దామోదర్ వ్యాలీ కార్పొరేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బహుళార్ధసాధక నదీ లోయ ప్రాజెక్టు అయిన దామోదర్ వ్యాలీ ప్రాజెక్టును నిర్వహించడానికి ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డివిసి). దీన్ని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రవహించే దామోదర్ నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. భారతదేశంలో నదీలోయ ప్రణాళికల మాజీ చీఫ్ రూపశిల్పి, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన మేఘనాద్ సాహా దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కోసం అసలు ప్రణాళికను సిద్ధం చేశాడు. డివిసి, భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ యాజమాన్యం కింద తాప విద్యుత్కేంద్రాలు, జలవిద్యుత్కేంద్రాలు రెండింటినీ నిర్వహిస్తుంది. డీవిసి ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]
1955 పోస్టల్ స్టాంప్

దామోదర్ నది లోయ వరదలకు గురవడం పరిపాటి. 1943 నాటి వినాశకరమైన వరద తరువాత, బెంగాల్ ప్రభుత్వం "దామోదర్ వరద విచారణ కమిటీ" అనే హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. అమెరికా లోని టేనస్సీ వ్యాలీ అథారిటీ తరహాలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. తదనంతరం, సమస్యను అధ్యయనం చేయడానికి TVA లో సీనియర్ ఇంజనీర్ అయిన వూర్డుయిన్‌ని నియమించారు. 1944 లో లోయ మొత్తంలో బహుళార్థక అభివృద్ధి జరిగేలా అతను సూచించాడు. 1948 లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌ను "స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బహుళార్ధసాధక నదీ లోయ ప్రాజెక్టు"గా స్థాపించారు. [2]

డివిసి కేంద్ర ప్రభుత్వం, బీహార్ (తరువాత జార్ఖండ్‌గా విడిపోయింది), పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పడింది. కార్పొరేషన్ ప్రధాన లక్ష్యాలు వరద నియంత్రణ, నీటిపారుదల, విద్యుదుత్పత్తి, విద్యుత్ప్రసారం, సంవత్సరం పొడవునా నౌకాయానం. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కార్పొరేషన్ పరోక్ష సహకారం అందించాలని కూడా భావించారు. అయితే, వూర్డుయిన్ ఎనిమిది ఆనకట్టల నిర్మాణాన్ని ప్రతిపాదించగా, డివిసి నాలుగు మాత్రమే నిర్మించింది.[3]

దామోదర్ లోయలో వరద నియంత్రణ, నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి, నౌకాయానం లక్ష్యాలుగా బహుళార్ధసాధక అభివృద్ధి ప్రణాళికను వూర్దూయిన్ "ప్రిలిమినరీ మెమోరాండం"గా రూపొందించాడు. భారత ప్రభుత్వం నియమించిన నలుగురు కన్సల్టెంట్లు దీనిని పరిశీలించారు. వారు వూర్డుయిన్ పథకం లోని ప్రధాన సాంకేతిక లక్షణాలను ఆమోదించారు. తిలయాతో నిర్మాణాన్ని ప్రారంభించి, ఆ తరువాత మైథాన్‌ను నిర్మించాలని సిఫార్సు చేశారు. 1947 ఏప్రిల్ నాటికి, పథకం అమలుపై కేంద్రం, పశ్చిమ బెంగాల్, బీహార్ మూడు ప్రభుత్వాల మధ్య ఆచరణాత్మకంగా పూర్తి ఒప్పందం కుదిరింది. 1948 మార్చిలో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ చట్టాన్ని (1948 నం. XIV చట్టం) కేంద్ర శాసనసభ ఆమోదించింది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌ను నిర్మించే ఉద్దేశ్యంతో - కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పాల్గొనవలసి ఉంటుంది. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి బహుళార్ధసాధక నదీ లోయ ప్రాజెక్టుగా 1948 జూలై 7 న ఈ కార్పొరేషన్ ఉనికిలోకి వచ్చింది.

మొదటి ఆనకట్ట తిలయా వద్ద బరాకర్ నదిపై నిర్మించి, 1953 లో ప్రారంభించారు. రెండవది, కోనార్ ఆనకట్టను కోనార్ నదిపై 1955 లో ప్రారంభించారు. మైథోన్ వద్ద బరాకర్ నదిపై నిర్మించిన మూడవ ఆనకట్టను 1957 లో ప్రారంభించారు. నాల్గవ ఆనకట్టను పంచేట్ వద్ద దామోదర్ నది మీద నిర్మించి, 1959 లో ప్రారంభించారు. దుర్గాపూర్ బ్యారేజీని 1955 లో నిర్మించారు. దీనికి 136.8 కిలోమీటర్లు (85.0 మై.) పొడవైన ఎడమ గట్టు ప్రధాన కాలువ, 88.5 కిలోమీటర్లు (55.0 మై.) పొడవైన కుడి గట్టు ప్రధాన కాలువను నిర్మించారు.[4][5]

