బ్లాగు

వికీపీడియా నుండి
(తెలుగు బ్లాగర్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఒక తెలుగు బ్లాగు

బ్లాగు (blog) అనే పదం వెబ్‌లాగ్ (weblog) అనే పదాన్ని సంక్షిప్తంగా చేయడంతో వచ్చింది. బ్లాగు అంటే మామూలు వెబ్‌పేజీయే, కాకపోతే ఇందులో రాసిన జాబులు తేదీల వారీగా. చివరగా రాసిన జాబులు ముందు చూపిస్తూ అమర్చి ఉంటాయి. వ్యక్తిగత డైరీల నుండి రాజకీయ ప్రచారాల దాకా, వివిధ మాధ్యమాల కార్యక్రమాల నుండి పెద్ద కంపెనీల వరకు, అప్పుడప్పుడు కలం విదిల్చే రచయితల నుండి అనేక మంది చెయ్యితిరిగిన రచయితల సామూహిక రచనల దాకా బ్లాగులు విస్తరించాయి. చాలా బ్లాగుల్లో చదువరులకు వ్యాఖ్యలు రాసే వీలు కలగజేస్తారు. అలా వ్యాఖ్యలు రాసేవారితో ఆ బ్లాగు కేంద్రంగా ఒక చదువరుల సమూహం ఏర్పడుతుంది; మిగతా వాళ్ళు కేవలం చదివి 'పారేసే' వాళ్ళన్నమాట. ఈ బ్లాగులూ, వాటికి సంబంధించిన వెబ్‌సైట్లూ అన్నిటినీ కలిపి బ్లాగోస్ఫియరుఅని దాన్ని తెలుగులో బ్లాగావరణం అని అంటారు. ఏదైనా ఒక విషయం గురించి, లేక వివాదం గురించి బ్లాగుల్లో వాద ప్రతివాదాలు చెలరేగితే వాటిని బ్లాగ్యుద్ధాలు, బ్లాగు తుఫానులు అంటారు.

బ్లాగులు రకరకాల ఆకృతుల్లో ఉంటాయి. మామూలు బులెట్‌జాబితా లాగా పేర్చిన హైపరులింకుల (hyper links) వంటి వాటి నుండి, పాఠకుల వ్యాఖ్యలు, రేటింగులతో కూడిన సంక్షిప్త వ్యాసాల దాకా ఉంటాయి. వ్యక్తిగత బ్లాగు జాబులన్నీ కూడా తేదీ, సమయం ప్రకారం అన్నిటి కంటే కొత్తవి అన్నిటి కంటే పైన కనపడేలా అమర్చబడి ఉంటాయి. పాఠకుల వ్యాఖ్యలు జాబుకు అడుగున ఉంటాయి. బ్లాగులకు లింకులు చాలా ముఖ్యం కనుక పాత జాబులను ఓ క్రమపద్ధతిలో అమర్చి ప్రతీ జాబుకూ ఓ స్థిర లింకును కేటాయించే ఏర్పాటు ఉంటుంది. ఈ స్థిర లింకునే పెర్మాలింకు అంటారు. కొత్త వ్యాసాలు, వాటి లింకులు అర్ ఎస్ ఎస్ (RSS) లేదా ఆటమ్ (Atom లేదా ఎక్స్ఎమ్ఎల్ (XML ) పద్ధతుల్లో అందిస్తున్నారు. వీటిని ఏ ఫీడురీడరు ద్వారానైనా చదువుకోవచ్చు.

బ్లాగుల రచన, కూర్పు, ప్రచురణ ఎక్కువగా కంటెంటు మేనేజిమెంటు సిస్టము లేదా CMS ద్వారా చేస్తారు.

చరిత్ర

[మార్చు]

తొలుదొల్త

[మార్చు]
  • ఎలెక్ట్రానిక్ సమాజాలు ఇంటర్నెట్టుకు పూర్వమే ఉన్నాయి. ఉదాహరణకు అసోసియేటెడ్‌ప్రెస్ వారి వైరు ఓ పెద్ద చాట్ గది లాగా ఉండేది. ఎలెక్ట్రానిక్ సంభాషణలు, వైరు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. హ్యాం రేడియో ఈ ఎలెక్ట్రానిక్ సమాజానికి మరో ఉదాహరణ. ఈ హ్యాం రేడియో వినియోగదారులు సైబోర్గ్‌లాగ్ (గ్లాగ్) అని వ్యక్తిగ్త డైరీలు రాసేవారు.
  • బ్లాగులు వ్యాపించక ముందు, Usenet, ఈమెయిలు జాబితాలు, బులెటిన్‌బోర్డులు మొదలైనవి ఉండేవి. 1990 లలో WebX లాంటి ఇంటర్నెట్టు సాఫ్టువేర్లు నిరంతరంగా సాగుతూ ఉండే సంభాషణలను వీలైన సాఫ్టువేరును సృష్టించాయి. ప్రస్తుతం బ్లాగుల్లో వాడుకలో ఉన్న అనేక పదాలు వీటిలో రూపుదిద్దుకున్నవే.
  • కొంతమంది ఇంటర్నేట్లో జర్నళ్ళను ప్రచురించారు. ఆటల సాఫ్టువేరు ప్రోగ్రాములు రాసే జాన్ కార్మార్క్ రాసిన జర్నలు ప్రసిద్ధి చెందింది.

బ్లాగు ప్రారంభం

[మార్చు]

వ్యక్తిగత పేజీలతోపాటు బ్లాగ్‌రోల్సూ, ట్రాక్‌బాక్ వంటి లింకులు, వ్యాఖ్యల వంటి లింకులను తేలిగ్గా అమర్చుకునే వీలును బ్లాగు కలిగించింది. కొంత మంది నియంత్రణలో ఉండే ఫోరములు, ఎవరైనా చర్చ మొదలుపెట్టగలిగే మెయిలు జాబితాలకు భిన్నంగా సొంతదారు నియంత్రణలో ఉంటూ వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా బ్లాగు ఉంటుంది. 1994 లో స్వార్త్‌మోర్ కాలేజీలో చదివేటపుడు బ్లాగటం మొదలుపెట్టిన జస్టిన్ హాల్‌ను తొలి బ్లాగరులలో ఒకడిగా భావిస్తారు.

