Jump to content

దిజ్ఞాగుడు

వికీపీడియా నుండి
(దిజ్నాగుడు నుండి దారిమార్పు చెందింది)
దిజ్ఞాగుడు

దిజ్ఞాగుడు (క్రీ. శ. 480-540) విఖ్యాత బౌద్ధ తర్కవేత్త. భారతదేశంలో నిగమన తార్కిక (Deductive Logic) అభివృద్ధికి తొలి పునాదులు వేసిన పండితుడు. తొలిసారిగా బౌద్ధ తార్కిక, జ్ఞానమీమాంస ప్రమాణాలను రూపొందించాడు.[1] భారతీయ తర్కశాస్త్ర పితామహుడిగా గుర్తించబడ్డాడు. ప్రమాణ సముచ్చయం, న్యాయ ప్రవేశం వంటి ప్రామాణిక గ్రంథాలు రాసి భారతీయ తర్కశాస్త్రాన్ని సమున్నత స్థితిలో నిలబెట్టాడు. బౌద్ధధర్మంలో ఆరు ఆభరణాలుగా (Six Ornaments) ఖ్యాతి పొందిన ఆరుగురు గొప్ప వ్యాఖ్యాతలలో (Six Great Commentators) దిజ్ఞాగుడు ఒకడు.[2] ఇతను తమిళనాడు లోని కాంచీపుర నివాసి. యోగాచార (విజ్ఞానవాద) సంప్రదాయకుడు. బౌద్ధ తత్వవేత్త వసుబందు యొక్క శిష్యుడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

5 లేదా 6వ శతాబ్దానికి చెందిన దిజ్నాగుడు తమిళనాడులోని కాంచీపురం సమీపంలో సింహవక్రం అనే పేరుగల గ్రామంలో ఇక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అంతకు మించి ఇతని బాల్య విశేషాలు తెలియవు. వాత్సీపుత్రీయ శాఖకు చెందిన ప్రసిద్ధ బౌద్ధ గురువు నాగాదత్తుని వద్ద బౌద్ధ ధర్మ దీక్షను పొందాడు. తదుపరి వసుబంధువుకు శిష్యుడైనాడు. తమ తమ రంగంలో గురువు వసుబందుని మించిపోయిన అతని నలుగురు ప్రధాన శిష్యులలో దిజ్నాగుడు ఒకడు. దిజ్నాగుడు జ్ఞానమీమాంస ప్రమాణాలలో గురువును మించిన ఖ్యాతి పొందాడు. నలందా మహావిహారంలో సుదర్జయుడు అనే బ్రాహ్మణ తర్కవేత్తను శాస్త్రంలో ఓడింఛి ఘనకీర్తిని పొందాడు. అనంతరం దక్షిణ భారతదేశంమంతటా పర్యటించినట్లు తెలుస్తుంది. దిజ్ఞాగుని శిష్యులలో శంకర స్వామి, ఈశ్వరసేన ముఖ్యులు.

దిజ్ఞాగుని జ్ఞానమీమాంస

[మార్చు]
దిజ్ఞాగుని ప్రకారం జ్ఞానాన్ని తెలుసుకొనే సాధనాలు (instruments of knowledge) : ప్రత్యక్ష (Perception), అనుమాన (Inference) ప్రమాణాలు

