శ్రీనాథుడు

వికీపీడియా నుండి
(కవిసార్వభౌముడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శ్రీనాథుడు
Portrait of Srinatha Kavi Sarvabhouma.jpg
శ్రీనాథుడు
పుట్టిన తేదీ, స్థలం1365-70
కోస్తాంధ్ర, గోదావరి ప్రాంతము, ఆంధ్రప్రదేశ్, భారతదేశం[1][2][3][4]
మరణం1441 (కపిలేశ్వర గణపతి కోస్తాంధ్రని గెలిచినాక .[5] (80 ఏళ్ల పై వయస్సులో)
బొడ్డేపల్లి కృష్ణా నది వడ్డున
వృత్తికవి

శ్రీనాథుడు (1365–1441) 15వశతాబ్ది తెలుగు కవి. దివ్యప్రబంధన శైలికి ఆదరణ కల్పించాడు.

చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది.

రాజాశ్రయం[మార్చు]

శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించాడు. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్సింగ్భూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు.

శ్రీ నాధుడు కొండవీటి రెడ్డి రాజు ప్రోలయ వేమభూపతి ఆష్థానం వాడని ప్రసిద్ధి

ఘనత - బిరుదులు[మార్చు]

డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదము ఉంది.

రచనలు[మార్చు]

ఇతను ఎన్నో కావ్యాలు రచించాడు. వాటిలో కొన్ని: భీమ ఖండము, కాశీ ఖండము, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము మొదలగునవి. ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంతా బహు ప్రశస్తి పొందాయి.

కాశీఖండమునందు చెప్పుకున్నట్టుగా

చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు
                   రచియించితిమరుత్తరాట్చరిత్ర.
నూనుగు మీసాల నూత్న యౌవనమున
                    శాలివాహన సప్తశతి నుడివితి.
సంతరించితి నిండు జవ్వనంబునయందు
                    హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని
                     యాడితి భీమనాయకుని మహిమ

ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మను మహాగ్రంథ మేను
తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక
పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.

శ్రీనాథుని జీవిత విశేషాలు తెలిపే కొన్ని పద్యాలు[మార్చు]

దీనారటంకాల దీర్థమాడించితి
    దక్క్షిణాధీశు ముత్యాలశాల,
పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య
    నైషధగ్రంథ సందర్భమునకు,
పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి
    గౌడడిండిమభట్టు కంచుఢక్క,
చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ద
    పాదుకొల్పితి సార్వభౌమ బిరుద,
మెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావు సింగ మహీపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సకలసద్గుణ నికురంబ! శారదాంబ!

కవిరాజుకంఠంబు కౌగిలించెనుగదా
    పురవీధినెదురెండ బొగడదండ,
సార్వభౌముని భుజాస్కంధ మెక్కెనుగదా
    నగరివాకిటనుండు నల్లగుండు,
ఆంధ్రనైషధకర్త యంఘ్రి యుగ్మంబున
    దగలియుండెనుగదా నిగళయుగము,
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత
    వియ్యమందెనుగదా వెదురుగొడియ,
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?


కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి
     రత్నాంబరంబు లే రాయడిచ్చు?
కైలాసగిరి బండె మైలారువిభుడేగె
     దినవెచ్చ మేరాజు దీర్పగలడు?
రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు
     కస్తూరి కేరాజు ప్రస్తుతింతు,
స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
     పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?
భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె
కలియుగంబున నిక నుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.

శ్రీనాథుని చాటువులు[మార్చు]

శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ రెండుపద్యాలూ అవధరించండి.

కుల్లాయుంచితి, కోకసుట్టితి, మహాకూర్పాసమున్ బెట్టితిన్,
వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రావితిన్, రుచులు దోసంబంచు పోనాడితిన్,
తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్ .


కవితల్ సెప్పిన పాడనేర్చిన వృధాకష్టంబె, యీ భోగపుం
జవరాండ్రేగద భాగ్యశాలినులు, పుంస్త్వంబేటికే పోగాల్పనా ?
సవరంగాసొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టించుచో
యెవరేనిన్ మదిమెచ్చి ధనంబులిత్తురుగదా నీరేజపత్రేక్షణా!

నీలాలకా జాల ఫాల కస్తూరికా
తిలకంబు నేమిట దిద్దువాడ
నంగనాలింగనా నంగ సంగర ఘర్మ
శీకరం బేమిట జిమ్మువాడ
మత్తేభగామినీ వృత్తస్తనంబుల
నెలవంక లేమిట నిల్పువాడ
భామామణీ కచాభరణ శోభితమైన
పాపట నేమిట బాపువాడ
ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి
కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి
… అహహ
పోయె నా గోరు తన చేతి పోరు మాని

ఒకసారి శ్రీనాథ కవిసార్వభౌములు పల్నాటిసీమ కు వెళ్లారు. అక్కడి నీటి ఎద్దడి చూసి ఈ కంద పద్యాన్ని చాటువుగా చెప్పేరట -

సిరిగలవానికిజెల్లును
తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశాగంగవిడువు పార్వతిచాలున్

కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు సుంకంబు నేడు నూర్లు?

రసికుడు పోవడు పల్నా డెసగంగా రంభయైన నేకులె వడకున్‌
వసుధేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్‌

ఊరు వ్యాఘ్ర నగర మురగంబు కరణంబు
కాపు కపివరుండు కసవు నేడు
గుంపు గాగ నిచట గురజాల సీమలో
నోగులెల్ల గూడి రొక్క చోట.