1997లో జాన్ బార్జర్ మొదటిసారిగా "వెబ్‌లాగ్" అనే మాటను వాడాడు. పీటర్ మెర్హోల్జ్ 1999 ఏప్రిల్, మేల్లో ఈ మాట ఇంగ్లీషు స్పెల్లింగుతో చిన్న ప్రయోగం చేసాడు. Weblog అనే ఒక పదాన్ని విడగొట్టి we blog అనే పదబంధంగా మార్చి తన బ్లాగులో పెట్టాడు. బ్లాగ్ అనేది వెబ్‌లాగ్ కి పొట్టిపదంగానూ, దాని క్రియగానూ భావించారు. క్రమేణా వెబ్‌లాగ్‌కు బ్లాగ్ అనే పేరే స్థిరపడి పోయింది. సరిగ్గా అదే సమయంలో వెలుగు చూసిన మొదటి బ్లాగు హోస్టింగు సైట్లయిన బ్లాగర్ (2004 లో గూగుల్ కొనేసింది), గ్రోక్‌సూప్లు ఈ మాటకు మరింత ప్రచారాన్ని తీసుకువచ్చాయి. 2003 మార్చిలో వెబ్‌లాగ్ అనేమాట నిఘంటువులకు ఎక్కింది. [1] Archived 2008-05-12 at the Wayback Machine

బ్లాగులంటే కేవలం మామూలు వెబ్‌సైట్ల లాగా కాక, వాటికి కొత్త హంగులు చేర్చి శోభ తెచ్చిన వ్యక్తి డేవ్ వైనర్. ఆయన ఓ సర్వరును సృష్టించాడు.. బ్లాగులో ఏదైనా మార్పు చేర్పులు జరగ్గానే సదరు బ్లాగు ఈ సర్వరును తట్టి, తనకు మార్పులు జరిగిన విషయం తెలియజేస్తుంది. బ్లాగ్‌రోలింగు [2] వంటి పరికరాలను వాడి తమకిష్టమైన బ్లాగుల్లో ఎప్పుడు మార్పులు చేర్పులు జరుగాయో వినియోగదారులు తెలుసుకోగలిగారు.

ప్రభావశీలంగా బ్లాగు

[మార్చు]

సెప్టెంబర్ 11 దాడుల తరువాత అమెరికాను సమర్ధించే బ్లాగులు ఎన్నో వచ్చాయి. ఆ సంఘటననకు సంబంధించిన సమాచారం మరింత తెలుసుకునేందుకు, దాన్ని అర్థం చేసుకునేందుకు పాఠకులు ఈ బ్లాగులను ఆదరించారు. 2002 నాటికి వీటిలో చాలా బ్లాగులు అమెరికా ఇరాక్ ఆక్రమణను, సామూహిక మారణాయుధాల నిల్వల ఏరివేతనూ సమర్ధించాయి. ఈ యుద్ధ బ్లాగరులు ఎక్కువగా యుద్ధ సమర్ధకులైన మిత వాదులే అయినప్పటికీ, తరువాతి కాలంలో ఇరాక్ యుద్ధం గురించి రాసేవారంతా - వారి దృక్కోణం ఎలా ఉన్నప్పటికీ - యుద్ధ బ్లాగరుల కోవలోకి వచ్చేలా ఈ పదం కొత్త అర్థం సంతరించుకుంది. 2003లో ఫోర్బెస్ పత్రిక ఉత్తమ యుద్ధబ్లాగులను సంకలనం చేసినపుడు యుద్ధ బ్లాగరులను ఈ కొత్త అర్థంలోనే వాడింది.

మొదటి బ్లాగు వివాదం బహుశా "ట్రెంట్ లాట్ పతనం" అయి ఉండవచ్చు. స్ట్రోం థర్మండ్ గౌరవార్థం ఇచ్చిన ఓ విందులో థర్మండ్ నాయకత్వ లక్షణాల కారణంగా అయ్యన ఒక ఉత్తమ అధ్యక్షుడు కాగలడని లాట్ వ్యాఖ్యానించాడు. థర్మండ్ తన రాజకీయ జీవితపు తొలిన్నాళ్ళలో తెల్ల జాత్యహంకారుల సానుభూతిపరుడుగా ఉండేవాడు. దీంతో అతన్ని పొగడిన లాట్‌ను ప్రజలు జాతి దురహంకారిగా భావించారు. తరువాతి కాలంలో జరిగిన పరిణామాల్లో జోష్ మార్షల్ వంటి బ్లాగర్లు ఈ విషయంపై దాడిని కొనసాగించారు. ఆయన వ్యాఖ్యలు ఏదో పొరపాటున నోరుజారి చేసినవి కావనీ, లాట్ స్వతహాగానే జాతి దురహంకారి అనీ వాదిస్తూ ఆయన చేసిన మరి కొన్ని ప్రసంగాలను ఉదహరిస్తూ తమ బ్లాగుల్లో రాసారు. ఈ ప్రయత్నాల మూలంగా వత్తిడి పెరిగి చివరికి సెనేట్ మెజారిటీ నాయకుడిగా లాట్ రాజీనామా చెయ్యవలసి వచ్చింది.

ఆ సరికి బ్లాగు ఒక గొప్ప ఆవిష్కరణగా మారింది. బ్లాగు ఎలా సృష్టించాలి, జాబులు ఎలా రాయాలి మొదలైన అంశాలను నేర్పిస్తూ వ్యాసాలు రాసాగాయి. ఇతర ప్రాజెక్స్టులకు వ్యాప్తి కలిగించడంతో పాటు, ఎలెక్ట్రానిక్ సమాజాలను నిర్మించడంలో బ్లాగుల ప్రాముఖ్యత గురించి కూడా వ్యాసాలు వచ్చాయి. జర్నలిజం కళాశాలలు బ్లాగులను పరిశీలిస్తూ, వాటికి, ప్రస్తుత జర్నలిజం పద్ధతులకు మధ్య తేడాలను గుర్తించే పని మొదలుపెట్టాయి.

