చెందుర్తి యుద్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉత్తర సర్కారులపై ఆధిపత్యం కోసం ఐరోపా దేశాలైన బ్రిటిషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు దేశీయులు తమలోతామే కాక, స్థానిక నాయకులతోనూ అనేక యుద్ధాలు చేసారు. ఈ యుద్ధాల కారణంగా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం మారుతూ వచ్చింది. పర్యవసానాల పరంగా గాని, యుద్ధ ఫలితాల కారణంగా గానీ వీటిలో ప్రధానమైనవి -బొబ్బిలి యుద్ధం, చెందుర్తి యుద్ధం, మచిలీపట్నం ముట్టడి. 1758 డిసెంబరు 9 న జరిగిన చెందుర్తి యుద్ధం తరువాత గోదావరికి ఉత్తరాన ఉన్న భూభాగంపై ఫ్రెంచి వారి అధికారాన్ని అంతం చేసి, బ్రిటిషు వారు ఆధిపత్యంలోకి వచ్చారు.

పరిస్థితులు

[మార్చు]

చెందుర్తి యుద్ధం నాటికి ఉత్తర సర్కారు ప్రాంత పరిస్థితులు ఇలా ఉన్నాయి. మద్రాసు ముట్టడిలో పాల్గొనేందుకు ఫ్రెంచి సేనాని డి బుస్సీ ఉత్తర సర్కారులను కాన్‌ఫ్లాన్స్ రక్షణలో ఉంచి వెళ్ళాడు.బుస్సీ మద్రాసు వెళ్ళిన సంగతి, ఉత్తర సర్కారుల రక్షణకు తగినంత సైన్యం లేదన్న సంగతీ తెలుసుకున్న క్లైవు, అక్కడ ప్రాబల్యం పెంచుకునేందుకు అదే తగిన సమయమని భావించాడు. అప్పటికే విజయనగర సంస్థానాధీశుడు ఆనంద రాజు (ఆనంద గజపతి) బ్రిటిషు వారు ఉత్తర సర్కారులలోని ఫ్రెంచి వారిపై దాడి చేస్తే తాను తోడ్పడతానని కలకత్తాలోని బ్రిటిషు వారికి ఆహ్వానం పంపించి ఉన్నాడు. క్లైవు కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ నేతృత్వంలో 2000 మంది సిపాయీలు, 500 మంది ఐరోపా సైనికులు, 100 మంది నావికులు, ఒక శతఘ్ని దళంతో కూడిన సైన్యాన్ని బెంగాల్ నుండి పంపించాడు. మరోవైపున మద్రాసు నుండి బ్రిటిషు అధికారి ఆండ్రూస్‌ను పంపించి విజయనగర సంస్థానాధీశుడు ఆనందరాజు (ఆనంద గజపతి)తో ఒప్పందం కుదురుచుకునేలా ఏర్పాట్లు కూడా చేసాడు. 1758 అక్టోబరు 15 న వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది.[1][2]

ఒప్పందం తరువాత, ఇరుసైన్యాలూ కలిసి ఫ్రెంచి వారిని ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డాయి.

చెందుర్తి యుద్ధం

[మార్చు]

కలకత్తా నుండి ప్రాన్సిస్ ఫోర్డు నాయకత్వంలో బ్రిటిషు సైన్యం అక్టోబరు 20 న విశాఖపట్నం చేరింది. అక్కడి నుండి బయలుదేరి నవంబరు 1 న కశింకోట వద్ద ఆనందరాజును కలిసింది. రెండు సైన్యాలూ కలిసి ఫ్రెంచి కోట ఉన్న రాజమండ్రి వైపు సాగాయి. తమపై తిరుగుబాటు చేసి, బ్రిటిషు వారితో చేతులు కలిపిన ఆనందరాజుపై దాడి చేసి బుద్ధి చెప్పేందుకు గాను ఫ్రెంచి సైన్యం అప్పటికే సిద్ధమై రాజమండ్రి వద్దే ఉంది. ముందుకు సాగిన సంయుక్త సైన్యం డిసెంబరు 3 న పిఠాపురం దగ్గరలోని గొల్లప్రోలు వద్ద ఫ్రెంచి దళాల శిబిరం వద్దకు చేరింది. డిసెంబరు 6 న బ్రిటిషు సైన్యం చేబ్రోలు గ్రామాన్ని ఆక్రమించుకుంది. ఆ తరువాత మూడు రోజుల పాటు రెండు సైన్యాలూ ముందడుగు వెయ్యకుండా ఎక్కడివక్కడే ఉండిపోయాయి.