దామోదర్ బేసిన్‌ 24,235 చ.కి.మీ.లలో విస్తరించింది. జార్ఖండ్‌లో 2 జిల్లాలు పూర్తిగా (ధన్‌బాద్, బొకారో), హజారీబాగ్, కోడెర్మా, ఛత్ర, రామ్‌గఢ్, పలమౌ, రాంచీ, లోహర్‌దాగా, గిరిదిహ్, దుమ్కా జిల్లాల్లోని భాగాలు, పశ్చిమ బెంగాల్లో పుర్బా బర్ధమాన్, పశ్చిమ్ బర్ధమాన్, హౌ, హూహ్, బంకురా, పురూలియా జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది.

తాప విద్యుత్కేంద్రాలు (బొగ్గు ఆధారిత) [6] [7]
విద్యుత్కేంద్రం పేరు రాష్ట్రం వ్యవస్థాపించిన సామర్థ్యం
MW లో
వ్యాఖ్యలు
మెజియా థర్మల్ పవర్ స్టేషన్ పశ్చిమ బెంగాల్ 4x210 + 2x250 + 2x500 = 2,340
రఘునాథ్‌పూర్ థర్మల్ పవర్ స్టేషన్ పశ్చిమ బెంగాల్ 2x600=1,200 రాబోయే 2x660 MW
దుర్గాపూర్ స్టీల్ థర్మల్ పవర్ స్టేషన్ పశ్చిమ బెంగాల్ 2x500=1,000
దుర్గాపూర్ థర్మల్ పవర్ స్టేషన్ పశ్చిమ బెంగాల్ 0 రాబోయే 1x800MW
కోడెర్మా థర్మల్ పవర్ స్టేషన్ జార్ఖండ్ 2x500=1,000 రాబోయే 2x800MW
చంద్రపుర థర్మల్ పవర్ స్టేషన్ జార్ఖండ్ 2x250=500 రాబోయే 1x800MW
బొకారో థర్మల్ పవర్ స్టేషన్ - ఎ జార్ఖండ్ 1x500
మొత్తం 6540
జలవిద్యుత్కేంద్రాలు[6][7]
విద్యుత్కేంద్రం పేరు రాష్ట్రం వ్యవస్థాపించిన సామర్థ్యం
MW లో
పంచేట్ ఆనకట్ట జార్ఖండ్ 80
మైథాన్ డ్యామ్ జార్ఖండ్ 63.2
తిలయా ఆనకట్ట జార్ఖండ్ 4
కోనార్ డ్యామ్ జార్ఖండ్ నిల్
మొత్తం 147.2
జాయింట్ వెంచర్లు
విద్యుత్కేంద్రం పేరు రాష్ట్రం వ్యవస్థాపించిన సామర్థ్యం
MW లో
వ్యాఖ్యలు
మైథాన్ పవర్ లిమిటెడ్ జార్ఖండ్ 2x525=1,050 మైథాన్ పవర్ లిమిటెడ్ యాజమాన్యం మధ్య జాయింట్ వెంచర్
డివిసి, టాటా పవర్ [8]
BPSCL పవర్ ప్లాంట్ జార్ఖండ్ 338 బొకారో పవర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ (BPSCL) యాజమాన్యంలో ఉంది
డివిసి, బొకారో స్టీల్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్ [9]

నీటి నిర్వహణ

[మార్చు]

డివిసి కింద నాలుగు ఆనకట్టలున్నాయి - బరాకర్ నదిపై తిలయ్యా, మైథోన్, దామోదర్ నదిపై పంచేట్, కోనార్ నదిపై కోనార్. అంతేకాకుండా, దుర్గాపూర్ బ్యారేజీని, కాలువలనూ 1964 లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అప్పగించారు. ఇవన్నీ మొత్తం నీటి నిర్వహణ వ్యవస్థలో భాగంగానే ఉన్నాయి. డివిసి ఆనకట్టలు 6.51 లక్షల క్యూసెక్కుల నుండి 2.5 లక్షల క్యూసెక్కులకు వరదలను తగ్గించగలవు.

