గోరంట్ల వెంకన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వారిలో మహాదాతలుగా ప్రసిద్ధి చెందిన వారిలో గోరంట్ల వెంకన్న ఒకరు. ఆర్ష సంస్కృతీ సముద్ధరణ కోసం తన జీవితార్జిత సర్వస్వాన్నీ ధారపోసి చిరస్మరణీయుడైన వెంకన్న ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం అనే గ్రామానికి చెందినవారు. ఈ గ్రామానికి గోరంట్ల వారు నరసరావుపేట ప్రాంతంలోని మురికిపూడి అనే గ్రామం నుండి వలస వచ్చి స్థిరపడ్డారు. వీరికి మూలపురుషుడు చంద్రప్ప. గోరంట్ల కుటుంబాలలో వీరన్న అనేవారు సుప్రసిద్ధులు. వీరి రెండవ భార్య పున్నమ్మకు వెంకన్న, రామన్న, వెంకటస్వామి అను ముగ్గురు కుమారులు పుట్టారు. పెద్దవాడైన వెంకన్న 1871లో జన్మించారు. వీరిది 1200 ఎకరాల భూస్వామ్య కుటుంబం.

వెంకన్న గారికి చిన్నప్పటినుండి విద్యాభిరుచి, జ్ఞానతృష్ణ ఎక్కువ. అచ్యుతన్న శ్రీరామ శాస్త్రి అనే మహాపండితుని సాంగత్యము వల్ల సంస్కృతభాష, ఆయుర్వేద వైద్యం, పురాణశ్రవణం మొదలగు విషయాలపై అపారమైన అభిమానం ఏర్పడింది. స్వగ్రామంలో కృష్ణమందిరం ఏర్పాటుచేసి ప్రతి ఏటా ఉత్సవాలు జరిపించారు. ఈ ఉత్సవాలలో రాష్ట్రం నలుమూలల నుండి సంస్కృత పండితులను రప్పించి సత్కరించేవారు. స్వయంగా పూర్ణ చంద్రోదయ, వసంత కుసుమాకరం, సిద్ధమకరధ్వజ ఔషధాలను చేయించేవారు. తన వాటా 268 ఎకరాలను వేదశాస్త్ర, సంస్కృత భాష, ఆయుర్వేద వైద్యాలకు దానం చేశారు. తన ఊరిలో సంస్కృత విద్యాపీఠం స్థాపించి అన్ని వర్ణాలవారు చదువుకునేట్లు, విద్యార్ధులందరికీ ఉచితవిద్య, అన్నదానం చేసే ఏర్పాట్లు చేయించారు.

వెంకన్న గారు ప్రకాశం పంతులు గారి ముఖ్య అనుచరులు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, స్వామి సీతారాం గార్లను తిమ్మసముద్రానికి ఆహ్వానించి ప్రసంగా లిప్పించారు. వెంకన్న గారి దేశభక్తి, త్యాగ నిరతి గురించి తెలుసుకున్న గాంధీజీ రెండుసార్లు తిమ్మసముద్రం వచ్చారు. గాంధీగారి సమక్షంలో ఏడు ఎకరాల భూమిని హరిజనులకు పట్టాల రూపేణా ఇచ్చారు. 1936లో వచ్చిన పెనుతుఫాను భీభత్సంలో గాంధీగారు బాధితులను ఆదుకొనడానికి తిమ్మసముద్రం వస్తే ఈ ప్రాంతం వారిని విషయం నేను చూసుకుంటాను మిగతా ప్రాంతాలను మీరు చూడండి అని భరోసా ఇచ్చిన మహాదాత వెంకన్న.

తన జీవితాన్ని, సంపదను, భూమిని సంఘం కోసం త్యాగం చేసి సంస్కృత భాషకు, ఆర్షసంస్కృతికీ నిస్వార్ధసేవ చేసిన మహనీయుడు గోరంట్ల వెంకన్న.

తిమ్మసముద్రంలో వెంకన్న స్థాపింఛిన సంస్కృత విద్యాపీఠము ఇప్పుడు ఓరియంటల్ కళాశాలగా మార్పు చెందింది[1].

మూలాలు[మార్చు]

  1. శ్రీ గోరంట్ల వెంకన్నఓరియంటల్ కాలేజి: http://mycollege.in/college.php?id=1733&name=Sri-Gorantla-Venkanna-Oriental-College Archived 2007-10-08 at the Wayback Machine