చాగరి పద్మనాభరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాగరి పద్మనాభరెడ్డి
చాగలి పద్మనాభరెడ్డి
జననం
చాగలి పద్మనాభరెడ్డి

1931 మార్చి 18
మరణం2013 ఆగస్టు 4(2013-08-04) (వయసు 82)
హైదరాబాదు
ఇతర పేర్లుసి. పద్మనాభరెడ్డి
విద్యన్యాయశాస్త్ర పట్టభద్రుడు
విద్యాసంస్థమద్రాసు న్యాయకళాశాల
క్రియాశీల సంవత్సరాలు1953 - 2013
ఉద్యోగంహైకోర్టు న్యాయ్తవాది
సుపరిచితుడు/
సుపరిచితురాలు
న్యాయవాది
బిరుదుపేదల న్యాయవాది
తల్లిదండ్రులుఓబుల్ రెడ్డి
సోమక్క
బంధువులుచిన్నప్పరెడ్డి

చాగరి పద్మనాభరెడ్డి ప్రముఖ హైకోర్టు న్యాయవాది, ప్రజాస్వామికవాది. అతను నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యాయం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం ఇప్పించేందుకు తాపత్రయపడ్డ ఒక మహా మనిషి. దేశంలోనే మంచి పేరు గడించిన క్రిమినల్ లాయర్లలో పద్మనాభడ్డిది ప్రత్యేక స్థానం.[1] న్యాయవాద వృత్తిలో విలువలు, నీతి నిజాయితీల కోసం పాటుపడిన అరుదైన న్యాయవాది పద్మనాభరెడ్డి.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

పద్మనాభరెడ్డి 1931 మార్చి 18న అనంతపురం జిల్లా యాడికి గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఓబులరెడ్డి, సోమక్క దంపతులకు జన్మించాడు. 5వ తరగతి వరకు యాడికి వీధి బడిలో చదివాడు. 6 నుంచి 8 తరగతుల వరకు మున్సిపల్ హైస్కూలు, తాడిపత్రిలో చదివాడు. 9, ఎస్‌ఎస్‌ఎల్‌సీ లండన్ మిషన్ హైస్కూల్, గుత్తిలో చదివాడు. గుంటూరు ఏసికాలేజీలో ఇంటర్మీడియట్, అనంతపురంలో బీఎస్సీ డిగ్రీ అభ్యసించాడు. మద్రాసులో న్యాయశాస్త్ర కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. అతని పెద్దమ్మ కుమారుడు చిన్నప్పరెడ్డి ప్రోత్సాహంతో మద్రాసులో లాయరుగా ప్రాక్టీసు చేశాడు. మద్రాసు హైకోర్టులో 1953 జూలై 27న న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించాడు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు 1954లో గుంటూరు హైకోర్టుకూ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 1957లో హైదరాబాదుకు వచ్చి ప్రాక్టీసు చేశాడు. 1967లో చిన్పప్పరెడ్డి న్యాయమూర్తిగా నియమింపబడిన తర్వాత స్వంత ప్రాక్టీసు ప్రారంభించాడు. అతను క్రిమినల్ చట్టాలలో నిష్ణాతుడు.[3][4]

నిరుపేదల న్యాయవాది

[మార్చు]

తమకు అన్యాయం జరిగిందంటూ వచ్చిన పేదలకు అండగా నిలిచేవాడు. వామపక్ష భావాలపట్ల అభిమానంతో వుండేవాడు. ఆంధ్రరాష్ట్ర ఉద్యమంతోసహా ఏ రాజకీయ కార్యాచరణలోనూ ఆయన పాల్గొనలేదు. 1962లోనూ, 1965లోనూ ప్రధానంగా కమ్యూనిస్టులను డిటెన్యూలుగా నిర్బంధించినప్పుడు ఆయన వారి తరఫున వాదించాడు. విద్యార్థి దశనుండీ కమ్యూనిస్టు విప్లవకారుల నాయకుడు తరిమెల నాగిరెడ్డిని అభిమానించేవాడు. ఆయనతో సంబంధాలను కలిగి వుండేవాడు.

