Jump to content

జి.యస్.సుందరరాజన్ స్వామి

వికీపీడియా నుండి
జి.యస్.సుందరరాజన్ స్వామి

బిరుదులు:"సాంగవేద విద్వాన్", "వేదవిద్యాచార్య", "వేదాంత వాచస్పతి ", "దేశిక హృదయాభిజ్ఞ"
సుందరాజన్ స్వామి ఛాయాచిత్రపటం.
జననం
గొడవర్తి శ్రీనివాస సుందర రాజన్

(1948-12-12) 1948 డిసెంబరు 12 (వయసు 76)
జాతీయతభారతీయుడు
వృత్తివిశ్రాంత గ్రేడ్ ఒన్ సంస్కృత పండితులు
క్రియాశీల సంవత్సరాలు2006 లో పదవీవిరమణ.
రచనలు:ఆర్ష విజ్ఞాన సర్వస్య వ్యాసాలు, కాళిదాస దర్శన రూపములుగా 6 వ్యాసాలు, హయగ్రీవ, నరసింహ, విష్ణుప్రియ, యదువిభు, బదరీశ సుప్రభాత మంగళా శాసనములు, బదరీశప్రపత్తి, నైమిశనాధకృష్ణద్వాదాశ నామస్తోత్ర లక్ష్మీ సహస్రనామ స్తోత్రము. విష్ణుసహస్రనామములకు సంస్కృత, తెలుగు భాషలలో అనువాదం.
తల్లిదండ్రులుతండ్రి గొడవర్తి శఠకోపాచార్యులు, తల్లి:అమృతవల్లి తాయారు
1981 నుండి 1994 వరకు ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం నుండి అమరవాణి కార్యక్రమాలు, వేద సాహిత్య నాటక ఇతిహాస విషయాలపై ప్రసారమైనవి.

గొడవర్తి శ్రీనివాస సుందర రాజన్ స్వామి ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

గొడవర్తి శ్రీనివాస సుందర రాజన్ స్వామి తూర్పుగోదావరి జిల్లా, రాయవరం మండలం, పసలపూడిలో గొడవర్తి.శఠకోపాచార్యులు,శ్రీ అమృతవల్లి తాయారు దంపతులకు 1948 లో జన్మించారు. ఆయన కృష్ణ యజుర్వేదం, క్రమాన్తం, విద్యాప్రవీణ, (ఎ.యు), భాషాప్రవీణ,(ఎ.యు), ఎం.ఎ (వ్యాకరణం)(ఎ.యు)వేదభాష్యమ్, వేదాంత శాస్త్రమ్, శిక్షాశాస్త్రి(తిరుపతి కె.ఎస్.విద్యాపీఠం అనే విద్యార్హతలను పొందారు. ఆయన వేదభాష్య గురువు బ్రహ్మశ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈయన సూత్ర భాస్యాన్ని చతుస్తన్త్రి శ్రీ ఉ.వే.శ్రీమాన్ గొడవర్తి శఠకోపాచార్యస్వామి వారివద్ద (ద్రావిడ సాంప్రదాయ గ్రంథముల అధ్యయనము) పొందారు.

సమ్మేళనాలు

[మార్చు]
గ్రంధావిష్కరణ తణుకు శ్రీ రామకృష్ణ సేవాసమితిలో జరిగిన తరువాత భక్తులకు గ్రంథ వితరణ చేస్తున్న సుందరరాజన్ స్వామి
  1. అఖిలభారత వేదవిద్వత్సమ్మేళనం, చెన్నై కామకోటిపీఠ నిర్వహణ-1966
  2. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ పెద్ద జీయర్ స్వామి వారిచే నిర్వహించబడిన అఖిలభారత వేద విద్వత్సమ్మేళనం, న్యూఢిల్లీ, రామలీలా మైదానం -1973.
  3. అష్టోత్తర సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ క్రతువు, తిరుమల
  4. ఇంకను అనేక క్రతువులు, వేదాంత సభల యందలి ప్రవచనములు, వేదసాహిత్య మిళిత ఉపన్యాసము మొదలగునవి.సంస్కృత భాషాప్రచారము, విశ్వసంస్కృత ప్రతిష్ఠాన కార్యదర్శిగా (దక్షిణాంధ్ర ప్రాంతీయ), సంస్కృతవికాస సమితి అధ్యక్షులుగా నుండిరి.

