Climate Change Work Group I. 2001. pp. Chapter 9.3.2 Patterns of Future Climate Change. Archived from the original on 2016-06-03. Retrieved May 28, 2016.
  21. "Stratospheric Ozone Depletion". Retrieved April 16, 2011.
  22. "Long-term increase in summer UV radiation". Retrieved December 4, 2013.
  23. McKenzie, Richard; Conner, Brian; Bodeker, Greg (September 10, 1999). "Increased Summertime UV Radiation in New Zealand in Response to Ozone Loss". Science. 285 (5434): 1709–1711. doi:10.1126/science.285.5434.1709. PMID 10481002.
  24. "Health and Environmental Effects of Ozone Layer Depletion". EPA. 2013-02-15. Retrieved September 26, 2013.
  25. "Reconstruction of Paleobehavior of Ozonosphere Based on Response to UV-B Radiation Effect in Dendrochronologic Signal" (PDF). Atmospheric Radiation Measurement, USA. Retrieved May 28, 2016.
  26. Lilley, Ray (October 5, 2000). "Ozone Hole Over City for First Time". Associated Press. Retrieved March 13, 2015.
  27. de Gruijl, Frank R. (Summer 1995). "Impacts of a Projected Depletion of the Ozone Layer". Consequences. 1 (2). Archived from the original on 2019-03-21. Retrieved 2020-02-27.
  28. Fears, T. R.; Bird, C. C.; Guerry d, 4th; Sagebiel, R. W.; Gail, M. H.; Elder, D. E.; Halpern, A.; Holly, E. A.; Hartge, P. (2002). "Average midrange ultraviolet radiation flux and time outdoors predict melanoma risk". Cancer Res. 62 (14): 3992–6. PMID 12124332.{{cite journal}}: CS1 maint: numeric names: authors list (link)
  29. Abarca, J. F.; Casiccia, C. C. (December 2002). "Skin cancer and ultraviolet-B radiation under the Antarctic ozone hole: southern Chile, 1987–2000". Photodermatol Photoimmunol Photomed. 18 (6): 294–302. doi:10.1034/j.1600-0781.2002.02782.x. PMID 12535025.
  30. West, S. K.; Duncan, D. D.; Muñoz, B.; Rubin, G. S.; Fried, L. P.; Bandeen-Roche, K.; Schein, O. D. (1998). "Sunlight exposure and risk of lens opacities in a population-based study: the Salisbury Eye Evaluation project". JAMA. 280 (8): 714–8. doi:10.1001/jama.280.8.714. PMID 9728643.
  31. Dobson, R. (2005). "Ozone depletion will bring big rise in number of cataracts". BMJ. 331 (7528): 1292–1295. doi:10.1136/bmj.331.7528.1292-d. PMC 1298891.
  32. "Ozone: Good Up High, Bad Nearby" (PDF). EPA. Archived from the original (PDF) on 2013-06-02. Retrieved March 13, 2015.
  33. Vieth R (1999). "Vitamin D supplementation, 25-hydroxyvitamin D concentrations, and safety". Am. J. Clin. Nutr. 69 (5): 842–56. doi:10.1093/ajcn/69.5.842. PMID 10232622.
  34. "Sunburned whales: Troubling environment news of the week". The Washington Post. BlogPost (blog). November 11, 2010. Archived from the original on 2012-01-07. Retrieved March 28, 2011.
  35. Thomas, Abbie (November 10, 2010). "Whales showing more sun damage". Abc.net.au. Retrieved March 28, 2011.
  36. Sinha, R. P.; Singh, S. C.; Häder, D. P. (1999). "Photoecophysiology of cyanobacteria". Recent Research Developments in Photochemistry and Photobiology. 3: 91–101.
  37. National Academy of Sciences (1976). Halocarbons, effects on stratospheric ozone. Washington, DC. Retrieved May 28, 2016.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  38. 38.0 38.1 Morrisette, Peter M. (1989). "The Evolution of Policy Responses to Stratospheric Ozone Depletion". Natural Resources Journal. 29: 793–820. Archived from the original on 2009-06-08. Retrieved April 20, 2010.
  39. Shabecoff, Philip (November 5, 1986). "U.S. Report Predicts Rise in Skin Cancer with Loss of Ozone". The New York Times. p. A1. Retrieved January 10, 2013.
  40. Grundmann, Reiner (2001). Transnational Environmental Policy: the ozone layer. New York: Routledge. ISBN 978-0-415-22423-9.
