Jump to content

వేల్పూర్ (నిజామాబాద్ జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 18°45′57″N 78°23′29″E / 18.765914°N 78.391457°E / 18.765914; 78.391457
వికీపీడియా నుండి
(వేల్పూరు నుండి దారిమార్పు చెందింది)

వేల్పూర్, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలానికి చెందిన గ్రామం.[1]

వేల్పూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు, వేల్పూరు స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు, వేల్పూరు స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు, వేల్పూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°45′57″N 78°23′29″E / 18.765914°N 78.391457°E / 18.765914; 78.391457
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రం వేల్పూరు
గ్రామాలు 10538
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 42,486
 - పురుషులు 20,610
 - స్త్రీలు 21,876
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.35%
 - పురుషులు 65.36%
 - స్త్రీలు 36.42%
పిన్‌కోడ్ 503311

ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]

గ్రామ గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2046 ఇళ్లతో, 8321 జనాభాతో 1887 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4059, ఆడవారి సంఖ్య 4262. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1435 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 60. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 570875.[3]

బాల కార్మికులు రహిత మండలంగా గుర్తింపు

[మార్చు]

ఎనిమిదేళ్లక్రితం బాలకార్మికులు లేని మండలం అన్న గుర్తింపు వచ్చింది. బడివయసు పిల్లలంతా బడికెళ్తున్న ఘనత దక్కింది. వి.వి.గిరి నేషనల్‌ లేబర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుడు ప్రొఫెసర్‌ మహావీర్‌ జైన్‌ 'కంప్లీట్‌ ఎబాలిషన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ లేబర్‌- ఎ పాజిబిలిటీ' పేరుతో వేల్పూర్‌ విజయం మీద ఓ పుస్తకం రాశాడు.

నిధులు మంజూరు చేసే ప్రభుత్వం, విధులు నిర్వర్తించే ఉద్యోగులు, ఫలాలు అందుకునే ప్రజలు ఏ కార్యక్రమ విజయానికైనా ఈ మూడూ మూలస్తంభాలు. వేల్పూర్‌ను బాలకార్మికుల్లేని మండలంగా తీర్చిదిద్దడంలో ఆ మూడు వ్యవస్థలూ ఒక్కటై పనిచేశాయి. ప్రజల వైపు నుంచి మంచి స్పందన వచ్చింది. తాత్కాలికంగా కాస్త ఇబ్బంది అనిపించినా, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సంతోషంగా సహకరించారు.

అది అక్షరమిచ్చిన వివేకం. అంతకుముందే, ఆ మండలంలోని వయోధికులంతా రాత్రి బడులకు వెళ్లి చదువులు నేర్చుకున్నారు. వేల్పూర్‌ 'వందశాతం వయోజన అక్షరాస్యత' సాధించిన మండలంగా నవోదైంది. 'అక్షర సంక్రాంతి' ఘనంగా జరుపుకుంది. మండల ప్రజలు సహజంగానే చైతన్యవంతులు. అక్కడ, గ్రామాభివృద్ధి కమిటీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. అభ్యుదయ భావాలున్న రైతులున్నారు. యువజన సంఘాలు ఏ మంచి పనికైనా నడుంబిగిస్తాయి. మండల స్థాయి అధికారులంతా యువకులే. సమాజానికి ఎంతోకొంత చేయాలని తపనపడుతున్నవారే. అప్పటికి కాస్త ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కొత్త ప్రజాప్రతినిధులు వచ్చారు. ఏదైనా మంచి కార్యక్రమంతో జనం మధ్యకు వెళ్లాలని తహతహలాడుతున్నారు.