బిరుదులు

[మార్చు]
  1. శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారిచే వాగ్రూపమున "సాజ్గవేదవిద్వాన్" అను బిరుదము అనుగ్రహించ బడింది.
  2. శ్రీ ఉ.వే.శ్రీమాన్ తె.కం.గోపాలాచార్యస్వామివారు, వేదవిశ్వవిద్యాలయం, సీతానగరం సంస్థ యొక్క ప్రథమ వార్షికోత్సవ సందర్భముగా సాంగాధ్యయన మొనరించిన మా సుందరరాజన్ స్వామిని "వేదవిద్యాచార్య"గా గౌరవిస్తున్నాము అని వాగ్రూపముగా గౌరవించిరి.
  3. అనంతపురం జిల్లా ధర్మవరంలో తిరుప్పావై శరణాగతి గద్య ప్రవచన సందర్భముగా "వేదాంత వాచస్పతి" అను బిరుదమును ప్రదానము గావించిరి. 2010 జనవరిన ఈ బిరుద ప్రదానము పరకాల మఠం ధర్మవరం వారిచే జరుపబడింది.
  4. ధర్మవరంలోనే సర్వతంత్రస్వతంత్రులగు వేదాంత దేశికుల పాదుకాసహస్ర, తిరుపావై ప్రవచన సందర్భముగా "దేశిక హృదయాభిజ్ఞ" అను బిరుదమును పరకాల మఠము వారిచ్చి సత్కరించిరి. ఈ ప్రవచనం ది.16-11-2010 నుండి 19-01-2011 వరకు జరిగింది.

సాహిత్య సంస్కృత భాషాప్రచారం

[మార్చు]

1981 నుండి 1994 వరకు ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం నుండి అమరవాణి కార్యక్రమములు వేద సాహిత్య,నాటక,ఇతిహాస విషయములపై ప్రసారమైనవి.1977లో సంస్కృత వికాస సమితి అను సంస్థను స్థాపించి, దానికి అధ్యక్షులుగా నున్న సమయంలో పి.టి.జి. రంగాచార్యులు కార్యదర్శిగా నుండి కొన్ని సంవత్సరాలు అనేక సంస్కృతశిక్షణా తరగతులను నిర్వహించాడు. దేవాలయములందు వేదపండితులను ఏర్పాటుచెయ్యాలనీ, సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వంతో 1977 నుండి 1988 వరకు అవిరళ కృషి చేసాడు.మరికొందరి సూచనలతో ఆ ప్రణాళిక అమలు జరుగుచున్నది. 1993 నుండి అనేక యజ్ఞములను, క్రతువులను, సామూహిక విష్ణుసహస్రనామ పారాయణలను,వేదాంత, సామాజిక, ధార్మిక ఉపన్యాసాలను చేసారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమందేకాక, ఇతరరాష్ట్రాలలో వారికి అభిమానులు,శిష్యులు ఉన్నారు..

వృత్తి

[మార్చు]

1971 నుండి 2006 వరకు సంస్కృత పండితులుగా జిల్లా పరిషత్ యందు పనిచేసాడు.గృహమందు ఉభయ వేదశిక్షణ,కావ్య,నాటక, సాహిత్య గ్రంథ పాఠ ప్రవచనములు జరుగుచున్నవి.

రచనలు

[మార్చు]

