జక్కా వెంకయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జక్కా వెంకయ్య
జక్కా వెంకయ్య

జక్కా వెంకయ్య


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు
పదవీ కాలం
1985-1989, 1994-1999
నియోజకవర్గం ఆలూరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1930 నవంబరు 11
దామరమడుగు,నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్
మరణం 2018 మే 29(2018-05-29) (వయసు 87)
హైదరాబాదు
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
సంతానం అశోక్‌, జయరామిరెడ్డి (కుమారులు)
శాంతమ్మ, శారద (కుమార్తెలు)
మతం హిందూ

జక్కా వెంకయ్య మార్క్సిస్టు పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.[1] [2] అతను 1985, 1994 లలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యునిగా పనిచేసాడు. అతను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపక నేతల్లో ఒకడు. వెంకయ్య ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య పెద్దమ్మ మనవడు. చిన్నప్పటి నుంచీ పుచ్చలపల్లి సుందరయ్య, డాక్టర్‌ రామచంద్రా రెడ్డిలతో కలిసి పెరిగాడు. దాంతో ఆయన మీద వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల చిన్నప్పటి నుంచి మరణించే వరకు మార్క్సిస్టుగా జీవించాడు. సుందరయ్య ప్రేరణతో అతనిలాగే "రెడ్డి" అనే కుల చిహ్నాన్ని పేరులోంచి తొలగించుకొని వెంకయ్య అయ్యాడు.[3]

జీవిత విశేషాలు[మార్చు]

జక్కా వెంకయ్య నెల్లూరు జిల్లా, దామరమడుగులో జక్కా రమణయ్య[4], శంకరమ్మ దంపతులకు 1930 నవంబర్‌ 3వ తేదీన జన్మించాడు. ఎస్‌.ఎస్.ఎల్.సి వరకు బుచ్చిరెడ్డిపాలెం చదివాడు. ఆ తరువాత కుటుంబభారం మీద పడటంతో కొన్నాళ్లు వ్యవసాయం చేశాడు. ఈ క్రమంలో భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణలో మొదలయిన రైతాంగ సాయుధ పోరాట ప్రభావం ఆయనపై పడింది. 1948 నుంచి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నిషేధ సమయంలో రహస్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాడు. దామరమడుగు గ్రామంలో పార్టీ నేతలకు రక్షణ కల్పించాడు. అప్పటి ప్రభుత్వం ఆయనను 15 రోజులు జైలుకు పంపించింది. వెంకయ్య 1951లో స్థానిక కమ్యూనిస్టు నాయకుడు డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి ప్రోత్సాహంతో సీపీఐలో సభ్యత్వం తీసుకొన్నారు. ప్రజా పోరాటాలే ఊపిరిగా ఆయన పయనం సాగింది. వ్యవసాయ కూలీలకు ఆరు సవాశేర్ల కూలీ ఇవ్వాలంటూ 1953లో ఆయన గ్రామం దామరమడుగులో గొప్ప పోరాటం నడిచింది. ఈ ఉద్యమానికి వెంకయ్య నాయకత్వం వహించాడు. ఆయన తీరు అగ్రనాయకత్వాన్ని ఆకట్టుకొంది. వెంకయ్యను 1956లో సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడిగా నియమించింది[5]. 1957లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దామరమడుగు సర్పంచ్‌గా గెలిచి, ఏడేళ్లపాటు కొనసాగాడు. సైద్ధాంతిక విషయాల్లో తలెత్తిన విభేదాలతో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలినప్పుడు, ఆయన సీపీఎం వైపు నిలిచాడు. నెల్లూరు జిల్లాలో సీపీఎం బలోపేతానికి కృషి చేశాడు. 1965లో డిటెన్యూగా రాజమండ్రి జైలులో సంవత్సరం ఐదునెలల జైలు జీవితం గడిపాడు. అప్పట్లో చైనా అనుకూల, కాంగ్రెస్‌ వ్యతిరేక వైఖరిని ఆయన పార్టీ తీసుకొంది. ఈ కారణంగా ఆయన 1965లో అరెస్టు అయి రాజమండ్రి జైలులో ఏడాదిన్నర కాలం గడిపాడు. అక్కడ గౌతు లచ్చన్న, సత్యనారాయణరెడ్డి తదితరులకు రాజకీయ తరగతులు బోధించాడు. జైలు నుంచి బయటకురాగానే, తిరిగి పోరాటాల్లోకి దూకాడు. నెల్లూరు జిల్లాలో చెరువు లోతట్టు బంజరు సాగుదార్ల పోరాటానికి నాయకత్వం వహించారు. 15 ఏళ్లఉద్యమం ఫలితంగా 10 వేల ఎకరాలు రైతులకు దక్కాయి. 1975 ఎమర్జెన్సీలో ఏడాదిన్నర కాలం జైలు జీవితం గడిపాడు. భూస్వాముల వద్దనున్న భూములను పేదలకు పంచాలంటూ 1979లో మరో ఉద్యమం చేపట్టాడు. 1992లో ఆక్వా రైతుల సమస్యలపై పోరాడారు. 1993లో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. 2002లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.[6] అతను రాజకీయ ఆర్థికశాస్త్రం[7], గతితార్కిక భౌతికవాదం[8], చారిత్రక భౌతికవాదం అనే పుస్తకాలు రాశాడు.అతను రాసిన రాజకీయ అర్ధశాస్త్రం, అదనపు విలువ–శ్రమ దోపిడీ అనే పుస్తకాలు విస్తృత పాఠకాదరణ పొందాయి. ఉద్యమకారులకు కరదీపికలుగా ఉపయోగపడ్డాయి. నెల్లూరు జిల్లాలో అనేకమంది మార్క్సిజం వైపు మొగ్గడానికి కారణమయ్యాడు. వ్యవసాయ కార్మిక ఉద్యమాల్లో, భూ పోరాటాల్లో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు. జిల్లాలో భూపోరాటాలకు కేంద్ర బింధువుగా నిలిచాడు. పేదలకు వేలాది ఎకరాలు భూములు దక్కేందుకు కారణమయ్యాడు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన సారా వ్యతిరేక ఉద్యయంలో కీలకపాత్ర పోషించాడు.[9] సి.పి.ఎం పార్టీ అతనిని సి,పి.ఎం కేంద్ర కమిటీకి ఎంపిక చేసింది.[10]