2001లో చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. బడివయసు పిల్లలంతా బళ్లోనే ఉండాలన్నది సర్కారు లక్ష్యం. కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. జిల్లా యంత్రాంగం రంగంలో దిగింది. మిగతా ఇరవైరెండు జిల్లాల్లో జరిగినట్టే, నిజామాబాద్‌లోనూ కలెక్టరు అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. సార్వజనీన విద్యాపథకంలో భాగంగా రెంజల్‌, నందిపేట్‌, ఎడపల్లి, వేల్పూర్‌ మండలాల్లోని ఐదేళ్ల నుంచి పద్నాలుగేళ్లలోపు బాలబాలికలందర్నీ బళ్లో చేర్పించాలని నిర్ణయించారు. అందులోనూ వేల్పూర్‌ మండలాన్ని 'పైలెట్‌ ప్రాజెక్టు'గా ఎంచుకున్నారు.జనానికి చదువు విలువ చెప్పాలి. పిల్లల్ని పనికి పంపడం మంచిదికాదని నచ్చజెప్పాలి. ఒక్కరంటే ఒక్కర్ని కూడా వదలకుండా బడివయసు పిల్లలందర్నీ బళ్లో చేర్పించాలి. ఇదీ లక్ష్యం.ఇంటింటి ప్రచారాలు, సైకిలు ర్యాలీలు, దండోరాలు, గ్రామసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన మార్గాలు. పిల్లల్ని పన్లో పెట్టుకోవడం ఎంత పెద్ద తప్పో... చట్టప్రకారం శిక్ష ఏమిటో పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇదో సున్నితమైన హెచ్చరిక.

ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రోత్సాహం అందింది. చాలా ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి వరకే పాఠశాలలు ఉన్నాయి. ఆతర్వాత చదవాలంటే, ఏ పొరుగూరికో వెళ్లాలి. పిల్లల్ని అంతదూరం పంపడానికి చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడరు. ఆడపిల్లల విషయంలో అయితే ఈ పట్టింపు మరీ ఎక్కువ. అందుకే అమీన్‌పూర్‌ లాంటి గ్రామాల్లో ప్రాథమిక పాఠశాల స్థాయిని పెంచి, ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నచోట విద్యా వాలంటీర్లను నియమించారు. బడి మొహం ఎరుగని పిల్లల కోసం రెసిడెన్షియల్‌ బ్రిడ్జి స్కూళ్లు ఏర్పాటు చేశారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం అనుకున్నంత సులభం కాదని అర్థమైపోయింది. వేల్పూర్‌ మండలంలో బాలకార్మిక సమస్యకు అనేక కారణాలు. మెదక్‌, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చే రైతుకూలీల సంఖ్య ఎక్కువే. ఆ నిరుపేదలది బతుకు పోరాటం. పిల్లల్ని బడికి పంపేంత స్తోమత ఉండదు. ఇంట్లో ఏ ఒక్కరి సంపాదన తగ్గినా, నోటిదాకా వచ్చిన ముద్దను ఎవరో లాగేసినట్టే. రుణాలు మరో కారణం. అప్పులు తీరాలంటే పసివాళ్లు పనిచేయాల్సిందే. తేడావస్తే వడ్డీవ్యాపారులు పరువుతీస్తారు. కొన్నిగ్రామాల్లో వెట్టిచాకిరి వేళ్లూనుకుంది. లేనిపోని అపోహలకూ అర్థంలేని ప్రచారాలకూ అడ్డే లేదు. అధికారులూ రాజకీయ నాయకులూ కలిసి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోతారనీ మూత్రపిండాలూ కళ్లూ అమ్ముకుని సొమ్ముచేసుకుంటారనీ ఎవరో పుకార్లు పుట్టించారు. అమాయక ప్రజలు నిజమే అనుకున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే, ప్రచార బృందాలకు గొంతుతడుపుకోడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. అంతుచూస్తామంటూ బెదిరింపులూ వచ్చాయి.

ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు వెనుకడుగు వేయలేదు. అవరోధాల్ని తట్టుకుంటూనే గ్రామయాత్రలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి పిల్లల్ని పనికి పంపవద్దంటూ ప్రచారం చేశారు. ఇక్కడ సాంస్కృతిక బృందాల పాత్ర కీలకమైంది. హరికథలు, బుర్రకథల రూపంలో చెప్పాల్సిన విషయాన్ని హృదయాలకు హత్తుకునేలా చెప్పాయి.