ఆర్ష విజ్ఞాన సర్వస్వ వ్యాసములు, కాళిదాస దర్శన రూపములుగా 6 వ్యాసములు, హయగ్రీవ, నరసింహ, విష్ణుప్రియ, యదువిభు, బదరీశ సుప్రభాతమంగళాశాసనములు, బదరీశ ప్రపత్తి, నైమిశనాధ, కృష్ణద్వాదశనామస్తోత్ర లక్ష్మీసహస్రనామ స్తోత్రములను రచించిరి. 1.సంవత్సర వైభవము, 2.పంచస్తవి అను గ్రంథములు జీయర్ శతాబ్దిగా ఆవిష్కరించబడినవి. 3.తిరునారాయణపుర వైభవము, బదరీశ సుప్రభాతాదులకు తెలుగు వ్యాఖ్యానములు జరిగినవి. సుప్రభాతాదులు కొన్ని ముద్రితములు. శ్రీ విష్ణుసహస్రనామమునకు సంస్కృత, తెలుగు భాషలలో స్వయముగా వ్యాఖ్యానము జరిగింది.ముద్రణలో ఉంది. వీరు సనాతన ధర్మ ప్రతిష్థానమను సంస్థను 1993 లో స్థాపించి, దాని ద్వారా అనేక ధార్మిక సామాజిక కార్యక్రమములను నిర్వహించిరి. విద్యార్థులకు, సంస్క్ర్తత శిక్షణ, వక్త్రుత్వ,వ్యాసరచన పోటీలను నిర్వహించిరి.విద్యార్థులను ఉత్సాహపరిచి అందు పాల్గొనినవారందరికీ సనాతన ధర్మప్రతిష్ఠానం తరపున బహుమతులు ప్రమాణపత్రములు ఈయబడినవి. ది.16-11-2011 కిన్నెర ఆర్త్స్ థియేటర్వారి ఆధ్యాత్మిక సాంస్కృతికోత్సవ సందర్భముగా ఆధ్యాత్మిక తత్వవేత్తగా సన్మానము.ఈ ఉత్సవమునకు శ్రీమాన్ పి.బి.ఆర్.కె.ప్రసాద్,తి.తి.డి.ఇ.ఒ.ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారు,తెలుగు విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గోపి మొదలగువారు వీరిని సభావేదికపై సత్కరించిరి. 2011 ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుండి భాద్రపద బహుళ తృతీయ పర్యంతము 63 ఏకాహ్నిక సుదర్శన యాగములు, లక్ష్మీనరసింహ వరివస్యగా బదరీనాధ్ లో నిర్వహించి సాధుసత్పురుషులకు సన్మానము గావించిరి. 2012 ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుండి భాద్రపద శుద్ధ పూర్ణిమ పర్యంతము 45 సుదర్శన ఏకాహ్నియాగములను, 15 రోజులు శ్రీ యాగమును బదరీనాధ్ లో నిర్వహించిరి.దీనితో 108 ఏకాహ్నిక యాగములను పూర్తిగావించిరి.ఈ యాగములకు అనేక ప్రాంతములనుండి భక్తులు వచ్చి సహాయ సహకారములు అందించిరి. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయరు స్వామివారి అష్టాక్షరీ క్షేత్రము బదరీనాధ్ యందు శ్రీ స్వామివారి అనంత మంగళాశాసనములతో 108 ఏకాహ్నిక సుదర్శనయాగములను పూర్తిచేసిరి.వీరు ఇత:పూర్వము అనేక మహాసౌర పూర్వక క్రతువులను నిర్వహించిరి.1993న ప్రారంభమయిన ఈ సనాతన ధర్మ ప్రతిష్ఠానము లోకకల్యాణార్ధము అనేక కార్యక్రమములను నిర్వహించుచున్నది అని తెలుపుచున్నాము. తొందరలో యాగశాలాది నిర్మాణములో వైదిక క్రతు నిత్యహోమములను ఏర్పాటు చేయదలచి దాని నిమిత్తము కృషిచేస్తున్నారు.

శ్రీ విష్ణుసహస్ర నామస్తోత్రం భావప్రకాశికాఖ్యా వ్యాఖ్యపై ప్రముఖుల అభిప్రాయాలు

[మార్చు]

ప్రియ స్వామినః-- అనేక మంగళాశాసనాలు: దేవరవారు విష్ణు సహస్రనామంపై వ్రాసిన సంస్కృతాంధ్రవ్యాఖ్యానాలను స్థాలీవులాక న్యాయంగ చూచినాము.సమయాభావం వల్ల విశదంగా అనుశీలించడం కుదరలేదు.యధావకాశంగ ముందు ముందు అనుసంధానం చేస్తాం .చూచినంత వరకు దేవరవారి రచన విస్పష్టంగాను,నిర్ధుస్టంగాను ఉంది.శ్రీ పరాశర భట్టరుల వ్యాఖానం మనకు సంప్రదాయ రహస్యాలను ఆవిష్కరించేది అయినప్పటికీ దేవరవారు యధొచితంగా శాస్త్రవిషయాలను ముఖ్యంగా శ్రీ రామానుజ దర్శన సమన్వయాలను అక్కడక్కడ చూపుతూ వ్యాఖ్యానానికి గౌరవాన్ని,ఉపాదేయతను సంతరించారు.ఈనాడు విష్ణుసహస్రనామం పట్ల ప్రీతి సామాన్యలోకంలో కూడా విస్తరించడం ఆనందింపదగిన విషయమే,అయినా అందులోని యథార్థ విషయతత్వాన్ని అందుకునే జిజ్ఞాస కలవారు,దాన్ని అవగాహన చేసుకుని లోకంలో సార్వజనీనంగా ప్రచారం చేసేవారు కరువైనారన్నది తప్పక అంగీకరించవలసిణ సత్యం.

