Jump to content

డబుల్ డెక్కర్ బస్సు

వికీపీడియా నుండి
లండన్ లో నడుస్తున్న కొత్త రూట్‌మాస్టర్ బస్సు

డబుల్ డెక్కర్ బస్సు రెండు అంతస్తులు కలిగి ఉంటుంది.[1] దీనిలో పై అంతస్తుల్లో కూడా ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఎగువ అంతస్తులోకి వెళ్ళడానికి వెనుక మెట్ల పక్కన మెట్లు కూడా ఉంటాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో వీటిని ఎక్కువగా ప్రజా రవాణా కోసం ఉపయోగిస్తారు. లండన్ లో ఎరుపు డబుల్ డెక్కర్లు చాలా ప్రసిద్ధి చెందాయి. ఐరోపా, ఆసియా, కెనడాలోని వివిధ దేశాలలో డబుల్ డెక్కర్ బస్సులు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. చాలా డబుల్ డెక్కర్ బస్సులు ఒకే ఛాసిస్‌పై నిర్మించబడ్డాయి. ఓపెన్ టాప్ టైప్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రధానంగా పర్యాటక అవసరాల కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న డబుల్ డెక్కర్ బస్సులు ముందు భాగంలో ప్రధాన ప్రవేశ ద్వారం కలిగి ఉంటాయి.

చరిత్ర

[మార్చు]

1828లో స్టానిస్లాస్ బౌడ్రీ అనే వ్యక్తి దగ్గర రెండు- అంతస్తుల స్థాయి ఉన్న గుర్రపు బండి నుండి ప్రేరణ పొందిన జార్జ్ షిల్లిబీర్ 'ఓమ్నిబస్'ని లండన్‌కు తీసుకువచ్చాడు. దీనిలో 22 మంది వరకు ప్రయాణించవచ్చు.[2] 1920లలో, డబుల్ డెక్కర్ బస్సు మొదటి ఇంజన్-ఆధారిత వెర్షన్ లండన్ సొసైటీలో ప్రవేశించింది. 1920ల మధ్య నాటికి దాదాపు 20 వేర్వేరు కంపెనీలు నగరమంతటా బస్సులు నడుపుతున్నాయి. ఈ పోటీని తట్టుకునేందుకు ఈ వ్యాపారాలలో అతిపెద్ద కంపెనీ అయిన 'ది లండన్ జనరల్ ఓమ్నిబస్ కంపెనీ (LGOC)', బస్సులకు ఎరుపు రంగును వేసింది. అపుడు ఇవి చాల ప్రసిద్ధి పొందాయి. 1930లలో ది లండన్ జనరల్ ఓమ్నిబస్ కంపెనీ, అనేక ఇతర కంపెనీల మాదిరిగానే లండన్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ బోర్డ్‌లో భాగమైంది.

బ్రిటన్

[మార్చు]

బ్రిటన్‌లోని చాలా డబుల్ డెక్కర్ బస్సులు 9.5 మీటర్లు, 11 మీటర్ల పొడవు ఉంటాయి. 1941లో, మిస్ ఫిలిస్ థాంప్సన్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో డబుల్ డెక్కర్ వాహనం నడపడానికి లైసెన్స్ పొందిన మొదటి మహిళ. ఆమె ఈ బస్సును ఫెలిక్స్ బస్ సర్వీసెస్ బస్సులను నడపడానికి లైసెన్స్ తీసుకుంది.[3]

లండన్

[మార్చు]

లండన్‌లోని ఎరుపు డబుల్ డెక్కర్ బస్సులు ఇంగ్లండ్ జాతీయ చిహ్నంగా మారాయి. ఈ బస్సులు ఏఈసీ రూట్‌మాస్టర్ బస్సులు, వీటిని 1956లో ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు అర్ధ శతాబ్దం పాటు లండన్‌లోని ప్రజా రవాణాలో ప్రధాన భాగమైయినాయి. వాడుకలో ఉన్న మిగిలిన రూట్‌మాస్టర్‌ బస్సులను 2005లో నిలిపివేశారు. 2007లో, లండన్ బస్ రూట్ - 141 లో హైబ్రిడ్ డబుల్ డెక్కర్ తీసుకువచ్చింది. అంతేకాకుండా 2008 మరిన్ని హైబ్రిడ్ డబుల్ డెక్కర్ల తీసుకువచ్చింది.[4] 2015 అక్టోబరు లో, లండన్ లో ఐదు ఎలక్ట్రిక్ డబుల్-డెక్కర్ బస్సులను తీసుకువచ్చారు. ఇవి ప్రపంచంలోనే మొదటి ఎలక్ట్రిక్ బస్సులు వీటిని చైనీస్ సంస్థ అయిన బివైడి తయారు చేసింది.[5] డబుల్ డెక్కర్లు ప్రధానంగా ప్రయాణీకుల రవాణా కోసం ఉంటాయి, అయితే ఓపెన్-టాప్ మోడల్స్ పర్యాటకుల కోసం ఉపయోగించబడతాయి. విలియం గ్లాడ్‌స్టోన్, లండన్ డబుల్-డెక్ హార్స్-డ్రాన్ ఓమ్నిబస్సుల గురించి మాట్లాడుతూ, ఒకసారి "...లండన్ చూడటానికి ఉత్తమమైన మార్గం డబుల్ డెక్కర్ బస్సు పై నుండి" అని అన్నాడు.