కులసంఘాల్నీ మతపెద్దల్నీ భాగస్వాములను చేయడం బాగా కలిసొచ్చింది. వడ్డెర కుటుంబాల్లోని పిల్లలంతా రాళ్లుకొట్టే పనికి వెళ్లేవారు. వయసుకు మించిన బరువది. వడ్డెర సంఘం సమావేశంలో గ్రామాభివృద్ధి కమిటీలు ఆ కష్టనష్టాలన్నీ వివరించాయి. పిల్లల్ని బడికి పంపితే వాళ్ల జీవితాలు మారతాయని భరోసా ఇచ్చాయి. వడ్డెర్ల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ముస్లిం కుటుంబాల్లో అయితే అధిక సంతానం, పేదరికం. అక్షరాస్యతకు అవకాశమే లేదు. బుద్ధెరిగినప్పటి నుంచే కార్ఖానా కొలువులు మొదలవుతాయి. వేల్పూర్‌ గ్రామంలో మతపెద్దల సహకారంతో శుక్రవారం ప్రార్థనల తర్వాత 'పిల్లల్ని పనికి పంపం' అని అల్లా పేరిట ప్రమాణం చేయించారు. రైతులతో 'నేలతల్లి' సాక్షిగా ఒట్టు వేయించారు. బీడీ ఫ్యాక్టరీల్లో వాతావరణం ఘోరంగా ఉండేది. అక్కడ పనిచేసే కూలీల్లో బాలికలే ఎక్కువ. వేతనాలు అంతంతమాత్రమే. దీంతో, అమ్మలే చొరవ తీసుకుని బిడ్డలను పనికి పంపేదిలేదని తీర్మానించారు.

పిల్లల్ని పనిమానిపించే తల్లిదండ్రులను రచ్చబండల దగ్గర సన్మానించారు. వోతె గ్రామంలో రామచందర్‌ అనే సైకిలుషాపు యజమాని తన కొడుకును పని మానిపిస్తానని బహిరంగంగా ప్రకటించి, సన్మానం అందుకున్నాడు. తీవ్ర ఆర్థికసమస్యలు లేకపోయినా, చదువు అబ్బలేదనో చేదోడుగా ఉంటారనో పిల్లల్ని పనికి పంపుతున్న కుటుంబాల మీద ఇలాంటి కార్యక్రమాల ప్రభావం చూపించాయి. మండలంలోని ఉపాధ్యాయులంతా ఒక సంఘంగా ఏర్పడి... బళ్లో చేరుతున్న బాలకార్మికులకు పుస్తకాలు పంచారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ టూత్‌బ్రష్‌లు, పేస్టులు, సాక్సులు ఇచ్చింది. పిల్లల్ని పనికి పంపబోమని ప్రతిజ్ఞ చేసిన కుటుంబాలకు బ్యాంకులు రుణాలిచ్చాయి. కమ్యూనిటీ మొబలైజేషన్‌ ఆఫీసర్‌ (సీఎమ్‌వో) సుధాకర్‌రావు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ 'అక్షర దీక్ష' తీసుకున్నారు. వందశాతం ఫలితాలు సాధించేదాకా ఇంటి గడపతొక్కననీ గ్రామాల్లోనే ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. కార్యకర్తల్లో ఈ నిర్ణయం ఉత్సాహాన్ని నింపింది. డ్వాక్రా గ్రూపు సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు చురుకైన భాగస్వాములయ్యారు. రెడ్‌రోజ్‌, గ్రేసీ వంటి స్వచ్ఛంద సంస్థలు, ముదిరాజ్‌యూత్‌ వంటి సంఘాలు కీలకపాత్ర పోషించాయి. పడగల్‌ గ్రామంలో ఒకేసారి పాతికమంది పిల్లలు బళ్లో పేర్లు నవోదు చేసుకున్నారు. బాలకార్మికులను బడికి పంపిన కుటుంబాలకు పంచాయతీ తరపున ఉచిత కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. పనిమానేసిన పేదపిల్లల్ని గ్రామపెద్దలే దత్తత తీసుకుని చదివించడానికి ముందుకొచ్చారు. ప్రజలే స్వచ్ఛందంగా ఇన్ఫార్మర్ల వ్యవస్థను రూపొందించుకున్నారు. ఏ కార్ఖానాలో బాలకార్మికులు కనిపించినా, అధికారులకు క్షణాల్లో సమాచారం అందేది. అవసరమైన చోట పోలీసుల సహకారం తీసుకున్నారు.