దిజ్ఞాగుని జ్ఞానమీమాంస, జ్ఞానం తెలుసుకోవడానికి రెండు రకాలైన ప్రమాణాలను గుర్తిస్తున్నది. అవి మొదటిది 'ప్రత్యక్ష' ప్రమాణం (Perception) : ఇది ఇంద్రియాల సాయంతో మాత్రమే కలిగే జ్ఞానం అంటే కంటికి కనిపించేది, చెవులకు వినిపించేది, స్పర్శకు తెలిసేది. రెండవది 'అనుమాన' ప్రమాణం (Inference) : ఇది న్యాయ లేదా తర్క శాస్త్రానికి మూలస్తంభం లాంటిది. ఒకదానిని చూసి, రెండవది వుంది వుండాలని గ్రహించడం. అంటే పూర్వానుభవం ద్వారా ఇంకొక దాన్ని ఊహించి అది వుందని నిర్ణయించడం అనుమానం అవుతుంది. ఉదాహరణకు దూరంగా కొండ మీద పొగ వస్తూ ఉంది. అది మనకు కనిపిస్తూ ఉంది. కాని అగ్ని అక్కడ వుందో లేదో తెలియదు. అటువంటప్పుడు కొండ మీద పొగను చూసి అక్కడ అగ్ని వుందని నిశ్చయించడం అనుమానం (Inference) అవుతుంది. ఇక్కడ కనిపించే పొగను 'సాధన' అని, కనిపించని అగ్నిని 'సాధ్య' అని అంటారు. దిజ్ఞాగుడు ఈ రెండు రకాలైన ప్రమాణాలను (ప్రత్యక్ష, అనుమానాలను) జ్ఞానాన్ని తెలుసుకొనే సాధనాలుగా (instruments of knowledge) మాత్రమే పరిగణించాడు.అయితే న్యాయ దర్శనకారులు పై రెండు ప్రమాణాలకు అదనంగా 'ఉపమాన' ప్రమాణం (comparison and analogy), 'శబ్ద' ప్రమాణం ద్వారా కూడా జ్ఞానాన్ని తెలుసుకోనేవీలవుతుంది అని చెప్పారు. ఇక్కడ శబ్ద ప్రమాణం అంటే ధ్వని కాదు. ఆప్త వాక్యాన్ని (reliable word) శబ్ద ప్రమాణంగా గ్రహిస్తారు. ఉదాహరణకు వేదాలు, శాస్త్ర గ్రంథాలు శబ్ద ప్రమాణంగా భావిస్తారు. అయితే దిజ్నాగుడు ఉపమాన, శబ్ద ప్రమాణాలను జ్ఞానం తెలుసుకొనే సాధనాలుగా పరిగణించలేదు. అయితే ప్రత్యక్ష ప్రమాణానికి లేదా అనుమాన ప్రమాణానికి ఆధారంగా శబ్దం (వాక్యం) వుంటుందే కాని జ్ఞాన సాధనకు ఉపకరించదు అని వివరిస్తాడు.

ప్రధాన రచనలు

[మార్చు]

దిజ్ఞాగుడు తర్కశాస్త్రానికి సంబంధించి సత్ ప్రామాణిక గ్రంథాలను సంస్కృత భాషలో రాసి భారతీయ తర్కశాస్త్రాన్ని సమున్నత స్థితిలో నిలబెట్టి భారతీయ తర్కశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధికెక్కాడు. ఇతను రాసిన గ్రంథాలలో సంస్కృతంలోని మూల ప్రతులు చాలా వరకు అలభ్యం. అయితే వాటి టిబెట్ భాషా అనువాదాలు చాలావరకు టిబెట్లో పదిలపరచబడ్డాయి. ఇతని గ్రంథాలలో ప్రమాణ సముచ్చయం, న్యాయప్రవేశిక లు అత్యంత ముఖ్యమైనవి. ఇతడు రచించిన గ్రంథాల జాబితా

  • హేతుచక్ర (The wheel of reason)
  • ప్రమాణ సముచ్చయం
  • న్యాయప్రవేశిక
  • ఆలంబన పరీక్ష (The Treatise on the Objects of Cognition)
  • త్రికాల పరీక్ష
  • మర్మ ప్రదీపవృత్తి

వీటిలో హేతుచక్ర (The wheel of reason) అనేది దిజ్ఞాగుని తర్క సంబందమైన తొలి గ్రంథంగా పరిగణించబడింది. ఇది సాధారణ తర్కం నుండి నిగమన తర్కానికి (deductive reasoning) తోవతీస్తుంది. సంస్కృతమున అలభ్యం కాని టిబెట్ అనువాదం దొరుకుతున్నది.

ప్రమాణ సముచ్చయం: దిజ్ఞాగుని గ్రంథాలలో ముఖమైనది ప్రమాణ సముచ్చయం. ఇది సంస్కృతంలో అనుష్టుప్ ఛందస్సులో రాయబడింది.[3] కాని ప్రస్తుతం ఈ సంస్కృత గ్రంథం అలభ్యం. దీనికి హేమవర్మ చేసిన టిబెట్ అనువాదం ఉంది. ఈ గ్రంథంలో సమస్త న్యాయ శాస్త్ర సిద్ధాంతాలను విశిదంగా ప్రతిపాదించడం జరిగింది. మొత్తం ఆరు పరిచ్చేదాలున్నాయి.1.ప్రత్యక్ష్యం 2.స్వార్దానుమానం 3.పరార్దానుమానం 4.హేతు దృష్టాంతం 5.అపోహ 6.జాతి [3]

న్యాయప్రవేశిక: న్యాయప్రవేశిక లేదా న్యాయముఖం అనేది తర్క శాస్త్రానికి కరదీపిక వంటిది. తర్కానికి ప్రవేశ ద్వారం అనదగిన ఈ సంస్కృత గ్రంథం సధర్మ, విధర్మ, హితవు మొదలగునవి వివరిస్తుంది. దిజ్ఞాగుని గ్రంథాలలో సంస్కృతంలో లభ్యమవుతున్న గ్రంథం ఇదొక్కటే. అయితే కొందరి దృష్టిలో న్యాయప్రవేశిక గ్రంథం దిజ్ఞాగుని శిష్యుడైన శంకర స్వామి యొక్క రచనగా భావించబడుతున్నది.