వార్తలను, విశేషాలను వెల్లడి చెయ్యడం, వార్తా వ్యాసాలు రాయడం, వ్యాపింపజెయ్యడం మొదలైన అంశాల్లో వాటి పాత్ర కారణంగా బ్లాగుల ప్రాచుర్యం 2003 నుండి దినదినాభివృద్ధి చెందింది. 2003 ఇరాక్ యుద్ధం బ్లాగు ప్రస్థానంలో ఒక ప్రముఖ సంఘటన. మితవాదులూ, వామపక్షవాదులూ ఈ విషయంపై పరిణతితో కూడిన అభిప్రాయాలను వెల్లడించారు. ఇరాక్ యుద్ధ వార్తలతో కూడిన బ్లాగులు ఒక విస్ఫోటనం లాగా అకస్మాత్ ప్రజాదరణ పొందాయి. ఫోర్బెస్ పత్రిక ఈ వ్యవహారాన్ని అక్షరబద్ధం చేసింది. హొవార్డ్ డీన్, వెస్లీ క్లార్క్ లాంటి రాజకీయవేత్తల బ్లాగులు తమ అభిప్రాయాలను ప్రకటించేందుకు బ్లాగులను వాడుకోవడంతో వార్తా కేంద్రాలుగ వారి ప్రాశస్త్యం మరింత బలపడింది. డేనియల్ డ్రెజ్ఞర్, జె.బ్రాడ్‌ఫోర్డ్ డిలాంగ్ వంటి విషయ నిపుణులు బ్లాగులు రాయడం కారణంగా లోతైన విశ్లేషణా కేంద్రాలుగా బ్లాగులు పేరుపొందాయి.

2003 ఇరాక్ యుద్ధాన్ని ఓ రకంగా మొదటి బ్లాగు యుద్ధంగా చెప్పవచ్చు. బాగ్దాదు బ్లాగరుల బ్లాగులకు పాఠకాదరణ బాగా పెరిగింది. సలీం పాక్స్ అనే బ్లాగరి తన బ్లాగును ఒక పుస్తకంగా ప్రచురించాడు. ఇరాక్ యుద్ధంలో పాల్గిన్న సనికుల్లో కూడా బ్లాగులు రాయడం పెరిగిపోయింది. వీరి బ్లాగుల ద్వారా ప్రజలకు యుద్ధాన్ని మరో కోణం నుండి చూడగలిగారు. యుద్ధ రంగం నుండి వచ్చిన బ్లాగరుల భావనలు అధికారిక వార్తలకు సమాంతర వ్యాఖ్యలుగా రూపొందాయి. బ్లాగుల నుండి లింకులు ఇవ్వడం ద్వారా పెద్దగా వ్యాప్తి లేని వార్తా సాధనాలకు ప్రచారం కలిగించడం తరచుగా జరిగింది. ఉదాహరణకు 2004 మార్చి 11న స్పెయిన్‌లో తీవ్రవాదుల ఘాతిఉకాలకు వ్యతిరేకంగా మాడ్రిడ్‌లో జరిగిన తీవ్రవాద వ్యతిరేక ప్రదర్శనను చూపేందుకు బ్లాగరులు అక్కడి వీధుల్లోని ట్రాఫిక్ కెమెరాలకు తమ బ్లాగుల నుండి లింకులు ఇచ్చారు. టెలివిజనులో వచ్చే కార్యక్రమాలకు ఇంచుమించు ప్రత్యక్ష వ్యాఖ్యానం లాగా బ్లాగరులు తమ తమ బ్లాగుల్లో రాస్తూ ఉంటారు. బ్లాగటం అంటే ప్రత్యక్ష వ్యాఖ్యానమనే మరో అర్థం అనే స్థాయికి చేరింది. ఎన్నికల పొత్తులపై సీపీఎం నాయకుడు "రాఘవులు వ్యాఖ్యలను బ్లాగుతున్నాను" అంటే "రాఘవులు వ్యాఖ్యలకు నా స్పందనను అలా టీవీలో చూస్తూ ఇలా బ్లాగులో రాస్తున్నాను" అని అర్థం.

2003 చివరికి, అగ్రస్థానాల్లో ఉన్న ఇన్స్టాపండిట్, డైలీ కోస్, అట్రియోస్ వంటి బ్లాగులకు రోజుకు 75,000 కు మించిన సందర్శకులు వస్తూ ఉన్నారు.

ప్రధాన స్రవంతిలో బ్లాగు

[మార్చు]

2004 లో బ్లాగులు ప్రధాన స్రవంతిలో భాగం కాసాగాయి. రాజకీయ పరిశీలకులు, వార్తా సంస్థలు, ఇతర వ్యక్తులు ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్దేందుకు, ప్రజల నాడిని తెలుసుకునేందుకు వాడసాగారు. రాజకీయ ప్రచారాల్లో పాల్గొనని నాయకులు కూడా తమ ఆలోచనలు, అభిప్రాయాలను వెల్లడి చేసేందుకు బ్లాగులను వాడుకున్నారు. కొలంబియా జర్నలిజం రివ్యూ పత్రిక బ్లాగుల గురించి రాయడం మొదలుపెట్టింది. బ్లాగుల సంకలనాల ముద్రణ మొదలైంది. రేడియో, టీవీల్లో బ్లాగరులు కనపడడం కూడా మొదలైంది. ఆ సంవత్సరం వేసవిలో జరిగిన అమెరికా రాజకీయ పార్టీల జాతీయ సమావేశాల్లో బ్లాగులు, బ్లాగరులు ప్రస్తావనకు వచ్చాయి. వెబ్‌స్టర్స్ డిక్షనరీ "blog"ను 2004కు ఆ సంవత్సరపు మాటగా గుర్తింపు నిచ్చింది. (వికీన్యూస్)