భారతదేశం

[మార్చు]

భారతదేశంలో 1937 నుండి డబుల్ డెక్కర్ బస్సులు నడుస్తున్నాయి. ప్రస్తుతం డబుల్ డెక్కర్ బస్సులు చెన్నై, కొచ్చి, తిరువనంతపురం, కోల్‌కతాలో నడుస్తున్నాయి. ఇవి లండన్ డబుల్ డెక్కర్ బస్సుల తరహాలో రూపొందించబడ్డాయి. అశోక్ లేలాండ్ డబుల్ డెక్కర్ బస్సులు భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. ముంబైలోని డబల్ డెక్కర్ బస్సులు భారతదేశంలోని మొదటి ఎలక్ట్రిక్ డబల్ డెక్కర్ బస్సులు.[6]

హైదరాబాద్

[మార్చు]
హైదరాబాద్ లోని కొత్త డబుల్ డెక్కర్ బస్

1946లో నిజాం VII మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిజాం ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ ద్వారా మొదటిసారి హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టబడ్డాయి.[7] 30 ఆల్బియాన్ సిఎక్స్ 19 మోడళ్ల సెట్‌ను ఇంగ్లండ్ నుండి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. 56-సీట్ల సామర్థ్యం గల బస్సులు సముద్రం ద్వారా వివిధ భాగాలలో రవాణా చేయబడ్డాయి, హైదరాబాద్ ఆల్విన్ మెటల్ వర్క్స్ లిమిటెడ్ వాటిని తిరిగి నగరంలోకి చేర్చింది. డబుల్ డెక్కర్ బస్సులు ఒకప్పుడు సికింద్రాబాద్, రాజేంద్రనగర్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మధ్య అనేక మార్గాల్లో నడిచేవి. ఫ్లై ఓవర్ల నిర్మాణం, పెరుగుతున్న నష్టాలు, అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా 2003లో దశలవారీగా నిలిపివేయబడింది.

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు బాగా ప్రాచూర్యం పొందాయి. హైదరాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆ బస్సుల్లో ప్రయాణాన్ని ఇష్టపడడమే కాకుండా వాటిని చూసేందుకు కూడా జనాలు ఆసక్తిని కనబరిచేవారు. 2020 నవంబరు 7న ఒక ట్విట్టర్ యూజర్ పాత డబుల్ డెక్కర్ బస్సు ఫొటోను షేర్ చేసి, సిటీ పర్యాటకులు లేదా జనాల కోసం ఆ బస్సులను మళ్ళీ పునఃప్రారంభించాలని ఐటీశాఖామంత్రి కేటీఆర్ ను కోరాడు. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి హైదరాబాద్‌లో పున:ప్రవేశపెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని కేటీఆర్ హామీఇచ్చాడు.[8] ఇచ్చిన హామీ మేరకు 2023 ఫిబ్రవరి 7న మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించాడు. ఈ డబుల్ డెక్కర్ బస్సులను నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ లో నడుపుతున్నారు. ఈ బస్సులు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు నడుపుతున్నారు.

బస్సు వివరాలు

[మార్చు]
డైమెన్షన్ విలువ
పొడవు 9.8 మీటర్లు
వెడల్పు 8.7 మీటర్లు
ఎత్తు 4.7 మీటర్లు
ఛార్జింగ్ 2. 5 గంటలు
ప్రయాణం 150 కి.మీ (ఒక ఫుల్ ఛార్జ్)
బస్సు ఖర్చు ఒకదానికి 2. 16 కోట్లు
ప్రయాణికుల సంఖ్య 65

స్విచ్ ఈఐవి22 (EiV22)

[మార్చు]

