తెలంగాణ పల్లె ప్రగతి పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ పల్లె ప్రగతి పథకం
తెలంగాణ పల్లె ప్రగతి పథకం లోగో
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనఆగష్టు 23, 2015
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ పల్లె ప్రగతి పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో సమీకృత గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో అమలైన తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగాం (టీఆర్‌ఐజీపీ) కి ‘తెలంగాణ పల్లె ప్రగతి పథకం’గా నామకరణం చేసి, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పథకంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు.[1]

ప్రారంభం

[మార్చు]

2015, ఆగష్టు 23న మెదక్ జిల్లా కౌడిపల్లి లో రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, టి. హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ప్రారంభించారు.[2]

తెలంగాణ పల్లె ప్రగతి పథకం ప్రారంభోత్సవం

పథకం వివరాలు

[మార్చు]

రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పల్లెప్రగతి పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని 150 వెనుకబడిన మండలాల అభివృద్ది కొరకు ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 653 కోట్ల రూపాయల మొత్తంతో ఐదు సంవత్సరాల కాలపరిధిలో “తెలంగాణ పల్లె ప్రగతి పథకం” కార్యక్రమాన్ని అమలు చేయుటకు నిర్ణయించడం జరిగింది.[3] గ్రామాల్లో ‘పల్లె సమగ్ర సేవాకేంద్రాలు’ ఏర్పాటుచేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

డీఆర్‌డీఏ నిర్వహించిన బేస్‌ లైన్ సర్వే ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మండలాను గుర్తించి ఆయా మండలాల్లో, ఈ పథకంలో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకుగాను డీఆర్‌డీఏ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, ఐసీడీఎస్, వైద్యశాఖల సమన్వయంతో ఆయా మండలాల్లో ప్రజలను, మహిళలను, రైతులను చైతన్య పర్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దళారుల బారిన పడి తమ పంటకు గిట్టుబాటు ధరను కోల్పోతున్న రైతులను ఆదుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులను బృందాలుగా ఏర్పర్చి, వారి పంట ఉత్పత్తులను వారే స్వయంగా మార్కెటింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తారు. ఏ.ఎన్‌.ఎం.ల ద్వారా ఆరోగ్య సేవలు, ఐసీడీఎస్ ద్వారా మాతా, శిశు సంరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలను ఐటీకి అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు.[1]

నిర్వహించిన తేదీలు

[మార్చు]

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించిన వివరాలు[4]

పల్లె ప్రగతి

[మార్చు]
  • మొదటి విడత: 2019 సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 5 వరకు
  • రెండో విడత: 2020 జనవరి 2 నుంచి 12 వరకు
  • మూడో విడత: 2020 జూన్ 1 నుంచి 10 వరకు
  • నాలుగో విడత: 2021 జూలై 1 నుంచి 10 వరకు
  • ఐదవ విడత: 2022 జూన్ 3 నుండి 18వ తేదీ వరకు

పట్టణ ప్రగతి

[మార్చు]
  • మొదటి విడత: 2020 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు
  • రెండో విడత: 2020 జూన్ 1 నుంచి 8 వరకు
  • మూడో విడత: 2021 జూలై 1 నుంచి 10 వరకు
  • నాలుగో విడత: 2022 జూన్ 3 నుండి 18వ తేదీ వరకు

పనులు

[మార్చు]

ఈ పథకంలో భాగంగా ప్రతిగ్రామంలో నర్సరీల ఏర్పాటు, ట్రాక్టర్లు-ట్రాలీల కొనుగోలు, హరితహారం కింద మొక్కలు నాటడం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లెపకృతి వనాలు, రైతు వేదికలు, ఇంటింటికీ చెత్త సేకరణ, వీధులు-మురికి కాల్వలను శుభ్రం చేయడం, పాత ఇండ్ల శిథిలాలను, చోట్ల పొదలు-తుప్పలు-మురికి తుమ్మలను తొలగించడం, ఖాళీ ప్రదేశాలు- కామన్ ఏరియాలను శుభ్రం చేయడం, పాత-పనిచేయని బోర్లను మూసివేయడం, నీరు నిల్వ ఉండే బొందలు-రోడ్ల గుంతలను పూడ్చివేయడం, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను శుభ్రంచేయడం, మార్కెట్లు-సంతలు నిర్వహించే ప్రదేశాలను శుభ్రం చేయడం వంటి పనులు చేపట్టబడుతున్నాయి.[5]

ప్రగతి

[మార్చు]

కొత్త పంచాయతీ రాజ్ చట్టం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 2019 నుండి 2022 వరకు ఈ మూడేండ్లకాలంలో రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలలకు రూ. 16,070.77 కోట్లు (పంచాయతీలకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.7,203 కోట్లు కాగా... వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులు, ఖర్చు చేసిన నిధులు రూ.8,867.77 కోట్లు) నిధులు విడుదలచేసి సంక్షేమం పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.[6]

2022 జూన్ 3 నుండి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులపాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. పల్లెప్రగతి ఐదో విడత, పట్టణప్రగతి నాలుగో విడతలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రధాన అంశాలుగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. పల్లె, పట్టణ ప్రగతి పర్యవేక్షణకు మండలానికి జిల్లా స్థాయి అధికారి, వార్డుకు ప్రత్యేక అధికారి, పంచాయతీకి మండలస్థాయి అధికారిని నియమించడంతోపాటు పంచాయతీ కమిటీలను (సర్పంచ్‌ అధ్యక్షుడిగా ఎంపీటీసీ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్తు లైన్‌, మిషన్‌ భగీరథ టెక్నిషియన్‌), పట్టణస్థాయి కమిటీలను (వార్డు కమిటీల్లో కార్పోరేటర్‌, కౌన్సిలర్‌, కలెక్టర్‌ నియమించిన వార్డు సూపర్‌వైజర్‌, మున్సిపల్‌ శానిటరీ ఉద్యోగి, మున్సిపల్‌ వాటర్‌ సప్లయ్‌ ఉద్యోగి) ఏర్పాటుచేశారు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 సాక్షి. "'తెలంగాణ పల్లె ప్రగతి'". Retrieved 5 February 2017.
  2. సాక్షి, తెలంగాణ కథ. "పేదరిక నిర్మూలనకే 'తెలంగాణ పల్లె ప్రగతి'". Retrieved 5 February 2017.
  3. టి.ఆర్.ఎస్. పార్టీ ఆన్ లైన్. "త్వరలో తెలంగాణ పల్లె ప్రగతి ప్రారంభం". trspartyonline.org. Retrieved 5 February 2017.[permanent dead link]
  4. 4.0 4.1 telugu, NT News (2022-06-03). "నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి". Namasthe Telangana. Archived from the original on 2022-06-03. Retrieved 2022-06-03.
  5. praveen, Sunkari (2021-07-10). "రాష్ట్రంలో నాలుగో విడత పల్లె/పట్టణ ప్రగతి దిగ్విజయం". TNews Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-31. Retrieved 2022-01-31. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "పల్లెలకు మూడేండ్లలో 16 వేల కోట్లు". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-30. Archived from the original on 2022-01-31. Retrieved 2022-01-31.