రాదర్‌గేట్ కుంభకోణం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. సీబీఎస్ వార్తా సంస్థకు చెందిన డాన్ రాదర్ 60 మినిట్స్ 2 అనే టీవీ కార్యక్రమంలో చూపించిన కొన్ని పత్రాలు ఫోర్జరీవి అని వాదిస్తూ కొందరు బ్లాగరులు సమీకృతంగా జాబులు రాసారు. మూడురోజుల్లోనే సీబీఎస్ తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పక తప్పలేదు. ఈ సంఘటనతో బ్లాగు కూడా ఒక వార్తా మాధ్యమంగా ఇతర మాధ్యమాలు అంగీకరించినట్లుగా బ్లాగరులు భావించారు. పాతుకుపోయిన వార్తా సంస్థలపై కూడా వత్తిడి తీసుకువచ్చి వారి వార్తా కథనాలను వెనక్కు తీసుకునేలా చెయ్యడంలో బ్లాగుల ప్రభావం తెలియవచ్చింది.

వినియోగదారుల ఫిర్యాదులను వెలుగులోకి తీసుకువచ్చే పని కూడా ప్రస్తుతం బ్లాగుల ద్వారా - ఒకప్పుడు యుస్‌నెట్ ద్వారా చేసినట్లు - చేస్తున్నారు.

బ్లాగరులు మాధ్యమాల వైపుకు కూడా మళ్ళారు. అట్రియోస్, గ్లెన్ రేనాల్డ్స్, మార్కోస్ మౌలిటాస్ జునీగా రేడియోలో పాల్గొంటారు. en:Ana Marie Cox (en:Wonkette) టీవీలో వస్తూ ఉంటారు. ఇక హ్యూ హెవిట్ వంటి వారు మాధ్యమాల నుండి ఇటువైపు వచ్చి తమ "పాత పరపతిని" బ్లాగుల ద్వారా మరింత విస్తరించుకున్నారు.

జనవరి 2005లో పీటర్ రోజాస్, జెని జార్డిన్, బెన్ ట్రాట్ & మెనా ట్రాట్, జోనాథన్ ష్వార్ట్జ్, జాసన్ గోల్డ్‌మన్, రాబర్ట్ స్కోబుల్, జాసన్ కలకానిస్ అనే ఎనిమిది మంది బ్లాగరులను వ్యాపార వర్గాలు విస్మరించజాలని వారుగా ఫార్చూన్ పత్రిక రాసింది.

బ్లాగడము, సంస్కృతీ

[మార్చు]

బ్లాగడమంటే రాజకీయాలెంతో సాంకేతికాలూ అంతే. బ్లాగులను నడిపించే ఉపకరణాలూ, బ్లాగుల చుట్టూ అల్లుకున్న సమాజాలూ బ్లాగులను ఓపెన్‌సోర్స్ ఉద్యమంతో ముడిపెట్టాయి. లారీ లెస్సిగ్, డేవిడ్ వీన్‌బెగర్ వంటి రచయితలు తమ బ్లాగుల ద్వారా బ్లాగులకు ప్రాచుర్యం కల్పించడమే కాక, రకరకాల సామాజిక దృష్టికోణాలను పాదుకొల్పారు. వార్తా సేకరణలో బ్లాగు పాత్ర గురించిన చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతున్న జర్నలిజం చర్చల్లో ఒకటి. ఇది సమాజంలో మాధ్యమాల పత్రగురించీ, మేథో సంపత్తి గురించీ పలు ప్రశ్నలకు దారి తీస్తుంది. చాలా మంది బ్లాగరులు ప్రధాన స్రవంతి మాధ్యమాల నుండి తమను తాము భిన్నంగా చూస్తారు. కొందరు మాత్రం మరో మాధ్యమం ద్వారా పనిచేస్తున్న ఆ మాధ్యమాల సభ్యులే.

చాలామంది బ్లాగరులకు పెద్ద పెద్ద ఎజెండాలే ఉన్నాయి. బ్లాగులను ఓపెన్‌సోర్సు రాజకీయాల్లో ఒక భాగంగానూ, రాజకీయాల్లో మరింత ప్రత్యక్షంగా పాల్గొన వీలు కలిగించే మార్గం గాను భావించారు. సంస్థలు మాత్రం అడ్డుగోడలేమీ లేకుండా ప్రజలకు నేరుగా తమ సందేశాలను చేర్చగలిగే సాధనంగా భావించాయి.

బ్లాగుల సృష్టీ, ప్రచురణా

[మార్చు]

బ్లాగులు మొదలైనప్పటి నుండి బ్లాగులను సృష్టించుకునేందుకు వీలు కలిగిస్తూ అనేక సాఫ్టువేరు పాకేజీలు వచ్చాయి. వెబ్‌లో బ్లాగులను రచించేందుకు, వాటిని ఆవిష్కరించేందుకు అనేక సంస్థలు తామరతంపరగా వచ్చాయి. గ్రేటెస్ట్ జర్నల్, పిటాస్, బ్లాగర్, లైవ్‌జర్నల్, క్సాంగా వీటిలో కొన్ని.

చాలా మంది బ్లాగరులు సర్వరు సాఫ్టువేరు ఉపకరణాలను వాడి బ్లాగులను సృష్టించేందుకు మొగ్గు చూపుతారు. న్యూక్లియస్ CMS, మూవబుల్‌టైప్, బిబ్లాగ్, వర్డ్‌ప్రెస్, బి2ఇవల్యూషన్, బోస్ట్‌మెషిన్, సెరెండిపిటీ ఇలాంటి ఉపకరణాల్లో కొన్ని. వీటి ద్వారా సృష్టించిన బ్లాగులను తమ తమ వెబ్‌సైట్లలో, లేదా తమకనువైన మరోచోట ప్రచురించుకోవచ్చు. ఈ ప్రోగ్రాములు మరిన్ని సౌలభ్యాలతో, మరింత శక్తివంతంగా ఉంటాయి కానీ, వాటిని వాడేందుకు మరింత పరిజ్ఞానం కావాలి. వెబ్‌లో రచనలు చేసేందుకు ఏర్పాటు చేస్తే ఎక్కడనుండైనా బ్లాగులు రాసే వీలు కలుగుతుంది.

