తిమ్మమ్మ మర్రిమాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిమ్మమ్మ మర్రిమాను

తిమ్మమ్మ మర్రిమాను శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం, గూటిబయలు గ్రామంలో ఉంది. ఇది కదిరి పట్టణానికి 26 కి.మీ, అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో వుంది. ఇది దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు.[1][2] 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందింది.

నేపథ్యము

[మార్చు]

బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబను గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిపించారు. కొంతకాలం అనంతరం వీరయ్య మరణించాడు. భర్త మరణంతో తిమ్మమాంబ సతీ సహగమనానికి సిద్ధమైంది. చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను (కట్టెలు) నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి మహా వటవృక్షంగా ఎదిగింది. ఇది 1989లో సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి మర్రిమాను ప్రపంచ పుటల్లో స్థానం పొందేందుకు కృషిచేసాడు. 1989లో ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా గిన్నిస్‌ రికార్డు సాధించింది. తాజా సర్వేలో 6,869 ఊడలతో ఎనిమిదిన్నర ఎకరాల్లో విస్తరించి ఉందని తేలింది. మర్రిమానుకు దాదాపు 660 సంవత్సరాలు నిండాయి.మర్రిమాను కిందికి వెళ్తే.. ఏదో అరణ్యంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అడుగడుగునా ఓ ఊడ కనిపిస్తుంది. దేనికదే ఇదే చెట్టు మొదలేమో అనిపిస్తుంది. ఆకాశమంత హరిత పందిరి, భూమంతా ఆక్రమించిన వటవృక్షాన్ని చూసిన ఆశ్చర్యంలో గంటలు నిముషాల్లా గడిచిపోతాయి

మర్రి మహావృక్షం

[మార్చు]

తిమ్మమాంబ ప్రాతివత్య మహిమకు తిమ్మమ్మ మర్రిమానుగా ప్రాచుర్యం పొందిన ఈ చెట్టును ఆమెకు ప్రతిరూపంగా చెబుతారు. 15వ శతాబ్దం ప్రథమభాగంలో భర్త బాల వీరనాయకునితోపాటు సహగమనం చేసిన తిమ్మమ్మకు స్థానికులు భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించారు. తిమ్మమ్మ గంగరాజు ఆస్థానంలో గూటిబయలు సంస్థానానికి ప్రతినిధిగా ఉన్న బాల వీరనాయకుని వివాహం చేసుకుంటుంది. అప్పట్లోనే ఆమె తన సంస్థాన కార్యక్రమాలను చక్కగా నిర్వహించేది. సామాజిక సంక్షేమానికి కృషిచేసేది. అయితే కుష్ఠువ్యాధిగ్రస్తుడైన వీరనాయకుణ్ణి గంగరాజు వెలివేస్తాడు. అప్పుడు వూరిబయట ఉన్న తమ పశువుల పాకనే కుటీరంగా చేసుకుని భర్తకు సేవ చేస్తూ జీవిస్తుంది తిమ్మమ్మ. తన పాతివ్రత్య మహిమతో గంగరాజును శపిస్తుంది. ఫలితంగా వాళ్లా కోటను వదిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతారు. ఆరు నుంచి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ మర్రి వృక్షం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. రాయలసీమలో అనంతపురం జిల్లాలో నీటి కొరత ఉన్నప్పటికీ తిమ్మమ్మ మర్రిమాను ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి, పచ్చని ఆకులతో పక్షుల కిలకిలరావాలతో చూపరులను చకితుల్ని చేస్తుంది.

మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్ నిర్మించారు. ఇటీవల కర్ణాటకకు చెందిన కైవారం ట్రస్టు ఆధ్వర్యంలో రూ.పది లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం వారు వెంకటేశ్వరాలయం నిర్మాణం చేపట్టారు.

ఈ చెట్టు క్రింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి ఉంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద "తిమ్మమ్మ 1394 లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప, మంగమ్మ లకు జన్మించింది. 1434 లో సతీ సహగమనం చేసింది" అని చెక్కబడింది.

విశేషాలు

[మార్చు]

తిమ్మమ్మ సతీ సహగమనం చేసిన చోట మొలచబడ్డ మొక్క ఈరోజు ఇంత పెద్ద మర్రిమానుగా వృద్ధి చెందింది అని భక్తులు భావిస్తారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చెయ్యడం వలన పిల్లలు కలుగుతారు అని భావిస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.

తిమ్మమ మర్రిమాను వృక్షం పైన ఏ పక్షీ మల విసర్జన చెయ్యదని చెపుతారు. అంతే కాకుండా సాయంత్రం ఆరు గంటలకల్లా పక్షులేవీ ఈ చెట్టు పై ఉండవు. ప్రస్తుతం ఈ వృక్షపు మొదలువద్ద మరొక మొక్క మొదలు అయ్యింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. C. Sudhakar; R. Suguna Kumari (2008). Women and Forestry. The Associated Publishers. ISBN 978-81-8429-081-3. Retrieved 5 June 2012.
  2. Lavanya Vemsani (31 October 2006). Hindu and Jain Mythology of Balarāma: Change and Continuity in an Early Indian Cult. Lewiston, New York: Edwin Mellen Press. ISBN 978-0-7734-5723-2. Retrieved 5 June 2012.


బయటి లింకులు

[మార్చు]