అశోక్ లేలాండ్ అనుబంధ సంస్థ అయిన స్విచ్ మొబిలిటీ - భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించింది, మొదటి సెట్ డెలివరీలు (ఫిబ్రవరి 2023 మధ్యలో) ముంబైలోని బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) ఆర్డర్ చేసిన 200 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులలో భాగం. స్విచ్ ఈఐవి22, 231కిలోవాట్ బ్యాటరీని కలిగి ఉంది, దీని పరిధి 250 కి.మీ వరకు ఉంటుంది. బస్సులో నికెల్, మాంగనీస్, కోబాల్ట్ (NMC) బ్యాటరీ ఉంది, దీనికి 8 సంవత్సరాల వారంటీ ఉంటుంది. స్విచ్ మొబిలిటీ బ్యాటరీ ఉష్ణోగ్రతను రిమోట్‌గా పర్యవేక్షిస్తుంది, ఏదైనా వ్యత్యాసాన్ని గమనించినట్లయితే డ్రైవర్‌కు తెలియజేస్తుంది. స్విచ్ ఈఐవి22 ఎలక్ట్రిక్ బస్సు 65 మంది కూర్చునే ప్రయాణీకుల సామర్థ్యం కోసం నిర్మించబడింది. క్యాబిన్ లోపల ఒక అడుగుతో సహా రెండు మెట్లు, అత్యవసర తలుపును కలిగి ఉంది. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, ఎక్స్‌ట్రా-వెడల్ ఫ్రంట్, రియర్ డోర్‌లతో అన్ని హాట్ క్లైమేట్ ఎన్విరాన్‌మెంట్‌కు సరిపోయేలా ఎఫెక్టివ్ కూలింగ్‌తో సరికొత్త ఏసీ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ మోడల్ అత్యున్నత భద్రతా ప్రమాణాలు, ఏఐఎస్ (AIS) 038 భద్రతా నిబంధనలకు అనుగుణంగా సరికొత్త ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ (FDAS/FDSS) తో థర్మల్ ఈవెంట్ విషయంలో వాహన ప్రయాణికులను అప్రమత్తం చేస్తుంది. మానిటరింగ్ అలాగే ప్రపంచ స్థాయి డిజిటల్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ టూల్స్‌ను ఎనేబుల్ చేయడానికి 'స్విచ్ అయాన్ (SWITCH iON)' తో సహా యాజమాన్య సొల్యూషన్‌లు పొందుపరచబడ్డాయి.[9]

భద్రత

[మార్చు]

డబుల్ డెక్కర్ బస్సులు అతి తక్కువ ఎత్తున్న వంతెనలను ఢీకొనడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సింగిల్ డెక్కర్ బస్సులను నడపడం అలవాటు చేసుకున్న డ్రైవర్లు ఎత్తు మరచిపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 2010లో, ఉత్తర అమెరికాలో చాలా తీవ్రమైన డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదం జరిగింది.[10]

చలన చిత్రాలు

[మార్చు]

సమ్మర్ హాలిడే చిత్రంలో, క్లిఫ్ రిచర్డ్, అతని సిబ్బంది ఐరోపా అంతటా డబుల్ డెక్కర్ బస్సును నడుపుతున్నట్లు చూపబడింది. అలాగే లైవ్ అండ్ లెట్ డై, హ్యారీ పాటర్ అండ్ ది ప్రిజనర్ ఆఫ్ అజ్కబాన్‌, ది మమ్మీ రిటర్న్స్‌ లో డబుల్ డెక్కర్ బస్సును చూపించారు.

మూలాలు

[మార్చు]
  1. "double-decker". TheFreeDictionary.com. Retrieved 2023-05-25.
  2. "A Brief History of the Double-Decker Bus - Landsea Tours & Adventures". vancouvertours.com. 2018-11-21. Retrieved 2023-05-25.
  3. "Phyllis Thompson | Photos, Facebook, Twitter & LinkedIn for Free at Social Register". web.archive.org. 2012-05-27. Archived from the original on 2012-05-27. Retrieved 2023-05-25.
  4. "World's first double-decker hybrid bus goes into service in London | Transport for London". web.archive.org. 2012-04-25. Archived from the original on 2012-04-25. Retrieved 2023-05-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. Liu, Cecily (2015-07-18). "Chinese-built zero-emissions electric bus prepares for service in London". The Guardian. ISSN 0261-3077. Retrieved 2023-05-25.
  6. "Mumbai's iconic double- decker buses to be phased out by 2023". Hindustan Times. 2018-10-09. Retrieved 2023-05-25.
  7. "Hyderabad's fabled double-decker buses, which were introduced by the Nizam's". deccanchronicle. Retrieved 2023-05-25.
  8. "హైదరాబాద్‍లో డబుల్ డెక్కర్ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయ్యొచ్చు". telugu oneindia. 2023-04-19. Retrieved 2023-05-25.
  9. "Switch EiV22, the first Indian electric double-decker, delivered in Mumbai and Hyderabad". Sustainable Bus. 2023-04-11. Retrieved 2023-05-25.
  10. "Megabus crash: Survival depended on where you sat". syracuse. 2010-09-26. Retrieved 2023-05-25.