సికింద్రాబాద్

వికీపీడియా నుండి
(సికిందరాబాదు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సికింద్రాబాద్‌, తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు జంట నగరంగా ప్రసిద్ధి పొందింది.

  ?సికింద్రాబాద్‌
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°27′N 78°30′E / 17.45°N 78.5°E / 17.45; 78.5Coordinates: 17°27′N 78°30′E / 17.45°N 78.5°E / 17.45; 78.5
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 543 మీ (1,781 అడుగులు)
జనాభా 204,182 (2001 నాటికి)
కోడులు
వాహనం

TS-10

హుస్సేన్ సాగర్ జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, కరకట్ట ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వ్యత్యాసం ఉంది.

చరిత్ర[మార్చు]

సికింద్రాబాదు రైల్వేస్టేషన్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న రైలు

బ్రిటిష్ వారు మూడవ నిజాం అయిన సికిందర్ జా పరిపాలన కాలంలో హైదరాబాదులో కంటోన్ మెంట్ ప్రాంతాన్ని స్థాపించారు.ఇతని జ్ఞాపకార్ధం దీనికి "సికింద్రాబాదు" అని పేరుపెట్టారు.1820లో ఒకసారి 1830లో మరోసారి తన కాశీయాత్రల్లో భాగంగా సికింద్రాబాదు ప్రాంతాన్ని సందర్శించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని సందర్శించి తన కాశీయాత్రచరిత్రలో నాటి విశేషాలు వ్రాశారు.1830లో రెండవసారి వచ్చినప్పుడు రాసిన కాశీ యాత్రాచరిత్రలో తాను మొదటిసారి పదేళ్ళక్రితం వచ్చిననాటికన్నా కుంఫిణీ లష్కర్ (ఈస్టిండియా కంపెనీ కంటోన్మెంట్) బాగా విస్తరించడాన్ని చూసి ఆశ్చర్యం చెందారు. హైదరాబాద్ నగరం కన్నా లష్కరు పెద్దగా ఎదుగుతోందని తన అభిప్రాయం వ్రాశారు. హైదరాబాద్ నగరంలో న్యాయవిచారణ సరిగా లేకుండడంతో సక్రమమైన న్యాయవిచారణ, సరియైన భద్రత కోసం పలువురు వ్యాపారస్తులు తమ నివాసాలు దండు ప్రాంతం (సికిందరాబాద్) కే మార్చుకుంటున్నారని ఆయన రాశారు.[1].సికింద్రాబాదుని 1948 వరకు బ్రిటీషువారు పాలించగా,హైదరాబాదులో నిజాం రాజుల పాలన ఉండేది.తొలుత ఓ ప్రత్యేక కార్పొరేషన్‌గా ఆవిర్భవించి ఆపై హైదరాబాద్‌లో అంతర్భాగంగా మారింది.1950లో ప్రత్యేకంగా రూపొందించిన చట్టం మేరకు సికింద్రాబాద్‌ నగర పాలక సంస్థ (మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌) అనే స్థానిక పురపాలక సంస్థ ఏర్పాటైంది.కార్పొరేషన్‌గానే సికింద్రాబాద్‌ నగర పాలక సంస్థ తన కార్యకలాపాల్ని నిర్వర్తించేది.28 మంది ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లుగా వ్యవహరించే వారు.1960 ఆగస్టు మూడో తేదీన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌ కార్పొరేషన్‌ను హైదరాబాద్‌ నగర పాలక సంస్థలో విలీనం చేసింది.అయితే, సికింద్రాబాద్‌ ప్రాంతవాసులకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వ ప్రముఖులు సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లలో ఒకరు తప్పనిసరిగా ఎం.సి.హెచ్‌.కు డిప్యూటీగా వ్యవహరించే పద్ధతిని ప్రారంభించారు.అనంతరం హైదరాబాద్‌ ప్రాంతానికి చెందినవారు మేయర్‌గా ఎన్నికయ్యే పక్షంలో సికింద్రాబాద్‌కు చెందిన కార్పొరేటర్‌ను డిప్యూటీ మేయర్‌గా, సికింద్రాబాద్‌కు చెందిన ప్రతినిధి మేయర్‌గా ఎన్నికయ్యే పక్షంలో హైదరాబాద్‌కు చెందిన కార్పొరేటర్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యేలా ఏర్పాట్లు చేశారు.గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆవిర్భవించే వరకూ ఎం.సి.హెచ్‌. పరిధిలో కొనసాగిన ఏడు సర్కిళ్లలోసికింద్రాబాద్‌ సర్కిల్‌ను డివిజన్‌గా పరిగణించారు. సికింద్రాబాద్‌ అదనపు కమిషనర్‌ హోదాను కూడా పెంచి, ఐ.ఏ.ఎస్‌. అధికారి ఈ పోస్టులో కొనసాగేలా తీర్చిదిద్దారు.2007లో హైదరాబాద్‌ను గ్రేటర్‌గా రూపొందించిన వెంటనే నగరంలోని అన్ని సర్కిళ్ల సరసనే సికింద్రాబాద్‌ సర్కిల్‌ను చేర్చి దాని ప్రత్యేకాధికారాలు, స్వయం ప్రతిపత్తిని పూర్తిగా తొలగించారు.

