చల్లా పిచ్చయ్యశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చల్లా పిచ్చయ్యశాస్త్రి

చల్లా పిచ్చయ్యశాస్త్రి మహాకవి, శతావధాని, పండితుడు, సంగీత విద్వాంసుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు విజయ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు గుంటూరు జిల్లా, ఇంటూరు గ్రామంలో వెంకమాంబ, పున్నయ్య దంపతులకు జన్మించాడు[1].

బాల్యము, విద్యాభ్యాసము[మార్చు]

ఇతడు వీధిబడిలో చదువుకుంటూ మామ రాజనాల వేంకటసుబ్బయ్యశాస్త్రివద్ద రఘువంశం ప్రథమసర్గ పూర్తిచేశాడు. వల్లూరులోని ప్రతాపరామయ్య వద్ద రఘువంశం ద్వితీయ సర్గ ప్రారంభించాడు. తరువాత పాతూరి రామస్వామి వద్ద రఘువంశములోని ద్వితీయ,తృతీయ సర్గలు పూర్తిచేసి, కుమార సంభవములోని మొదటి ఐదు సర్గలు చదివాడు. తాడేపల్లి వేంకటసుబ్బయ్య వద్ద నాటకాలంకార శాస్త్రములతోపాటుగా సంస్కృత పంచకావ్యములు, మనుచరిత్ర మొదలైన ఆంధ్రకావ్యములు అధ్యయనం చేశాడు.

ఉద్యోగపర్వము[మార్చు]

ఇతడు మొదట ఇంటూరు హిందూ హైస్కూలులో 1928 నుండి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత 1944లో పొన్నూరులోని భావనారాయణ సంస్కృత కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి 1951 వరకు పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు.

అవధానరంగము[మార్చు]

ఇతడు రాళ్ళబండి వెంకటసుబ్బయ్యతో కలిసి జంటగా 1913-1915 మధ్య మూడు సంవత్సరాలు అనేక శతావధానాలు, అష్టావధానాలు చేశాడు. వాటిలో ప్రత్తిపాడులో ఒక శతావధానము, ఉల్లిపాలెం, కొల్లూరులలో రెండు అష్టావధానాల వివరాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఇతడు ఒంటరిగా కూడా అనేక అవధానాలు చేశాడు.

కొన్ని అవధానపద్యాలు[మార్చు]

  • సమస్య: ఉత్తరంబున భానుదేవుఁడుదయంబయ్యెన్

పూరణ:

నెత్తమ్ములు దళ్కొత్తగ
మొత్తములై యంధతమసములు పోవంగా
క్రొత్తగ నల్లదె పూర్వ న్
గోత్తరమున భానుదేవుఁడుదయంబయ్యెన్

  • సమస్య: నారీమణి యోర్తు చూపె నాలుగు కుచముల్

పూరణ:

స్మేరానన యగుచు మణి
స్పార ముకురమందు తనదు చాయంగని త
న్జేరెడు చెలికత్తెయకున్
నారీమణి యోర్తు చూపె నాలుగు కుచముల్

  • సమస్య: తండ్రీ! అని పిల్చె నొక్క తన్వి స్వనాథున్

పూరణ:

గండ్రయయియల్ల బేరుల
యాండ్రవెలెన్నేందు సరసమాడెదనంచున్
పండ్రెడేడుల కొమరుల
తండ్రీ! అని పిల్చె నొక్క తన్వి స్వనాథున్

  • వర్ణన: తిరుపతి వేంకట కవులపై పద్యం

ధరణిధవుల్ వినన్ శతవధానవిధాన ప్రథన్ గణించి క్రి
క్కిరిసి యశంబు దిక్తటుల గీల్కొనఁ బల్కుల కుల్కులాడి కి
న్నెర పలుమెట్లలోన ఠవణిల్లెడు నల్లికకెల్ల చెల్లెయౌ
సరసపుఁ గైతపోషణము సల్పిరి తిర్పతి వేంకటేశ్వరుల్

రచనలు[మార్చు]

ఇతడు అనువాదాలు, స్వతంత్రకావ్యాలు, నాటకాలు, విమర్శగ్రంథాలు, లక్షణ గ్రంథాలు మొదలైనవి 40కి పైగా వెలువరించాడు. వాటిలో కొన్ని:

  1. శ్రీమదాంధ్ర గీతగోవిందము
  2. హంసలదీవి ప్రభావము
  3. చాణక్యనీతి దర్పణము
  4. భాషాభ్యుదయము
  5. స్వీయచరిత్ర

మూలాలు[మార్చు]

  1. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 203–208. |access-date= requires |url= (help)CS1 maint: discouraged parameter (link)