ముఖ్యంగా భగవత్ గుణరత్నకోశం సామాన్యులకు బుద్ధిమంతులకు సమానంగా అందేలా విశేష పరిశ్రమ చేసిన ఉ.వే.శ్రీమాన్ ఎస్.ఎన్.సి.రఘునాధాచార్య స్వామి వారి రచన బహువిస్తారమై విషయ గౌరవంతో పాటు గ్రంథ గౌరవాన్ని పొంది మనందరకూ ఆలంబమై ఉండటం మన అదృష్టం కాగా,దేవరవారి ప్రయత్నం మరింతగా మహొపకారం అవుతుందనటంలో మాకెంత మాత్రం సందేహం లేదు.న్యాయవేదాంత నిష్ణాతులైన నాన్న గారి సంస్కారాన్ని పుణికిపుచ్చుకుని దానికి వేదపరిమళాన్ని అందించిన దేవరవారు విష్ణుసహస్ర నామ వివరణంలో చేసిన కృషి చిరస్మరణీయం అనడంలో సందేహం లేదు.జ్ఞానానుష్టానాలు రెండూ సమస్కంధాలుగా కలిగిన దేవరవారి కృషి బహుముఖీనమై లోకోపకారకం కావాలని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం.---జై శ్రీమన్నారాయణ.జీయరు ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ,త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి.

మంగళశాసనాలు

[మార్చు]

శ్రీ ఉ.వే.శ్రీమాన్ సుందరరాజన్ స్వామివారు 1995 నుండి పరిచయం.వారికి నాయందు మిక్కిలి అభిమానము.వారు మంచి వక్త అలుపులేకుండా చాలాసేపు అధ్యనమూ చేయగలరు.అధ్యాపనమూ చేయగలరు.అనేక శాస్త్రములను పరిశీలించినవారు.పాలకొల్లు పట్టణంలో నున్న సమయంలో నా వద్దకు తమ 'భావప్రకాశిక'అనే విష్ణుసహస్ర నామ స్తోత్ర వ్యాఖాన గ్రంథమును తీసికొని వచ్చి మంగళా శాసనములు చేయవలెనని కోరినారు ఏ గ్రంథమునైనా పరిష్కరించవలె నంటే శ్రమ సాధ్యము కాని,భగవత్ భాగవత ఆచార్య కైంకర్యరూపముగ నది విలసిల్లవలెనని మంగళా శాసనము చేయుట సత్పురుషులందరి స్వరూపమే కదా!ఇందు స్రమేమున్నది.భగవద్రామానుజుల వారి శ్రీపాద చాయని ఆశ్రయించి జీవితాలను ధన్యం చేసికొంటున్న వారందరికీ 'భగవద్గుణ దర్పణ' అనే పేరుగల పరాశర భట్టరు వారి విష్ణుసహస్ర నామ వ్యాఖ్యానమే పరమ ప్రమాణంగా నడుస్తోంది.ఎంబెరుమానార్లకు,ఎంబార్ కు కూడా సన్నిహితంగా మెలగిన పరాశరభట్టరు వారి వ్యాఖా రాబోయే తరాలవారికి కూడా శిరోధార్యం గానే ఉండాలనేది శ్రీ వైష్ణవ లోకం అభిలాష.అందుచేత అటువంటి భగవద్గుణ దర్పణ అనువాదములు,వివరణములు భాగవతోత్తములు ముఖవికాసమునకు తప్పక దోహదం చేస్తాయి.అది భగవన్ముఖ వికాసానికి ఆచార్య ముఖ వికాసానికి కూడా కారణమౌతుంది.ముఖవికాసమనే దానినే సాంకేతికంగా 'కైంకర్యం'అంటున్నాం అందరం.భగవద్గుణ దర్పణ విషయములు మరింత సరళంగా సామాన్య పాఠకులకు అందుబాటులోకి తీసికొని రావాలనే ఆకాంక్షతో తమ భావప్రకాశికాఖ్య వ్యాఖ్య బయలుదేరినట్లు శ్రీ మాన్ సుందరరాజన్ గారు నాతొ అన్నారు.అభిలషణీయమే కదా!సంస్కృత భాషలో వ్యాఖ్యానము,దానికి తెలుగు అనువాదము,విశేషములు---ఇవన్నీ చాలా శ్రమ సాధ్యమైనవి.శ్రీమాన్ సుందరరాజన్ గారి శ్రమ వృధా కాకూడదని,గ్రంధము లోని భగవద్గుణ దర్పణానుసారి అయిన ప్రతి వాక్యము భగవత్ భాగవత ఆచార్య కైంకర్య రూపంగా పరిణమిచాలనీ అనేకానేక మంగళా శాసనములు చేస్తూ....శ్రీరస్తు --- శ్రీ రంగరామానుజ జీయర్,కాకినాడ.08-12-2013,పాలకొల్లు.