సికిందరాబాద్ లో సైదానిమా సాహెబా మసీదు. స్వంతకృతి

హైదరాబాద్, సికింద్రాబాద్[మార్చు]

సెయింట్ మేరీస్ చర్చి
సికిందరాబాద్ లో క్లాక్ టవర్ . స్వంత కౄతి

1806 వ సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందంలో భాగంగా హుస్సేన్ సాగర్ అవతల వెలసిన ఆంగ్లేయుల స్థావరం నిజాం పాలకుడు సికిందర్ జాహ్ ఉత్తర్వులతో సికింద్రాబాద్ గా ఆవిర్బవించింది. జంట నగరాల మధ్య అనేక తేడాలు గానవస్తాయి. సికిందరాబాదులో సాంఘిక సంస్కరణలు ఆంగ్లేయుల ఆచారాలకు అనుగుణంగా జరిగాయి. సంస్కర్తలకు పూర్తి మద్దతు లభించింది. హైదరాబాద్ ఇందుకు బిన్నం, నిజాము సర్కారు ఆచారాలకు అనుగుణం. సంస్కరణలు మార్పులు జరుగలేదు. మగ్దూం మొహియుద్దీన్ ప్రారంభించిన ఉద్యమం తప్ప చెప్పుకోదగ్గ ఉద్యమమే లేదు. నిజాం నిరంకుశ ధోరణి వల్ల హైదరాబాదు వెనుకబడింది. బ్రిటిష్ వారిది పార్లమెంటరీ వ్వవస్థ. స్వార్థం వున్నా ఉదారవాదులుగా చెలామణి. ఈ తేడా జన జీవనంలో చాల స్పష్టంగా కనబడేది. 1806 ఏర్పడిన సికింద్రాబాదు 1946 వ సంవత్సరంలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం నిజాంకు ఆప్పగించే వరకు సికింద్రాబాద్ ఆంగ్లేయుల పాలన క్రిందే వుండేది. అందుకే హైదరాబాద్ లో ఉర్దూ రాజ్యం చేస్తున్నా సికింద్రాబాద్లో తెలుగు కళ కళ లాడింది. కవులు, రచయితలు, సంస్కర్తలు, సికింద్రాబాద్ వాసులే. హైదరాబాదులో ఉర్దూకవులు రాజ్యమేలారు. అప్పట్లో సికింద్రాబాద్ అంటే ఎంజి రోడ్, ఆర్పీ రోడ్, ఎస్ డి రోడ్, సెకెండ్ బజార్, రెజిమెంటల్ బజార్, ప్రాంతాలే. ఏ హడాహుడి లేదు, కాలుష్యం లేదు చక్కని చల్లనిగాలి, ఎక్కడికైన నడిచే వెళ్లి వచ్చేంత దూరం మాత్రమే. హైదరాబాద్ లో మతకల్లోలాలు జరిగినా సికింద్రాబాదులో ప్రశాంతత ఒక ప్రత్యేకత. కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1860లో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సికింద్రాబాద్ క్లాక్‌ టవర్ 1897, ఫిబ్రవరి 1న ప్రారంభించబడింది.[2] ఇక్కడికి సమీపంలో అమీన్ మంజిల్ అనే రాజభవనం ఉంది.