ఇవేకాక, కొంతమంది తమ బ్లాగు సాఫ్టువేరును తామే ఓనమాల దగ్గరి నుండి రాసుకుంటారు. PHP, CGI వంటి భాషలు వాడి రాసే ఈ ప్రోగ్రాములకు చాలా సమయం పడుతుంది కానీ, చక్కగా తమకు అనువైన విధంగా బ్లాగులను తీర్చిదిద్దుకోవచ్చు.

బ్లాగులకు సామాన్యంగా ఉండే రెండు అంశాలు "బ్లాగ్చక్రాలు" (blogrolls), "వ్యాఖ్యలు" (commenting).

బ్లాగ్చక్రాలు అంటే ఓ బ్లాగు నుండి లింకులు ఇచ్చిన బ్లాగుల జాబితా. తన బ్లాగు దగ్గర సంబంధం కలిగి ఉన్న బ్లాగులకు లింకులు ఇవ్వడం ద్వారా బ్లాగరి తన బ్లాగుకు ఒక సందర్భాన్ని సృష్టిస్తారు. ఈ లింకుల ద్వారా ఒక బ్లాగు ఎన్నిసార్లు ఉదహరించబడిందో లెక్క వేస్తారు. బ్లాగ్చక్రపు మరో ప్రయోజనం ఏమిటంటే.. పరస్పర లింకులు ఇచ్చుకోవడం. లేదా తన బ్లాగుకు లింకు ఇస్తారనే ఆశతో తన బ్లాగునుండి మరో బ్లాగుకు లింకు ఇవ్వడం

మరో ముఖ్యమైన, వివాదాస్పదమైన అంశం.. వ్యాఖ్యానాల పద్ధతి. ఈ పద్ధతిలో పాఠకులు బ్లాగు జాబులపై తమ వ్యాఖ్యలను రాయవచ్చు. కొన్ని బ్లాగులకు ఈ వ్యాఖ్యల పద్ధతి ఉండదు. మరి కొన్నిటిలో వ్యాఖ్యలకు బ్లాగరి అనుమతి తప్పనిసరి చేసి ఉంటుంది. కొందరు బ్లాగరులు వ్యాఖ్యలను చాలా కీలకమైనవిగా భావిస్తారు. అసలైన బ్లాగులకు మామూలు రకం బ్లాగులకు తేడా ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుందని వీరు భావిస్తారు. వ్యాఖ్యాన అంశాన్ని బ్లాగు సాఫ్టువేరులో అంతర్భాగంగా రూపొందించవచ్చు. లేదా హేలోస్కాన్ వంటి సేవను అనుబంధంగా చేర్చడం ద్వారా నెలకొల్పవచ్చు. ఏదైనా బ్లాగుకు క్రమం తప్పకుండా రాసే వ్యాఖ్యాతలుంటే వారందరినీ ఆ బ్లాగు యొక్క సంఘంగా అనుకోవచ్చు.

ఎక్టో, w.బ్లాగర్ వంటి ఉపకరణాలను వాడి బ్లాగరులు వెబ్‌కు వెళ్ళకుండానే తమ బ్లాగుల్లో జాబులు రాయవచ్చు. బ్లాగు సాంకేతికాంశాలు ఇంకా మెరుగుపడుతూనే ఉన్నాయి. ఉదాహరణకు మూవబుల్‌టైప్ వారు 2002 లో ప్రవేశపెట్టిన ట్రాక్‌బాక్ ద్వారా బ్లాగుల్లో మార్పులు చేర్పులు జరిగినపుడు విషయ సంబంధం ఉన్న బ్లాగులకు ఈ విషయం తెలియజేస్తుంది&ందష్;ఫలానా విషయంపై జాబు లేదా వేరే బ్లాగులోని ఫలానా జాబుపై స్పందన.. ఇలాగ.

ఈ ట్రాక్‌బాకుల్లాంటి విశేషాలు కలిగిన బ్లాగులు సెర్చి ఇంజన్లు వాడే పేజీ రాంకు పద్ధతిని జటిలం చేసాయి. వీటిని సెర్చి ఇంజన్ల పరిధి లోకి తీసుకురావడం ఒక సవాలుగా మారింది. కావాలని సెర్చి రాంకును ముందుకు నెట్టేందుకు కొందరు దీన్ని వాడుతున్నారు. అయితే, పేజిరాంకును నిర్ణయించే పని సెర్చి ఇంజన్లది.. అది ఎలా చెయ్యాలి అనేది అవే చూసుకోవాలి.

వెబ్‌హోస్టింగు కంపెనీలు, ఆన్‌లైను ప్రచురణా సంస్థలు కూడా బ్లాగు తయారీ ఉపకరణాలను అందిస్తున్నాయి. సేలన్, ట్రైపాడ్, బ్రేవ్‌నెట్, అమెరికా ఆన్‌లైన్ మొదలైనవి కొన్ని ఉదాహరణలు. తాము ప్రచురించే బ్లాగులను వీరు "జర్నల్స్" అంటారు.

