చండీప్రియ
చండీప్రియ (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి. మధుసూదన రావు |
---|---|
తారాగణం | శోభన్ బాబు, చిరంజీవి, జయప్రద, అంజలీ దేవి |
సంగీతం | ఆదినారాయణ రావు చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | అంజలీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
చండీప్రియ 1980 లో విడుదలైన తెలుగు చిత్రం. వీరమాచనెని మధుసూదనరావు దర్శకత్వంలో, శోభన్ బాబు, జయప్రద, చిరంజీవి, నటించిన ప్రేమకథా చిత్రం. అంజలీ పిక్చర్స్ పతాకంపై, పి ఆదినారాయణ రావు నిర్మించిన ఈ సినిమాకి సంగీతం ఆదినారాయణ రావు అందించారు. చండీప్రియ నవల పోల్కంపల్లి శాంతాదేవి రచన ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది .
కథ
[మార్చు]పోల్కంపల్లి శాంతాదేవి రాసిన నవలలలో ” చండీప్రియ ” ఒకటి. ఇది ముక్కోణపు ప్రేమకథ. అంతే కాదు కథలో ఇంకోకోణములో కూడా ప్రేమకథ ఉంది. కాబట్టి ముక్కోణపు ప్రేమకథ అనలేము. నవల చదువుతుంటే సాదా సీదా ప్రేమకథ లాగే వుంటుంది. కాని హీరోకి ఓ రెండు ప్రేమ కథలు, హేరోయిన్ కు ఓ రెండు ప్రేమకథలు, హీరో తమ్ముడికో రెండు ప్రేమకథలు ఉంటాయి.
దుర్గాప్రసాదరావుగారిది జమిందారీ ఫాయీకి చెందిన కుటుంబము. ఇప్పుడు జమీందారీ లేకపోయినా ఆ వైభవము, ఆ దర్పము, ఆయనలో, ఆయన బంగళాలో, బంగళాలోని ప్రతివస్తువులోనూ చూడవచ్చు. వారి ఇలవేలుపు చండీ పేరు కలిసేలా ” చండీప్రియ ” అని ఆయన కూతురుకు పేరు పెట్టుకున్నారు. రెండేళ్ళ వయసులో తల్లిని పోగొట్టుకున్న చండీప్రియ అంటే ఆయనకు ప్రాణము. ఆమె ప్రస్తుతము బి.యే ఫైనల్ పరీక్షలు వ్రాయబోతున్నది. ఆయన వస్తుతః దయార్ద్ర హృదయుడు. అయన బంగళాకి ఒకవైపున కొన్ని పెంకుటిళ్ళు ఉన్నాయి. వాటిల్లో ఆయన వద్ద పనిచేసే సిబ్బంధి కొద్దిపాటి అద్దె ఇచ్చి వుంటున్నారు. వారిలోనే, ఆయన వద్ద పనిచేసి, రెండు సంవత్సరాల క్రితము చనిపోయిన నారాయణరావు కుటుంబము -ఆయన రెండో భార్య శారదమ్మ, కొడుకు అనిల్, కూతురు కృష్ణప్రియ కూడా వుంటున్నారు. చండీప్రియ చిన్నప్పుడు వారి ఇంటిలోనే ఎక్కువగా గడిపేది. ఆ పిల్లలతో స్నేహముగా వుండేది. కాని పెద్ద దవుతున్నకొద్దీ వారి మధ్య వున్న అంతరాలు తెలుసుకొని దూరంగా ఉండిపోయింది. ఆ యింటివారు కూడా దూరముగా వుండిపోయారు. కాని అనిల్ మటుకు ప్రియ అంటే ప్రేమ కలిగి చిన్ననాటి స్నేహాన్ని మర్చిపోలేకుండా ఉన్నాడు. చండీప్రియ స్నేహితురాలు శోభ. శోభ అనిల్ ను ప్రేమిస్తూవుంటుంది. ఎలాగైనా అనిల్ తన దగ్గరకు రవాలని, చండిప్రియకు దూరము కావాలని ఓ ప్లాన్ వేస్తుంది. చండిప్రియ అనిల్ ను ప్రేమిస్తోందని, చెప్పేందుకు సిగ్గుపడుతోందని అనిల్ కు చెపుతుంది. ఆమె మాటలు నమ్మి, ఆమె సలహాతో చండీప్రియకు ప్రేమలేఖ వ్రాస్తాడు