విప్లవకారులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించిన సందర్భంలో అతను రావి సుబ్బారావు, కన్నాభిరాన్, పత్తిపాటి వెంకటేశ్వర్లు, జీవన్ రెడ్డి, మనోహర్ రాజులతో కలిసి డిఫెన్సు కమిటీగా ఏర్పడి నాగిరెడ్డి కుట్రకేసు, పార్వతీపురం కుట్రకేసులలో వాదించి, చాలామందికి క్రింది కోర్టులు విధించిన శిక్షలను తొలగింపజేశాడు. ఈ కేసులు అబద్ధపు కేసులని రుజువుచేశాడు. ప్రజాస్వామ్య ఉద్యమాలకు పెద్ద అండగా నిరుపేదలకు ఆత్మస్థైర్యం, మనోధైర్యం కల్పించే మంచి న్యాయవాదిగా ఆయనకు పేరుంది.

ఎమర్జెన్సీ కాలంలో విప్లవకారుల నాయకులందరూ రహస్య జీవితంలోకి వెళ్ళగా, వారు ముద్దాయిలుగా వున్న నాగిరెడ్డి కుట్రకేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. అయినప్పటికీ ఎలాంటి ఫీజు ఆశించకుండానే, హైకోర్టులో వాదించి కొందరికి శిక్షలు తప్పించాడు. అయితే ముఖ్య నాయకులకు క్రిందికోర్టు వేసిన శిక్షలను తొలగింపుజేయలేనందుకు ఎంతో బాధను వ్యక్తం చేశాడు. రావి సుబ్బారావు మరణం తర్వాత డెమోక్రటిక్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యాడు. ఈ సంస్థ తర్వాత తన పేరును "ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్" గా మార్చుకుంది. దీనికి దాదాపు 20 ఏళ్ళు అధ్యక్షునిగా వున్నాడు.

పద్మనాభరెడ్డి 60 ఏళ్ల సుదీర్ఘ కాలం క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ చేశాడు. హైకోర్టులో అరవై వేలకు పైగా కేసులు వాదించాడు. సాధారణ ప్రజలు, పేదలు హైకోర్టులో సీనియర్ లాయర్లను నియమించుకోలేరు. వాళ్ల ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఫీజులు ఇవ్వలేని కేసులలో కూడా పద్మనాభరెడ్డి వాదించి గెలిపించాడు. జైలులోని ముద్దాయిలు కార్డుముక్క రాసినా ఆయన స్పందించేవాడు. కేసులో ముద్దాయి ధనికుడా, పేదవాడా అనే తేడా లేకుండా వాదించాడు.

నిరాడంబర జీవితం

[మార్చు]

హైదరాబాదు పాతనగరం నుండి కొత్తనగరం నుండి హైటెక్‌ సిటీ వెళ్లే దారిలోని మెహదీపట్నంలో ఆయన నివాసం. ఇంట్లో ఒక కుర్చీ దాని ముందు టేబుల్‌ ఆ కుర్చీలో అసీనులయ్యే పద్మనాభరెడ్డిగారు ఎలాంటి హంగులు లేకుండా సాదా సీదా వ్యక్తిగానే ఆయన గురించి వెళ్లిన వారికి కనిపించేవాడు. సాధారణంగా క్రిమినల్‌ కేసులు వాదించే లాయరు అంటే క్లయింట్లు, ప్రజల దృష్టిలో ఒక ప్రత్యేకమైన ఆహార్యం, ఆకారం ఆవిష్కారమవుతుంది. ఆయనది తత్‌ భిన్నమైన రూపం. సాదర ఆహ్వానం, హోదాల తేడా లేదు. అత్యంత సంపన్నుల నుండి కూలి చేసుకునేవారు, ఆటోలు నడిపేవారు, అత్యంత పలుకుబడి గల రాజకీయ వేత్తలు, భుజంమీద గొంగళి, చిరిగిన బట్టలు తొడుక్కునే మామూలు ప్రజానీకం ఎవరైనా సరే తమకు కోర్టులో న్యాయవాదిగా ఉండాలని వచ్చిన వారికి తారతమ్యం చూపించని న్యాయవాది పద్మనాభరెడ్డి.

