కుచలకుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుచలకుమారి

కుచలకుమారి తెలుగు, తమిళ సినీ నర్తకి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మొత్తం 200 చిత్రాల్లో నృత్యాలు, పాత్రలు ధరించింది. తెలుగు సినిమాల్లో మరపురాని నృత్యాలెన్నింటినో చేసి ప్రేక్షక మహాజనుల చేత వహ్వా అనిపించుకున్న మేటి నర్తకి కుచలకుమారి. 'సరసాల జవరాలను' (సీతారామకల్యాణం), 'కొమ్ములు తిరిగిన మగవారూ...' (భట్టి విక్రమార్క), 'నెలనడిమి వెన్నెలరేయి' (జయసింహ), 'రంగరంగేళి' (భార్యాభర్తలు) వంటి వందలాది గీతాలకు మరపురాని నృత్యాలు చేసి ఆనాటి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఆరంభ జీవితం[మార్చు]

కుచలకుమారి స్వస్థలం తంజావూరు. వీరి కుటుంబంలో అందరూ సినిమా రంగంలో పనిచేసిన వారే. సుప్రసిద్ధ నటి టి.ఆర్.రాజకుమారి ఈమె పిన్ని. కుచలకుమారి అమ్మ టి.ఎస్.దమయంతి[1]కూడా సినిమానటే. ఆమె 1935లోనే సినిమా రంగంలోకి వచ్చి అనేక తమిళ చిత్రాల్లో నటించింది కానీ ఎందువల్లనో తారాపథం చేరలేకపోయింది. దాంతో ఆమె తిరిగి తంజావూరు వెళ్ళిపోయింది. అక్కడే డిసెంబర్ 6, 1937న కుచలకుమారి జన్మించింది.

కుచలకుమారి పుట్టిన తర్వాత బ్రతుకు తెరువు కోసం వాళ్ల అమ్మ మళ్ళీ మద్రాసు వచ్చింది. ఏడవ ఏటనే వాళ్ళ అమ్మ కుచలకుమారిని వళ్లువుర్ రామయ్య పిళ్ళై దగ్గర భరతనాట్య శిక్షణ కోసం చేర్పించింది. టి.నగర్‌లోని 'విద్యోదయ' స్కూలులో నాల్గవ ఫారం వరకూ చదివి, ఆపైన హోలీ ఏంజిల్స్ కాన్వెంటులో ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేసింది. రామయ్య పిళ్ళై దగ్గర 1950 వరకూ భరత నాట్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని, ఆ తర్వాత 'అరంగేట్రం' ఇవ్వకుండానే నాట్యప్రదర్శనలివ్వడం ప్రారంభించింది. అది ఆ రోజుల్లో సంప్రదాయ విరుద్ధమైన సాసహచర్య.

సినీరంగ ప్రవేశం[మార్చు]

కుచలకుమారి పిన్ని టి.ఆర్. రాజకుమారి అప్పట్లో తమిళంలో టాప్ హీరోయిన్ గనుక ఆమె సినీరంగ ప్రవేశం చాలా సులువుగానే జరిగింది. రాజకుమారి చిన్నప్లిల కదా, ముద్దుగా ఉంటుందని కుచలకుమారిని షూటింగ్‌లకి తీసుకువెళ్ళేది. అక్కడ దర్శక నిర్మాతలు చూసి ముచ్చటపడి బాలపాత్రలు ఇచ్చారు. అలా ఏడవ ఏటనే 'మహామాయ' అనే తమిళ చిత్రంలో కన్నాంబ కూతురు పాత్ర ధరించింది. మొదటి రోజు లైట్లు, కెమెరాలు ఆ హంగామా అంతా చూసి భయపడిపోతే కన్నాంబ కుచలకుమారిని ఒళ్ళోనే కూర్చోబెట్టుకుని, లాలిస్తూ, బుజ్జగిస్తూ మధ్య మధ్యలో చాక్లెట్లు, బిస్కట్లు తీసిస్తూ ఆమె భయం పోగొట్టింది. అప్పటి నుండి కన్నాంబ కుచలకుమారిని సొంత కూతురులాగే చూసుకునేది.

తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో 1954 నుండి 1965 వరకు సుమారు పదేళ్ళ పాటు కుచలకుమారి నృత్యం లేకుండా ఏ చిత్రమూ ఉండేది కాదు. తమిళంలో బాగా పేరు వచ్చిన తర్వాత బి.ఎ.సుబ్బారావు 'రాజు-పేద' (1954) చిత్రంలో మొట్టమొదటిసారిగా తెలుగులో నటించే అవకాశమిచ్చారు. అందులో 'కళ్ళు తెరచి కనరా' అన్న పాటకు కుచలకుమారి చేసిన నృత్యం ఆంధ్రదేశాన్ని మారు మ్రోగించింది. సినిమాలో కథకు అన్వయిస్తూ చేసిన నృత్యమది. ఆ పాట విజయవంతం కావడంతో తెలుగులో కూడా నర్తకిగా స్థిరపడింది.

సినిమా రంగంలో ఎంతపేరు తెచ్చుకున్నా కుచలకుమారి నృత్య ప్రదర్శనలివ్వడం మానలేదు. ఈమె తొలి నృత్య ప్రదర్శన తిరుప్పూరులో ఒక వివాహ సందర్భంలో 1954 జూన్ నెలలో జరిగింది. ఆ తర్వాత తనే సొంతంగా ఒక డాన్స్ ట్రూప్ కూడా నడిపింది. కళారంగంలోనే ఉండిపోవాలనుకున్న కుచలకుమారి, వివాహం వల్ల ఇంట్లో పురుషాధిక్యత ఎక్కువై నాట్యానికి ఎక్కడ అవాంతరం ఏర్పడుతుందోననే భయంతో వివాహం చేసుకోలేదు. వృద్ధాప్యంలో బంధువులందరికీ ష్యూరిటీలు ఇచ్చి, వాళ్ళు అప్పులు కట్టకుంటే ఆమే కట్టవలసి వచ్చి కుచలకుమారి ఆర్థికంగా చాలా చిక్కుల్లో పడింది. అందువల్ల శరవణ్ మొదలియార్ వీధిలో ఉన్న పెద్ద ఇల్లు చాలా చౌకగా అమ్మేసి, నిలువనీడ కోల్పోయిన సమయంలో కరుణానిధి ఆమెకు ఒక ప్రభుత్వ గృహాన్ని చాలా చౌకగా అద్దెకు ఇప్పించి ఆదుకున్నాడు. ఇప్పుడు అదే ఇంట్లో తన తమ్ముడి కుటుంబాన్ని తన దగ్గరే పెట్టుకుని ఉంటున్నది.

తెలుగులో నర్తకిగా ఈమె చివరి చిత్రం రామానాయుడు మొదటి చిత్రం 'రాముడు భీముడు'. ఆ తర్వాత కె.బాలచందర్ తీసిన 'మన్మథలీల' చిత్రంలో నృత్యం చేయలేదు కానీ హలం ఆంటీ పాత్రను వేసింది. ఆ మధ్య తమిళంలో 'జానకి' అనే టెలీ సీరియల్‌లో కూడా నటించింది.

చిత్రసమాహారం[మార్చు]

మూలాలు[మార్చు]