Jump to content

తెలుగు వెలుగులు

వికీపీడియా నుండి
తెలుగు వెలుగులు
కృతికర్త:
సంపాదకులు: శివలెంక శంభుప్రసాద్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వ్యాసాల సంకలనం
విభాగం (కళా ప్రక్రియ): జీవితచరిత్రలు
ప్రచురణ:
విడుదల:

తెలుగు వెలుగులు పుస్తకం గతంలో ఆంధ్రసచిత్ర వారపత్రికలో తెలుగు ప్రముఖుల గురించి ధారావాహికగా ప్రచురించిన వ్యాసాల సంకలనం.

రచన నేపథ్యం

[మార్చు]

సంకలనంలో ప్రచురింపబడ్డ వ్యాసాలన్నీ తెలుగు వెలుగులు శీర్షిక (కాలమ్)గా 1959-61 మధ్య కాలంలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వారంవారం ధారావాహికగా ప్రచురించబడ్డాయి. ఆనాటి తెలుగు రాజకీయవేత్తలు, సాహిత్యవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, ఉద్యమనేతలు వంటివారిని వాసాల్లో సమగ్రంగా చిత్రించే ప్రయత్నం చేశారు. ఆనాటి ఆంధ్రపత్రిక సంపాదకుడు శివలెంక శంభుప్రసాద్ నిర్దేశకత్వంలో సంపాదక మండలి వారు ఈ వ్యాసాలను రచించారు.ఈ వ్యాసకర్త ఎవరో ఆనాటి ఆంధ్రపత్రిక పాఠకులకు తెలియదు. పైగా ఈ వ్యాసాలు ఒకచేతిమీదుగానే వస్తున్నాయనుకునేవారని ముళ్లపూడి వెంకటరమణ ప్రస్తావించారు. ఈ వ్యాసాలు శివలెంక శంభుప్రసాద్, ముళ్లపూడి వెంకటరమణ, నండూరి, తిరుమల రామచంద్ర, పిలకా, తెన్నేటి సూరిలతో పాటు నలుగురైదుగురు రచయితలు వ్రాశామని ముళ్ళపూడి వెంకటరమణ ఆత్మకథలో వ్రాసుకున్నారు.[1] సినీ ప్రముఖుల గురించీ, ఈమని శంకరశాస్త్రి గురించీ ముళ్లపూడివారు వ్రాశారన్నది దాదాపు ప్రచురించిన నలభై యేళ్లకు బాపూరమణీయం ద్వారా బయటపడింది.[2] నండూరివారు అక్షరయాత్రలో దేవులపల్లి, మరికొందరు కవిప్రముఖుల వ్యాసాలు ప్రచురించారు.[3] కోతికొమ్మచ్చిలో ఉన్న వివరాలను బట్టి రంగా, విశ్వనాథ, ద్వారం వేంకటస్వామి నాయుడు, గుర్రం జాషువాలను గురించిన వ్యాసాలు శివలెంక శంభుప్రసాద్ వ్రాసారని తెలుస్తుంది. మిగిలిన రచయితలు ఏ వ్యాసాలు వ్రాశారో తెలియదు. వీరితోపాటు వ్యాసాలు వ్రాసిన ఇతర రచయితలు ఎవరో కూడా తెలియదు.

వ్యాసాల శైలి

[మార్చు]

క్లుప్తంగా పేజీలోపు వ్యాసాన్ని వ్రాస్తూనే ఆ వ్యక్తి సమగ్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా వ్యాసాలను రాశారు. వ్యాసం పక్క పేజీలో ఆ వ్యక్తి లక్షణాలను స్ఫుటంగా వ్యక్తపరిచేలా బాపు వేసిన బొమ్మలు కూడా జతపరిచారు. ముళ్లపూడి వెంకటరమణ ఆనాడు తాము కలిసి చిత్రించిన వ్యాసాలను గురించి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి వివిధ రంగాలలో గొప్పగొప్ప విజయాలు సాధించి పేరు గడించిన తెలుగువారి గురించిన పదచిత్రాలు. పదిహేను ఇరవై వాక్యాలలో-కావ్యం లాంటి వ్యాసం వ్రాయాలి. ఆ వ్యక్తి జీవితజీవన సమగ్రరూపాన్ని పాఠకుడి మనసులో కల్పించాలి. దానిని బాపూ రేఖాచిత్రాలతో కంటికి చూపించాలి. భయం, పక్షపాతం, మొహమాటం ఉండకూడదు. ఉంటే చెడును కూడా చెప్పి నొప్పించాలి. నొచ్చుకున్నవాళ్ళు మెచ్చుకోవాలి. అన్నీ ఒక్క పేజీకి లొంగాలి. ప్రతీ వ్యాసాన్నీ అయిదారుగురం చిత్రిక పట్టేవాళ్ళం.

మూలాలు

[మార్చు]
  1. కోతికొమ్మచ్చి:ముళ్ళపూడి వెంకటరమణ
  2. బాపూరమణీయం:బాపు-రమణలు:తానా ప్రచురణలు
  3. అక్షరయాత్ర:నండూరి రామ్మోహనరావు