గరళము మ్రింగితి ననుచుం బురహర గర్వింపబోకు పో పో పో నీ
బిరుదింక గానవచ్చెడి మెరసెడి రేనాటి జొన్నమెతుకులు తినుమీ.

కాశికా విశ్వేశ్వరు గలిసె వీరారెడ్డి
రత్నాంబరము లే రాయడిచ్చు
రంభ గూడె దెనుంగు రాయరాహుత్తుండు
కస్తూరి కే రాజు ప్రస్తుతింతు
స్వర్గస్థుడయ్యె విస్సన్న మంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండె మైలార విభుడేగె
దినవెచ్చ మే రాజు దీర్పగలడు
భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగె
గలియుగంబున నిక నుండ గష్టమనుచు
దివిజకవివరు గుండియల్‌ డిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.

సమకాలీకులు[మార్చు]

ఈయన పోతనకు సమకాలీనుడు. పోతనకు బంధువని, పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్నిసర్వజ్ఞసింగభూపాలునికి అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ చారిత్రాక ఆధారాలు లేని కారణంగా వాటి విశ్వసనీయత పై పలు సందేహాలు, వివాదాలు ఉన్నాయి.

చరమాంకం[మార్చు]

శ్రీనాథుని అంతిమ దినాలు బహు దుర్బరంగా గడిచాయి. కొండవీటి ప్రాభవంతో పాటు శ్రీనాథును ప్రభ మసకబారింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టేయి. కృష్ణాతీరాన ఉన్న గ్రామాన్ని గుత్తకు తీసుకొని శిస్తు కట్టని కారణంగా ఆయన భుజంపై ఊరిబయటనున్న శిలను ఉంచి ఊరంతా ఊరేగించారని ఆయన చరమ పద్యం ద్వారా తెలుస్తుంది.

శ్రీనాథుని వ్యక్తిత్వం[మార్చు]

శ్రీనాథ కర్తృత్వంతో ఎన్నో చాటుపద్యాలు మనకిప్పుడు దొరుకుతున్నాయి. వీటిలో ఎన్ని శ్రీనాథుడు స్వయంగా చెప్పినవో, అసలు “శృంగార నైషథ” కావ్య కర్త ఐన ఆ శ్రీనాథుడు వీటిలో ఒక్కటైనా చెప్పాడో లేడో కూడా మనకు తెలియదు. ఐతే, ఆయన చెప్పినా మరొకరు చెప్పినా ఈ పద్యాల ద్వారా, శ్రీనాథుడి “వ్యక్తిత్వం” గురించి తర్వాతి తరాల వారు ఏమని భావించారో మనకు తెలిస్తుంది.

ఇక్కడ “వ్యక్తిత్వం” అని ఎందుకు నొక్కి చెపుతున్నానంటే, కవుల కవితాశక్తి కోసమే ఐతే వాళ్ళు రాసిన (లేదా చెప్పిన) గ్రంథాలు చదువుకోవచ్చు, అవి చాలు. అంతటితో ఆగకుండా, ఆ కవుల వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకోవాలన్న కుతూహలం పాఠకుల్లో కలిగినప్పుడు చాటు పద్యాలు ఆ అవసరాన్ని భర్తీ చేస్తాయి. (”A poem at the right moment” అన్న గ్రంథంలో వెల్చేరు నారాయణ రావు, డేవిడ్‌ షుల్మన్‌ వివిధ భారతీయ భాషల చాటువుల గురించి సాధికారిక విశ్లేషణ చేశారు.) కవితాస్వాదనా తత్పరులైన రసిక పాఠకులు తమకు అంతటి ఆనందాన్ని అందిస్తున్న కవుల వ్యక్తిగత ప్రపంచాన్ని గురించి తయారు చేసుకున్న ఊహాచిత్రాల్ని ప్రతిబింబించేవి చాటుపద్యాలు. ఇప్పుడు సినీ తారల, ఆటగాళ్ళ, ఇతర ప్రముఖుల, వ్యక్తిగత విషయాల గురించి జనసామాన్యంలో ఎంతటి కుతూహలం ఉన్నదో చెప్పనక్కరలేదు. ఒకప్పుడు కవులు కూడా ఇలాటి జాబితాలో ఉండేవారనటానికి ప్రబలసాక్ష్యాలు చాటుపద్యాలు. అలాగే, వాళ్ళని ఆరాధించిన పాఠక-శ్రోతలు ఎంతటి సాహితీభక్తులో ఉన్నతస్థాయి కవులో కూడా చూపిస్తాయి.

పై పుస్తకంలో చెప్పినట్లు, ఓ కవి జనబాహుళ్యంలోకి ఎంతగా చొచ్చుకుపోయాడో చెప్పటానికి కొలమానాలు చాటుపద్యాలు. ఐతే ఇక్కడ మనం కవిని, అతని రచనల్ని విడదీసి చూడాలి. ఉదాహరణకు ఒక రచనకి ఎంతో జనాదరణ దొరికినా ఆ కవికి సంబంధించిన చాటువులు ఏమీ లేకపోవచ్చు. అలాటి పరిస్థితుల్లో పాఠకుల దృష్టి ఆ కవి మీద కన్నా రచన మీదే ఉందన్నమాట. లేకపోతే, ఆ కవి వ్యక్తిగత జీవితంలో కుతూహల కారకాలైన అంశాలేవీ లేకపోవచ్చు. ఉదాహరణకు నన్నయ గారిని తీసుకుంటే, ఆయన ఎలాటివాడు?

