Jump to content

జుబైదా యాజ్దానీ

వికీపీడియా నుండి
జుబైదా యాజ్దానీ
స్థానిక పేరుزبیدھ یسدانی
జననంజుబైదా యాజ్దానీ
ప్రసిద్ధిచరిత్రకారిణి, రచయిత్రి
తండ్రిగులామ్ యాజ్దానీ

జుబైదా యాజ్దానీ (27 ఏప్రిల్ 1916-11 జూన్ 1996) భారతదేశంలోని దక్కన్ పీఠభూమి , హైదరాబాద్ నిజాం రాష్ట్రాల చరిత్రలపై ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన భారతీయ చరిత్రకారిణి. ఈమె ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర చదివింది.

జీవితచరిత్ర

[మార్చు]

జుబైదా యాజ్దానీ 1916 ఏప్రిల్ 27న భారతదేశంలోని హైదరాబాద్ లో జన్మించింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన మొదటి ఆసియా మహిళలలో యాజ్దానీ ఒకతె.[1] ఈమె భారతదేశ చరిత్ర గురించి రెండు పుస్తకాలు వ్రాసింది. చరిత్ర గురించి అనేక వ్యాసాలను కూడా రచించింది. ఆమె పుస్తకం హైదరాబాద్ డ్యూరింగ్ ది రెసిడెన్సీ ఆఫ్ హెన్రీ రస్సెల్, 1811-1820 భారతీయ సైన్య ఆధీన వ్యవస్థకు ఇది ఒక వ్యాఖ్యానం.[2] రెండవ పుస్తకం, ది సెవెంత్ నిజాం: ఫాలెన్ ఎంపైర్, హైదరాబాద్ చివరి నిజాం జీవిత చరిత్ర మాత్రమే కాకుండా, భారతదేశపు రాజ్యాలకు బ్రిటిష్ రాజ్యంతో ఉన్న సంబంధాలను ప్రభావం చేసిన రాజ్యాంగ, రాజకీయ సంక్లిష్టతల అధ్యయనం కూడా.[3] ఈమె పరిశోధనలు మునుపటి పరిశోధకులు విస్మరించిన అసలు రికార్డులు, పత్రాలను శ్రద్ధగా ఉపయోగించుకొని అధ్యయనం చేయబడిన అంశాలను కలిగివున్నాయి.[2] లోతుగా పరిశీలిస్తే ఈమె పరిశోధనలు సంప్రదాయ చరిత్రలను సవాలు చేసినట్లు తెలుస్తుంది.

నజీర్ అహ్మద్ దెహ్ల్వీ రాసిన తౌబత్-అల్-నుసుహ్ (ఆంగ్లం: రెపెంటెన్స్ ఆఫ్ నుస్సోహ్: ది టేల్ ఆఫ్ ఎ ముస్లిం ఫ్యామిలీ ఎ హండ్రెడ్ ఇయర్స్ అగో)ను ఉర్దూ నుండి ఆంగ్లంలోకి ఈమె పర్యవేక్షణలో అనువదించబడింది. ఇది భారతదేశంలో ముస్లింల జీవితంపై 19వ శతాబ్దం చివరిలో వెలువడిన సాహిత్య రచన.

యాజ్దానీ భారతదేశంలోని హైదరాబాదులోని కళాశాలలో మూడు దశాబ్దాలకు పైగా బోధించింది, ఈమె మహిళా కళాశాల ప్రధాన వ్యవస్థాపకులలో ఒకరు.[1] ఆమె లండన్‌లో హైదరాబాద్ స్కూల్ ఫర్ లాంగ్వేజెస్ అండ్ సైన్స్‌ను‌ కూడా ప్రారంభించింది. ఈ పాఠశాల ప్రాథమిక, జూనియర్, సెకండరీ విద్యార్థులకు ఉర్దూతో పాటు ప్రాథమిక నుండి O, A స్థాయిల వరకు విద్యార్థులకు ఇంగ్లీష్, గణితం, కంప్యూటర్ విద్య, ఫ్రెంచ్, అరబిక్ పాఠ్యాంశాలను బోధిస్తుంది.[1][4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