అనిల్. ఆ లేఖ చూసి మండిపడుతుంది ప్రియ. వాళ్ళకు తండ్రి ఇచ్చిన అప్పును వెంటనే వసూలు చేయాలని లేదా వాళ్ళను తక్షణము ఇల్లు ఖాళీ చేయించాలని తండ్రి దగ్గర పట్టుపడుతుంది. కూతురు పెళ్ళి కుదిరిందని, పరిస్థితులు చక్కపడ్డాక చిన్నగా అప్పు తీరుస్తామని శారదమ్మ ఎంత వేడుకున్నా వినదు. వారి సామానులు బయటపడేసే సమయానికి వస్తాడు ఇంద్రనీల్, శారదమ్మ సవితి కొడుకు. ప్రసాదరావుగారి అప్పు తీర్చి, చెల్లెలి పెళ్ళి ఘనముగా జరిపిస్తాడు. అతనికి ఆస్తి ఎలా వచ్చింది అన్నదానికి రకరకాల కథలు ప్రచారములో వుంటాయి. అతను ఒక మార్వాడి దగ్గర పనిచేస్తూ, ఆ మార్వాడి రెండో భార్య ప్యారీని ప్రేమించాడని, ఆమె సహాయముతో మార్వాడీనీ హత్య చేసి, ఆస్తి దక్కించుకొని ప్యారీ నికూడా ఆక్సిడెంట్ లో చంపేసాడని అంటారు. కాని ఇంద్రనీల్ కవిత అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. కవిత అచ్చము చండీప్రియ లాగే వుండటముతో మొదటి సారి చండీప్రియను చూసి ఆశ్చర్యపోతాడు. అతనిని మొదటి చూపులోనే ప్రేమిస్తుంది చండీప్రియ. కాని ఆ ప్రేమను మనసులోనే దాచుకుంటుంది.
శోభ అనిల్ తిరస్కారముతో పిచ్చిది అవుతుంది. బాంబేలో ఇంద్రనీల్ తో కలిసి ఫాక్టరీ పెట్టేందుకు వూరిలోని తమ ఆస్తులన్నీ అమ్మేస్తాడు ప్రసాదరావు. ఆ డబ్బు తీసుకొని వస్తుండగా కొంతమంది దుండగులు ప్రసాద్రావు మీద హత్యా ప్రయత్నము చేసి, ఆ డబ్బును ఎత్తుకెళుతారు. ఆ సమయములో ఇంద్రనీల్ ప్రసాదరావును ఆదుకుంటాడు. వైద్యము చేయిస్తాడు. ఆస్తులు పోగొట్టుకున్న చండి తండ్రి వైద్యము కోసము పాటలు పాడి సంపాదిస్తూ వుంటుంది. రక రకాల మలుపుల తరువాత, తండ్రి మరణముతో వంటరిదై ఇంద్రనీల్ పంచన చేరుతుంది. ఇక చెప్పేందుకు కేముంది చివరలో తనమీది ప్రేమతో పిచ్చి ఎక్కిన శోభను అనిల్ వివాహము చేసుకుంటాడు. తనను ప్రేమించిన చండీప్రియను ఇంద్రనీల్ పెళ్ళి చేసుకుంటాడు. ఇదీ క్లుప్తముగా ” చండీప్రియ ” నవల కథ ఇన్ని ప్రేమకథలు, మలుపులు వున్న చండీప్రియ నవలను 1980 లో అంజలీ పిక్చర్స్ వారు సినిమాగా తీసారు. ఇందులో, శోభన్ బాబు, జయప్రద, చిరంజీవి, సువర్ణ, అంజలిదేవి, గుమ్మడి, అల్లురామలింగయ్య మొదలైనవారు నటించారు. మాటలు సత్యానంద్ వ్రాయగా, పాటలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి. నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామమూర్తి వ్రాసారు. పి. సుశీల, యస్.పి బాలాసుబ్రమణ్యం, యస్.