Jump to content

కనుమూరి రామిరెడ్డి

వికీపీడియా నుండి

శ్రీ కనుమూరి రామిరెడ్డి గారు, 1908 సం.లో, డోకిపర్రు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి గంగిరెడ్డి. రామిరెడ్డి గారు 8వ తరగతి వరకు చదువుకున్నారు, రైతు బిడ్డ. గ్రామంలోని ప్రజలకు జాతీయోద్యమ భావాలను,సాంస్కృతిక కార్యక్రమాలు (బుర్రకథ, నాటకాలు) ద్వారా పెంపొందించారు. కనుమూరి రామిరెడ్డి గారు 1930 సం.న స్థాపించిన,   డోకిపర్రు కో-ఆపరేటివ్ బ్యాంకుకి వరుసగా మూడు సార్లు సెక్రెటరీగా పనిచేసారు. 22.2.1932, శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని, పోలీసు వారి దురహంకార  లాఠీఛార్జీకి గురయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, అలీపురం జైలులో 11.5.1943 నుండి 27.8.1943 వరకూ కఠిన శిక్ష అనుభవించారు.  18.5.1943 న అలీపురం జైలులో, 12 కొరడా దెబ్బల శిక్షకు గురయ్యారు. వీరి వంటికి  చన్నీళ్ల స్నానం పడదు, కానీ జైలులో వున్నప్పుడు,రోజు చన్నీళ్ల స్నానం చేయడంతో, వారి ఆరోగ్యం పూర్తిగా  దెబ్బతింది, కంటి చూపు సన్నగిల్లింది. కనుమూరి రామిరెడ్డి గారు జైలులో వున్న రోజులలో, బ్రిటిష్ పోలీసులు, ప్రతి రెండు నెలల కాలంలో ఒకసారి వారి  ఇంటి లోకి చొరబడి, కుటుంబ సభ్యులపై అకారణంగా దౌర్జన్యం చేసేవారు. ఇంటిలో వున్న పాలు, పెరుగు వంటి వాటిని నేల పాలు చేసేవారు. స్వాతంత్ర సమరయోద్యమంలో బ్రిటిష్ వారు విధించిన జరిమానాలు నిమిత్తం, వారి రెండున్నర ఎకరాల పొలం కోల్పోయారు. రామిరెడ్డి గారు, వారి కుమారుడికి బాల గంగాధర తిలక్ రెడ్డి, మొదటి  కుమార్తెకు భరతమాత గుర్తుగా భారతిగా, రెండవ కుమార్తెకు గాంధీజీ సతీమణి పేరైనా కస్తూరి, చివరి కుమార్తెకు  ఆజాద్ హింద్ ఫౌజ్  కెప్టెన్ లక్ష్మికి గుర్తుగా విజయలక్ష్మి  అని నామకరణం చేసారు.  ఈయన[1] దేశ స్వాతంత్రం కోసం ఎంతో పరితపించారు, కానీ భారత స్వాతంత్ర ప్రకటన కన్నా ముందే, 1945 సంవత్సరంలో కనుమూశారు.

మూలాలు

[మార్చు]
  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. pp. అనుభందం - 1. ISBN 978-93-5445-095-2.