Jump to content

పండిత్ నరేంద్రజీ

వికీపీడియా నుండి

పండిత్ నరేంద్రజీ ఏప్రిల్ 10, 1907న హైదరాబాదులో జన్మించాడు. చిన్నతనంలోనే ఆర్యసమాజ్ పట్ల ఆకర్షితుడైనాడు. ఆర్యసమాజ్ యొక్క మంత్రిగా, ఉపాధ్యక్షునిగా పనిచేశాడు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఇతను హైదరాబాదు ఉక్కుమనిషిగా పేరుపొందాడు.[1] హైదరాబాదులో ఆర్యసమాజ్ కార్యక్రమాలకు నరేంద్రజీ విశేషకృషే కారణం.1938లోనే నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు 3 సంవత్సరాలు మన్ననూరు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన పిదప వైదిక దర్శనం పత్రికను నిర్వహించాడు. ఈ పత్రికద్వారా నిజాం నిరకుశత్వాన్ని తీవ్రంగా నిరసించాడు. దీనితో పత్రిక మూతపడింది, ఆస్తులన్నీ జప్తు అయ్యాయి. అయిననూ నరేంద్రజీ తన లక్ష్యాన్ని మార్చుకోలేదు. బలవంతపు మతమార్పిడులు జరిపితే అర్యసమాజం ద్వారా మళ్ళీ హిందూమతంలోకి ఆహ్వానించాడు. 1942 నుండి 1945 వరకు ఆర్యసమాజీయులను ఏకం చేసి ముందుకు నడిపించడానికి నిజాం రాజ్యంలోని పలుప్రాంతాలలో ఐదు ఆర్యసమాజ సభలు నిర్వహించబడ్డాయి. నరేంద్రజీ 1942లో ఉద్గిర్లో జరిగిన మొదటి సమావేశంలో సమావేశపు కార్యదర్శిగా పనిచేయటమే కాకుండా ఆ తర్వాత సభల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నాడు.[2]

హైదరాబాదు రాజ్యం భారత యూనియన్ లో విలీనం కావడానికి తీవ్రంగా కృషిచేశాడు. 1947లో మరోసారి జైలుకు వెళ్ళవలసి వచ్చింది. నూతి శంకరరావు లాంటి పోరాటయోధులు కూడా ఇతని ఉపన్యాసాలకు ప్రభావితులైనారు.[3] నిజాం నవాబు పైనే బాంబు విసిరిన నారాయణరావు పవార్ కూడా నరేంద్రజీ శిష్యుడే. 1948 సెప్టెంబరులో నిరంకుశ నిజాం పాలన అంతమై హైదరాబాదు భారత యూనియన్ లో కలిసిన పిదప నరేంద్రజీ హైదరాబాదు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనాడు. 1952లో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. 1975లో రాజకీయాలకు స్వస్తిచెప్పి సన్యాసం స్వీకరించాడు. సెప్టెంబరు 24, 1976 నాడు మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. చరితార్థులు మన తెలుగు పెద్దలు, మల్లాది కృష్ణానంద్ రచన, ప్రథమ ప్రచురణ 2012, పేజీ 278
  2. ARYA SAMAJ AND ITS ACTIVITIES - T.Uma
  3. మెదక్ జిల్లా స్వాతంత్ర్యోద్యమము సమరయోధులు, రచన ముబార్కపురం వీరయ్య, 2007, పేజీ 151