బ్లాగుల్లో రకాలు

[మార్చు]

వ్యక్తిగతం

[మార్చు]

బ్లాగు అంటే ఆన్‌లైను డైరీ లేదా జర్నలుగా చెప్పడం తరచూ జరుగుతూ ఉంటుంది. సరళమైన బ్లాగు ఆకృతి కారణంగా పెద్ద అనుభవం లేనివారు కూడా జాబులను సులభంగా రాసి, ప్రచురించగలుగుతున్నారు. ప్రజలు తమ రోజువారీ అనుభవాలను, ఫిర్యాదులను, కవిత్వాన్ని, గద్యాన్ని, దొంగచాటు, చాటుమాటు ఆలోచనలను రాసుకుంటారు. కొన్నిసార్లు ఇతరులను కూడా రాయనిస్తారు. ఇంటర్నెట్టు పితామహుడైన టిం బెర్నర్స్ లీ చెప్పినట్లు పరస్పరం కలిసి పనిచేయడమన్నమాట. 2001లో ఈ ఆన్‌లైను డైరీల గురించిన పరిజ్ఞానం నాటకీయంగా పెరిగిపోయింది.

కౌమారదశలో ఉన్నవారు, కాలేజీ కుర్రాళ్ళు, మొదలైనవారి దైనందిన జీవితంలో ఆన్‌లైను డైరీ ఓ భాగమైపోయింది. ఒకరినొకరు తిట్టుకోడానికీ, పైగా స్నేహితులు, శత్రువులు, అపరిచితులు - అందరూ చక్కగా వాటిని చదువుకోడానికి ఈ డైరీలు అనువుగా ఉన్నాయి.

ఆలోచనాత్మకం

[మార్చు]

వ్యక్తిగత బ్లాగు దైనందిన జీవితంలోని విషయాలకు, సంఘటనలకు సంబంధించింది కాగా, ఈ ఆలోచనాత్మక బ్లాగులు ఒక విశేష విషయంపై బ్లాగరు ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. విషయాలేమైనా కావచ్చు.. ప్రస్తుతం వార్తల్లో ఉన్న విషయాలే కానక్కర్లేదు, వేదాంత విషయాల దగ్గర్నుండి ఏవైనా కావచ్చు. ఒకవైపు వ్యక్తిగత బ్లాగులతోటీ, మరోవైపు విషయాత్మక బ్లాగులతోటి కలుస్తున్నప్పటికీ ఈ ఆలోచనాత్మక బ్లాగులను ఓ ప్రత్యేక వర్గంగా భావించవచ్చు.

మిత్రబ్లాగు

[మార్చు]

ఒకే అభిరుచులు కలిగిన వారు కలగలసి రాసే జర్నలే మిత్రబ్లాగు. ఇవి చిన్న చిన్న జాబులతో కూడి ఉంటాయి. జాబులు తరచుగా రాస్తూ ఉంటారు. రచయిత తన మిత్రబ్లాగును తన స్నేహితుల మిత్రబ్లాగులతో కనెక్టయ్యే వీలు కల్పిస్తారు. దీంతో బ్లాగుల గొలుసుకట్టు ఏర్పడితుంది.

విషయాత్మకం

[మార్చు]

ఓ ప్రత్యేక విషయంపై - సాధారణంగా సాంకేతిక విషయం - రాసే బ్లాగులే విషయాత్మక బ్లాగులు. గూగుల్ బ్లాగు దీనికో ఉదాహరణ. గూగుల్‌కు సంబంధించిన వార్తలు మాత్రమే ఇందులో ఉంటాయి. చాలా బ్లాగుల్లో పోస్టులను వర్గీకరించుకునే ఏర్పాటు ఉంది. దీంతో మామూలు బ్లాగును కూడా విషయాత్మక బ్లాగుకా మార్చుకోగలిగే వీలు ఏర్పడింది.

వార్తలు

[మార్చు]

కొన్ని బ్లాగులు వార్తలను సంక్షిప్తంగా సమర్పిస్తూ ఉంటాయి. ఉదాహరణకు తెలుగువారికి సంబంధించిన వార్తలు, చైనాలో ఇంటర్నెట్టు, బేస్‌బాల్, నార్వే వార్తలు, సంగీతం

సంయుక్తంగా (, ఉమ్మడిగా లేదా గుంపుగా)

[మార్చు]

ఒక విషయం గురించి ఒకే బ్లాగులో ఒకరికంటే ఎక్కువ మంది రాసే బ్లాగులు ఇవి. ఇలాంటి బ్లాగులు ఎవరైనా రాసే విధంగానైనా, లేదా కొంతమందికే పరిమితమైగానీ ఉండవచ్చు. మెటాఫిల్టరు దీనికో ఉదాహరణ.

స్లాష్‌డాట్ లో కొంతమంది ఎడిటర్లు సాంకేతికాంశాలకు చెందిన వార్తలపై రోజంతా తమకు వచ్చే లింకులను పరిశీలించి సరైనవాటిని ఎంచి ప్రచురిస్తూ ఉంటారు. వాళ్ళు స్లాష్‌డాట్ ను బ్లాగు అని పిలవనప్పటికీ బ్లాగు లక్షణాలు దానికి కొన్ని ఉన్నాయి.

మరో కొత్త రకం బ్లాగు వచ్చింది.. బ్లాగరులూ, సాంప్రదాయిక మాధ్యమాలు పరస్పర సహకారంతో నిర్వహించే బ్లాగులివి. ఈ మాధ్యమాల్లో వచ్చే వార్తలను బ్లాగుల్లోనూ, బ్లాగు వార్తలను మాధ్యమాల్లోను చర్చించే కార్యక్రమమిది. లోన్‌స్టార్ టైమ్స్, హూస్టన్ టాక్ రేడియో స్టేషనుల మధ్య గల సహకారం ఇలాంటిదే!

రాజకీయపరమైనవి

[మార్చు]

బ్లాగుల్లో ఎక్కువగా కనపడే రకాలలో రాజకీయ బ్లాగులు ఒకటి. వార్తల వెబ్‌సైట్లలోని వార్తలకు లింకులు ఇస్తూ వాటి గురించి తమ అభిప్రాయాలు రాస్తూ ఉంటారు. రచయితకు ఆసక్తి ఉన్న ఏ అంశంపైనైనా జాబులు రాయవచ్చు. వీటిలో కొన్ని ప్రత్యేకమినవి.. వార్తల వెబ్‌సైటులో గానీ, ఇతర బ్లాగుల్లో గానీ దొర్లిన తప్పులు, పక్షపాత ధోరణి గురించి రాస్తూ ఉంటారు ఈ బ్లాగుల్లో.


