అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format

కీసర (కీసర మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కీసర, కీసరగుట్ట లేదా కేసరిగిరి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలానికి చెందిన గ్రామం.[1]

కీసర
—  మండలం  —
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, కీసర స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, కీసర స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, కీసర స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ జిల్లా
మండల కేంద్రం కీసర
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,77,288
 - పురుషులు 90,006
 - స్త్రీలు 87,282
అక్షరాస్యత (2011)
 - మొత్తం 77.52%
 - పురుషులు 84.20%
 - స్త్రీలు 70.27%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరంలో ఉంది.కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివాలయానికి ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయాన్ని దర్శించుటకు రాష్ట్రం నలుమూలలనుండి భక్తులు విచ్చేస్తారు.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2318 ఇళ్లతో, 10087 జనాభాతో 2918 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5152, ఆడవారి సంఖ్య 4935. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1442 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 240. గ్రామం జనగణన లొకేషన్ కోడ్ 574142[2]

శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం

[మార్చు]

స్థలపురాణము

[మార్చు]

త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతులతో వనవిహారమునకై వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతములోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్ఠాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు.

అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీ క్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకొని రావలసినదని ఆజ్ఞాపిస్తారు. ఆంజనేయుడు ఆకాశమార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా, ఈశ్వరుడు నూటొక్క శివలింగముల రూపములో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి నూటొక్క శివలింగములను తీసుకొని బయలుదేరాడు.

ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడి పరమేశ్వరుని ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీసీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి "శ్రీరామలింగేశ్వరస్వామి" అని పేరు వచ్చింది.

తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి, అప్పటికే ప్రతిష్ఠ జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేసెను. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడా పడినవి. హనుమంతుని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం అతని పేరుమీద 'కేసరి గిరి'గా ప్రసిద్ధిచెందుతుందని ఆశీర్వదించెను. హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని స్వామివారి వామభాగములో ప్రతిష్ఠించాడు. అదే మారుతీ కాశీ విశ్వేశ్వరాలయము.కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రం కీసరగుట్ట'గా రూపాంతరం చెందింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా ఉండుట విశేషం.

చరిత్ర

[మార్చు]

చారిత్రక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం సా.శ. 4వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి 7వ శతాబ్దం పూర్వార్థం వరకు ఆంధ్రదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించిన విష్ణుకుండిన రాజవంశమునకు కీసరగుట్టతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అతని రాజముద్రిక లంఘించు సింహం (కేసరి).

ఈ ప్రదేశంలో రాజ వంశానికి చెందిన రెండవ మాధవ వర్మ 11 అశ్వమేధ యాగాలు,ఇంకా 1000 ఇతర యాగాలు నిర్వహించి నర్మదా తీరం వరకు తన రాజ్యాన్ని విస్తరించిన గొప్ప రాజు.

విష్ణుకుండినులు మొదట ఇంద్రపురిని (నేటి నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం) రాజధానిగా చేసుకొని ప్రజారంజకంగా పరిపాలన చేశారు. కీసరగుట్ట ప్రాంతం వారి సైనిక స్థావరం. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖవారి త్రవ్వకపు పరిశోధనలలో 3 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక శిథిలమైన కోట, భవనాలు, ఆభరణాలు, అలంకార వస్తువులు, నాణెములు, మట్టి పాత్రలు, యజ్ఞ కుండాలు వెలుగుచూశాయి. ఈ వంశంలోని మొదటి గోవింద వర్మ బలపరాక్రమ సంపన్నుడై అనేక రాజ్యాలను జయించి బౌద్ధారామ విహారాలను, చైత్యములను, దేవాలయములను నిర్మించి ప్రసిద్ధిచెందినట్లుగా ఇంద్రపురి (ఇంద్రపాల నగరం) లో లభించిన తామ్రశాసనం ద్వారా తెలుస్తోంది. విష్ణుకుండినులు తెలుగుబాషను అధికార భాషగా మొట్టమొదట గుర్తించినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తున్నది.[3]

ఈ వంశీయులు అపురూపమైన దేవాలయాలను, గుహాలయాలను నిర్మించారు. నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర ఆలయం, తుమ్మలగూడెం లోని రామేశ్వర, అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ (ఫరూఖ్‌నగర్) సమీపంలోని ఉత్తరరాజ రామలింగేశ్వరాలయం, కందూరు రామలింగేశ్వరాలయం, గుంటూరు జిల్లా వేల్పూరు రామలింగేశ్వరాలయం వీటిలో కొన్ని దేవాలయాలు.