  41. Sarma, K. Madhava "Compliance with the Multilateral Environmental Agreements to Protect the Ozone Layer" in Ulrich Beyerlin et al. Ensuring Compliance with Multilateral Environmental Agreements Leiden: Martinus Nijhoff 2006
  42. Mate, John (2001). "Making a Difference: A Case Study of the Greenpeace Ozone Campaign". Review of European Community and International Environmental Law. 10 (2): 190–198. doi:10.1111/1467-9388.00275.
  43. Currie, Duncan E.J. (2005) "The Experience of Greenpeace International" in Tullio Treves et al. (eds.) Civil Society, International Courts, and Compliance Bodies The Hague, The Netherlands: TMC Asser.
  44. Benedick, Richard Elliot (1991) Ozone Diplomacy. Cambridge, MA: Harvard University.
  45. Stafford, Edwin R.; Hartman, Cathy L.; Liang, Ying (2016-10-10). "Wayback Machine" (PDF). Business Horizons. 46 (2): 47–56. doi:10.1016/S0007-6813(03)00009-0. Archived from the original (PDF) on 2016-10-10.
  46. Molina, M.; Zaelke, D.; Sarma, K. M.; Andersen, S. O.; Ramanathan, V.; Kaniaru, D. (2009). "Reducing abrupt climate change risk using the Montreal Protocol and other regulatory actions to complement cuts in CO2 emissions". Proceedings of the National Academy of Sciences. 106 (49): 20616–20621. Bibcode:2009PNAS..10620616M. doi:10.1073/pnas.0902568106. PMC 2791591. PMID 19822751.
  47. Norman, Catherine; Decanio, Stephen; Fan, Lin (2008). "The Montreal Protocol at 20: Ongoing opportunities for integration with climate protection". Global Environmental Change. 18 (2): 330–340. doi:10.1016/j.gloenvcha.2008.03.003.
  48. 48.0 48.1 "Summary for Policymakers" (PDF). IPCC/TEAP special report on safeguarding the ozone layer and the global climate system: issues related to hydrofluorocarbons and perfluorocarbons. Cambridge: Published for the Intergovernmental Panel on Climate Change [by] Cambridge University Press. 2005. ISBN 978-0-521-86336-0. Retrieved మే 28, 2016.
  49. Canada's SCISAT satellite explains 2006 ozone-layer depletion. Canadian Space Agency. October 6, 2006.
  50. Solomon, S.; Ivy, D. J.; Kinnison, D.; Mills, M. J.; Neely Rr, 3rd; Schmidt, A. (June 30, 2016). "Emergence of healing in the Antarctic ozone layer". Science. 353 (6296): 269–74. Bibcode:2016Sci...353..269S. doi:10.1126/science.aae0061. PMID 27365314.{{cite journal}}: CS1 maint: numeric names: authors list (link)
  51. Silverman, Amy (May 4, 1995). "Freon Easy". Phoenix News. Archived from the original on 2007-10-11. Retrieved April 6, 2011.
  52. FAQ, part I, section 1.3.
  53. Fabian, P.; Borchers, R.; Krüger, B. C.; Lal, S. (1985). "The vertical distribution of CFC-114 (CClF2-CClF2) in the atmosphere". Journal of Geophysical Research. 90 (D7): 13091. Bibcode:1985JGR....9013091F. doi:10.1029/JD090iD07p13091.
  54. ozone-depletion FAQ, Part II, section 4.3
  55. Yokouchi, Y.; Noijiri, Y.; Barrie, L. A.; Toom-Sauntry, D.; Machida, T.; Inuzuka, Y.; Akimoto, H.; Li, H. -J.; Fujinuma, Y. (2000). "A strong source of methyl chloride to the atmosphere from tropical coastal land". Nature. 403 (6767): 295–298. Bibcode:2000Natur.403..295Y. doi:10.1038/35002049. PMID 10659845.
  56. ozone-depletion FAQ, Part II, section 4.4
  57. Zuev, V.V.; Zueva, N.E.; Savelieva, E.S.; Gerasimov, V.V. (2015). "The Antarctic ozone depletion caused by Erebus volcano gas emissions". Atmospheric Environment. 122: 393–399. Bibcode:2015AtmEn.122..393Z. doi:10.1016/j.atmosenv.2015.10.005.
  58. "ozone-depletion FAQ, Antarctic". Faqs.org. Retrieved April 6, 2011.
  59. Andersen, Stephen O.; Sarma, K. Madhava (2002). Protecting the Ozone Layer: The United Nations History. Earthscan. p. 272. ISBN 9781849772266.

మరింత చదవడానికి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]