న్యాయపరమైనవి

[మార్చు]

న్యాయ, చట్టపరమైన విషయాలను చర్చించే బ్లాగులు ఇవి. ఇంగ్లీషులో వీటిని blawgs అనడం కద్దు.

డైరెక్టరీ బ్లాగులు

[మార్చు]

అనేకానేక వెబ్‌సైట్ల వివరాలను ఒక పద్ధతిలో, విషయానుసారంగా అమర్చి పెట్టిన బ్లాగులివి. వార్తలకు సంబంధించిన బ్లాగులు ఈ కోవలోకి వస్తాయి.

ప్రసార మాధ్యమాల ప్రధానమైనవి

[మార్చు]

కొన్ని బ్లాగులు ప్రసార మాధ్యమాల తప్పులని, వక్రీకరించబడిన యదార్థాలని వేలెత్తిచూపిస్తూ, ప్రసార మాధ్యమాలకు కాపలాదార్లుగా ఉంటాయి. చాలా మాధ్యమ-ప్రధానమైన బ్లాగులు ఏదో ఒక్క వార్తాపత్రికనో, టెలివిజన్ నెట్‌వర్క్‌పైనో దృష్టి కేంద్రీకరిస్తాయి.

వ్యాపార సంస్థల బ్లాగులు

[మార్చు]

పెద్ద పెద్ద వ్యాపార సంస్థల ఉద్యోగులు అధికారిక, లేదా ఉప అధికారిక బ్లాగులు ప్రచురించడము బాగా ఎక్కువ అవుతున్నది. కానీ సంస్థలు మాత్రం అన్ని వేళలా ఈ బ్లాగులును, బ్లాగర్లను మెచ్చుకోలేదు. జనవరి 2005లో జాయ్ గోర్డన్, స్కాట్లాండు లోని ఎడింబర్గ్ లోని వెస్ట్స్టోన్ పుస్తకాల షాపు నుండి ఉద్యోములో నుండి తొలగించబడినాడు, ఎందుకంటే ఇతను తన బ్లాగులో పై అధికారిని " asshole in sandals" అని తిట్టినాదు. అలాగే 2004 సంవత్సరములో ఎల్లెన్ సిమోనెట్టి డెల్టా ఎయిర్ లైన్స్ విమాన సేవకుడు కూడా తన బ్లాగులో ఉద్యోగ డ్రస్సులో ఫోటో పెట్టినందుకు తొలగించబడింది. బహుశా అన్నిటికన్నా ప్రముఖమైన సంఘటన ఓ వెబ్సైటు జేటూఈఈ నుండి పీహెచ్‌పీకి మారడంలోని ఔచిత్యం గురించి వ్రాసినందుకు అనే ఆవిడను ఫ్రెడ్‌స్టెర్ నుండి ఉద్యోగము నుండి తొలగించుట.

దీనికి వ్యతిరేకముగా ప్రవర్తించిన సంస్థలు కూడా ఉన్నాయి.

2004లో బ్లాగుల పాపులారిటీని గమనించిన అనేక సంస్థల పై అధికారులు, విశ్వ విద్యాలయాలు బ్లాగులను సమాచార మార్గముగా వాడటము మొదలుపెట్టినాయి. ఇలా బ్లాగులను (ఏవైతే కేవలము ఇంటర్నెట్టులో అభిరుచి గల వారికి మాత్రమే పరిమితము అయినాయో) సంష్తలు వాడటము మొదలుపెట్టడము బ్లాగు వ్యవస్థకే చేతు అని భయపడుతున్నాయి, కానీ కొందరు మాత్రము ఇది చాలా మంచి పరిణామము అని భావిస్తారు.

2005 వ సంవత్సరములో ఎలాక్ట్రానిక్ ఫ్రాంటియరు ఫౌండేషను ప్రచురించిన అనామకంగా, సురక్షితంగా బ్లాగు చేయడం అనే రచన చూడదగ్గది.

సలహా

[మార్చు]

చాలా బ్లాగులు సలాహాలు అందిస్తుంటాయి, ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ సాంకేతిక విజ్ఞానము (గారీడెవ్)లేదా కాల్పనిక మహిళా రచనలు (ఫోర్ చిక్స్, కిడ్స్ ).

మతపరమైన

[మార్చు]

కొన్ని బ్లాగులు మతపరమైన విషయాలు చర్చిస్తూ ఉంటాయి. వీటిలో మత పరమైన సలహాలు, సూచనలు, శ్లోకాలు, మంత్రాలు, మత గ్రంథాల వివరాలు, విశ్లేషణలు, ఇంకా మత పరమైన ఆరోపణలు, కేకల్ మొదలగున్నవి ఉంటాయి

ఫార్మేటులు

[మార్చు]

కొన్ని బ్లాగులు ఫార్మేటులో ప్రత్యేకతను కలిగి ఉంటాయి, ఉదాహరణకు బొమ్మల బ్లాగు, వీడియో బ్లాగు మరి కొన్ని ప్రత్యేకమైన విషయముపై ఉంటాయి, ఉదాహరణకు మొబైలు బ్లాగు.

ఆడియో లేదా ధ్వని బ్లాగులు

[మార్చు]

2000 సంవత్సరము నుండి బాగా అభివృద్ధి చెందిన బ్లాగులు ఆడియో బ్లాగులు, ఈ ఆడియో బ్లాగులు సాధారణంగా ఏదైనా విషయముపై ఉదాహరణకు పాత పాటల బ్లాగులు, కొత్త పాటల బ్లాగులు వంటివి ఉంటాయి, ఇవే కాకుండా వ్యక్తిగత పాటల బ్లాగు అనగా పాడ్‌కాస్టింగ్ కూడా బహుళ ప్రాచుర్యము పొందుతున్నది.

