Jump to content

కలుపు పాటలు

వికీపీడియా నుండి

నాట్లపాటల్లాంటివే కలుపుపాటలు. ఐతే ఇవి పంట పెరుగుతున్న రోజుల్లో పొలాల్లో పెరిగే కలుపు మొక్కల్ని పీకేటప్పుడు శ్రమను మరిచిపోవడానికి పాడుకునే పాటలు. ఒకరు పాడుతుంటే ఇతరులు పలుకుతుంటారు.


బృందగేయం - కలుపు పాట - హాస్యప్రధానం

తోడిస్వరాలు - దేశాది తాళం


ఓరి మగడా! వయ్యారి మగడా

నా ఏలుపడే పాటుసూడు ఓరి మగడా

గొట్లూరు సెరువు కింద ఓరి మగడా

నేను వరిమడి నాటబోతి ఓరి మగడా


వరిమడి నాటబోతి ఓరి మగడా

నేను గెనుం వార మునుం పడితి ఓరి మగడా

గెనుం వార మునుం పడితె ఓరి మగడా

నన్నెండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా ||ఓరి||


ఎండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా

నాకు ఒళ్ళు సర్తుబోసినాది ఓరి మగడా

నాకు ఉలవపిండి పట్టెయ్ ర ఓరి మగడా

నువ్వు రాత్రంత మేలుకోర ఓరి మగడా ||ఓరి||


నాకు వరికూడు వండిపెట్టర ఓరి మగడా

నువ్వు రాగిసంగటి పాంకోర ఓరి మగడా

నాకు గోదుం రొట్టెలు కాల్సి పెట్ర ఓరి మగడా

నువ్వు జొన్నరొట్టెల్ పాంకోర ఓరి మగడా ||ఓరి||


నేను ఉంటానొ పోతానొ ఓరి మగడా

నన్ను ఉయ్యాలలూపించు ఓరి మగడా

నేను సస్చానొ బతుకుతానొ ఓరి మగడా

నాకు సంది బిందె జేయించు ఓరి మగడా ||ఓరి||


నన్నిష్టం జూసే మగనివైతె ఓరి మగడా

నన్నిసనకర్ర తిసర్రాద ఓరి మగడా

నువ్వు కోరుకున్న మగనివైతె ఓరి మగడా

నాకు కోన్నిగోసి పెట్టరాద ఓరి మగడా ||ఓరి||


నువ్వు సేసుకున్న మగనివైతె ఓరి మగడా

నాకు శాపలొండి పెట్టరాద ఓరి మగడా

నువ్వు అక్కరగల్ల మగనివైతె ఓరి మగడా

నన్ను ఆసపట్ల కంపరాద ఓరి మగడా ||ఓరి||


ఈ పాటలోని కొన్ని పదాలకు అర్థాలు-వివరణలు:

ఏలు = వేలు

పాటు = కష్టం

గొట్లూరు = అనంతపురం జిల్లాలోని ఒక గ్రామం

గెనుం/గెనెం/గనిమ = గట్టు; చేలలో వేసే చిన్నకట్ట

మునుం = వరుస; పైరు కోతకు, కలుపుతీతకు ఏర్పరచుకునే వరస

సర్తు = చెమట

పాముకోవడం = (ఆత్రంగా) తినడం

సందిబిందె = ఒక ఆభరణం

ఆసపట్లకు = ఆసుపత్రికి

'అక్కర' అనే మాటకుండే నానార్థాల్లో "శ్రద్ధ" ఇక్కడ ధ్వనిస్తోంది.