యజ్దానీ చరిత్రకారుడు పురావస్తు శాస్త్రవేత్త అయిన డాక్టర్ గులాం యజ్దానీ పెద్ద కుమార్తె. ఈమె తండ్రి హైదరాబాదులోని నిజాం ప్రభుత్వంలో పురావస్తు శాఖ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతడు బౌద్ధ, హిందూ మతాలకు, కళలకు సాంస్కృతిక వారసత్వాలైన అజంతా, ఎల్లోరాలోని గుహల సంరక్షణలో కీలక పాత్ర పోషించాడు. బ్రిటిష్ ప్రభుత్వం అతడిని ఓబీఈ తో, భారత ప్రభుత్వం పద్మభూషణ్ (భారతదేశం యొక్క మూడవ అత్యున్నత పౌర గౌరవం) పురస్కారంతో సత్కరించాయి. జుబైదా యాజ్దానీ ఉర్దూ కవి మీర్ యాసీన్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది.[5]

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన మొదటి ఆసియా మహిళలలో జుబైదా యాజ్దానీ ఒకరు. ఈమె ఇతర హైదరాబాదీ విద్యార్థినులకు ఉన్నత చదువుల కోసం ఆక్స్ఫర్డ్ రావడానికి ఒక ఉదాహరణగా నిలిచింది.[1] చాలా సంవత్సరాల తరువాత ఇందిరా గాంధీ జ్ఞాపకాల గురించి ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, జుబైదా యాజ్దానీ ఇలా వ్యాఖ్యానించింది, "ఆమె చాలా సిగ్గుపడే విద్యార్థిని. ఆమె ఉపన్యాసాలలో, చర్చలలో చాలా తక్కువ మాట్లాడేది".[4]

జుబైదా యాజ్దానీ 1940 జూన్‌లో ఆక్స్ఫర్డ్ నుండి డిగ్రీ పొందింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత, ఆమె అక్కడే ఉండి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలని నిశ్చయించుకుంది.

హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తరువాత ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్‌గా (1942), తరువాత రీడర్ (1947) గా నియమింపబడింది.[6] అక్కడ ఈమె ఎంఏ తరగతులను ప్రారంభించింది. ఈమె అక్కడ చాలా సంవత్సరాలు బోధించింది. అక్కడ బోధించే కాలంలో ఎన్నో పరిశోధనలు చేసి పరిశోధనా పత్రాలను ప్రచురించింది.

ఈమె మార్చి 1963లో మళ్లీ బ్రిటన్‌కు వెళ్లి లండన్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ తరగతులకు హాజరు కావడం ప్రారంభించింది. తరువాత, ఈమె ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి మారి అక్కడ ఆమె సెయింట్ హిల్డా కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలను పూర్తి చేసింది.

1967 నుండి 1969 వరకు ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాలలో సీనియర్ రీడర్ గా, అలాగే దాని యాక్టింగ్ ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసింది. తరువాత ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో చరిత్రలో రీడర్‌గా చేరి చివరకు దాని చరిత్ర విభాగానికి అధిపతిగా మారింది.[1] ఆ తరువాత ఆమె (మేరీ క్రిస్టల్ తో కలిసి) తన రెండవ పుస్తకం ది సెవెంత్ నిజాంః ది ఫాలెన్ ఎంపైర్ ను వ్రాసింది. జుబైదా యాజ్దానీ 1996 జూన్ 11న లండన్‌లో మరణించింది.[7]

సాహిత్యం, రచనలు

[మార్చు]

జుబైదా యాజ్దానీ తన మొదటి పుస్తకం "హైదరాబాద్ డ్యూరింగ్ ది రెసిడెన్సీ ఆఫ్ హెన్రీ రస్సెల్ 1811-1820" ను ప్రచురించింది.[2] ఈ పుస్తకం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో B.Litt కొరకు సమర్పించిన థీసిస్ ఆధారంగా రూపొందించబడింది. ఇది ఆక్స్‌ఫర్డ్‌లోని బోడ్లియన్ లైబ్రరీలో అందుబాటులో ఉన్న అసలు వనరులైన రస్సెల్, పామర్‌ల పత్రాల ఆధారంగా వ్రాయబడిన విద్వత్‌పూర్ణమైన రచన. ఈ భారీ పత్రాలను వివరంగా అధ్యయనం చేసిన మొదటి వ్యక్తి జుబైదా యాజ్దానీ. ఆక్స్‌ఫర్డ్‌లోని ఆల్ సోల్స్ కళాశాలలో అధ్యాపకుడైన రష్ బ్రూక్ విలియమ్స్ (CBE, FRSA) ఈ అధ్యయనం కొత్త పుంతలు తొక్కుతుందని, ఇప్పటివరకు ఆమోదించబడిన తీర్పుల పునర్విమర్శకు దారి తీస్తుందని, ఇది నిష్పాక్షికమైన, సమగ్రమైన పరిశోధన అని పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో పేర్కొన్నాడు.

