Jump to content

డి. వై. సంపత్ కుమార్

వికీపీడియా నుండి
సంపత్ కుమార్

డా. దాసరి యతిరాజ సంపత్ కుమార్ (డి. వై. సంపత్ కుమార్) (నవంబరు 20, 1927 - మే 27, 1999) శాస్త్రీయ, జానపద నృత్యకళాకారుడు, నాట్య గురువు. అతనిని ఆంధ్ర జాలరి గావ్యవహరిస్తారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను దక్షిణ భారత దేశంలోని ప్రాచీన సాంప్రదాయ కళలైన నృత్యం, సంగీతాలను ఏకీకృతం చేశాడు. అతను పేరి నరశింహ శాస్త్రి వద్ద వీణా వాద్యం పై శిక్షణ పొందాడు. శ్రీ దువ్వూరి జగన్నాథ శర్మ వద్ద భరతనాట్యం పై శిక్షణ పొందాడు. వివిధ నృత్య రీతులను నిశితంగా అధ్యయనం చేసిన మీదట అతను భరతనాట్యం , కూచిపూడి , యక్షగానం, జానపద నృత్యరీతులకు ఒక విశిష్టమైన విధానాన్ని ప్రవేశ పెట్టాడు. అతను దేశ, విదేశాలలో కొన్ని వేల ప్రదర్శనలిచ్చాడు. 1954 నుండి 1999 వరకు 45 సంవత్సరాలలో అతని శిక్షణలో 60 మంది కళాకారులు తయారైనారు. అతను ఆంధ్ర ప్రదేశ్ లో, విజయనగరం నందు శ్రీ గీతా నృత్య కళాశాలను ఏర్పరచి జాతీయ, అంతర్జాతీయ వేదకలపై సుమారు 3000 ప్రదర్శనలిచ్చి అనేక గౌరవాలను అవార్డులను పొందాడు.

అవార్డులు - సత్కారాలు

[మార్చు]
  • 1957 - న్యూఢిల్లీ లో జరిగిన ఆల్ ఇండియా డాన్స్ ఫోటీలలో 1400 మంది కళాకారులతో కలసి ప్రదర్శించిన ఆంధ్రజాలరి నృత్యానికి మొదటి బహుమతి వచ్చింది.
  • 1960 - న్యూఢిల్లీలోజరిగిన అంతర్జాతీయ వ్యవసాయ ప్రదర్శనలో "సంక్రాంతి" అంశంపై జానపద నృత్యానికి మొదటి బహుమతి వచ్చింది.
  • 1960 - ఉజ్జయిని లో జరిగిన జాతీయ సంస్కృత నాటక పోటీలలో "అభిజ్ఞాన శాకుంతలం" నాటక ప్రదర్శనకు మొదటి బహుమతిగా "స్వర్ణ కలశం" లభించింది.
  • 1961 - కలకత్తాలో జరిగిన ఠాగూర్ శతజయంతి ఉత్సవాలలో ఠాగూర్ రచిందిన "కాబూలీవాలా" నాటక ప్రదర్శనకు మొదటి బహుమతి.
  • 1964 - హైదరబాదులోని రవీంధ్రభారతిలో అనేకమంది గవర్నర్లు, ముఖ్యమంత్రుల సమక్షంలో "అభిజ్ఞాన శాకుంతలం" నాటక ప్రదర్శన, అధ్యక్షుడు డాక్టర్ రాడకృష్ణన్, ప్రధాని పండిట్ నెహ్రూల ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.
  • 1965 – రాష్ట్రపతి ప్రశంస మెమెంటో అందుకున్నారు.
  • 1973 – తూర్పు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీలలో 143 దేశాలలో మొదటి స్థానంలో నిలిచిన “ఆంధ్ర జలారి” అనే నృత్య ప్రదర్శనకు బంగారు పతకం.
  • 1974 – మాస్కో సాంస్కృతిక పోటీలలో ‘శివ పార్వతి’ ఊర్ధ్వ తాండవ సంప్రదాయంపై నృత్యనాటిక ప్రదర్శన.
  • 1980 – హైదరాబాద్‌లో జరిగే అఖిల భారత భరతనాట్యం పోటీల్లో ‘తిల్లనా’ ప్రథమ బహుమతి.
  • 1982 – హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి నృత్య నాటక పోటీల్లో పాల్గొన్న 56 మందిలో ‘క్షీరసాగరమథనం’ అనే నృత్య నాటకానికి ప్రథమ బహుమతి.
  • 1986 – అతని విజయాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అతనికి గౌరవ డాక్టరేట్, "కళాప్రపూర్ణ" బిరుదును ప్రదానం చేసింది.
  • 1988 - ఇండో-సోవియట్ కల్చరల్ ఎక్సేంజ్‌లో భాగంగా యు.ఎస్ఎ.స్ఆ.ర్ అతనికి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును ప్రదానం చేసింది.
  • 1990 - మారిషస్‌లో జరిగిన వార్షిక తానా సదస్సులో భారతీయ నృత్యానికి అతనను చేసిన కృషికి సత్కరించారు.
  • 1993 - అతన్ని న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు తానా ఆహ్వానించింది. అంతర్జాతీయ సాంస్కృతిక అవార్డు, మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేసారు.
  • 1994 - మద్రాస్ తెలుగు అకాడమీ నుండి ప్రతిష్టాత్మక ఉగాడి పురస్కారం అందుకున్నాడు.
  • 1995 - కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా శుభసంకల్పంలో కమల్ హసన్ నటించిన ఆంధ్ర జాలరి నృత్యానికి అతను నృత్యదర్శకత్వం వహించాడు.