ఫోటోగ్రఫీ

[మార్చు]

బహుళ ప్రాచుర్యము పొందిన డిజిటల్ కెమెరాలు, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ల వల్ల ఇంటర్నెట్ (అంతర్జాలము) పై ఫోటోలు పంచుకోవడము చాలా తేలిక మరియూ ప్రాచుర్యము వహించింది. ఈ కోవలోని చెందినదే ఫోటో బ్లాగు, ఈ బ్లాగులో ఫోటోలు చాలా చక్కగా అలంకరించి ఉంటాయి.

వీడియో

[మార్చు]

జనవరి 2005 న మొదటి వీడియో బ్లాగు ఏర్పాటు చేయబడింది. దీనితో ఓ క్రొత్త బ్లాగర్ల ఫార్మేటు ప్రారంభమైంది, అదే వీడియో బ్లాగింగు.

సాధారణ పదజాలం

[మార్చు]

అన్ని హాబీల్లాగే బ్లాగింగు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన పదజాలాన్ని సృష్టించుకున్నది. వాటిలో ఎక్కువ తరచుగా వాడే పదాలు, పదబంధాలు కొన్నిటిని వివరించడానికి చేసిన చిన్న ప్రయత్నం ఇది (పదం యొక్క అర్థం స్పష్టంగా లేనిచోట ఆ పదం ఎలా ఏర్పడిందో కూడా పేర్కొనడం జరిగింది):

ఆడియో బ్లాగు (బ్లాగ్ధ్వని)
ఈ రకము బ్లాగులో జాబులు సాధారణముగా ఆడియో జాబులు ఉంటాయి. వీటిలో పాడ్‌కాస్టింగ్ అనేది ఒక ఉప శాఖ.
బ్లెగ్ (బ్లెగ్గింగు)
ఏదైనా సమాచారము కోసం చదువరులను అడిగే బ్లాగు, ఇది బ్లాగు మరియూ బెగ్గింగు అనే పదాల నుండి వచ్చింది.
బ్లాగు ఫీడు
యక్స్ యం యల్ (XML) ఆధారిత ఫైలు, దీనిలో బ్లాగు సాఫ్ట్‌వేరులు యాంత్రికముగా చదవతగిన బ్లాగును ఉంచుతాయి, తద్వారా ఆ బ్లాగు వెబ్బులో పంచబడి, సిండికేటు చేయబడి ప్రాచుర్యము పొందుతుంది. ఆర్ యస్ యస్ (RSS) మరియూ యాటం (Atom) అనునవి దీనిలో ప్రముఖమైన స్టాండర్డులు.
బ్లాగ్ఫూ (బ్లాగనామక)
అనాకముడిని, లేదా అనామక గుంపును ఉద్దేశించి వ్రాయబడుతున్నట్టున్న బ్లాగులు కానీ నిజానికి అవి ఓ ప్రత్యేకమైన వ్యక్తిని లేదా సంస్థను ఉద్దేశించి వ్రాయబడునవి.
బ్లాగ్జంపులు
ఒక బ్లాగు నుండి మరొక బ్లాగునకు లింకుల ద్వారా ఫాలో అవ్వడము అన్నమాట, మన టార్జాను గారు ఒక చెట్టు నుండి మరొక చెట్టునకు దుముకుతారు చూడండి అలాగన్నమాట. ఇలా ఫాలో అవ్వుతున్నప్పుడు సాధారణంగా మరింత సమాచారము, ఉపయోగపడే ఇతర లిణ్కులు చాలా తగులుతుంటాయి.
బ్లాగకుడు
బాగా బ్లాగు చేసేవాదు అని అర్థము
బ్లాగుచుట్ట (బ్లాగ్‌రోల్)
ఒక బ్లాగుల చిట్టా, సాధారణంగా ఒకని ఇష్టమైన బ్లాగుల చిట్టా ఉంటుంది. ఈ చిట్టాలు బ్లాగ్రోలింగు సేవలు ఉపయోగించుట ద్వారా మరింత శక్తివంతముగా చేయవచ్చు.
బ్లాగ్సైటు
బ్లాగు యొక్క వెబ్బు లొకేషను. సాధారణంగా ఒక బ్లాగుకు దానికి మాత్రమే చెందిన డిమైను ఉన్నచో ఇలా పిలుస్తారు.
బ్లాగ్స్నాబు ( బ్లాగద్దకస్తుడు)
తన బ్లాగుపై కామెంట్లకు జవాబులు ఇవ్వడంలో బద్దకించి అస్సలు ఇవ్వని వాడు.
మోబ్లాగు
మొబైలు బ్లాగు, సాధారణంగా మొబైలు ఫోను నుండి పంపబదిన ఫోటులు కలిగి ఉంటాయి.
శాశ్వత లింకు
ఒక బ్లాగు జాబునకు ఉన్న శాశ్వత లింకు.
పింగు
ట్రాక్ బ్యాకు పద్ధతిలో ఒక బ్లాగులోని టపాకు సంబంధించి ఇంకొక బ్లాగులో ఏదైనా రాస్తే అది సూచిస్తూ మొదటి బ్లాగుకు పంపే ఆటోమేటిక్ సంకేతాన్ని పింగంటారు.
ట్రాక్‌బ్యాకు
ఒక బ్లాగులోని టపాకు జవాబుగా లేదా వ్యాక్యానిస్తూ ఎవరైనా ఆ వ్యాఖ్యనే తమ బ్లాగులో టపాగారాసి ట్రాక్బ్యాకు పద్ధతిలో ఆ మూల బ్లాగుకు దీనికి వ్యాఖ్య లేదా తిరుగుటపా ఇక్కడుందన్నట్టు ఒక పింగు పంపించే పద్ధతిని ట్రాక్‌బ్యాక్ అంటారు.

చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బ్లాగు&oldid=4222862" నుండి వెలికితీశారు