“… అవిరళ,
జపహోమతత్పరు విపులశబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది,
నానాపురాణ విజ్ఞాననిరతు
బాత్రు నాపస్తంబ సూత్రు ముద్గలగోత్ర
జాతు సద్వినుతావదాత చరితు
లోకజ్ఞు నుభయభాషా కావ్యరచనాభి
శోభితు సత్ప్రతిభాభియోగ్యు
నిత్యసత్యవచను మత్యమరాధిపా
చార్యు సుజను నన్నపార్యు..”

అని భారతం చెప్తోంది.

విశ్వనాధ అభిప్రాయం[మార్చు]

ఇటీవలి కాలంలో విశ్వనాథ కూడా ఆయన గురించి “ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి” అన్నారు. అలాటి వ్యక్తి జీవితంలో జనసామాన్యానికి కుతూహలం కలిగించే సంఘటనలుండటం అరుదు. ఐనప్పటికీ ఆయన చివరి పద్యం

శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారకహారపంక్తులం
జారుతరంబులయ్యె వికసన్నవకైరవ గంధబంధురో
దార సమీరసౌరభము దాల్చి సుధాంశువికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచి పూరములంబరపూరితంబులై

అన్న దాన్లోని చివరి సమాసాన్ని “పాండురుచి పూరములన్‌ పరపూరితంబులై” అని విరిచి, అది తన చివరి పద్యమనీ మిగిలిన భారతాన్ని పరులు పూరించబోతున్నారనీ నన్నయ గారు చెప్తున్నారని అన్వయించుకుని ఆనందించారు రసిక పాఠకులు. అలాగే సోమయాజి తిక్కన గారి విషయంలోనూ “ఏమి చెప్పుదున్‌ గురునాథా” అన్న చిన్నముక్కని దొరకపుచ్చుకుని దాని చుట్టూ ఓ రసవంతమైన కథని అల్లుకుని తృప్తిపడ్డారు.

అదే వేములవాడ భీమకవి విషయంలో ఐతే, చాటువుల్లో ఆయనది ప్రముఖ స్థానమైనా ఆయన రాసినవి ఏవీ ఇప్పుడు దొరకటం లేదు. అంటే, రసవత్తరమైన ఆయన వ్యక్తిగత విషయాలతో పోలిస్తే ఆయన గ్రంథాలు వెలవెల బోయానన్న మాట. ఇంకా చాలామంది కవుల విషయంలో కూడా ఇలా జరిగింది.

ఐతే శ్రీనాథుడి విషయంలో ఒకరకమైన సమతుల్యత సమకూరిందని చెప్పుకోవచ్చు. ఆయన రచనలు, ముఖ్యంగా ఆంధ్ర పంచకావ్యాలలో ఒకటిగా భూషించబడ్డ శృంగార నైషథం, అవశ్యపఠనీయాలయ్యాయి; అలాగే, ఆయన వ్యక్తిగత అనుభవాలను ప్రతిపాదించే చాటువులు ఆబాలగోపాలానికీ జిహ్వాగ్రాల మీద నిలిచాయి. ఈ చాటువుల్లో కనిపించే శ్రీనాథుడి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇందాకనే అనుకున్నట్లు, నిజంగా శ్రీనాథుడు ఇలా ప్రవర్తించాడా అనే ప్రశ్నకి ఇక్కడ తావులేదు - ఔనో కాదో చెప్పటం అసాధ్యం కనుక. ఇవి చెప్పేది తర్వాతి తరాల వాళ్ళ ఊహలో శ్రీనాథుని జీవితం ఎలాటిది అని మాత్రమే.

కాలం గడిచే కొద్ది ఏ విషయమైనా సరళీకృతం కావటం సాధారణం. అంటే మొదల్లో ఉన్న క్లిష్టతలు, అస్పష్టతలు బయటకు వెళ్ళిపోయి ఆ విషయానికి కొట్టొచ్చేట్టు కనిపించే గుణాలు మాత్రం బహుగుణీకరించబడతాయి. ఇప్పటి మాటల్లో చెప్పాలంటే “మైనర్‌ పాయింట్స్‌” మరుగున పడిపోయి “కోర్‌ వాల్యూస్‌” అనుకున్నవి ఎంతగానో “యాంప్లిఫై” ఔతాయి. శ్రీనాథుడి వ్యక్తిగత చిత్రీకరణ విషయంలోనూ చాటు పద్యాలు మనకు అదే నిరూపిస్తాయి. వీటిలో కనిపించే శ్రీనాథుడి వ్యక్తిత్వం ఇది -

 1. ఆయన విశాల లోక సంచారి, ఐక్యాంధ్ర సామ్రాజ్యపు సరిహద్దులేమిటో తొలిగా చూపిన వాడు (వెల్చేరు ప్రతిపాదన ప్రకారం)
 2. సౌందర్యారాధకుడు, మహా రసికుడు, సరసుడు
 3. భోజనప్రియుడు
 4. సర్వ స్వతంత్రుడు, దేవుణ్ణైనా లెక్కచెయ్యని వాడు
 5. విలాసి, జీవితాన్ని విపరీతంగా ప్రేమించి అనుభవించిన వాడు
 6. బాహ్యప్రేరణలకు వెంటనే స్పందించే వాడు
 7. అసౌకర్యాలను భరించలేని వాడు
 8. కులమత విభేదాలు లేనివాడు
 9. సున్నిత మనస్కుడు
 10. గొప్ప చమత్కారి

ఈ పట్టిక చూస్తే శ్రీనాథుడు ఎంతటి “ఆధునికుడో” అర్థమౌతుంది. మనం ఇప్పుడు నిజమైన ఆధునికతకు లక్షణాలుగా పరిగణిస్తున్నవి అన్నీ (సంప్రదాయ వైముఖ్యత, స్వకేంద్రిత దృష్టి, reactions based on unconscious, not self-consciousness, ) వీటిలో ఉన్నాయి. ఏడు వందల ఏళ్ళ క్రితమే ఈ లక్షణాల్ని సంతరించుకున్న ఒక వ్యక్తి ఉండటాన్ని ఊహించిన, అలాటి వ్యక్తిని ఉన్నతుడిగా భావించిన, మన సంస్కృతి ఔన్నత్యం ఏమిటో ఆలోచించండి! ఈ గుణాల్ని ఇప్పుడు ఇంకొంచెం విపులంగా, ఉదాహరణల్తో చూపుతాను.