త్రికాల పరీక్ష: ఇది సంస్కృతమున అలభ్యం. టిబెట్ అనువాదం దొరుకుతుంది.
మర్మ ప్రదీపవృత్తి: ఇది వసుబంధుని అభిదమ్మకోశానికి రాసిన వ్యాఖ్య. అయితే దీని సంస్కృత మూలం, టిబెట్ అనువాదం కూడా లభించడం లేదు.

దిజ్ఞాగుని సాంప్రదాయం, వారసత్వం

[మార్చు]

దిజ్ఞాగుడు జ్ఞానాన్వేషణలో పేర్కొన్న జ్ఞానమీమాంస ప్రమాణాలు తదనంతరకాలంలో బౌద్ధ తత్వవేత్తలను మాత్రమే కాక న్యాయ దర్శనకారులను కూడా అమితంగా ప్రభావితం చేసాయి. ఇతడు అంగీకరించిన రెండు ప్రమాణాలు - ప్రత్యక్ష, అనుమాన లు జ్ఞానాన్ని తెలుసుకొనే సరైన సాధనాలుగా (Valid instruments of knowledge) గా నిలిచాయి. ఇతను పేర్కొన్న ప్రమాణాలపై తదనంతరకాలంలో ధర్మకీర్తి, ధర్మపాలుడు, శాంతభద్రుడు, శాంతరక్షిత మొదలుకొని రత్నకీర్తి (సా.శ. 11 వ శతాబ్దం) లాంటి పెక్కు మంది తత్వవేత్తలు ప్రమాణాలపై ఉద్గ్రంధాలు రచించారు. ఇదే విధంగా టిబెట్ దేశంలో కూడా జ్ఞానాన్వేషణ అభివృద్ధి చెంది చాబా (Cha-baa), శాక్య పండిత వంటి తత్వవేత్తలు (సా.శ. 13 వ శతాబ్దం) కూడా జ్ఞాన ప్రమాణాలపై గ్రంథాలు రాసారు.

హిందూ న్యాయ దార్శనికులకూ, బౌద్ధ న్యాయ దార్శనికులకూ మధ్యగల స్పర్ధతో కూడిన వివాదాలు చాలాకాలం నుండి ఉన్నప్పటికీ దిజ్ఞాగుని రాకతో అది భారతీయ తర్కశాస్త్ర అభివృద్ధికి దోహదం చేసింది. ఫలితంగా గొప్ప తార్కిక గ్రంథాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు న్యాయసూత్ర భాష్యకారుడైన వాత్సాయనుడు (కామసూత్ర గ్రంథ కర్త కాదు) రాసిన "న్యాయభాష్యాన్ని" ఖండిస్తూ దిజ్ఞాగుడు “ ప్రమాణ సముచ్చయం ” రాసాడు. దిజ్ఞాగుని దాడిని నిరోదిస్తూ, న్యాయసిద్ధాంతాన్ని సమర్దిస్తూ ఉద్యోతకారుడు “ న్యాయవార్తిక ” అనే గ్రంథాన్ని రాసాడు. దీనిపై దిజ్ఞాగుని సమర్దిస్తూ ఆచార్య ధర్మకీర్తి రచించిన ఏడు గ్రంథాలలో “ ప్రమాణవార్తిక” అనే గ్రంథం చాలా ముఖ్యమైనది. ఉద్యోతకారుని వాదనా సరళిని సమర్దిస్తూ వాచస్పతిమిశ్ర “ న్యాయవార్తిక తాత్పర్య టీకా ” అనే గ్రంథాన్ని రాసాడు. దీనిపై “ తాత్పర్య పరిశుద్ధి “ అనే భాష్య గ్రంథాన్ని ఉదయనాచార్యుడు వ్రాసినాడు. ఈ విధంగా దిజ్ఞాగుని ప్రమాణసముచ్చయంతో ప్రారంభమైన న్యాయ, బౌద్ధులమధ్య చెలరేగిన వాద ప్రతివాద ఫలితంగా ఏర్పడిన గ్రంథాలతో భారతీయ తత్వశాస్త్రం ఉన్నతశిఖరాలకు చేరింది.[4]

దిజ్ఞాగుడు బౌద్ధ తార్కికతా సంప్రదాయానికి పునాదులు వేసాడు. జ్ఞానాన్వేషణలో తర్క సంబందమైన ఇతని ఆలోచనలు దిజ్ఞాగుని పాఠశాల (School of Dignāga) గా లేదా దిజ్ఞాగ-ధర్మకీర్తి పాఠశాల (School of Dignāga-Dharmakīrti school) గా పిలవబడింది.