జుబైదా యాజ్దానీ 1985లో "ది సెవెంత్ నిజాం: ది ఫాలెన్ ఎంపైర్" పేరుతో తన రెండవ పుస్తకాన్ని ప్రచురించింది.[3] ఈ పుస్తకం హైదరాబాదులోని అసఫ్ జాహి పాలకులలో గొప్పవాడైన ఏడవ నిజాం ఆధ్వర్యంలో హైదరాబాద్ గురించి అధ్యయనం. ఇది భారత రాష్ట్రాల పట్ల బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను కూడా అధ్యయనం చేసింది. భారతదేశం, పాకిస్తాన్ స్వతంత్రం పొందిన సమయం వరకు బ్రిటిష్ విధానంపై రెండు ప్రపంచ యుద్ధాల ప్రభావాలను కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ఈ పుస్తకం లండన్‌లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీ నుండి పొందిన అసలు పత్రాలతో పాటు నిజాం కుటుంబం ఆమెకు అందుబాటులో ఉంచిన నిజాం అసలు పత్రాల ఆధారంగా రూపొందించబడింది. ఈ పుస్తక ప్రచురణకు ముందు వీటిలోని చాలా పత్రాలు ఎన్నడూ అధ్యయనం చేయబడలేదు. ఈ పుస్తకానికి ముందుమాటను గోర్డాన్ జాన్సన్ (కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్, రాయల్ ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ అధ్యక్షుడు) వ్రాశాడు. "ఈ అధ్యయనం చివరి నిజాం యొక్క జీవితాన్ని మాత్రమే కాకుండా, బ్రిటిష్ రాజ్యంతో భారత రాష్ట్రాల సంబంధాల సంక్లిష్టతలను కూడా వివరిస్తుంది, ఇది భారతీయ చరిత్రలో తరచుగా విస్మరించబడే అంశం. ఈ అధ్యయనం ఉపఖండంలో ఆధునిక రాజకీయ పరిణామాలపై మన అవగాహనకు దోహదపడుతుంది" అని డాక్టర్ గోర్డాన్ పేర్కొన్నాడు.[3]

మొదటి ఉర్దూ నవలా రచయిత అయిన నజీర్ అహ్మద్ దెహ్ల్వీ వ్రాసిన తౌబత్ అల్ నుసుహ్ అనే నవల ఉర్దూ నుండి ఆంగ్లంలోకి అనువాదం చేయడాన్ని కూడా జుబైదా యాజ్దానీ పర్యవేక్షించింది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కు సమకాలీనుడైన నజీర్ అహ్మద్ ముస్లింల సంస్కరణలు, విద్యకు, ముఖ్యంగా ముస్లిం మహిళల విద్యకు ప్రాధాన్యం ఇచ్చాడు. తౌబత్ అల్ నుసుహ్ ను ఉర్దూలో రాసిన మొదటి నవలగా చాలా మంది భావిస్తారు. జుబైదా యాజ్దానీ అనేక పత్రాలు, వ్యాసాలు కూడా వ్రాసి వాటిని వివిధ సెమినార్లలో సమర్పించింది.

సామాజిక, విద్యాపరమైన కృషి

[మార్చు]

జుబైదా యాజ్దానీ సామాజిక, విద్యా కార్యక్రమాలలో పాల్గొన్నది. వాటిలో ఒకటి, మహిళా కళాశాల స్థాపన కోసం ఆమె చేసిన కృషి.[1]