లోకసంచారం.[మార్చు]

శ్రీనాథుడు సింహాచలం నుండి ద్రవిడ కర్ణాట సీమల వరకు, కృష్ణాతీరపు బొడ్డుపల్లి నుండి శ్రీశైలం వరకు ఉత్తర దక్షిణాలుగా తూర్పుపడమరలుగా తిరిగాడు. మాచర్ల, పల్నాడు, కారెంపూడి, గురజాల లాటి చోట్ల ఉన్నాడు. త్రిలింగాల్ని దర్శించాడు. కొండవీడు, అద్దంకి, మారెళ్ళ, ఇంకా ఎన్నో చిన్నా పెద్దా ప్రదేశాల్లో ఉన్నాడు. వీటికి వేరే ఉదాహరణలు ఇవ్వక్కర్లేదు. ఎన్నో మన నాలుకల మీద నానుతున్న పద్యాలే.

సౌందర్యారాధన.[మార్చు]

శ్రీనాథుడు సౌందర్యం కోసం వెదికాడు. ఎక్కడ కనిపించినా పరవశించి ప్రశంసించాడు. ఈ పద్యం చూడండి -

తాటంకయుగ ధగద్ధగిత కాంతిచ్ఛటల్‌
చెక్కుటద్దములపై జీరువార
నిటలేందు హరి నీల కుటిలకుంతలములు
చిన్నారిమోముపై జిందులాడ
బంధుర మౌక్తిక ప్రకట హారావళుల్‌
గుబ్బపాలిండ్లపై గులిసియాడ
గరకంకణ క్వణ క్వణ నిక్వణంబులు
పలుమారు రాతిపై బరిఢవిల్ల

నోరచూపుల విటచిత్త మూగులాడ
బాహు కుశలత జక్కని మోహనాంగి
పాట బాడుచు కూర్చుండి రోటి మీద
బిండి రుబ్బంగ గన్నులపండు వయ్యె

దీన్లో ఉన్నది అచ్చమైన సౌందర్యానందమే. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆ సౌందర్యాన్ని చూసి కన్నుల పండగయిందట! పిండి రుబ్బటంలో ఇంత సొగసు చూడగలిన కవి మరొకరు మనకు కనిపించరు. ఇప్పుడు మరోటి చూడండి - పూజావేళలో కూడా అందం ఆయన్ను ఆకర్షించక మానదు -

దాయాదుల్వలె గుబ్బచన్ను లొలయన్‌ ధావళ్య నేత్రాంబుజ
చ్ఛాయ ల్తాండవ మాడ గేరి పురుషస్వాంతమ్ముల న్మన్మథుం
డేయం జంగమువారి చంద్రముఖి విశ్వేశార్చనా వేళలన్‌
వాయించెం గిరిగిండ్లు బాహు కుశల వ్యాపార పారీణతన్‌

భోజనప్రీతి.[మార్చు]

పల్నాడు, రేనాడు, గురజాల, కర్ణాటక, ద్రవిడదేశం, మరెన్నో చోట్ల సరైన భోజనం దొరక్కపోవటాన్ని గురించి ఎన్నో విధాలుగా వాపోయాడు శ్రీనాథుడు. చక్కటి కాయగూరల్తో మంచి సుగంధాలు చిమ్మే వరి అన్నం బంగారు పళ్ళెంలో వడ్డిస్తే భోంచెయ్యటం ఆయనకు ఇష్టం. అవి దొరకనప్పుడు ఆయన బాధ ఆ దేవుడికీ తెలియాలి.

ఫుల్ల సరోజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్‌

శ్రీనాధుడు కర్ణాటక సామ్రాజ్యమునకు వెళ్ళినప్పుడు, రాజస్థానమున ప్రవేశము లభించుట కష్టమయ్యెను. కాలహరణమగుచుండెను.ఆ రాజ్యమున సామాన్యునివలె జీవించవలసివచ్చెను. ఆహారము సరిగానున్నచో మిగిలిన వెట్లున్నను సమర్ధించుకొని పోవచ్చును.కాని అదియే సరిగా అమరలేదు.ఎన్ని తిప్పలు మహాకవికి! కర్ణాటకరాజ్యలక్ష్మి నిట్లు ప్రార్ధించినాడు.

కుల్లా యుంచితి గోకచుట్టితి మహా
కూర్పాసముం దొడ్డితిన్
వెల్లులిం దిలపిష్టమున్ మెసవితిన్
విశ్వస్త వడ్డింపగా
సల్లానంబలిద్రావితిన్ రుచులు
దోసంబంచు బోనాడితిం
దల్లీ! కన్నడరాజ్యలక్ష్మీ! దయలేదా!
నేను శ్రీనాధుడన్.