నిరాడంబర శాసనసభ్యుడు[మార్చు]

1985,[11] 1994[12]లో ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 1995 నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దీర్ఘకాలం పనిచేశాడు. 2002లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు[13].సుందరయ్య లాగే అత్యంత నిరాడంబరంగా జీవించాడు. ఎమ్మెల్యేగా ఉండి కూడా సొంతం అంటూ లేకుండా జీవించాడు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయాన్నే తన నివాసం చేసుకొన్నాడు. ఆ కార్యాలయంలోని ఓ చిన్న గదిలో రెండు బెంచీలను ఒకచోటకు జరిపి, మంచంగా వాడుకొని అక్కడే నివసించాడు. సొంతంగా తానే వంట చేసుకొనేవాడు. అప్పట్లో సైకిల్‌ మీద అసెంబ్లీకి వెళ్లిన పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శాన్ని వెంకయ్య నిలబెట్టాడు. మాజీ ఎమ్మెల్యే కింద తనకు లభించే పింఛను డబ్బులను కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకే వెచ్చించేవాడు[14].

మరణం[మార్చు]

అతనికి గుండె పోటు వల్ల నెల్లూరులోని సింహపురి స్పెషాలిటీ ఆస్ప త్రిలో వైద్యం పొందుతూ 2018 మే 29 న మరణించాడు. అతనికి అశోక్‌, జయరామిరెడ్డి అనే కుమారులు, శాంతమ్మ, శారద అనే కుమార్తెలు ఉన్నారు.[15]

మూలాలు[మార్చు]

 1. "జక్కా వెంకయ్య అస్తమయం.....జక్కా వెంకయ్య అస్తమయం..." TELUGUGLOBAL. 2018-05-29. Archived from the original on 2018-06-01. Retrieved 2018-05-30.
 2. "CPM veteran leader Jakka Venkaiah dies". The Hans India. Retrieved 2018-05-30.
 3. "జక్కా వెంకయ్య కన్నుమూత -". www.andhrajyothy.com. Retrieved 2018-05-30.[permanent dead link]
 4. "Empowering India - Making democracy meaningful, Know our Representative & Candidate". www.empoweringindia.org. Retrieved 2018-05-30.[permanent dead link]
 5. "CPI(M)'S Rashtra Rakshana Bheri". archives.peoplesdemocracy.in. Retrieved 2018-05-30.[permanent dead link]
 6. "ELITES OF COMMUNIST MOVEMENT IN NELLORE DISTRICT. పుట సంఖ్య: 91" (PDF).
 7. "Jakka Venkaiah". www.anandbooks.com. Retrieved 2018-05-30.[permanent dead link]
 8. "Amazon.in: Jakka Venkaiah: Books". www.amazon.in. Retrieved 2018-05-30.[permanent dead link]
 9. "Anti-liquor activist Dubagunta Rosamma no more". The New Indian Express. Retrieved 2018-05-30.
 10. "CPM leaders from AP get their due - Times of India". The Times of India. Retrieved 2018-05-30.
 11. "Andhra Pradesh Assembly Election Results in 1985". www.elections.in. Retrieved 2018-05-30.
 12. "Andhra Pradesh Assembly Election Results in 1994". www.elections.in. Archived from the original on 2016-09-05. Retrieved 2018-05-30.
 13. "సీపీఎం సీనియర్‌ నేత జక్కా వెంకయ్య కన్నుమూత". Sakshi. 2018-05-30. Retrieved 2018-05-30.
 14. "కమ్యూనిస్టు ధ్రువతార జక్కా వెంకయ్య కన్నుమూత -". www.andhrajyothy.com. Archived from the original on 2018-05-31. Retrieved 2018-05-30.
 15. "మజీ ఎమ్మెల్యే జక్కా వెంకయ్య కన్నుమూత - Kommineni News". kommineni.info. Archived from the original on 2018-05-31. Retrieved 2018-05-30.