డిసెంబరు 9 ఉదయాన్నే ఫోర్డు తన సైన్యాన్ని తీసుకుని కుడివైపుగా ఉన్న గుట్టల వెనగ్గా సాగి 8 గంటలకల్లా 3 మైళ్ళ దూరంలోని చెందుర్తి (కోండోర్) గ్రామం చేరుకున్నాడు. రెండు సైన్యాల మధ్య 4 మైళ్ళ దూరం ఉంది. వారి మధ్య ఓ చిన్న గ్రామం ఉంది. ఫోర్డు ఆ గ్రామాన్ని స్వాధీనం చేసుకోదలచాడని కాన్‌ఫ్లాన్స్ భావించి తన సైన్యాన్ని ముందుకు నడిపించాడు. అయితే బ్రిటిషు సైన్యం మాత్రం ముందుకు కదల్లేదు. కాన్‌ఫ్లాన్స్ దాన్ని వారి బలహీనతగా అనుకుని, వాళ్ళు తిరిగి చేబ్రోలు వెళ్ళిపోతారని భావించాడు

ముందుకు సాగిన ఫ్రెంచి సైన్యం బ్రిటిషు సైన్యం నుండి ఒక మైలు దూరంలో ఆగింది. రెండు సైన్యాలూ ఒకే మాదిరిగా మోహరించి ఉన్నాయి. ఐరోపా సైనికులు మధ్యలోను, శతఘ్ని దళాలు వారికి రెండు వైపులా, సిపాయీలు రెండు పార్శ్వాల్లోనూ ఉన్నారు. బ్రిటిషు శిబిరంలోని ఆనందరాజు దళం మాత్రం బ్రిటిషు సైన్యానికి వెనక, దూరంగా ఉంది. రాజుపై ఉన్న అపనమ్మకంతో ఫోర్డు ఆ ఏర్పాటు చేసాడు[3]. బ్రిటిషు సైన్యంలోని ఐరోపా దళం ఏపుగా పెరిగిన జొన్న చేల మధ్య ఉండి ఫ్రెంచి సైన్యానికి కనబడకుండా ఉండగా ఇరువైపులా ఉన్న సిపాయీలు మైదానంలో ఉన్నారు. ఫ్రెంచి సైన్యం శత్రు సైన్యానికి ఎదురుగా పోకుండా, కుడి వైపుకు తిరిగి, బ్రిటిషు సైన్యపు ఎడమ పార్శ్వపు సిపాయీలపై దాడి చేసారు. ఆ సిపాయీలు ఎర్ర చొక్కాలు ధరించి ఉన్నారు. అది చూసి, వారిని బ్రిటిషు ఐరోపా సైన్యంగా ఫ్రెంచివారు పొరబడ్డారు.[4] ఈలోగా ఆ సిపాయీలు ఫ్రెంచి దాడిని తట్టుకోలేక వెనక్కు పారిపోయారు. ఫ్రెంచి సైన్యం వారిని వెంబడించి ముందుకు పోయింది. అప్పుడు వారి వెనుకే, భుజాలపై తుపాకులతో, మొక్కజొన్న చేలలోంచి బయటకు వస్తూన్న బ్రిటిషు సైన్యం కనబడింది. బ్రిటిషు సైన్యం పారిపోయిన తమ సిపాయీలు ఖాళీ చేసిన స్థలాన్ని చేరుకుంది. సిపాయీలను తరిమే పనిలో చెల్లాచెదురై ఉన్న ఫ్రెంచి సైన్యం తిరిగి కూడగట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ బ్రిటిషు వారి కాల్పుల కారణంగా ఆ పని చెయ్యలేకపోయింది. సిపాయీలను వెంటాడే సమయంలో ఓ మైలు వెనుక వదలిపెట్టి వచ్చేసిన తమ ఫీల్డు గన్నుల వద్దకు చేరుకునేందుకు ఫ్రెంచి సైన్యం పరుగెత్తింది. బ్రిటిషు సైన్యం వారిని వెంటాడింది. బ్రిటిషు వారు అక్కడికి చేరుకునేసరికి ఫ్రెంచివారు ఫీల్డు గన్నులతో సిద్ధమై, వారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో బ్రిటిషు అధికారి ఆడ్నెట్ హతుడయ్యాడు. అతడి సైనికులు ముందుకు సాగి ఆ ఫీల్డు గన్నులన్నిటినీ పట్టుకున్నారు. ఫ్రెంచి సైన్యం గొల్లప్రోలువద్ద ఉన్న తమ శిబిరానికి పారిపోయింది. ఈలోగా ఫ్రెంచి వారి దాడికి పారిపోయిన బ్రిటిషు సిపాయీలు, తిరిగి వచి, తమ ఫీల్డు గన్నుల వెనక చేరారు.