సా.శ. 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంశంలోని అబ్దుల్ హసన్ తానీషా నవాబు వద్ద మహా మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు కేసరిగిరి శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించి, ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రముగా అభివృద్ధి చేయదలచి హిందూ మహమ్మదీయ సమ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక దేవాలయాన్ని నిర్మించారు. దానిలో శ్రీ లక్ష్మీనృశింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయస్థూపం ఉంది. ఈ స్తంభంపై మత్స్య, కూర్మ, వరాహ, గణపతి, ఆంజనేయ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి.కీసరగుట్టలో ఉన్న పురాతన విగ్రహలు ఉన్నాయి.

స్థలపురాణం

[మార్చు]

శ్రీ రాముడు రావణ వధ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించాడు, రావణ వధ తర్వాత బ్రహ్మ హత్యా పాతకం తొలగి పోవడానికి ఇక్కడ శివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకున్నారు, హనుమంతున్నీ వారణాసికి వెళ్లి శివ లింగాన్ని తీసుకురమ్మని పంపించాడు, అయితే హనుమంతుడు ఆలస్యం చెయ్యడంతో రాముడు శివున్ని ప్రార్ధిస్తాడు, అప్పుడు ప్రత్యక్షం ఐన శివుడు లింగరూపంలో ఇక్కడ వెలిసాడు, ఇక్కడ వెలిసిన లింగం స్వయంభు: లింగం, ఆ లింగాన్ని రాముడు పూజించాడు, ఆలస్యంగా చేరుకున్న ఆంజనేయుడు రాముడు వేరే లింగాన్ని ప్రతిష్ఠించడంతో తాను వెంట తెచ్చిన 101 లింగాలని ఆ ప్రాంతంలో విసిరి పారేసాడు, అందుకే ఈ గుట్టపై అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. కేసరి సుతుడైన ఆంజనేయుడి పేరు మీదిగా కేసరి గుట్ట అనే పేరు వచ్చింది, కేసరి గుట్టె నేడు కీసర గుట్టగా పిలవబడుతుంది.

ఇక్కడ ఆలయంలో కొలువైన స్వామిని రాముడు ప్రతిష్ఠించాడు కావున రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు, భవాన్ని అమ్మవారు, శివ దుర్గా అమ్మవార్లు ఇక్కడ కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు, ఈ దేవాలయంలో లక్ష్మి నరసింహ స్వామి, శ్రీ సీతారాముల ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి. శివ రాత్రి రోజు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలలో వేలాదిగా భక్తజనం పాల్గొంటారు.

ఈ గుట్ట కింది భాగంలో ఆశ్రమాలు, యోగ కేంద్రాలను ఏర్పాటు చేసారు, ప్రశాంత మైన వాతావరణంతో పాటు కొండ సువిశాలంగా ఉండటం, కాలుష్యానికి దూరంగా ఉండడం మూలంగా గుట్టపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు, ఇది ఆధ్యాత్మిక కేంద్రం గానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతం కూడా, ఇక్కడ ఉన్న సహజ అందాలకు తోడు దేవాలయ శాఖ వారు మరిన్ని సోగబులను తీర్చిదిద్దారు. గుట్టపైన పర్యాటకులను ఆకర్షించడానికి భారి ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటుచేసారు, వానాకాలంలో లేదా చలికాలంలో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కొండపైన విశాలమైన కాలి స్థలం ఉండడం వల్ల దీనిని విస్తరించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి.

ఉత్సవాలు

[మార్చు]

బ్రహ్మోత్సవాలు

[మార్చు]
  • మాఘ బహుళ త్రయోదశి మొదలు ఫాల్గుణ శుద్ధ విదియ వరకు మహాశివరాత్రి పర్వదినాన ఐదు రోజులు పరమశివునికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
  • ఇక్కడ ప్రతిరోజు అభిషేకాలు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి.