యూనివర్శిటీ ఉమెన్స్ అసోసియేషన్ పేరుతో ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ వుమెన్ ఒక శాఖ హైదరాబాదులో స్థాపించబడింది. అక్కడ ఈమె దాని కార్యదర్శిగా నియమించబడింది. కొత్త మహిళా కళాశాలను స్థాపించాలన్న తన ప్రతిపాదనను జుబైదా యాజ్దానీ అసోసియేషన్‌కు సమర్పించగా, ఈ ప్రతిపాదనను మహిళా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దేవి ఆమోదించింది. ప్రతిపాదిత కళాశాలకు భవనం కూడా లేదు. సుల్తాన్ బజార్ లైబ్రరీ భవనాలు చాలా రోజులుగా ఖాళీగా ఉన్నందున,ఆమె సుల్తాన్ బజార్ లైబ్రరీని సంప్రదించింది. కళాశాలకోసం వారి భవనాలను తాత్కాలికంగా ఉపయోగించడానికి లైబ్రరీ పాలకవర్గం అంగీకరించినందున అప్పుడు కళాశాల సుమారు 35 మంది విద్యార్థుల ప్రారంభ నమోదుతో ప్రారంభించబడింది. ఈ సమయంలో జరిగిన ఒక సంఘటన జుబైదా యాజ్దానీ యొక్క అచంచలమైన సంకల్పాన్ని, అంకితభావాన్ని సూచిస్తుంది.[6] సుల్తాన్ బజార్ లైబ్రరీ చివరికి వారి గదులను తిరిగి కోరుకుని, భవనపు తలుపులకు తాళం వేయాలని నిర్ణయించుకుంది. వారు కళాశాల నుండి వచ్చిన ఏ అభ్యర్థననూ వినలేదు. జుబైదా యాజ్దానీ ఈ సంక్షోభాన్ని తన సాధారణ దృఢమైన పద్ధతిలో ఎదుర్కొంది. విద్యార్థులకు ఇంటికి వెళ్లాలని, ఇది వారికి కళాశాల సెలవు అని, మరుసటి రోజు ఇదే ప్రదేశానికి తిరిగి రావాలని, కళాశాల కొత్త ప్రదేశం గురించి వారికి తెలియజేస్తామని ఈమె చెప్పింది. మరుసటి రోజు వారి సాధారణ సమయానికి తిరిగి రావాలని, ఆ తర్వాత వారు కొత్త ప్రాంగణానికి వెళతారని కూడా ఆమె ఉపాధ్యాయులకు చెప్పింది. అక్కడకు తరలించడానికి కొత్త భవనాలు లేనందున ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్లి తన టీనేజ్ కొడుకును తనతోపాటు తీసుకెళ్లి సర్ నిజామత్ జంగ్ ట్రస్ట్ లైబ్రరీ అధ్యక్షుడు, కార్యదర్శిని కలవడానికి వెళ్ళింది. లైబ్రరీలోని గదులను కళాశాలకు అద్దెకు ఇవ్వాలని ఆమె అభ్యర్థించగా లైబ్రరీ అధ్యక్షుడు, కార్యదర్శి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు, కమిటీ నిర్ణయాన్ని తరువాత ఆమెకు తెలియజేస్తామని ప్రకటించారు. కమిటీని ఏర్పాటు చేసే సమయానికి కళాశాల పూర్తవుతుందని జుబైదా యాజ్దానీ వారికి చెప్పింది. అప్పుడు అధ్యక్షుడు, కార్యదర్శి ఈమెను కళాశాల గురించి మరిన్ని ప్రశ్నలు అడిగారు. ఈమె సంకల్పం, అంకితభావాలతో వారు ఎంతగానో ఆకర్షించబడి, ఆమెకు గదుల తాళాలను ఇచ్చారు. మరుసటి రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు కళాశాలకు తిరిగి వచ్చినప్పుడు, వారికి చిరునవ్వుతో ఉన్న జుబైదా యాజ్దానీ ఎదురయ్యింది. ఈమె వారికి కొత్త కళాశాల భవనానికి ఆదేశాలు ఇచ్చింది. చివరికి కళాశాల శాశ్వత స్థానానికి మారింది. ఈమె నాయకత్వంలో కళాశాల నిరుపేద బాలికల కోసం చరిత్ర, ఆర్థికశాస్త్రం, సామాజిక శాస్త్రాలలో తరగతులను ప్రారంభించింది. తరువాత సైన్స్ తరగతులు ప్రారంభించబడ్డాయి. లైబ్రరీ, ప్రయోగశాలల ఏర్పాటు కూడా సంతృప్తికరంగా ప్రారంభమైనాయి. ఈ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండాలని జుబైదా యాజ్దానీ ఆకాంక్షించింది. ఈ ప్రతిపాదనకు లక్ష రూపాయలు (రూ. 100,000) అవసరమయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ల సంఘం ఆఫీస్ బేరర్ రాయ్ శంకర్ జీ అసోసియేషన్ స్పాన్సర్షిప్ కింద పూర్తిగా పనిచేసే కళాశాలను తీసుకున్నారు. 1961లో, వ్యతిరేకత ఉన్నప్పటికీ, U.W.C.A కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా చేర్చబడింది. ఈ కళాశాల ఇప్పుడు, దాని హిందీ పేరుతో, సరోజిని నాయిడు వనితా మహా విద్యాలయగా పిలువబడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద మహిళా కళాశాలలలో ఒకటిగా నిలిచింది. ఇది హైదరాబాద్ లోని నాంపల్లి ప్రాంతంలో ఉంది.