ఒకే లక్ష్యం...వేల్పూర్‌ను బాలకార్మికుల్లేని మండలంగా తీర్చిదిద్దడం. వ్యూహాలు అనేకం. గ్రామాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, బాలల పరిస్థితుల్ని బట్టి అవి మారుతూ ఉండేవి. వేల్పూర్‌ విజయానికి కారణమైంది ఆ చొరవే! లేకపోతే, ఇది కూడా లెక్కలేనన్ని సర్కారీ కార్యక్రమాల్లో ఒక్కటిగా మిగిలిపోయేది. మహా అయితే ఫలితాలు 'రికార్డు'లకే పరిమితం అయ్యేవి.

తొలి విజయం...వోతె గ్రామంతో విజయపరంపర వెుదలైంది. ప్రవేశద్వారం దగ్గర 'మా వూళ్లో బాల కార్మికులు లేరు' అన్న బోర్డు ఏర్పాటు చేశారు. తొలి విజయంలో ఉన్న ఆనందమే వేరు. సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అదో పండగ! అలా అని అడ్డంకులన్నీ తొలగిపోలేదు. చాలాచోట్ల బాలకార్మికులు కనిపిస్తూనే ఉన్నారు. దీంతో కాస్త కఠిన వైఖరి అవలంబించాల్సి వచ్చింది. దారికిరాని వ్యాపారుల ఇళ్లముందు ధర్నాలు చేశారు. విద్యుత్తు, నీళ్లు ఇవ్వబోమని హెచ్చరించారు. సామాజిక సేవలు బహిష్కరించారు. ఆ ఒత్తిడి ఫలించింది. లక్కొర, వాడి, కొత్తపల్లి, సాహెబ్‌పేట, అమీనాపూర్‌ తదితర గ్రామాలు సంకెళ్లు తెంచుకున్నాయి.

వేల్పూర్‌ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే... అక్కడ వ్యాపారుల మీదకానీ భూస్వాముల మీదకానీ ఒక్కకేసు కూడా నవోదు చేయలేదు. ఒక్కపైసా జరిమానా విధించలేదు. ఎవర్నీ అరెస్టు చేయలేదు. అంతా 'పాజిటివ్‌' ప్రచారంతోనే జరిగింది. విముక్తులైన బాలకార్మికులతో యజమానులకు దండలు వేయించారు. దండం పెట్టించారు. గ్రామీణ భారతం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యల నుంచి బాలకార్మిక వ్యవస్థను వేరు చేసి చూడలేదు. పిల్లలు పనికెళ్లడానికి చాలా కారణాలు. బడికెళ్లకపోవడానికి ఇంకెన్నో కారణాలు. ముందు వాటిని గుర్తించాలి. పరిష్కరించాలి. అవసరమైతే వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందించాలి. ఆతర్వాతే 'మీ పిల్లల్ని బడికి పంపండి' అని కన్నవారిని అడగాలి. వేల్పూర్‌లో జరిగింది అదే. ఓ చిన్నగూడు కట్టుకోడానికి ఇంటిల్లిపాదీ కష్టపడుతున్న పరిస్థితుల్లో...ప్రభుత్వ పథకాల ద్వారా గృహవసతి కల్పించారు. దీంతో ఆ కుటుంబం పసివాడిని సంతోషంగా బడికి పంపింది. ఓరైతుకు గొట్టపుబావి తవ్వుకోడానికి బ్యాంకు రుణం ఇప్పించారు. అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, బిడ్డను చదివించడానికి ఒప్పుకున్నాడు. తల్లో తండ్రో తీవ్ర అనారోగ్యంతో మంచంపాలైన చోట...ముందు వారికి వైద్యం చేయించారు. ఆ తర్వాతే, బిడ్డ చదువు సంగతి ప్రస్తావించారు. అప్పులపాలైన కుటుంబాలకు ధైర్యం చెప్పారు. వడ్డీ వ్యాపారులకు బాలకార్మిక చట్టాల గురించి వివరించి, నయానో భయానో అప్పు రద్దు చేయించారు. ఇక చదివించడానికి సమస్య ఏముంది? ప్రభుత్వ పథకాల్ని సమన్వయం చేసుకోవడం చాలా అరుదైన విషయం. విద్యాహక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలన్నా...ఈ సూత్రాన్నే పాటించాలి. వేల్పూర్‌ బాటలోనే నడవాలి.