తెలుగునేలపై బండిన కర్పూరపు భోగివంటకము భుజించిన శ్రీనాధుడు కర్ణాటకదేశమున వెల్లుల్లి పాయలను తెలకపిండిని తినవలసివచ్చెనట! ఎంత కష్టము మెంతకష్టము! అంతేకాదు. విధవరాలు వడ్డింపగా అంబలిలో చల్ల కలిపికొని జర్రువలసి వచ్చెనట! అందనిపళ్ళు పులుపు. అందులకే ఇపుడు రుచులు కోరికొనుట దోషమని ఉన్నదే గ్రహించి భుజించవలసివచ్చినది అని వగపోయినాడు. ఇట్టి భోజనము శ్రీనాధునకు గిట్టదు. కాననే పలనాటినిగూర్చి ఇట్లు ఆదరముగా పల్కినాడు "కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్".కర్మకాలి మన్మధుడు పలనాటికి పోయెనా జొన్నకూడుతినక తప్పదన్నమాట! అందుకే రసికుడు పోవడు పల్నాడ అను పల్కినాడు. అచటి భోజనము అతనికి మొత్తినది అందుకు పలు పద్యములు వ్రాసినాడు.

జొన్నకలి జొన్నయంబలి
జొన్నన్నము జొన్నపిసరు జొన్నల్ తప్పన్
సన్నన్నము సున్న సుమీ
సన్నుగ బల్నాటిసీమప్రజలందరకున్

రేనాటిసీమ పలనాటిసీమకు ఏమాత్రము తీసిపోకుండటచూచి, అట మరియొక సవాలును విసిరినాడు. ఈపందెములన్నియు దేవుళ్ళపైనే!

గరళము మింగితి నంచు
బురహర! గర్వింపబోకు పో!పో!పో! నీ
బిరుదింక గానవచ్చెడి
మెరసెడి రేనాటి జొన్న మెదుకులు తినుమీ!

మాతృభూమిని వదలిపోయిన తరువాత ఏభూమియు శ్రీనాధునకు నచ్చలేదు. ఈవంటకములకు ఆభోజనములకు హస్తిమశకాంతరము కదా! "కూడు తలప చోళ్ళు!" "కూర కారామళ్ళు" పోనీ ముప్పూటను అవేతినుదమన్న "కలవు మాపటివేళ గంజినీళ్ళు". ఇట్లు దక్షిణదేశపు భీజనములను పెక్కుపద్యములందు స్మరించినాడు. భోజన పరాక్రమము మాత్రమే కలవారి నిట్లు హేళన చేసినాడు.

గ్రామము చేతనుండి
పరికల్పిత ధాన్యము నింటనుండి
శ్రీరామకటాక్ష వీక్షణ పరంపరచే
గడతేరెగాక మా
రామయమంత్రి భోజన
పరాక్రమేమని చెప్పవచ్చు? నా
స్వామి యెరంగు దత్కబళ చాతురి
తాళఫలప్రమాణమున్

అవసానదశలో శ్రీనాధుడు చెప్పిన చాటువని చెపబడుచున్న సీసముననున్న

స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తిగలదు?

హేమపాత్రలో భుజించిన శ్రీనాధునికిట్టి సిద్ధించుట విషాదకరము.

శ్రీభీమేశ్వరపురాణము ద్వితీయాశ్వాసములో భీజన వర్ణనము విపులముగానున్నది. అందు ప్రతి సూక్ష్మపదార్షములనుస్పష్టముగ చెప్పినాడు.

పప్పును బిండివంటలను
బాయసముల్ ఘృతముల్ గుడంబులుం
గుప్పలుగాగ జుట్టునను గూర్పగ
గూడిన యేరు బ్రాలతె
ల్గప్పుర భోగి వంటకము
గమ్మని తాలిపు సాజ్జెపిండితో
నొప్పులుగా భుజొంచిరి బుధోత్తమ
లాకటి చిచ్చు పెచ్చునన్

మరొకచోట తనకిష్టమైన పదార్చములను వర్ణించినాడు.

ద్రాక్షాపాన ఖండశార్కరలతో
రంభాఫలశ్రేణితో
గోక్షీరంబులతోడ మండెగలతో
గ్రోనేతితో బప్పుతో
నక్ష్యంబగు నేరుబ్రాల కలమాహారంబు
నిశ్శంకతం
గుక్షుల్ నిండగ నారగించితిమి
యక్షుద్రక్షుధాశాంతికిన్

శివరాత్రీమహత్యమున చతుర్ధాశ్వాసములో నున్న పరియొక పద్యము.

కప్పుర భోగివంటకము
కమ్మనిగోధుమపిండి వంటయున్
గుప్పెడు పంచదారయును
గ్రొత్తగ గాచినయాలనే పెస
ర్పప్పును గొమ్మునల్లనటి
పండ్లును నాలుగు నైదునంజులన్
లప్పలతోడ గ్రొంబెరుగు
లక్ష్మణవజ్జలయింట రూకకున్

ఇట్లు భోజనపదార్ధముల ఇంతరమ్యముగ వర్ణించిన మరియొకకవి లేడనుటలో అతిశయోక్తిలేదు! కప్పుర భోగివంటకము, గోధుమపిండివంట, ఆవునేయి, పెసరపప్పు, నంజులు మొదలగునైవి ప్రతిభోజన వర్ణనమునందు చెప్పబడుట గమనార్హము. అవి అతనికి ఇష్టమని అనుకోవచ్చును కూడా?