యితర విజయాలు

[మార్చు]

ఆంధ్రజాలరి, నాట్య విశారద, విశ్వప్రజానార్థకుడు, నృత్య చైతన్య, నాట్యకళాధార, నాట్య భూషణ, అభ్యుదయ నాట్య కళా శ్రేష్ట వంటి బిరుదులను పొందాడు. వందల సన్మానాలను పొందాడు. పిఠాపురంలో కళాకారులు అతనిని గజారోహణం చేసారు. 1982 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అతనికి వెండి పతకం, సన్మాన పత్రాన్ని అందజేసింది. రాజమండ్రి మునిసిపాలిటీ అతనికి పౌర సన్మానం చేసి సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం అతన్ని టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్) టెలికాం సలహా కమిటీ గౌరవ సభ్యునిగా ప్రతిపాదించింది. కాకినాడ (ఆంధ్రప్రదేశ్) నుండి ప్రచురించబడిన సంగీత, నృత్య మాసపత్రిక ‘గణకాల’ కు అసోసియేట్ ఎడిటర్ గా వ్యవహరించాడు. అతను ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ప్రారంభం నుండి గరికపాటి రాజారావు వంటి వ్యవస్థాపక సభ్యులతో కలసి పనిచేసాడు.

ఆంధ్ర జాలరి సృష్టి

[మార్చు]

1957వ సంవత్సరం కొత్తఢిల్లీలో ప్రజా నాట్యమండలి ఐ.పి.టి.ఏ. వారి అధ్వర్యంలో అఖిల భారత నృత్య పోటీలు జరిగాయి . ప్రజా నాట్యమండలి ఉద్యమకర్త ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడైన గరికపాటి రాజారావు , సంపత్ కుమార్‌ను ఆ పోటీల్లో పాల్గొనమని ప్రేరేపించాడు. అయితే కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కలిగించారు . సాధారణంగా ఒక నృత్యం ప్రదర్శించాలంటే చాలా మంది సహకారం అవసరమవుతుంది. అటువంటిది కేవలం ఇద్దరితో ఏ అంశం చేయాలో అనే ఆలోచనలో పడ్డ సంపత్ కుమార్‌కి సరోజిని నాయుడు వ్రాసిన " కోరమండల్ ఫిషర్స్" అనే ఆంగ్ల కవిత మదిలో మెదిలింది. ఆ ఆలోచన అతన్ని భీమిలికి తీసుకుపోయింది. అక్కడ సముద్ర తీరాన సాగరమే సంసారంగా, దినదిన గండంగా దినాలు గడిపే నిరుపేద జాలరుల జీవన సమరాన్ని, భావగర్భితంగా ఏ సాహిత్యము లేకుండా కేవలం " మైమ్ " తో ప్రదర్శించే మహత్తర భావం రూపుదాల్చుకుంది. అవసరార్థం, పోటీకొరకు, సరదాగా కూర్చిన ఈ నృత్యం ఇతివృత్తపరంగాను , సాంకేతికపరంగాను అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. కేవలం తబలా శబ్ద తరంగాలతో, అలలు, తూఫాను హోరు, ఉరుములు, మెరుపుల సృష్టితో, ప్రేక్షకుల్ని మైమరిపింపజేసే ఈప్రత్యేక తరహా నృత్య రూపకం అవతరించి, ఒక అద్భుతమైన కళాఖండమై విరాజిల్లింది.

ఆంధ్రజాలరి

[మార్చు]

సంపత్ కుమార్ రాసిన అన్ని నృత్య రచనలలో "ఆంధ్ర జాలరి" చాలా ప్రసిద్ది చెందింది. వాస్తవానికి "ఆంధ్ర జలారి" సంపత్ కుమార్‌కు పర్యాయపదంగా మారింది. కాలక్రమేణా ఇది అతని పేరుకు పూర్వలగ్నంగా మారింది.