హార్దాశయం

[మార్చు]

శ్రీమతే రామానుజాయ నమః న్యాయవేదాంత విద్వాన్ ఉ.వే.శ్రీమాన్ ఈయుణ్ణి రంగాచార్య స్వామి వారు,భారద్వాజ భవనం,నరసాపురం . "దేవో నామసహస్రవాన్" అని,నామజ్ఞ్జళా యిరముడైయ ఎమ్బెరుమాన్ " అని",నామనాయిరమేత్త నిన్ననాయణ "అని భగవానుడు వేయినామాలు కలవాడని కీర్తింపబడు తున్నాడు.(ఇక్కడ సహశ్ర శబ్దం అనేకార్ధకం) సకల జగత్కారణ భూతుడు,సర్వరక్షకుడు,సనస్త కల్యాణగుణాకరుడైన భగవానుడు చేతనా చేతనాలను తనకు శరీరంగా కల్గినవాడైనందున సకల శబ్దవాచ్యుడైనా ఆస్వామి తెలిపే నామాలలో ప్రధానమైన నామాలు వేయి-అని పూర్వోక్త మహాభారత ప్రమాణం వల్ల,దివ్య సూరిసూక్తుల వల్ల నిష్కర్షిం పబడుతున్నది.ఈ భగవన్నామాలు అన్నీ ప్రణవ,నమః పదాలతో కూర్చినప్పుడు మంత్రాలనబడతాయి.ఇవి అనేకం అయినందున వేదం 'అనంతావై భగవ్న్మంత్రాః అని పల్కింది.ఈ మత్రాలన్నీ స్వరాది వైకల్యాన్ని పొందినప్పుడు తాంత్రికాలనబడతాయి.ఇటువంటి తాంత్రికమైన భగవన్మంత్రాలుకూడా వైదిక మంత్రాలవలె సర్వాభీష్ట ఫలప్రదాయకాలు. (4) కె.వేంకటాచార్య దాసుడు,స్థానాచార్య,(5) శ్రీ ఉ.వే.శ్రీమాన్ డా.ఈ.వి.సింగరాచార్య,తిరుపతి.(6) డా. ఎస్.వి.రంగ రామానుజ ఆచార్యులు,ఎడిటర్-భక్తినివేదన,ప్రెసిడెంట్ శ్రీమత్ ఉభయ వేదాంత ఆచార్య పీఠం,శ్రీరంగం.డైరెక్టర్-జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమి శ్రీరాంనగర్,ముచిమ్తల్,పాల్మకుల్ పోస్ట్ శంషాబాద్,రంగారెడ్డి జిల్లా .(7) మహామహోపాధ్యాయ-శ్రీ ణ-చ-రఘునాధాచార్య ఏకశిలా (వరంగల్) నగరవాసి.

