గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు
గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు జంటకవులుగా ప్రసిద్ధి చెందారు. వీరిలో గౌరావఝల రామకృష్ణ శాస్త్రి (1902-1970) పెద్దవాడు. ఇతడు కర్నూలు మునిసిపల్ హైస్కూలులో పండితుడిగా పెక్కు సంవత్సరాలు పనిచేశాడు. రెండవ వాడైన గౌరావఝల సీతారామ శాస్త్రి (1904-1972) అప్పటి కర్నూలు జిల్లా (ప్రస్తుతం ప్రకాశం జిల్లా) గజ్జలకొండ గ్రామంలో బోర్డు హైస్కూలు ప్రధానోపాధ్యాయుడిగా, పోస్టుమాస్టర్‌గా పనిచేశాడు. ఈ ఇరువురు సోదరకవులు పెక్కు శతావధానాలు చేశారు[1].
విద్యాభ్యాసం
[మార్చు]వీరు బాపట్ల శంకర విద్యాలయంలో గీర్వాణాంధ్ర భాషలను, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్షను ఉత్తీర్ణులయ్యారు.
రచనలు
[మార్చు]- శ్రీ కాశీవిశ్వనాథ శతకము
- పయిడిపాటి మహాలక్ష్మి శతకము
- వెంకటేశ్వర శతకము
- శ్రీ కృష్ణ కథామృతము
- సుబ్రహ్మణ్యేశ్వరీయము
- శ్రీరామ నిర్యాణ నాటకము
- కాఫీ పురాణము
అవధానాలు
[మార్చు]ఈ సోదరకవులు మదనపల్లి, చిత్తూరు, బెంగుళూరు, మైసూరు, బళ్ళారి, అనంతపురము మొదలైన ముఖ్యపట్టణాలలో శతావధానాలు చేశారు. ఈ పట్టణాల చుట్టుపక్కల గ్రామాలలో అష్టావధానాలు, నేత్రావధానాలు కూడా చేశారు. ఆశు ప్రదర్శనలలో సభ్యులు కోరిన కథాభాగాన్ని తీసుకుని గంటకు 300 పద్యాలను ఆశువుగా చెప్పి పలువురి మెప్పును పొందారు. మరికొన్ని పల్లెటూరి దేవాలయాలలో పురాణ పఠనం చేశారు.
రచనల నుండి ఉదాహరణలు
[మార్చు]@
ఒక మారేడు దళంబు నీ పదము లందుంచంగ సంతోషివై
యకలంకంబగు మోక్షమిత్తువట, పుష్పారామముంబెంచి, మా
లికలంగూర్చి సహస్ర నామముల హాళింగొల్చు నీ పుణ్యరా
శికేమిచ్చెదొ? తంగేడంచపుర కాశీ విశ్వనాథ ప్రభూ!
@
అకలంకంబౌ భక్తి నీ చరణ సేవాశక్తి వల్మీక మృ
త్తికచే లింగము జేసి నిత్యము "నమస్తే రుద్ర" యన్దివ్యవై
దిక మంత్రంబుల ధూపదీపముల నర్థింగొల్చునప్పుణ్య రా
శికి మోక్షంబిడు, తంగేడంచపుర కాశీ విశ్వనాథ ప్రభూ!
@
వ్యాసుడంతటివాడు, బిక్షకయి మధ్యాహ్నంబు నందేగియున్
గ్రాసంబెక్కడ లేక, కాశిపయి రౌద్రంబూని దూషింప, స
న్యాసీ! పొమ్మనినావు, కోపి యెటులందంజాలు నీ మోక్ష ల
క్ష్మీ సామ్రాజ్యము; తంగేడంచపుర కాశీ విశ్వనాథ ప్రభూ!
- (శ్రీ కాశీ విశ్వనాథశతకము నుండి)
@
అతిథి వాకిటనుండ నాతని విడనాడి
కాఫీ త్రాగెడు కులకాంత యొకతె
తాను జిక్కని కాఫీ త్రాగి నీరిడి తక్కు
వారి కొసంగు నొయ్యారి యొకతె
అలవాటు మాకు లేదని; రహస్యంబుగా
జవిగొని యరుదెంచు జాణ యొకతె
చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష యం
చును త్రాగి మురియు శూర్ఫణక యొకతె
కాంతుడే కాఫీ గాచి పక్కకడ జేరి
నోటికందీయ ద్రాగి,కన్నులను విప్పి
చక్కగాలేదు పొమ్మని వెక్కిరించు
గర్వమానసయగు విషకన్య యొకతె!
- (కాఫీ పురాణము నుండి)
@
బట్టలిస్త్రీ సేయవైచిన మఱకల
వైపు గన్గొని చాకివాడు దిట్టు
సరస ప్రసంగముల్సలుప గౌగిట జేరి
ముద్దిడు చెలి పెడమొగము బెట్టు
పసిపాప కనులలో బడన గేకలు వైచి
సారెకు సారెకు బోరుపెట్టు
తళతళలాడు గోడల మీద జీదిన
బనివాడు సూచి చీవాట్లు బెట్టు
నెత్తి కెక్కును, కనులకు నీరు దెచ్చు
గొద్ది కొద్దిగ ధనమెల్ల గొల్లవెట్టు
నాసికా చూర్ణమొక దురభ్యాస మగుట
తగదు సేవింప మీకు విద్యార్థులారా!
- (సికిందరాబాదు అవధానములో నశ్యంపై ఆశువుగా చెప్పిన పద్యం)
బిరుదులు
[మార్చు]రామకృష్ణశాస్త్రి అభినవ బాణకవి, ఆశుకవి చక్రవర్తి, కవిసార్వభౌమ మొదలైన బిరుదులను పొందాడు. సీతారామశాస్త్రికి బాలకవిరత్న బిరుదును కలిగి ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ కర్నూలు జిల్లా రచయితల చరిత్ర - కె.ఎన్.ఎస్.రాజు - పేజీలు 65-69