డి.ఎన్‌. వాడియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డి.ఎన్‌. వాడియా

డి.ఎన్‌. వాడియా

హిమాలయాల గుట్టు విప్పినవాడు- పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి? నేలల స్వభావమేమిటి? భూగర్భంలో దాగిన రహస్యాలేంటి? ఇలాంటి విషయాలను విప్పి చెప్పడం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన భారతీయ శాస్త్రవేత్త డి.ఎన్‌. వాడియా (Darashaw Nosherwan Wadia or D.N.Wadia) ! ఆయన పుట్టిన రోజు 1883 అక్టోబరు 23న అయితే 1969 వీరు పరమపదించారు.

ప్రపంచవ్యాప్తంగా పర్వత శ్రేణులు ఏర్పడడం వెనుక భౌగోళిక కారణాలను విశ్లేషించిన భారతీయ శాస్త్రవేత్తగా డి.ఎన్‌. వాడియా పేరుపొందారు. ఆయన పరిశోధనలు భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి దోహదపడ్డాయి. శ్రీలంక భౌగోళిక పటాన్ని తయారు చేసింది ఆయనే. హిమాలయాలు ఎప్పుడు, ఎలా, ఏ పరిస్థితుల్లో ఏర్పడ్డాయో ఆయన వివరించగలిగారు. అనేక దేశాలు పర్యటించి భూగర్భ శాస్త్రపరమైన పరిశీలనలు చేశారు. లండన్‌లోని రాయల్‌ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యారు. భారతదేశం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది.

ప్రస్తావన[మార్చు]

గుజరాత్‌లోని సూరత్‌లో 1883 అక్టోబరు 23న పార్శీల కుటుంబంలో తొమ్మిదిమంది సంతానంలో నాలుగోవాడిగా పుట్టిన దారాషా నోషర్వాన్‌ వాడియాకు చిన్నతనంలోనే సైన్స్‌ పట్ల అభిరుచి ఏర్పడింది. ఓ పల్లెటూరిలో రైల్వే స్టేషను‌ మాస్టర్‌గా పనిచేసే తండ్రి అతడిని సూరత్‌లో తాతగారింట్లో చదివించారు. బరోడా కళాశాలలో చదివేప్పుడు వాడియాకు భూగర్భశాస్త్రంపై ఆసక్తి కలిగింది. రెండు బీఎస్సీ డిగ్రీలను పొందిన అతడు ఆపై ఎమ్మెస్సీ పూర్తిచేసి జమ్మూలోని ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. సెలవు రోజుల్లో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఖనిజాలు, రాళ్లు, శిలాజాలను సేకరిస్తూ పరిశోధనలో మునిగితేలేవాడు. అప్పట్లో అతడు సేకరించిన అరుదైన శిలాజాలు ఇప్పటికీ జమ్మూ విశ్వవిద్యాలయంలోని మ్యూజియంలో ఉన్నాయి.

హిమాలయాలలో పర్యటన[మార్చు]

ఆపై 1921లో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా చేరిన వాడియా మరింత విస్తృతంగా పరిశోధనలు చేశారు. హిమాలయాల్లోను, ఇతర ప్రాంతాల్లోను కలిపి సుమారు 11,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్వయంగా పర్యటించి సవివరమైన భౌగోళిక పటాలను రూపొందించారు. వందలాది పరిశోధన పత్రాలను వెలువరించారు. దేశవ్యాప్తంగా భూసార శాస్త్రానికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు. తద్వారా అపార ఖనిజ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలను, భూగర్భ జలవనరులను, వ్యవసాయానికి అనుకూలమైన భూములను, ఆనకట్టల వంటి ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను గుర్తించడం సాధ్యమైంది. ఎన్నో అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని విదేశాల్లో అక్కడి బృందాలతో కలిసి పరిశోధనలు చేశారు. పదవీవిరమణ అనంతరం శ్రీలంక ప్రభుత్వం తరఫున అక్కడి భౌగోళిక స్థితిగతులపై పరిశోధన చేశారు. ఆపై మన దేశ భూగర్భశాస్త్ర సలహాదారుగా నియమితులై ఖనిజ విధానాన్ని రూపొందించారు. ఆయన రాసిన 'జియాలజీ ఆఫ్‌ ఇండియా' ఒక ప్రామాణిక గ్రంథం.

శేకరణ
ప్రొ||ఈ.వి. సుబ్బారావు

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]