తెలుగు అకాడమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు అకాడమి చిహ్నం
కె యాదగిరి, తెలుగుఅకాడమీ సంచాలకుడు

ఉన్నత స్థాయిలో విద్యాబోధన వాహికగానూ, పాలనా భాషగా తెలుగును సుసంపన్నం చేసేందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 6, 1968తెలుగు అకాడమి [1][2]ని స్థాపించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. పి.వి.నరసింహరావు దీని వ్యవస్థాపక అధ్యక్షులు. ప్రస్తుత (2011) సంచాలకులుగా ప్రభుత్వం ఆచార్య కె యాదగిరిని నియమించింది. దాదాపు రెండువేల పుస్తకాలు విడుదల చేసింది. ఏటా అచ్చేసే పాఠ్యపుస్తకాలు దాదాపు 25 లక్షలు.

లక్ష్యాలు[మార్చు]

 • ఉన్నత విద్యకు సంబంధించి అన్ని స్థాయిలలో అంటే ఇంటర్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలలో తెలుగుని మాధ్యమంగా ప్రవేశపెట్టటం, తెలుగుని వ్యాప్తి చేయడంలో విశ్వ విద్యాలయాలకు సహకరించడం.
 • అధికారభాషగా తెలుగుని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం.
 • తెలుగు భాషను ఆధునీకరించి, సుసంపన్నం చేసే కృషిలో భాగంగా ప్రమాణీకరించడం, పరిశోధనలు నిర్వహించండం.

తెలుగులో ఉన్నతవిద్య[మార్చు]

ఇంటర్ లోని అన్ని గ్రూపులకు తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, డిగ్రీ, పిజి స్థాయిలలో తెలుగు మాధ్యమపు పాఠ్యపుస్తకాలను ఈ సంస్థ అందజేస్తుంది. సామాజిక, సామాన్య శాస్త్రాల అనువాదానికి ముఖ్యంగా కావలసిన పారిభాషిక పదకోశాలను, రకరకాల నిఘంటువులను వెలువరించింది.

పారిభాషిక పదకోశం భౌతికశాస్త్రము

అధికార భాషా సేవ[మార్చు]

అధికారభాషా అమలుకు అవసరమయిన పదకోశాలను తయారుచేసింది.

తెలుగు భాష పరిశోధన, ఆధునీకరణ[మార్చు]

తెలుగులో వెలువడిన సాహిత్య సంగ్రహాలను వెలువరించే దిశగా, 1950 దాకా వెలవడిన సాహిత్యాన్ని రెండు కోశాలలో ముద్రించింది.

నిర్వహణ[మార్చు]

తెలుగు అకాడమీలో పాలనా సౌలభ్యత కోసం మూడు శాఖలను ఏర్పాటుచేసారు.

పరిశోధనా శాఖ[మార్చు]

పరిశోధనా శాఖ ప్రధాన కార్యక్రమాలు:

 • ఆధునిక తెలుగు భాషకు సమగ్రమైన వర్ణనాత్మక వ్యాకరణం రూపొందించడానికి గాను సామాజిక భాషా పరిశీలన జరపడం.
 • ఉపయుక్త గ్రంథ సూచికలు రూపొందించడం.
 • వివిధ శాస్త్ర విషయాలలో పరిశోధనలను వివరించే సంహితాలను సంకలనం చేయడం.
 • నేటి తెలుగు సాహిత్యంలో వాక్యగత వైవిధ్యాన్ని అధ్యయనం చేయడం.
 • గిరిజన పరిశోధనా సంస్థ సహకారంతో గోండి, కోయ తెగల భాషాధ్యయనం చేసి, వాటికి తెలుగు లిపి వాచకాలు తయారు చేయడం.

బోధనా శాఖ[మార్చు]

దీని ప్రధాన ఉద్దేశాలు

 • తెలుగు మాతృభాషకాని వయోజనులకు తెలుగు నేర్పించడం.
 • ఒకటి నుండి ఏడవ తరగతి వరకూ విద్యార్థుల శబ్దసంపద పరిశీలన చేసి పట్టికలను తయారు చేయడం.
 • ఈ శాఖకు గల ప్రత్యేక ప్రయోగశాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం.