ఈ కూర్పు వెనుక కథ ఇలా ఉంటుంది. 1957 వ సంవత్సరంలో, అప్పటి వర్ధమాన నృత్యకారుడు, కొరియోగ్రాఫర్ అయిన సంపత్ కుమార్, న్యూఢిల్లీలో ఐపిటిఎ ఆధ్వర్యంలో జరపబడిన అఖిల భారత నృత్య పోటీలలో ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానం అందడంతో ప్రముఖ చిత్ర దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ కళారూపాల పోషకుడైన గరికపాటి రాజా రావును సంప్రదించాడు. ఆ రోజుల్లో దూరం, ప్రయాణ ఖర్చులను పరిగణనలోకి తీసుకొని తన సొంత ఆర్థిక పరిమితుల కారణంగా రాజా రావు, సంపత్ కుమార్ పర్యటనకు కొంత డబ్బును రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందటానికి అంగీకరించాడు. కాని ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ప్రతినిధి బృందంలో భాగంగా తన బృందాన్ని ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితం చేశారు. ఏమి చేయాలనే దానిపై సంపత్ కుమార్ అభీష్టానుసారం వదిలివేయబడింది. ఆ సమయంలో సంపత్ కుమార్ వ్యక్తిగత సందర్శన కోసం భీమునిపట్నం వెళ్ళాడు. అక్కడ మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి దినచర్యలను పరిశీలించాడు. ఈ పరిశీలనతో అతను ఒక మూకాభినయాన్ని రూపొందించాడు. తన ఆలోచనలను రాజారావుకు సమర్పించాడు. రాజారావు అతనికి సరోజినీనాయుడు రాసిన "కోరమందల్ ఫిషర్స్" నకలును అందజేసాడు. ఈ కవితపై తన ఆలోచనలను ఆధారం చేసుకొని మెరుగుపరచమని సూచించాడు. సంపత్ కుమార్ తబాలా రాజు అనే తబాలా కళాకారుని సహాయంతో కేవలం 15 రోజులు ఈ భావనపై పనిచేసి, దానిని రాజా రావుకు సమర్పించాడు, దీనిని న్యూ ఢిల్లీలో జరిగిన అఖిల భారత నృత్య పోటీలో ప్రదర్శించమని ప్రోత్సహించాడు. ఇది పాటలు, సాహిత్యం లేదా సంగీత వాయిద్యాలు లేని చాలా అరుదైన కూర్పు. ఇది పూర్తిగా తబాలా లయలపై ఆధారపడి ఉంటుంది. ఈ నృత్యం ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మత్స్యకారుడి జీవితంలో రోజువారీ పడిన కష్ట,నష్టాలను ప్రదర్శిస్తుంది. ఈ నృత్య అంశం సంపత్‌కు అపారమైన పేరు, కీర్తిని తెచ్చిపెట్టింది. అతనికి అనేక పురస్కారాలు కూడా లభించాయి. సోలో జానపద నృత్య విభాగంలో 1400 మంది పోటీదారులలో 1957 సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారత నృత్య పోటీలలో మొదటిసారి బహుమతి పొందినపుడు, అప్పటి భారత ఉపరాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్ నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఇది 1973 లో బెర్లిన్‌లో 143 దేశాలు పాల్గొన్న "ప్రపంచ యువజన ఉత్సవం" లో అంతర్జాతీయ బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. 1974 లో ఇది ఆప్ఘనిస్థాన్‌లోని కాబూల్ వద్ద , తాష్కెంట్, సమర్ఖండ్, అల్మట్టి, రిగా, కీవ్, ఒడీశా, సోచి, మాస్కోలలో ప్రదర్శించబడింది. అక్కడ ఇది టెలివిజన్ లో ప్రసారం చేయబడింది. తరువాతి కాలంలో, ఈ నృత్య అంశం తబాలా రాజు విద్యార్ధి అయిన టి.వి.రమణ మూర్తికి కూడా కీర్తిని తెచ్చిపెట్టింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతను రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. అతని రెండవ భార్య ఉమా సంపత్, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతని మొదటి భార్య నరసయ్యమ్మ 2000 సంవత్సరంలో మరణించింది. ఉమా సంపత్ కూడా తనంతట తానుగా నిష్ణాతురాలైన నర్తకి. ఆమె సంపత్ కుమార్‌కు అనేక నృత్య కంపోజిషన్లలో సహాయం చేసింది.

మూలాలు

[మార్చు]
  1. "Perseverance personified". The Hindu. May 14, 2005. Archived from the original on 2010-07-25. Retrieved 2013-05-29.

బాహ్య లంకెలు

[మార్చు]
  • D.Radhika Rani in Vijaya Vani on Vijayanagar Utsav-2002.s

యితర లింకులు

[మార్చు]