భాష సంస్కృతి[మార్చు]

సికిందరాబాద్ లో సైదానిమా సాహెబా మసీదు ముందు బోర్డు.
సికిందరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో పేరొందిన ఆల్ఫా హోటల్

హైదరాబాద్లో తెలుగు తక్కువే. తెలుగు మాట, తెలుగు అచ్చు, తెలుగు సినిమా, తెలుగు నాటకం, తెలుగు సభ ఇలాంటివీ తక్కువే. ఒకసారి ఇలా అనిపిస్తుంది "హైదరాబాద్ అంటే ఉర్దూ - సికింద్రాబాద్ అంటే తెలుగు". మహబూబ్ కాలేజి, బురుగు మహదే హాలు వంటివి అలాంటి సాంస్కృతి కార్యక్రమాలకు నెలవు. వివేకానందుడు వచ్చినా, కృష్ణమీనన్ వచ్చినా ఇంకెవరు వచ్చినా వారి సభలు ఇక్కడే జరిగేవి. 1959 లో జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ వచ్చాడు. ప్రదానికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. హైదరాబాద్ మేయరు, సికింద్రాబాద్ మేయరు ఇద్దరు హాజరయ్యారు. ఇద్దరూ పూల దండలేశారు. నెహ్రూకు ఒక సందేహం: "ఒన్ సిటి, టూ మేయర్స్?" అని ప్రశ్నించారు. సమాధానం చెప్పే దైర్యం ఎవరికుంటుంది? రెండు వేరు వేరు నగరాలు, వెరు వేరు సంస్క్రుతులు, వేరు వేరు జీవన విధానాలు.1946వ సంవత్సరంలో ఆంగ్లేయులు సికింద్రాబాద్ ను నిజాము అప్పగించారు. ఈ విభిన్న హృదయాలు ఒక్కటయాయి. సికింద్రాబాద్ హైదరాబాద్ లో భాగం అయి పోయింది. సికింద్రాబాద్ ప్రజలు దీన్ని జీర్ణించు కో లేక పోయారు. వ్వతిరేకించారు. ఉద్యమాలు చేశారు. అయినా ఫలితం లేదు. రెండు నగరాలు ఒక్కటయ్యి జంట నగరాలుగా మారాయి. అయినా సికింద్రాబాద్ తన ప్రత్యేకతను అనాటి నుండి చాటు కుంటూనే ఉంది. సికింద్రాబాద్ అభివృద్ధికి కృషి చేసిన ముదలియార్లకు, సదా ఋణ పడి వుంటుంది. ప్రుడెన్షియల్ బాంకు, కీస్ ఉన్నత పాఠశాల, దక్కన్ క్రానికల్ లాంటివి వారిచ్చిన కానుకలే. క్రైస్తవ మిషనరీల సేవలు కూడా కానవస్తాయి. బడులు, ఆసుపత్రులు రెడ్ క్రాస్ లను వారే నడిపారు. రాను రాను తెలుగు విద్యావేత్తలు, వైద్యులు తమ సేవలను విస్తరించారు. విస్తరణలో ఆనాటికి ఈనాటికి పోలికే లేదు.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

ఇతర వివరాలు[మార్చు]

  • సికింద్రాబాదులోని సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిని 2022 జూన్ 25న రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే జి. సాయన్న, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బేవరేజేస్ చైర్మన్ గజ్జెల నరేశ్‌, కార్పోరేటర్లు దీపిక, కొలన్ లక్ష్మి, మహేశ్వరి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఈ అనిల్ రాజ్, డీసీ ముకుంద రెడ్డి, ఈ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జికి రెండువైపులా లిఫ్ట్‌, ఎస్కలేటర్‌, ఎనిమిది సీసీకెమెరాలను అమర్చారు. వృద్ధులు, చిన్నారులు సులువుగా ఎక్కి రోడ్డు దాటేలా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించబడింది.[3]
  • సికింద్రాబాదు ప్రాంత ప్రజల తాగునీటి కోసం అసఫ్‌-జాహీ వంశస్తులు ఆరు అంతస్తుల లోతు, మెట్లు, స్తంభాలతో అద్భుతంగా నిర్మించిన బన్సీలాల్‌పేట మెట్లబావిని పునరుద్ధరణ చేసి 2022 డిసెంబరు 5న తెలంగాణ రాష్ట్ర మంత్రులు కెటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, హైదరాబాదు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కలిసి ప్రారంభించారు.[4]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు.
  2. క్లాక్‌ టవర్లు (సికింద్రాబాద్ క్లాక్‌ టవర్), ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 17
  3. telugu, NT News (2022-06-25). "అన్నిరంగాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి : మంత్రి తలసాని". Namasthe Telangana. Archived from the original on 2022-06-25. Retrieved 2022-06-28.
  4. telugu, NT News (2022-12-06). "చరిత్రకు సాక్ష్యం బన్సీలాల్‌పేట మెట్లబావి". www.ntnews.com. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-09.

బయటి లింకులు[మార్చు]

  • (ఈనాడు: ఆదివారం: 4 జూన్ 2006)