ప్రచురణల శాఖ[మార్చు]

ఈ శాఖ యొక్క కార్యక్రమాలు.

 • ఇంటర్ మీడియట్, బి.ఏ., బి.కాం., బి.యస్.సి. విద్యార్థుల కోసం తెలుగులో మౌలిక పాఠ్య పుస్తకాలు రాయించి, ప్రచురించడం
 • పోస్ట్ గ్రాడ్యుయేట్, వృత్తి విద్య స్థాయిలో పాఠ్య పుస్తకాలు, గ్రంథాలు ప్రచురించడం.
 • జనరంజక గ్రంథాలను, పౌరశాస్త్ర విజ్ఞాన వ్యాప్తికై రిఫరెన్స్ గ్రంథాలను అనువదించి ప్రచురించడం
 • శాఖ విషయాలలో మోనోగ్రాఫులు రాయించి ప్రచురించడం
 • పునరభ్యాస గోష్ఠులను నిర్వహించడం, వైజ్ఞానికోపాన్యాసాలను నిర్వహించడం మొదలగునవి.
ప్రచురించిన పుస్తకాల వివరాలు (31-09-2007 వరకు)
విభాగం ప్రచురణల సంఖ్య
ఇంటర్ తెలుగు మాధ్యమము 22
ఇంటర్ ఇంగ్లీషు మాధ్యమము 22
భాషలు 37
వృత్తి విద్యాపుస్తకాలు 70
డిగ్రీ స్థాయి 115
పిజీ స్థాయి 52
డిఇడి 8
బిఇడి 12
జనరంజక గ్రంథాలు, పౌరశాస్త్ర విజ్ఞాన వ్యాప్తికై రిఫరెన్స్ గ్రంథాలు, అనువాదాలు 202
మొత్తం 540

ఇతర వివరాలు[మార్చు]

తెలుగు పత్రిక

1973 నుండి "తెలుగు" అనే పేరుతో త్రైమాసిక పత్రికను నడుపుతున్నది. దీనిలో సామాజిక, శాస్త్ర, భాష, సాహిత్యాలపై వ్యాసాలు వుంటాయి.

నవతరం నిఘంటువులు
తెలుగు-కన్నడ నిఘంటువు

నవతరం నిఘంటువులు శీర్షికన రకరకాల నిఘంటువుల నిర్మించింది. ప్రవాస తెలుగువారికి ఉపయోగపడే నిఘంటువులు కూడా ముద్రించింది. ఉదాహరణ:తెలుగు-కన్నడ నిఘంటువు, డా: జి ఉమామహేశ్వరరావు, శ్రేణి సంపాదకులు, 2004

తెలుగు మాండలికాలు

తెలుగు మాండలికాలు అనే పేరుతో వైఎస్ఆర్ జిల్లా, విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, ఆదిలాబాదు జిల్లా, నిజామాబాదు జిల్లా, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల వారీగా ముద్రించారు.

పోటీ పరీక్షల పుస్తకాలు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి

వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సరిపోయేటట్లు పుస్తకాలను ప్రచురించింది.

విద్యార్థిపురస్కారాలు

2001 నుండి ఇంటర్మీడియెట్ తెలుగు మాధ్యమంలో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు పురస్కారాలు అందచేస్తున్నది.

సమస్యలు[మార్చు]

తెలుగు అకాడమీ పుస్తకాల కాపీహక్కుల ఉల్లంఘనకు గురై, దీని ఆదాయానికి గండిపడుతున్నది. 2010 లో కొన్ని విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ పుస్తకాల నకలుహక్కులు ఉల్లంఘించినట్లు వార్తలలో [3] వచ్చింది.

ఇతర తెలుగు అకాడమీలు[మార్చు]

లింకులు[మార్చు]