కెప్టెన్ నాక్స్ నాయకత్వంలో బ్రిటిషు సైన్యం ఫ్రెంచి వారి గొల్లప్రోలు శిబిరంపై దాడికి వెళ్ళాయి. ఫ్రెంచి సైన్యం అది చూసి తమ శిబిరాన్ని వదిలి తమ ఆయుధాలను అక్కడే వదిలిపెట్టి, చెల్లాచెదురుగా పారిపోయింది. 30 ఫీల్డుగన్నులను, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రినీ బ్రిటిషు వారు పట్టుకున్నారు. ఆరుగురు ఫ్రెంచి అధికారులు, 70 మంది సైనికులూ చనిపోయారు. సుమారుగా అంతే సంఖ్యలో బందీలుగా పట్టుకున్నారు. బ్రిటిషు సైన్యంలో 1 అధికారి, 15 మంది సైనికులూ మరణించారు. కాన్‌ఫ్లాన్స్ యుద్ధభూమి నుండి గుర్రంపై నేరుగా రాజమండ్రికి పారిపోయాడు. అతడి సైన్యం కూడా రాజమండ్రికి పారిపోయింది.

ఈ యుద్ధంతో ఉత్తర సర్కారులపై ఫ్రెంచి ఆధిపత్యపు అంతం మొదలైంది.[5]

పర్యవసానాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "1758 -బ్రిటిష్ ఆపరేషన్స్ ఇన్ దక్కన్". Archived from the original on 2016-03-07. Retrieved 2016-09-02.
  2. మోరిస్, హెన్రీ (1878). ఎ డిస్క్రిప్టివ్ అండ్ హిస్టారిక్ ఎకౌంట్ ఆఫ్ ది గోదావరి డిస్ట్రిక్ట్ ఇన్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్. లండన్: ట్రబ్నర్ అండ్ కంపెనీ. p. 234.
  3. స్టాఫ్ రిపోర్టర్ (1843). హిస్టారికల్ రికార్డ్ ఆఫ్ ది ఆనరబుల్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఫస్ట్ మద్రాస్ రెజిమెంట్. లండన్: స్మిత్, ఎల్డర్ అండ్ కంపెనీ. p. 146.
  4. Orme, Robert (1861). A history of the military transactions of the British nation in Indostan : from the year MDCCXLV; to which is prefixed A dissertation on the establishments made by Mahomedan conquerors in Indostan. Madras: Pharoah and Co. pp. 379.
  5. Innes, Percival Robert (1885). The history of the Bengal European regiment : now the Royal Munster Fusiliers, and how it helped to win India. London: Simpkin, Marshall & Co. p. 80.