జుబైదా యాజ్దానీ లండన్‌లో హాక్నీలో హైదరాబాద్ స్కూల్ ఫర్ లాంగ్వేజెస్ అండ్ సైన్సెస్‌ను కూడా స్థాపించింది. ఉర్దూ బోధించడానికి హైదరాబాద్, పాకిస్తాన్ నుండి వచ్చి లండన్‌లో స్థిరపడిన తల్లిదండ్రులు తమ పిల్లలకోసం ఈమెను సంప్రదించినందున ఈ పాఠశాల ఫిబ్రవరి 1981లో ప్రారంభించబడింది.[4] ఈమె, ఈమె భర్త మీర్ యాసీన్ అలీ ఖాన్ మొదట్లో తరగతులకు బోధించారు. కొన్ని నెలల తర్వాత ఇన్నర్ లండన్ ఎడ్యుకేషన్ అథారిటీ పాఠశాలను సందర్శించి గ్రాంటును మంజూరు చేసింది. ఆ తరువాత, పాఠశాల ఎక్కువ మంది ఉపాధ్యాయులను నియమించగలిగింది. ఈ పాఠశాల ప్రాథమిక, జూనియర్, మాధ్యమిక విద్యార్థులకు ఓ, ఏ స్థాయి వరకు ఉర్దూలో బోధించింది. ఈ పాఠశాలలో ఇంగ్లీష్, అరబిక్, సైన్స్ విషయాలను కూడా బోధించేవారు. జుబైదా యాజ్దానీ మరణించిన కొన్ని సంవత్సరాల తరువాత పాఠశాల మూసివేయబడింది.

జుబైదా యాజ్దానీ వివిధ ఉర్దూ, చరిత్ర సంఘాలలో నిర్వాహక సభ్యురాలిగా ఉంది. విద్యా పత్రికలలో అనేక పరిశోధనా వ్యాసాలను ప్రచురించింది. [6]

పుస్తకాలు

[మార్చు]
  • హైదరాబాద్ డ్యూరింగ్ ది రెసిడెన్సీ ఆఫ్ హెన్రీ రస్సెల్ : 1811-1820
  • సెవెంత్ నిజామ్, ది ఫాలెన్ ఎంపైర్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 St Hilda's College (1987–1988). Report and Chronicle. Memoir deposited in the library with the ASM archive.{{cite book}}: CS1 maint: location missing publisher (link)St Hilda's College (1987–1988). Report and Chronicle. Memoir deposited in the library with the ASM archive.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  2. 2.0 2.1 2.2 Yazdani, Zubaida (1976). Hyderabad During the Residency of Henry Russell, 1811–1820: A Case Study of the Subsidiary Alliance System. Printed at University Press, Oxford.Yazdani, Zubaida (1976). Hyderabad During the Residency of Henry Russell, 1811–1820: A Case Study of the Subsidiary Alliance System. Printed at University Press, Oxford.
  3. 3.0 3.1 3.2 Yazdani, Zubaida (with Mary Chrystal) (1985). The Seventh Nizam: The Fallen Empire. Printed at Cambridge University Press.
  4. 4.0 4.1 4.2 Leach, Joy (1985). "Interview with Mrs Ali Khan (married name)". Rectory Neighborhood Warden.
  5. Weekly Ravi Bradford (11 May 1996). "Nawab Mir Yaseen Ali Khan". Ravi.
  6. 6.0 6.1 6.2 Siasat Publications Hyderabad (1963). "Professor Zubaida Yazdani". Siasat.
  7. Ravi Weekly Bradford (22 June 1996). "Urdu and English Writer Zubaida Yazdani Passed Away".