కపిల కాశీపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కపిల కాశీపతి పత్రికా, చలనచిత్ర, రేడియో,నాటక, సాహిత్య రంగాలలో సుప్రసిద్ధుడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలోను, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలోను పట్టభద్రుడయ్యాడు. మద్రాసులో న్యాయవాద వృత్తి చేపట్టి తరువాత ఆ వృత్తిని త్యజించి టంగుటూరి ప్రకాశంపంతులు గారి స్వరాజ్యపత్రికలో చేరాడు. ది మెయిల్ పత్రికలో కొన్నాళ్లు పనిచేశాడు. నిజాం రాష్ట్రంలో ప్రత్యేక విలేఖరిగా నియమితుడైనాడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వ్రాయడంతో ఆ రాష్ట్రం నుండి బహిష్కృతుడయ్యాడు. తరువాత చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. అటు పిమ్మట ఆకాశవాణిలో చేరాడు. ఢిల్లీనుండి ఆకాశవాణిలో తెలుగులో వార్తలు చదివిన తొలితరం వ్యక్తులలో ప్రముఖుడు. కేంద్ర ప్రభుత్వ సమాచారశాఖలో చేరి కలకత్తా, మద్రాసులలో ఉపసంచాలకులుగా పనిచేశాడు. సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారిగా పనిచేసి పదవీవిరమణ చేశాడు. మద్రాసు, హైదరాబాదు ప్రభుత్వాలలో ప్రత్యేకాధికారిగా నియమితుడై ఆయా రాష్ట్రాల సమాచారశాఖను పటిష్టం చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఆ రాష్ట్రానికి తొలి సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా పనిచేశాడు. 1956లో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ పత్రికకు తొలి సంపాదకుడు ఇతడే.[1] అటు ఆంధ్ర మహాసభతోనూ, తెలంగాణా ఆంధ్ర మహాసభతోనూ ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, వారి కోరిక మేరకు నెహ్రూ ఆశీర్వచనంతో, కృష్ణమీనన్ సహకారంతో మద్రాసు ప్రభుత్వం ద్వారా లండన్కు వెళ్లి అక్కడ నిజాం ప్రతినిధుల ప్రచారానికి వ్యతిరేక ప్రచార ఉద్యమం నడిపాడు. ఇతడికి కాసు బ్రహ్మానందరెడ్డి సహాధ్యాయి. ఇతడు కాసు బ్రహ్మానందరెడ్డి రాజకీయ జీవితాన్ని గురించి బ్రహ్మానందయాత్ర అనే గ్రంథాన్ని రచించాడు.

రచనలు

[మార్చు]
  1. బ్రహ్మానందయాత్ర[2]
  2. ఇంతకీ నేనెవరు?
  3. Tryst with destiny
  4. రవియాత్ర
  5. స్వయంవరం

నటించిన సినిమాలు

[మార్చు]
  1. కాలచక్రం

మూలాలు

[మార్చు]
  1. Seshu, A Ravindra (2014-05-28). "Last issue of AP magazine released". Andhra Pradesh Breaking News, Telangana News, Hyderabad News Updates, National News, Breaking News. Retrieved 2023-09-20.
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో బ్రహ్మానందయాత్ర పుస్తకప్రతి