పి శైలజ పాడారు. నిర్మాత ఆదినారాయణ రావు, డైరెక్టర్ వి. మధుసూదనరావు. సినిమా నవలను చాలా వరకు పోలివున్నా, చాలానే మార్పులు చేసారు. సగము వరకు నవల లాగే ఉంది. మిగితా సగము లోనే మార్చారు. చండీప్రియను ముందునుంచీ అహంకారిగా చూపించారు. నవలలో గాయని ఐతే సినిమాలో నాట్యమంటే ఇష్టముగా చూపించారు. శారదమ్మ నవలలో గయ్యాళిగా రాసారు రచయిత్రి. కాని సినిమాలో గయ్యాళిది కాదు. అలాగే నవలలో శోభ అనిల్ మీద ప్రేమతో పిచ్చిదవుతుంది. అనిల్ చివరలో జాలితో ఆ పిచ్చి అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాడు. కాని సినిమాలో పిచ్చి ఎక్కినట్లుగా చూపించరు. దిగులుగా చూపిస్తారు. ఇక ఇంద్రనీల్ ప్రియురాలు కవిత పాత్ర సినిమాలో లేదు. ప్యారిలోనే ఇద్దరినీ చూపిస్తారు. ముక్కోణపు ప్రేమలు ఏరూపములో ఎలా నెరవేరాయి ? ఇంద్రనీల్ విలన్ ఆటేలా కట్టిస్తాడో సినిమా చూసి ఆనందించండి. కారెక్టర్స్ ను కొద్దిగా మార్చారు కాని కథను ఎక్కువగా మార్చలేదు. అందుకని విడిగా చెప్పేందుకు ఏమీలేదు. శోభన్ బాబు ఇంద్రనీల్ గా హుందాగా ఉన్నాడు. చండీప్రియగా జయప్రద అందంగా ఉంది. డాన్స్ లు బాగున్నాయి. చిరంజీవి సెకండ్ హీరో అనిల్ గా వేసాడు. భారీ డైలాగులూ, ఫైటింగులూ గట్రా లేకుండా చిరంజీవిని చూడటము వెరైటీనే అన్నట్లు చిరంజీవి హీరోయిన్ ను ఊహించుకుంటూ ఓ పాట ” ఓప్రియా చండీప్రియ ” అని ఓ డాన్స్ కూడా చేసాడు. కాకపోతే చిరంజీవి వచ్చిన కొత్తల్లో ది కదా అందుకే చాలా సాఫ్ట్ గా వుంది ఎలిఫెంట్ బాటం పాంట్ లో గమ్మత్తుగా ఉన్నాడు. శోబన్ బాబు, జయప్రద ల ఒక హిందీ పాట, డాన్స్ కూడా ఉన్నాయి. అదే ‘ యుహీ హం గాయేంగే జనం జనం ‘. సినిమా మొదట్లోనే జయప్రద చండీ దేవాలయములో చే నాట్యము, ‘ శ్రీ భాగ్య రేఖా ఉప పాదయంతి ‘ నాట్యము చాలా బాగుంది. మొత్తానికి నవల చదవ తగ్గదే. సినిమా కూడా పరవాలేదు చూడవచ్చు.
నటవర్గం:
[మార్చు]శోభన్ బాబు
జయప్రద(చండిప్రియా)
అంజలీ దేవి(శారదమ్మ)
చిరంజీవి(అనిల్ కుమార్)
సువర్ణ(ఆషా)
గుమ్మడి(ప్రసాదరావు)
అల్లు రామలింగయ్య(ఆనందరావు)
పి.ఎల్.నారాయణ(గాలి సుబ్బారావు)
పొట్టి ప్రసాద్(అవతారం)
ఎస్.వి.జగ్గారావు
గిరిజ
కె.వి.లక్ష్మీ
మధుమతి
విజయకళ
స్వర్ణ
కాంతారావు
మంజు భార్గవి
సి.హెచ్.నారాయణరావు
సేద్.
పాటల జాబితా
[మార్చు]ఓ ప్రియా ప్రియా , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
ఏ వేళనైన ఒకే కోరిక , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
శ్రీ భాగ్యరేఖ జననీ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
ఏలో ఎలో వరపులో , గానం.పి.సుశీల , రచన: వేటూరి సుందరరామమూర్తి
మసకపడితే నిదుర పట్టదు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: వేటూరి .
సాంకేతికవర్గం
[మార్చు]దర్శకుడు: వీరమాచనేని మధుసూదన రావు
సంగీతం: పి ఆదినారాయణ రావు, సత్యం
నిర్మాణ సంస్థ: అంజలీపిక్చర్స్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామమూర్తి,
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
విడుదల:1989: మార్చి 07.