కృషి ఉంటే...2001 జూన్‌ పన్నెండున బాలకార్మిక విముక్తి ఉద్యమం వెుదలైంది. యాభై రోజుల వ్యవధిలో మండలంలోని వెుత్తం పదిహేను పంచాయతీలూ ఇరవై జనావాసాలూ 'మా వూళ్లో బాలకార్మికులు లేరు' అని నిర్ధారించాయి. ఐదువందల ఇరవై తొమ్మిది మంది పిల్లలు బడిబాట పట్టారు. అవసరమైతే పిల్లల్ని హాస్టళ్లలో, బ్రిడ్జి స్కూళ్లలో చేర్పించారు. అక్టోబరు రెండున...ప్రభుత్వం 'వేల్పూర్‌... బాలకార్మికుల్లేని మండలం' అని సగర్వంగా, సాధికారికంగా ప్రకటించింది.అది...సమష్ఠి విజయం!

ఉద్యోగులు వెుక్కుబడి బాధ్యతగా భావించలేదు. ఏ తెల్లవారు జామునో గ్రామయాత్రలకు బయల్దేరితే, అర్ధరాత్రికి కానీ ఇంటికి చేరేవారు కాదు. కొన్నిసార్లు ఆ అవకాశమూ ఉండేది కాదు. ప్రజాప్రతినిధులు కూడా 'మాకేం లాభం?' అనుకోలేదు. సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామపెద్దలు, వివిధ పార్టీల నాయకులు...ఎవరికివారు ప్రతిఫలాన్ని ఆశించకుండా పనిచేశారు. యువజన సంఘాలు, డ్వాక్రా గ్రూపుల పాత్రా తక్కువేం కాదు. 'కమాండర్‌ ఇన్‌ చీఫ్‌' జిల్లా కలెక్టరు అశోక్‌కుమార్‌ కూడా మండల స్థాయిలో అమలవుతున్న పథకమే కదా అని చిన్నచూపు చూడలేదు. దాదాపు డజనుసార్లు వచ్చి వెళ్లారు. రోజూ రాత్రి పది గంటల నుంచి ఓ అరవై నిమిషాలపాటు వేల్పూరు మండల సమీక్షకే కేటాయించారు. అరవై తొమ్మిది రోజులు...అదో యజ్ఞం! జీసీడీవో నిర్మలకుమారి, తహసిల్దార్‌ రవి, ఎంపీడీవో విశ్వనాథ సుబ్రహ్మణ్యం, ఎంయీవో శంకర్‌, మండల రిసోర్స్‌పర్సన్లు ప్రకాశ్‌, శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్‌... ఒకరని ఏమిటి, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన బృందం సభ్యులంతా ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు. ఇప్పటికీ అదే బాట...

