కొన్ని సమయాల్లో కొందరు మనుషులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, ప్రముఖ తమిళ రచయిత డి.జయకాంతన్ రచించిన తమిళ నవలకు ఇది అనువాదం. సమాజంలో స్త్రీల స్థితిని, పురుషులు చేసిన అకృత్యానికి కూడా స్త్రీ దుస్థితి అనుభవించవలసి రావడం గురించి ఈ నవల వివరిస్తుంది.[1] స్త్రీవాద కోణాన్ని వివరించిన ఈ నవల తమిళనాట సంచలనం సృష్టించి సినిమాగా రూపొందింది.

రచన నేపథ్యం[మార్చు]

జయకాంతన్ వ్రాసిన సిల నేరంగలిల్, సిల మణితర్గల్ అనే పుస్తకానికి అనువాదం – కొన్ని సమయాలలో కొందరు మనుష్యులు. 1977/1978 ప్రాంతాలలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో మాలతీచందూర్ అనువదించిన ఈ జయకాంతన్ నవల సీరియల్‌గా ప్రచురితమైంది. అనంతరం అంతర భారతీయ గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. తమిళ మాతృకకు ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. జయకాంతన్ కొందరు బాలికలపై జరిగే అకృత్యాలను సమాజం వరకూ తీసుకురాకుండా దాచుకోవాలని, తద్వారా ఆమె భావిజీవితం నరకప్రాయం కాదన్నట్టుగా వివాదాస్పదమైన కథాంశంతో అగ్నిప్రవేశం అన్న కథ రచించారు. అందరినీ అమాయకంగా నమ్మరాదన్న విషయం ఆ యువతి మనస్సుకు పట్టేట్టుగా చెప్పాలి గానీ దాన్ని బయటపెట్టరాదన్నట్టు రాసిన ఆ కథ సాహిత్యవర్గాల్లోనే కాక సమాజంలో కూడా సంచలనం సృష్టించింది.[2] దానితో రచయిత ఒకవేళ ఆమెపై ప్రమాదవశాత్తూ జరిగిన అత్యాచారం తల్లి బయటపెడితే ఏం జరుగుతుందో సమాజం ఎంత తీవ్రంగా అమాయకురాలైన ఆమె జీవితాన్ని మోడువారుస్తుందోనన్న కోణంలో ఈ నవల రచించారు. ఈ నవలలో అగ్నిప్రవేశం కథారచయితకు కూడా పాత్ర ఉండడం వంటివి విశేషంగా ఉంటాయి. దీనికి కొనసాగింపుగా గంగ అనే ఆ యువతి భవిష్యజీవితం ఎలా మలుపులు తిరిగిందో మరొక నవలలో వివరించారు. మొత్తంగా అగ్నిప్రవేశం అనే కథకు ఒకవిధమైన కొనసాగింపుగా రచించిన ఈ నవలకు మరొక నవల కూడా కొనసాగింపుగా సాగుతుంది.

కథాంశం[మార్చు]

గంగ అనే మహిళ తన యౌవనంలో జరిగిన అత్యాచారం సమాజంలోని అందరికీ తెలియడంతో వివాహం ప్రస్తావనే లేకుండా విడిగా జీవించాల్సి వస్తుంది. ఉద్యోగం చేసుకుంటూ తాను జీవిస్తూనే తన తల్లిని కూడా తన వద్దే ఉంచుంకుంటుంది. ఈ నేపథ్యంలో ఒక మాసపత్రికలో అగ్నిప్రవేశం అనే కథ అచ్చుకాగా అది చదివి దానిలో వర్ణించిన దుస్సంఘటనకు తన జీవితాన్ని ఇలా మార్చిన అత్యాచారానికి సంబంధం ఉన్నట్టు తెలుసుకుంటుంది. కానీ ఆ కథలో మాత్రం ముగింపులో యువతి తల్లికి వెక్కుతూ అంతా వివరిస్తుంది.ముందు అరచి తిట్టబోయిన తల్లి ప్రక్కింటావిడ వచ్చి “ఏమి జరిగింది…” అని అడగ్గానే స్పృహలోకి వచ్చి సంభాళించుకుని, కేవలం వర్షంలో తడసి వచ్చి నందుకు తిడుతున్నాని అంటుంది. ఒక క్షణం ఆలోచించి ఆమెకి తలార స్నానం చేయించి పునీతురాలిని చేస్తుంది. ఆపైన అదే కథ తల్లి చేతికిచ్చి చదివించి ఆమె తనకు చేసిన పనిపై నిరసన తెలియజేస్తుంది. ఆ కథకుణ్ణి కలుసుకునేందుకు ప్రయత్నమూ చేస్తుంది. ఆ రచయిత తాను చదివిన కళాశాలలోని కిందిస్థాయి ఉద్యోగి అని తెలసుకుంటుంది. అతని ద్వారా తనపై అత్యాచారం చేసిన వ్యక్తి ఫోను నెంబరు తెలుసుకుని కలుస్తుంది. ఆపైన అతని జీవితంలోని లోటుపాట్లు, వ్యర్థునిగా ఉండడం తెలిసి స్నేహితురాలవుతుంది. వారిద్దరి మధ్యా స్నేహమూ, సాన్నిహిత్యమూ పెరుగుతాయి. వివాహమై ఎదిగిన కూతురు కూడా ఉన్న ఆ వ్యక్తినే గంగ ప్రేమించడం, అతను పశ్చాత్తప్తుడై తిరస్కరించడం వంటి పరిణామాలు కథను అనేక మలుపులు తిప్పుతాయి. ముగింపు కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది.

ప్రాచుర్యం[మార్చు]

ఈ నవల తమిళంలో సిలనేరంగళిళ్ సిల మణితర్గళ్ పేరిట సినిమాగా కూడా వచ్చింది. గంగ పాత్ర ధరించిన నటి లక్ష్మి 1976లో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా రజత కమలం అందుకొన్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. కొన్ని సమయాల్లో కొందరు మనుషులు:మూ.జయకాంతన్, అ.మాలతీ చందూర్:నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా
  2. శ్రీ, అశ్విని. "జయకాంతన్ కథలు-2 (అగ్నిప్రవేశం)". http://aswinisri.wordpress.com/. Retrieved 3 November 2014. External link in |website= (help)
  3. ఇండియాగ్లిట్జ్ వెబ్‌సైట్‌లో సిల నేరంగళిళ్ సిల మణితర్గళ్ సినిమా గురించి