గ్రంధముద్రణ కైంకర్య విషయం మంగళాశాసనంలతో సుందరరాజన్ స్వామి మాటలు

[మార్చు]

విష్ణుసహస్ర వ్యాఖ్యను వ్రాయుట ఒక ఎత్తు దానిని ముద్రించుట అనునది ఒక ఎత్తు.ముద్రించుటకు నా ప్రయత్నమేమియూ లేదు.అష్టాక్షర మహర్షిగా బదరికాశ్రమమున,ద్వయమంత్రార్ధ ప్రదాతగా తిరునారాయణ పురమున వేంచేసియున్న దక్షిణోత్తర బదరీ నారాయణుల సంపూర్ణ కృపాకటాక్ష మంగళా శాసనములతో ఈ గ్రంథ ముద్రణకు ప్రేరణ జరిగింది.తణుకు పట్టణం లోని ప్రసిద్ధ వైద్యులు డా.తిమిరిశ కృష్ణమాచార్యులు గారు వీరు 1971నాటికి మేము తణుకు వచ్చేసరికి డాక్టరుగా ప్రసిద్ధులు.వారి సంతానము ఆనాటికే కొంతమంది అమెరికాలో నున్నారు.శ్రీమాన్ డా.కృష్ణమాచార్యులు గారి భార్య ప్రభావతమ్మ గారు,డా.కృష్ణమాచార్యులు గారు వైద్యవృత్తిలో ఉన్నప్పటికీ సదాచార సంప్రదాయపరులు.వీరి తండ్రి గారు వైదిక కర్మల యందు మంచి పండితులు.నిత్యమూ ఊర్ధ్వపుండ్రధారణ,భగవదా రాధన,సుందరకాండ పారాయణ చేసుకొనుట శ్రీ కృష్ణమాచార్యులుగారి నిత్యానుష్టానము.ఆ రోజులలో శస్త్ర చికిత్స యందు మంచియనుభవజ్ఞులు.డా.కృష్ణమాచార్యులు గారు,ప్రభావతమ్మ గార్ల కుమార్తె చి.సౌ.సీత మాడభూషి,ఆమె భర్త రంగరాజన్ మాడభూషి.చి.సౌ.సీత ఒక సంవత్సరమునకు పూర్వము నన్ను చూడడానికి వచ్చింది.అప్పుడు ఈ వ్యాఖ్యానమును ఆమెకు చూపించినాను.ఆమె వెంటనే దీని ముద్రణ బాధ్యత మేము తీసుకుంటామని వాగ్దానము చేసింది.ఆమె చిన్ననాటి గురువును నేను.వారి తల్లిదండ్రులపైన,అత్తమామలపైన ఉన్న గౌరవముతో భగవత్ కైంకర్యముగా ముద్రణా బాధ్యతలను వహించిన వదాన్య శేఖరులు చి.సౌ.సీత,రంగరాజన్ లకు మా ఆరాధ్య దైవమైన శ్రీ లక్ష్మీనారాయణ,శ్రీ బడరీనారాయణ,శ్రీనివాస పెరుమాళ్ళ యొక్క అనంత మంగళా శాసనములను కృ పసుయుమని ప్ర్రార్ధించు చున్నాను.స్వస్తి శ్రీర్ధిశతాత్.

సుందరరాజన్ మనోగతమ్

[మార్చు]