దిజ్నాగుడు బౌద్ధేతర సంస్కృత ఆలోచనాశీలురను కూడా ప్రభావితం చేసాడు. J.లారెన్స్ మేక్రియ, G.పరిమళ్, G.పాటిల్ ప్రకారం దిజ్నాగుడు భారత తత్వశాస్త్రాన్ని జ్ఞానాన్వేషణ వైపుకు తార్కికంగా తీసుకొనిపోయాడు. దిజ్ఞాగుని తదనంతర కాలంలో వచ్చిన తాత్విక ప్రశ్నలన్నీ జ్ఞానసంబందమైనవిగా పునర్ రూపొందించబడటం ప్రారంభమయ్యింది. అంటే ఎవరైనా తత్వవేత్తలు తత్వశాస్త్రంలో ఏదైనా ఒక అంశాన్ని లేవనేత్తవలసి వస్తే వారు పేర్కొనబోయే అంశం అభివృద్ధి చెందిన జ్ఞానసిద్ధాంతంలో ఒక భాగమేనని ముందుగానే నిరూపించుకోవాల్సిన అనివార్యమైన బాధ్యత తత్వవేత్తలపై పడింది.

రిఫరెన్సులు

[మార్చు]
  • Chu, Junjie (2006).On Dignāga's theory of the object of cognition as presented in PS (V) 1, Journal of the International Association of Buddhist Studies 29 (2), 211–254
  • Frauwallner, Erich, Dignāga, sein Werk und seine Entwicklung. (Wiener Zeitschrift für die Kunde Süd- und Ostasiens 2:83–164, 1959)
  • Hattori Masaaki, Dignāga, On Perception, being the Pratyakṣapariccheda of Dignāga's Pramāṇasamuccaya from the Sanskrit fragments and the Tibetan Versions (Cambridge, Mass.: Harvard University Press, 1968)
  • Hayes, Richard, Dignāga on the Interpretation of Signs (Dordrecht: Reidel Publishing Company, 1982)
  • Katsura Shoryu, Dignāga and Dharmakīrti on apoha in E. Steinkellner (ed.), Studies in the Buddhist Epistemological Tradition (Vienna, Österreichische Akademie der Wissenschaften, 1991), pp. 129–146
  • Mookerjee, S. The Buddhist Philosophy of Universal Flux, an Exposition of the Philosophy of Critical Realism as expounded by the School of Dignāga (Calcutta, 1935)
  • Sastri, N. Aiyaswami, Diṅnāga's Ālambanaparīkṣā and Vṛtti. Restored with the commentary of Dharmapāla into Sanskrit from the Tibetan and Chinese versions and edited with English translations and notes with extracts from Vinītadeva's commentary. (Madras: The Adyar Library. 1942) [1]
  • Tucci, Giuseppe, The Nyāyamukha of Dignāga, the oldest Buddhist Text on Logic after Chinese and Tibetan Materials (Materialien zur Kunde des Buddhismus, 15 Heft, Heidelberg, 1930)
  • Vidyabhusana, S.C. A History of Indian Logic – Ancient, Mediaeval and Modern Schools (Calcutta, 1921)

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Zheng Wei-hong; Dignāga and Dharmakīrti: Two Summits of Indian Buddhist Logic. Research Institute of Chinese Classics; Fudan University; Shanghai, China
  2. "Dignaga". Rigpa Shedra. Archived from the original on 27 జూన్ 2017. Retrieved 23 June 2017.
  3. 3.0 3.1 Pandita Baladevopadyaya. బౌద్ధ వాజ్మయ సర్వస్వం (తెలుగు అనువాదం) (2006 ed.). Hyderabad: భోదిశ్రీ నాగార్జునాచార్య విజ్ఞాన కేంద్రం. p. 210.
  4. దేవిప్రసాద్, చటోపాధ్యాయ. భారతీయ తత్వశాస్త్రం -సులభ పరిచయం (2016 జూన్ ed.). విజయవాడ: విశాలాంద్ర పబ్లిషింగ్ హౌస్. p. 19.