సర్వస్వతంత్రత.[మార్చు]

శ్రీనాథుడు తను చూసింది చూసినట్లు, తనకు తోచింది తోచినట్లు స్పష్టంగా, సూటిగా చెప్పాడు. తనకు ఇంపుకాని పని జరిగింది ఎవరివల్లనైనా - మామూలు మనిషి కానివ్వండి, రాజాధిరాజు కానివ్వండి, దేవుడే కానివ్వండి - వాళ్ళని కడిగెయ్యటానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇది చూడండి (హెచ్చరిక - దీన్లో బూతు వుంది) -

హంసీయానకు గామికి న్నధమ రోమాళుల్‌ నభఃపుష్పముల్‌
సంసారద్రుమ మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట వి
ద్వాంసుల్‌ రాజమహేంద్ర పట్టణమునన్‌ ధర్మాసనంబుండి ప్ర
ధ్వంసాభావము ప్రాగభావ మనుచున్‌ దర్కింత్రు రాత్రైకమున్‌

దేవతలకే దిక్కులేదు, ఈ రాజమహేంద్ర పుర విద్వాంసులు ఒక లెక్కా?

గొరియల మేకపోతులను గొమ్ముపొటేళ్ళను గాపుగొందు వీ
వరయగ సందెకాడ దగ వత్తునటంచు భవచ్ఛిరంబుపై
గరమిడి పోయినట్టి తిలఘాతుకురాలి తదీయశష్పముల్‌
పెరుకగలేవు నీవు కడు భీకరమూర్తివె కాళికేశ్వరీ

విలాసి[మార్చు]

జీవితాన్ని పరిపుష్టంగా అనుభవించిన వాడు శ్రీనాథుడు. వృద్ధాప్యంలో విధి వక్రించి విపరీత దుర్దశ ప్రాప్తించినా అప్పటివరకు రేపన్నది లేనట్లు అర్థకామాల అంచులు చూసిన వాడు. ఒకసారి తన వేలిగోరు విరిగితే దాన్ని ఉద్దేశించి ఎంత అద్భుతంగా తన జీవనశైలిని వివరించాడో చూడండి -

నీలాలకా జాల ఫాల కస్తూరికా
తిలకంబు నేమిట దిద్దువాడ
నంగనాలింగనా నంగ సంగర ఘర్మ
శీకరం బేమిట జిమ్మువాడ
మత్తేభగామినీ వృత్తస్తనంబుల
నెలవంక లేమిట నిల్పువాడ
భామామణీ కచాభరణ శోభితమైన
పాపట నేమిట బాపువాడ
ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి
కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి
… అహహ
పోయె నా గోరు తన చేతి పోరు మాని

(దీన్లో ఒక పాదభాగం మనకిప్పుడు దొరకటం లేదు.)

చివరిరోజుల్లో తన పూర్వవైభవాన్ని తల్చుకుంటూ చెప్పిన ఈ పద్యం ఒకవంక గుండెల్ని పిండి చేస్తూనే మరోవంక ఆయన ఎలాటి జీవితాన్ని అనుభవించాడో సూచిస్తుంది.

కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయడిచ్చు
రంభ గూడె దెనుంగు రాయ రాహుత్తుండు
కస్తూరి కే రాజు ప్రస్తుతింతు
స్వర్గస్థుడయ్యె విస్సన మంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండె మైలార విభుడేగె
దినవెచ్చ మే రాజు దీర్పగలడు

భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగె
గలియుగంబున నికనుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్‌ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి

సత్వర స్పందన[మార్చు]

చాలా సందర్భాలో మనకు శ్రీనాథుడి అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి కవులూ గాయకులకన్నా వేశ్యలే మేలంటున్నాడు -

కవితల్‌ సెప్పిన బాడ నేర్చిన వృథా కష్టంబె యీ బోగపుం
జవరాండ్రే కద భాగ్యశాలినులు పుంస్త్వం బేల పో పోచకా
సవరంగా సొగసిచ్చి మేల్‌ యువతి వేషం బిచ్చి పుట్టింతువే
నెవరున్‌ మెచ్చి ధనంబు లిచ్చెదరు గాదే పాపపుం దైవమా

రసికులు కాని రాజుల్ని మెత్తగా, పొగడ్త అనిపించే విధంగా మందలించటానికి ఏమాత్రం వెనకాడడు -

జననాథోత్తమ దేవరాయ నృపతీ చక్రేశ శ్రీ వత్సలాం
ఛన సంకాశ మహా ప్రభావ హరి రక్షాదక్ష నా బోటికిన్‌
గునృప స్తోత్ర సముద్భవంబయిన వాగ్దోషంబు శాంతంబుగా
గనకస్నానము చేసి గాక పొగడంగా శక్యమే దేవరన్‌

ఇదో అద్భుతమైన పద్యం. ఈ దేవరాయలు ఎవరో నాకు తెలియదు గాని శ్రీనాథుడికి బాగానే తిక్కరేపి నట్టున్నాడు. తొలిరెండు పాదాల్లోను అతన్నెంతగానో పొగిడినట్లనిపిస్తూ ఆ తర్వాత అసలు విషయం బయటపెడుతున్నాడు - నీలాటి కునృపుల్ని పొగిడీ పొగిడీ నాకు వాగ్దోషం వచ్చినట్టుంది, అది కనకస్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప పోయేది కాదు, అని!