అతని అభిప్రాయాలు

[మార్చు]

భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆయన అభిప్రాయాలు.[5]

  1. “కోర్టులలో కేసులు పేరుకుపోవటం పెద్ద సమస్య. కోర్టుల సంఖ్య పెంచి, సీనియరు లాయర్లను జడ్జిలుగా నియమిస్తే ఈ సమస్య తీరుతుంది”.
  2. “ఫాస్తు ట్రాకు కోర్టుల ఏర్పాటు మంచిదని అనుభవం నేర్పింది. అనేక కేసులు పరిష్కారమయ్యాయి. అయితే వీటితీర్పులపై అప్పీళ్లు హైకోర్టుకు చేరుతున్నాయి. వీటిని పరిశీలించి ఇస్తున్న తీర్పులు ఫాస్ట్ట్రాక్ కోర్టుల తీర్పునే నిర్ధారిస్తున్నాయి. దీనికి రెండు, మూడేళ్లు పట్టడంతో నిందితులు, వారి కుటుంబము అనేక కష్టాలు పడుతున్నారు. (ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల) ప్రయోజనం లేకుండాపోతోంది".
  3. “క్రిమినల్ కేసుల పరిష్కారానికి నాలుగేళ్ళు. అవినీతి కేసులకు 8 ఏళ్లు పడుతున్నది. ఈ ఆలస్యం న్యాయవ్యవస్థకే చేటు కలిగిస్తున్నది".
  4. “న్యాయమూర్తి జి.రఘురామ్ వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల తీర్పును నేను పూర్తిగా సమర్ధిస్తున్నాను. ప్రతి ఎన్కౌంటరు సందర్భంలోనూ ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలి; సంబంధిత పోలీసు అధికారులపై దర్యాప్తు జరిపి, అవసరమైతే కేసులు పెట్టాలి అన్నదే ఆ తీర్పు(ఈ కేసును వాదించింది పద్మనాభరెడ్డిగారే) కేసులను చేపట్టే అధికారాలను మానవ హక్కుల కమీషనకివ్వాలి. అవి వీటిని తామే గుర్తించి, విచారించే అధికారం యివ్వాలి. ఎన్కౌంటరు కేసులను మానవ హక్కుల కోర్టుల పరిధిలోకి చేర్చాలి".
  5. “న్యాయమూర్తుల నియామకాలలో పారదర్శకత వుండటంలేదు. నా అనుభవమే తీసుకోండి. 1980లో నన్ను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు దీనికి ఆమోదం తెలిపాయి. గూఢచారీశాఖ నేను నక్సలైట్ల తరఫున వాదించాననీ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యుడిననీ వ్యతిరేక నివేదిక యివ్వటంతో నా నియామకం ఆగిపోయింది. ఇవి రెండూ రాజద్రోహ నేరాలన్నట్లుగా చిత్రించారు. నా క్లయింటుకు ఎలాంటి రాజకీయ అభిప్రాయాలున్నా, అతని తరఫున వాదించటం లాయరుగా నా బాధ్యత. అలాగే జస్టిస్ కృష్ణఅయ్యర్, భగవతి, దేశాయ్‌లు ఇండియన్ ఆసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సభ్యులే. వివిధ జీవన రంగాలలో వున్న ప్రముఖులతో జాతీయ జుడీషియల్ కమీషన్ ఏర్పాటుచేసి న్యాయమూర్తుల నియామకం చేయటం సరైన ప్రత్యామ్నాయమని భావిస్తున్నాను".

అస్తమయం

[మార్చు]

చాగరి పద్మనాభరెడ్డి 2013 ఆగస్టు 4 తేదీ అనారోగ్యంతో మృతిచెందాడు. అతని ఏకైక సంతానం తనయుడు జస్టిస్ సీ ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం హైకోర్టు జడ్జిగా ఉన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "నిరుపేదల న్యాయవాది".
  2. "Poor man's advocate passes away".
  3. "మహోన్నత న్యాయకోవిదుడు పద్మనాభరెడ్డి". 2 August 2014.[permanent dead link]
  4. "An advocate with a penchant for truth". 8 August 2013.
  5. "ప్రముఖ న్యాయవాది, ప్రజాస్వామికవాది చాగరి పద్మనాభరెడ్డికి జోహార్లు" (PDF). janasakthionline.com. janasakti, monthly. 20 August 2013.[permanent dead link]

బయటి లంకెలు

[మార్చు]