1948 నుండి 1959 వరకు నాలుగు బహుళార్ధసాధక ఆనకట్టలను నిర్మించారు:

  • తిలయా డ్యామ్ (1953)
  • కోనార్ డ్యామ్ (1955)
  • మైథాన్ డ్యామ్ (1957)
  • పంచేట్ డ్యామ్ (1959)

4 జలాశయాలకు కలిపి 45.6 టిఎంసిల వరద నిల్వ సామర్థ్యం ఉంది. దీనికి 6,50,000 క్యూసెక్కుల గరిష్ఠ స్థాయి వరదను, 2,50,000 క్యూసెక్కుల సురక్షిత వరదనూ మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో పారిశ్రామిక, పురపాలక, గృహ అవసరాలను తీర్చడానికి 680 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయడానికి 4 డివిసి రిజర్వాయర్లలో 15 టిఎంసిల నీటిని నిల్వ చేస్తారు. దామోదర్ నదిపై దుర్గాపూర్ బ్యారేజీని 1955లో బర్ద్వాన్, బంకురా & హుగ్లీ జిల్లాలకు సాగునీటి సరఫరా కోసం నిర్మించారు.

  • స్థూల నీటిపారుదల సౌకర్యం: 569,000 హెక్టారులు (5,690 కి.మీ2)
  • నీటిపారుదల సామర్థ్యం: 364,000 హెక్టారులు (3,640 కి.మీ2)
  • కాలువలు: 2,494 కి.మీ. (1,550 మై.)

డివిసి నిర్మించిన సుమారు 16 వేల చెక్‌డ్యాముల నుండి నీటిని ఎత్తిపోసి, మెరక ప్రాంతాల్లో 30,000 హెక్టారులు (300 కి.మీ2) కు సాగునీటిని అందిస్తున్నారు.

జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు

[మార్చు]
మైథాన్ పవర్ లిమిటెడ్

విద్యుత్ కొరత ఉన్న ప్రాంతాల ఇంధన అవసరాలను తీర్చడం కోసం 1,050 మెగావాట్ల మైథాన్ కుడిగట్టు విద్యుత్కేంద్రాన్ని స్థాపించారు. దీని కోసం డివిసి, టాటా పవర్ కంపెనీలు కలిసి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసాయి.

బొకారో పవర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ (BPSCL)

డివిసి, SAIL సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ ఇది. విద్యుత్తు, నీటి ఆవిరి ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఇది బొకారో స్టీల్ లిమిటెడ్‌కు విద్యుత్తు, నీటి ఆవిరిని సరఫరా చేస్తుంది.

డివిసి EMTA కోల్ మైన్స్ లిమిటెడ్

క్యాప్టివ్ కోల్ మైన్ బ్లాకుల అభివృద్ధి, నిర్వహణ, డివిసి థర్మల్ పవర్ ప్రాజెక్టులకు ప్రత్యేకంగా బొగ్గు సరఫరా కోసం ఈస్టర్న్ మినరల్స్ & ట్రేడింగ్ ఏజెన్సీతో కలిసి ఈ జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది.

మైనింగ్ & అలైడ్ మెషినరీ కార్పొరేషన్ (MAMC)

దుర్గాపూర్‌లోని మైనింగ్ అండ్ అలైడ్ మెషినరీ కార్పొరేషన్ (MAMC) భారతదేశంలోని ప్రభుత్వ సంస్థలలో ఒకటి. అరవైల ప్రారంభంలో సోవియట్ యూనియన్ మద్దతుతో అప్పటి రూపాయి-రూబుల్ ఒప్పందం ప్రకారం దీన్ని స్థాపించారు. ఈ కన్సార్టియంలో భారత్ ఎర్త్ మూవర్స్‌కు అత్యధిక వాటా (48%) ఉండగా, మిగిలిన రెండు ప్రభుత్వ సంస్థలు - డివిసి, కోల్ ఇండియాలు ఒక్కొక్క దానికి 26% వాటా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "DVC". Archived from the original on 10 February 2007. Retrieved 23 October 2006.
  2. "Overview". DVC. Archived from the original on 16 November 2021. Retrieved 16 November 2021.
  3. Planning in India by Mahesh Chand, Vinay Kumar Puri, pages 422-423, Allied Publishers Private Ltd. ISBN 81-7023-058-6
  4. "Damodar Valley Corporation". Dams and Barrages. DVC. Archived from the original on 29 April 2010. Retrieved 6 June 2010.
  5. "Emphasis was laid on keeping the Damodar river and valley clean". Prabhat Khabar. Retrieved 18 June 2024.{{cite news}}: CS1 maint: url-status (link)
  6. 6.0 6.1 "Generating Units". report. DVC. Archived from the original on 8 December 2015. Retrieved 8 July 2016.
  7. 7.0 7.1 "Generating Units". DVC. Archived from the original on 2014-02-27.
  8. "Power puffed by Maithon 1050MW Tata-DVC plant chugs to life". Archived from the original on 1 June 2015.
  9. "The Official Website of BPSCL".