అసౌకర్యాలంటే అసహనం[మార్చు]

భోజన, నిద్రా, మైథునాల్లో ఎలాటి లోపం కలిగినా భరించలేడాయన. వీటిలో భోజనం గురించి ముందే చెప్పుకున్నాం. ఇవి చూడండి -

గొంగడి మేలు పచ్చడము కుంపటి నల్లులు కుక్కిమంచమున్‌
జెంగట వాయుతైలము లజీర్ణపు మందులు నుల్లిపాయలున్‌
ముంగిట వంటకట్టియల మోపులు దోమలు చీముపోతులున్‌
రంగ వివేకి కీ మసర రాజ్యము కాపుర మెంత రోతయో

అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే
దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె
న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్‌

తేలాకాయెను బోనము
పాలాయెను మంచినీళ్ళు పడియుండుటకున్‌
నేలా కరవాయె నిసీ
కాలిన గురిజాల నిష్ట కామేశ శివా

కులమతాతీతుడు[మార్చు]

ఆయన అందం ఎక్కడున్నా హర్షించాడు, కుత్సితం ఎక్కడున్నా గర్హించాడు. ఇంత విశాల దృక్పథం మరో పూర్వకవిలో కనిపించదు. ఈయన కంటికి నచ్చిన స్త్రీలు అన్ని వర్గాల వారూను - వ్యాపారి, నంబి, కమ్మ, రెడ్డి, జంగము, కాపు, శబర, ద్రావిడ, బలిజ, గానుల, వాసర, విప్ర, క్షత్రియ, శూద్ర, నియోగి, కర్ణాట, కాసల్నాటి, వైష్ణవ, సాతాని, అగసాలె, వడ్డెర, కుమ్మరి, చాకలి, ముస్లిం, ఇలా ఎందరెందరో. వీళ్ళలో ఎవరినీ ఎక్కువగానూ మరెవర్నీ తక్కువగానూ చూడడు. ఆయన దృష్టిలో సౌందర్యమే ప్రధానం, మిగిలినవన్నీ అనవసర విషయాలు. ఉదాహరణకు ఈ పద్యాలు చూడండి -

గిట గిట నగు నెన్నడుములు
పుట పుట నగు గన్నుగవలు పున్నమి నెలతో
జిట పొట లాడెడు మొగములు
కటి తటముల కొమరు శబరకాంతల కమరున్‌

నిబ్బరపు గలికిచూపులు
జబ్బించుకలేని పిరుదు సన్నపు నడుమున్‌
మబ్బు కురు లుబ్బు కుచములు
బిబ్బీలకు గాక కలవె పృథివీస్థలిపై

బంగరులింగమూర్తి చనుబంతుల మధ్య నటింపుచుండగా
జెంగులుజార మేల్వలువ చీరయు వీడ మదీప్సితంబు లు
ప్పొంగగ వామహస్తమున బొల్పగు నీవిని బట్టి వేడ్కతో
జంగున గోడదాటు నగసాలె శిరోమణి జూచితే సఖా

సున్నితమసస్కుడు[మార్చు]

సౌందర్యారాధనే కాదు, స్త్రీల మనస్సుల్ని చదవగలిగిన వాడు శ్రీనాథుడు. ఈ ప్రేమలేఖను చూడండి - ఆయన నిర్మల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.

శ్రీమదసత్య మధ్యకును జిన్ని వయారికి ముద్దులాడికిన్‌
సామజయానకున్‌ మిగుల జక్కని యింతికి మేలు గావలెన్‌
మేమిట క్షేమ మీవరకు మీ శుభవార్తలు వ్రాసి పంపుమీ
నా మది నీదు మోహము క్షణంబును దీరదు స్నేహబాంధవీ

అలాగే దుర్దశలో వున్న వారిని చూసి ప్రతిస్పందిస్తాడు కూడా -

వీసపు ముక్కునత్తు నరవీసపు మంగళసూత్ర మెంతయున్‌
గాసుకురాని కమ్మ లరకాసును కానివి పచ్చపూసలున్‌
మాసినచీర గట్టి యవమాన మెసంగగ నేడు రాగ నా
కాసలనాటి వారి కనకాంగిని జూచితి నీళ్ళరేవునన్‌

ఈ పద్యంలో వున్నావిడ దుస్థితిని హేళనగానో చులకనగానో చెప్పవచ్చు కాని అధికాదు ఆయన దృష్టి. వస్త్రాభరణాల్లో పేదరికం పొంగిపారుతున్నా ఆయన దృష్టిలో ఆమె కనకాంగి! సార్వభౌముల సత్కారాలు పొందుతూ భోగభాగ్యాలు చవిచూసిన వ్యక్తి నుంచి పేదరికం పట్ల ఇలాటి స్పందన అపూర్వం, అనితరసాధ్యం. అందులోనూ, అప్పటి సమాజంలో!

చమత్కారి[మార్చు]

రావు సింగన గురించి శ్రీనాథుడు చెప్పిన పద్యం -

సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావు సింగ జనపాలునకే
యుర్విం జెల్లును దక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే

అనేది ఆయన అతని సముఖంలో చెప్పాడని, ఆ తర్వాత మిత్రులు “అదేమిటీ, అతన్ని అంతగా పొగిడేశావు?” అనడిగితే, “అబ్బే, నేనెక్కడ పొగిడాను? నేను అన్నది ఏమిటంటే, “సర్వజ్ఞ నామధేయము శర్వునకే; రావు సింగ జనపాలునకి - ఏ యుర్విం జెల్లును? తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే” అంటూ అతను కుక్క అనే ధ్వనిని స్ఫురింపజేశాను” అన్నాడనీ మనకో కథ వినిపిస్తున్నది. ఇలాటిదే మరొకటి, ఇంకొంచెం లోతైనది ఇది -

