Jump to content

టి.ఎన్.రాజరత్నం పిళ్ళై

వికీపీడియా నుండి
టి.ఎన్.రాజరత్నం పిళ్ళై
తపాలా బిళ్ళపై రాజరత్నం పిళ్ళై
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరుதிருமருகல் நடேசபிள்ளை ராஜரத்தினம் பிள்ளை
జన్మ నామంబాలసుబ్రహ్మణ్యం
ఇతర పేర్లుటి.ఎన్.ఆర్.
జననం(1898-08-27)1898 ఆగస్టు 27
తిరువదుత్తురై
మరణం1956 డిసెంబరు 12(1956-12-12) (వయసు 58)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తినాదస్వర విద్వాంసుడు
వాయిద్యాలునాదస్వరం
క్రియాశీల కాలం32

తిరుమరుగళ్ నటేశపిళ్ళై రాజరత్నం పిళ్ళై (1898 – 1956)[1] భారతీయ కర్ణాటక విద్వాంసుడు, నాదస్వర కళాకారుడు, గాత్ర కళాకారుడు, సినిమా నటుడు .[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈయన తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరువదుత్తురై అనే శైవ క్షేత్రంలో కుప్పుస్వామి పిళ్ళై, గోవిందమ్మాళ్ దంపతులకు 1898, ఆగష్టు 27 వ తేదీన జన్మించాడు.[3] ఇతని అసలు పేరు సుబ్రహ్మణియన్. ఇతని తండ్రి సంగీతాభిమాని. ఇతడు తన మామ, నాదస్వర సంగీత విద్వాంసుడైన తిరుమరుగళ్ నటేశ పిళ్ళైకు దత్తత వెళ్ళాడు.[4] ఆ తరువాత ఇతని పేరును రాజరత్నం పిళ్ళైగా మార్చారు. ఇతడు ఐదు సార్లు వివాహం చేసుకున్నాడు. కానీ సంతానం కలుగలేదు.

వృత్తి

[మార్చు]

ఇతడు కర్ణాటక వాయులీన విద్వాంసుడు తిరుకోడికావల్ కృష్ణయ్యర్ వద్ద కర్ణాటక సంగీతాన్ని అభ్యాసించాడు. నాదస్వరాన్ని అమ్మచత్రం కణ్ణుస్వామి పిళ్ళై వద్ద నేర్చుకున్నాడు. ఇతడు మొదట గాత్ర కచేరీలు ఇచ్చేవాడు. తిరువదుత్తురై ఆధీనం ప్రధాన అర్చకుల సలహాపై ఇతడు నాదస్వర కచేరీలు ఇవ్వడం ప్రారంభించాడు. కొద్ది కాలానికే ఇతడు తిరువదిత్తురైలోని మసిలమణీశ్వర ఆలయానికి నాదస్వర విద్వాంసునిగా మారాడు. ఇతడు రోజూ ఉదయం ఆలపించే "భూపాల రాగం" వినడానికి భక్తులు ఎక్కువగా పెందరాళే దేవాలయానికి హాజరయ్యేవారు. కొద్ది కాలానికే ఇతనికి అనేక కచేరీలలో పాల్గొనే అవకాశం లభించింది. అనేక రేడియో కార్యక్రమాలు కూడా చేశాడు. 1940లో విడుదలైన తమిళ సినిమా కాలమేఘంలో ప్రధాన పాత్రను పోషించాడు. నాదస్వర విద్వాంసునిగా ఇతడికి లభించిన కీర్తి వలన ఇతనిలోని గాత్ర విద్వాంసుడు వెనుకబడ్డాడు.

ఇతని సంగీత వృత్తి జీవితంలో ఇతడు కనుమరుగవుతున్న ఎన్నో రాగాలను అభివృద్ధి చేసి వాటికి కర్ణాటక సంగీతంలో ఒక స్థానాన్ని కల్పించాడు. ముఖ్యంగా తోడి రాగాన్ని ఇతడు విస్తరించిన తీరు, మెరుగు పరచిన తీరు ప్రశంసనీయమైంది. ఇతడు తెలుగు, సంస్కృత, తమిళ కీర్తనలను లోప రహితంగా నాదస్వరంలో పలికించేవాడు. ఇతని తాళ పరిజ్ఞానం బహుళ గుర్తింపును పొందింది.

ఇతడు యువ నాదస్వర కళాకారులను తనతో పాటు కచేరీలలో అవకాశం కల్పించేవాడు. వారిలో కుళికరై పిచ్చయ్యప్ప, తిరువారూర్ లచ్చప్ప మొదలైన వారు నాదస్వర విద్వాంసులుగా పేరు గడించారు. నీడమంగళం మీనాక్షి సుందరం పిళ్ళై వంటి డోలు కళాకారులు ఇతడికి లయ సహకారాన్ని అందించేవారు.

సినిమారంగం

[మార్చు]

ఇతడు కాలమేఘం సినిమాలో కథానాయకుడైన 16వ శతాబ్దపు తమిళ కవి వేషం ధరించాడు.[5] ఇతడు తిరునీలకంఠర్ సినిమాలో నాదస్వర విద్వాంసునిగా కొంతసేపు కనిపిస్తాడు.[6]

బిరుదులు, సత్కారాలు

[మార్చు]

ఇతనికి అనేక బిరుదులు లభించాయి. అయితే అవేవీ అధికారమైనవి విద్వత్సంభందమైనవి కావు. ఇతడు నాదస్వర చక్రవర్తిగా సుపరిచితుడు.[7] 1955లో ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీతం - వాద్యపరికరాలు (నాదస్వరం) విభాగంలో అవార్డును ప్రకటించింది.

మరణం

[మార్చు]

ఇతడు 1956, డిసెంబరు 12 వ తేదీన తన 58వ యేట మరణించాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. "The Emperor passes". The Hindu. 7 December 2007. Archived from the original on 8 డిసెంబరు 2007. Retrieved 19 మార్చి 2021.
  2. Vijaya Ramaswamy, Jawaharlal Nehru University (2007). Historical Dictionary of the Tamils. Scarecrow Press. p. 160. ISBN 978-0-8108-6445-0.
  3. V Ramnarayan (21 June 2012) TN Rajarathnam Pillai (1898–1956). kutcheris.com
  4. "T N Rajaratnam Pillai". Carnatica.net. Retrieved 1 December 2016.
  5. Blast From the Past - Kalamegham 1940, The Hindu 21 September 2007
  6. M. K. Thyagaraja Bhagavathar Filmography
  7. "Reader-friendly approach". The Hindu. 14 January 2007. Archived from the original on 17 జనవరి 2007. Retrieved 19 మార్చి 2021.
  8. శంకర నారాయణ & వైజర్సు బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్టు. p. 87. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022. Retrieved 19 March 2021.