నేను వేదాధ్యయనము అయిన పిమ్మట సాహిత్య విద్యాప్రవీణ,భాషాప్రవీణ,యం.ఎ.(వ్యాకరణ)శిక్షాశాస్త్రి చేసి 36 సంవత్సరములు తణుకు జిల్లా పరిషత్ పాఠశాలయందు గ్రేడ్1 సంస్కృతపండితునిగా 1971-2006 వరకు పనిచేసి పదవీవిరమణ చేసినాను.1977-78లో శిక్షాశాస్త్రి శిక్షణ పొందు సమయమున బ్రహ్మశ్రీ ధూళిపాళ అర్కసోమయాజులు గారు ఆనాటి ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి,శ్రీమాన్ డా.ఎస్.బి.రఘునాధాచార్యులు గారు (డీమ్డ్ యూనివర్సిటీ సంస్కృత విద్యాపీఠం)తిరుపతి వారు నన్ను ప్రోత్సాహము చేసి,ఆర్షవిజ్ఞాన వ్యాసములను వ్రాయుటకు ఒక సభ్యునిగా చేర్చుకొనిరి.అప్పటికే నేను వేదభాష్యమును చూచినాను.యజుర్వేదముపై వ్యాసములను వ్రాయుటకు పూర్తిగా విద్యారణ్య భ్యాష్యమును అధ్యయనము చెయ్యాలి.అందుకు తణుకులోనే యున్న విజయనగర ఆస్థాన విద్వాంసులు అయి విశ్రాంతి పొందుచున్న బ్రహ్మశ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రిగారిని వేదభ్యాష్యములు అద్యాపన గావించమని అర్ధించినాను.అప్పటికే నేను ఆర్ష విజ్ఞాన సర్వస్వ వ్యాసములను వ్రాయుట వారికి చూపించుట జరిగింది.వారు విషయమును గ్రహించిన మీకు చెప్పుట నాకు స్రమకాదని,రెండు సంవత్సరములు కొన్ని అధ్యాయములు వాటిలో ప్రధానవిషయములను అధ్యాపన గావించి,మిగిలిన భాష్యమును జాగ్రత్తగా పరిశీలించిన తరువాత మీకు సందేహములుంటే ణా వద్దకు రండి అని అన్నారు.తరువాత 5,6,7 కాండలు స్వయముగా అభ్యాసము చేసిన తరువాత బ్రాహ్మణ భాగముతో సహా వారివద్ద అధ్యయనము చేసినాను.ఇన్ని శాస్త్రములను అధ్యయనము చేసినప్పటికీ నేనొక సామాన్య సంస్కృత పండితునిగా నుండుట వలన మాకుండే ఔద్యోగిక ప్రతిబంధకములతో కొంతకాలము శాస్త్రములను వదులుట జరిగింది.1991-92 సంవత్సరము లలో నా కుమార్తె ఎం.ఎ.వేదాంతమును చేసినప్పుడు ఆమెకు పాఠమును చెప్పుటకు మా తండ్రిగారి వద్ద అధ్యయనము చేసిన వేదాంతమును స్పృశించుట,ఆమెకు ఫై.జి.డాక్టరేటు పూర్తిచేయించిన సందర్భముగా మరల వేదాంత శాస్త్రమందు కొన్ని అభిప్రాయములు కలిగినవి.ఆ శాస్త్రమర్యాదను మరచిపోలేదు అని నిర్ధారణ చేసికోనుటకే ఈ విష్ణుసహస్రనామ వ్యాఖ్యానమును ప్రారంభించినాను. మాతండ్రి గారు నాకు వ్యయప్రయాసలేగాక,చాలా శారీరక శ్రమను చెంది నాచే అధ్యయనము చేయించాలని వారు పట్టుదలతో నుండిరి.కాని శ్రీ వైష్ణవులలో అధ్యయనము చేసినవారు ఆనాడు ఈ ప్రాంతమున లేకపోవుటవలన,అద్వైతుల వద్ద ణా వేదాధ్యయనము శ్రమ సాధ్యముగా తయారైనది.కొంతకాలమునకు బ్రహ్మశ్రీ దెందుకూరి సుబ్రహ్మణ్య సోమయాజి ఘనాపాఠీ గారు మా తండ్రి గారివద్ద తర్కము అధ్యయనము చెయ్యాలని అర్ధించుట,దానికి మా తండ్రిగారు ణా వేదాధ్యయనమును గూర్చి చెప్పుటతో వారు అంగీకరించి వారి కుమారునితో సమానముగా పదక్రమ బ్రాహ్మణోపనిషత్తులను పూర్తిగావించిరి.

మూలాలు

[మార్చు]
  • 20-11-1997 నాటి స్టేట్స్ టైం పత్రికలో సుందరరాజన్ స్వామి చేసిన కార్యక్రమాల గురించి వ్యాసం
  • 12-12-2015 శనివారం నాటి సువర్ణలేఖ వారపత్రికలో ఈ గ్రంథావిష్కరణ గురించి ప్రముఖ వార్త ప్రచురణ
  • శ్రీ విష్ణుసహస్ర నామస్తోత్రస్య భావప్రకాశికాఖ్య వ్యాఖ్య (సంస్కృత,ఆంధ్ర భాషా ద్వయోపేతా )నందు మొదటి అభిప్రాయం.
  • వాడుకరి :వడ్డూరి రామకృష్ణ -944౦953315.

వెలుపలి లంకెలు

[మార్చు]