దీనారటంకాల తీర్థమాడించితి
దక్షిణాధీశు ముత్యాలశాల
వాక్కుతోడై తాంధ్రభాషా మహాకావ్య
నైషథగ్రంథ సందర్భమునను
పగలగొట్టించి తుద్భట వివాదప్రౌఢి
గౌడ డిండిమబట్టు కంచుఢక్క
చంద్రభూషక్రియాశక్తి రాయల యొద్ద
పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు

నెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావు సింగన భూపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సరస సద్గుణ నికురంబ శారదాంబ

ఇది కూడ ఆ రావు సింగన గురించినదే! సీస పాదాలు అన్నీ అయేవరకు ఒక దారిన వెళ్ళిన పద్యం తేటగీతి మొదలుకావటంతో ఒక వింత మలుపు తిరుగుతుంది. సీస పాదాలన్నీ తనకు కలిగిన కఠినమైన పరీక్షల్ని వివరించి వాటిలో తను ఎలా విజయాన్ని సాధించాడో చెప్పాయి. నిజానికి అలాటి వాడికి ఈ రావు సింగనని మెప్పించటం ఓ లెక్క కాదు. అందువల్ల ఇక్కడ జరుగుతున్నది అతన్ని హేళన చెయ్యటం. అతన్ని “ధీవిశాలు”డని పిలవటం కూడ దాన్లో భాగమే. పైకి పొగడ్తగా కనిపిస్తూ లోపల అవహేళన నిండిన ఈ పద్యం ఆలోచనామృతం! ఇలాటిదే పైన చూసిన “కనకస్నానం” పద్యం కూడ. ఈ కింది పద్యం కూడా మొదటి మూడు పాదాల్లో మనల్ని మభ్యపెట్టి చివరకు హఠాత్తుగా ఒక అద్భుతమైన మలుపు తిరిగి ఔరా అనిపిస్తుంది, గిలిగింతలు పెడుతుంది. దీన్లోని అనుపమ శిల్పం ఆలోచనామృతమే. రెండోపాదం సగంలోంచి ఎలా ఒకే సమాసంతో ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తూ తనతో పాటు మనల్నీ లాక్కెళ్తూ నిజానికి పద్యంలో ఏం జరుగుతుందో కూడా తెలియనివ్వనంత వేగంగా తన గమ్యస్థానానికి తీసుకెళ్ళి మనం ఎక్కడికి చేరామో తెలుసుకునే లోగానే పద్యం ముగిసిపోతుంది! ఐతే, ఇది “ఎక్స్‌-రేటెడ్‌” పద్యం అని హెచ్చరిక!

శ్రుతి శాస్త్ర స్మృతు లభ్యసించుకొని విప్రుండంత నానాధ్వర
వ్రతుడై పోయి కనున్‌ బురందర పురారామ ద్రుమానల్ప క
ల్పతరు ప్రాంత లతా కుడుంగ సుఖ సుప్త ప్రాప్త రంభా భగ
ప్రతి రోమాంకుర పాటన క్రమ కళా పాండిత్య శౌండీర్యమున్‌

పద్యశిల్పం ఏమిటో సోదాహరణంగా చూపే పద్యం ఇది. అసలు విషయం ఎంతవరకు దాచటానికి వీలౌతుందో అంతవరకూ దాచి అప్పుడు కూడా ఒక దీర్ఘ సమాసంలో దాన్ని కలిపేసి మనతో దోబూచులాడతాడు. మిరుమిట్లు గొల్పే పద్యం ఇది.

ఉపసంహారం[మార్చు]

శ్రీనాథుడు తన గ్రంథాలతో ఎంతగా లబ్ధప్రతిష్ఠుడయాడో చాటువుల ద్వారా కూడా అంతే. ఐతే శ్రీనాథుడివిగా చెప్పబడేవన్నీ ఆయన చెప్పినవేనా అనేది ఎవరూ తేల్చలేని విషయం. కాని, రసవేత్తలైన పాఠకుల దృష్టిలో శ్రీనాథుడి వ్యక్తిగత జీవనచిత్రణని చూపిస్తాయివి. ఈ చాటుపద్యాలలో కనిపించే శ్రీనాథుడు ఎంతో ఆధునిక భావాలున్నవాడు. ఈ కాలపు సమాజంలో హాయిగా ఇమిడిపోగలవాడు. ఆనాటి సమాజానికి ఆయన జీవనశైలి మింగుడుపడనిదై ఉండాలి. అందుకే అంతటి మహానుభావుడూ చివరిదశలో ఎన్నో ఇక్కట్లకు గురయ్యాడు. ఎవరూ ఆయన్ని ఆదుకోవటానికి రాలేదంటే తన బంధుమిత్రులకు ఎంత దూరమయాడో తెలుస్తుంది. సర్వస్వతంత్రుడిగా, నిరంకుశుడిగా జీవితాన్ని తన మనసుకు నచ్చిన రీతిలో సాగించిన శ్రీనాథుడి మూలంగా మనకు మిగిలిన సంపదలో ముఖ్యభాగం ఈ చాటువులు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

 1. Rao & Shulman, Srinatha 2012.
 2. Lal, Mohan (2006). The Encyclopaedia Of Indian Literature: Sasay To Zorgot.
 3. Gazetteer of the Nellore District: Brought Upto 1938 By Government Of Madras Staff, Government of Madras - 1942.
 4. The Andhras through the ages by Kandavalli Balendu Sekaram, Sri Saraswati Book Depot, 1973.
 5. Somasekhara Sarma, Mallampalli (1946), History of the Reddi Kingdoms (Circa. 1325 A.D., to circa. 144B A.D.), Waltair: Andhra University
 6. శ్రీనాథుడు. ఆంధ్ర నైషధ సారము.[dead link]