ప్రత్యేక మాసోత్సవాలు

[మార్చు]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 4 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, 4 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. గ్రామంలో 2 ప్రైవేటు మేనేజిమెంటు కళాశాలలు ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కాప్రాలోను, ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, పాలీటెక్నిక్ హైదరాబాదులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదులో ఉన్నాయి.

  • వేద సంస్కృత పాఠశాల: దీనిని తిరుమల తిరుపతి దేవస్థానములు 1981 సంవత్సరము నుండి నిర్వహించుచున్నది. ఇక్కడ గురుకుల పద్ధతిలో కృష్ణ యజుర్వేదము, సంస్కృత శాస్త్రములు బోధింపబడుచున్నవి.
  • గురుకుల విద్యాలయము: ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల సంస్థ 1972 సంవత్సరంలో ఒక సంస్థను ప్రారంభించి, 1980 లో డా. మర్రి చెన్నారెడ్డి గారు పాఠశాలకు శంకుస్థాపన చేశారు.

వసతులు

[మార్చు]

తిరుమల... తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన 26 గదుల ధర్మశాల ఉంది. ఆలయ కార్యాలయంలో సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ వారు నిర్మించిన హరిత హోటల్ ఉంది. ఇందులో భోజనం, వసతి సదుపాయం ఉంది. జిల్లా పరిషత్ వారు, ఆర్ అండ్ బి వారు నిర్మించిన గదులు కూడా ఉన్నాయి. ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రం ఉంది. బ్రాహ్మణులకు నిత్యాన్నదాన పథకం ఉంది.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కీసరలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కీసర (రంగారెడ్డి జిల్లా)లో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ఈక్షేత్రం జంట నగరాలకు అతి సమీపంలో ఉంది. జంట నగరాలలోని సికింద్రాబాద్, ఇ.సి.ఐ.ఎల్., అఫ్జల్ గంజ్ నుండి బస్సులు వెంట, వెంటనే ఉన్నాయి. ప్రవేటు వాహనాలు కూడా ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. ఆటో సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 5 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కీసర (రంగారెడ్డి జిల్లా)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 190 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 981 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 956 హెక్టార్లు
  • బంజరు భూమి: 635 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 156 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1579 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 167 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కీసర (రంగారెడ్డి జిల్లా)లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 167 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కీసర (రంగారెడ్డి జిల్లా)లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

దర్శనీయ ప్రదేశాలు

[మార్చు]
  • శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రధాన దేవాలయము
  • భవానీ, విఘ్నేశ్వర విగ్రహములు
  • స్వామి పుష్కరిణి
  • విజయ స్తంభము, నంది స్తంభములు
  • అక్కన్న, మాదన్నల లక్ష్మీ నృసింహస్వామి దేవాలయము
  • ఆళ్వారుల విగ్రహములు
  • ఆంజనేయస్వామి దేవాలయము
  • సీతమ్మవారి దేవతాస్థానము
  • శైవ విఘ్నేశ్వరాలయము
  • సీతాసరోవరము, తామరకొలను
  • క్షేత్రపాలక, భైరవ విగ్రహములు
  • సన్యాసి మఠము
  • 101 శివలింగములు
  • కాశీబుగ్గ వద్దనున్న గుహ
  • శ్రీరాములవారి పాదములు
  • నందిసేవిత శివలింగము
  • ప్రాచీన జైన విగ్రహము
  • పురావస్తుశాఖ త్రవ్వకాలు: శివాలయము, యజ్ఞవాటిక
  • ముప్పైమూడు అడుగుల బారి ఆంజనేయ స్వామి విగ్రహం:
  • కీసర గుట్టకు ప్రక్కనే వున్న మరో గుట్టపై నిజాముల కాలంలో కట్టిన పెద్ద ద్వారం.
  • గుట్టపై ప్రాచీన కాలంలో కట్టిన బౌద్ధ స్థూపాల ఆనవాలు. వీటిని అతి పెద్ద ఇటుకలతో వృత్తాకరంలో కట్టివున్నవి.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 11

బయటి లింకులు

[మార్చు]