ఓ ఘన విజయం సాధించడం వేరు. ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం వేరు. ఈ విషయంలోనూ వేల్పూర్‌ ఆదర్శంగా నిలుస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత కూడా అదే అప్రమత్తత. అంతే చిత్తశుద్ధి. ఇప్పటికీ అక్కడ ఒక్క బాలకార్మికుడు కూడా కనిపించడు. నిర్బంధ విద్య స్వచ్ఛందంగా అమలవుతోంది. 'మేం మా బాధ్యతను మరచిపోలేదు. ఎవరైనా విద్యార్థి వరుసగా రెండు రోజులు బడికి రాకపోతే, ఎందుకు రాలేదో తెలుసుకుంటాం. చిన్నచిన్న సమస్యలుంటే, సర్దుబాటు చేసి మళ్లీ బడికి తీసుకొస్తాం' అంటారు మండల విద్యాశాఖ అధికారి బెజ్జోర శ్రీనివాస్‌. 'గ్రామాల్లోకి ఏ వలస కూలీ కుటుంబం వచ్చినా, పిల్లల్ని పనికి పంపకుండా జాగ్రత్తపడతాం. చొరవ తీసుకుని బళ్లో చేర్పిస్తాం. ఇలాంటి చర్యలవల్లే వేల్పూర్‌ మండలం తన రికార్డును నిలుపుకుంటోంది' అని చెబుతారు మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడు వోతే రామాగౌడ్‌. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 'రాజీవ్‌ రతన్‌' అవార్డు వచ్చింది.

ఈ ఎనిమిదేళ్లలో వేల్పూర్‌ చదువుల మండలంగా పేరుతెచ్చుకుంది. ప్రభుత్వ పాఠశాలలు చక్కని ఫలితాలు సాధిస్తున్నాయి. వ్యాపారంలేక ప్రయివేటు పాఠశాలలెప్పుడో మూతబడ్డాయి. వేల్పూర్‌ స్ఫూర్తితో బాల్కొండ, వోర్తాడ్‌, జకరాన్‌పల్లి తదితర మండలాలు కూడా అదే బాట పట్టాయి. భయంభయంగా బ్రిడ్జి స్కూళ్లలో అడుగుపెట్టిన గొర్రెల కాపర్లూ రైతు కూలీలూ బీడీ కార్మికులూ పెద్దతరగతులకు వచ్చేశారు. కరుణజ్యోతి, సతీష్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. సాయి డిగ్రీ కాలేజీలో చేరబోతున్నాడు. దాదాపు పాతిక మంది విద్యార్థులు పదోతరగతి పాసయ్యారు. ఓ ఎనిమిది మంది ఇంటర్‌ చదువుతున్నారు. వృత్తివిద్యాకోర్సులు చేసి తమకాళ్ల మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నవారూ ఉన్నారు.

నొయిడాలోని నేషనల్‌ లేబర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఏ శిక్షణ కార్యక్రమం నిర్వహించినా అందులో 'వేల్పూర్‌ విజయం' ప్రస్తావన ఉండితీరుతుంది. సిలబస్‌లో ఇదో ముఖ్యమైన పాఠం.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఐదుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆర్మూర్లోను, ఇంజనీరింగ్ కళాశాల చేపూర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, పాలీటెక్నిక్‌ నిజామాబాద్లోను, మేనేజిమెంటు కళాశాల ఆర్మూర్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నిజామాబాద్లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఆర్మూర్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

వేల్పూర్లో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

వేల్పూర్లో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

వేల్పూర్ పెద్దవాగుపై 15 కోట్ల రూపాయలతో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్‌ 2023 ఫిబ్రవరి 23న ప్రారంభించబడింది.[4]

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

[మార్చు]
ఆలేటి అన్నపూర్ణ రాజకీయ నాయకురాలు

భూమి వినియోగం

[మార్చు]

వేల్పూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 360 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 3 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 85 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 99 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 110 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 145 హెక్టార్లు
  • బంజరు భూమి: 302 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 783 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 614 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 616 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

వేల్పూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 616 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

వేల్పూర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మొక్కజొన్న, పసుపు

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

బీడీలు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-31.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. telugu, NT News (2023-02-23). "Minister Prashant Reddy | రికార్డు సమయంలో వంతెనల నిర్మాణం : మంత్రి వేముల". www.ntnews.com. Archived from the original on 2023-02-25. Retrieved 2023-03-16.
  5. మననాయకుడు. "ఆలేటి అన్నపూర్ణ". mananayakudu.com. Retrieved 12 May 2017.[permanent dead link]
  6. మైనేత. "Annapurna Aleti". myneta.info. Retrieved 12 May 2017.

వెలుపలి లంకెలు

[మార్చు]