దేశపాండ్య సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేశపాండ్య సుబ్బారావు ప్రతేకాంధ్ర ఉద్యమ నాయకుడు, ఆంధ్రమహాసభ అధ్యక్షుడు. నంద్యాల ప్రముఖుడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించే ఉద్దేశంతో 1937లో నియమించిన సంఘంలో ఈయన సభ్యుడు. ఈ సంఘపు చర్చలే శ్రీబాగ్‌ ఒడంబడికకు దారితీసాయి.

ప్రత్యేక ఆంధ్రరాష్ట్రానికి దత్తమండలపు నాయకులు తొలుత సుముఖంగా లేరు. ఆంధ్ర మహాసభ నాయకులు తరచుగా పర్యటనలు జరిపి సాగించిన ప్రచారం ప్రభావమో తెలియదు కాని క్రమంగా ‘సీమ’వారి వైఖరి మారింది. 1915లో జరిగిన కర్నూలు జిల్లా రెండవ మహాసభ ఆంధ్ర ఉద్యమాన్ని, దాని ఆశయాలను పూర్తిగా బలపరిచింది. అదే సంవత్సరం విశాఖపట్నంలో జరిగిన తృతీయాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన చిత్తూరుకు చెందిన పానుగంటి రాజా రామారాయణింగార్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వెంటనే వద్దన్నాడే కానీ అసలే వద్దన లేదు. ఇదే సభలో పాల్గొన్న దేశపాండ్య సుబ్బారావు ఆంధ్ర రాష్ట్రాన్ని బేషరతుగా, మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఇలా అన్నారు "నేను సీడెడ్ జిల్లాలకు చెందిన వాడిని... ఆంధ్ర రాష్ట్రం సాధించాలన్న ఉత్సాహం మీకెంత ఉన్నదో మాకూ అంతే ఉన్నది. తిక్కనను చదివి, ఆనందించిన ప్రతి ఆంధ్రుడికీ ఆ కోరిక ఉండాలి. ఇంకోసారి చెబుతున్నాను - సీడెడ్ జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం కావాలంటున్నాయి" సుబ్బారావు లాంటివారి మద్దతుతో సీడెడ్ జిల్లాల ప్రతికూలతపట్ల సర్కార్ జిల్లాల వారికి సందేహాలు తగ్గాయి. ఆ జిల్లాలకు వెళ్లి సభలు పెడితే అక్కడివారూ మనకు ఇంకా చేరువవుతారు, మనతో కలిసి వస్తారు అని వల్లూరి సూర్యనారాయణరావు, కె.ఆర్.వి. కృష్ణరావు తదితరులు విశాఖపట్నం మహాసభలో సూచించారు. దానితో మరుసటి సంవత్సరం ఆంధ్రమహాసభ నెల్లూరులోనూ, ఆ తర్వాత నంద్యాలలోనూ జరిగింది.

1934లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమాన్ని పట్టించుకునే దిక్కులేని నిస్తబ్ధ దురవస్థలో దేశపాండ్య సుబ్బారావు ఆంధ్రత్వం మీది అభిమానంతో ఖర్చులు తానే పెట్టుకుని లండను వెళతానని ముందుకొచ్చాడు. ఆంధ్రుల తరఫున మాట్లాడటానికి నువ్వెవరు అని ఆయనను సీమలో ఎవరైనా అడిగే పరిస్థితి రాకూడదు కదా? అందుకని ఆయన కోరిన మేరకు పెద్దలు బద్ధకంగా కదిలి అతి కష్టంమీద విశాఖపట్నంలో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పరచి, సుబ్బారావును అధ్యక్షుడుగా ఎన్నుకుని, సభ పనుపున లండను రాయబారానికి అధికారికంగా పంపించారు. అదే పదివేలు అనుకున్న సుబ్బారావు ఎవరినీ పైసా అడక్కుండా సమస్త ఖర్చులూ తానే భరించి హుటాహుటిన ఓడ ఎక్కి లండన్ వెళ్లి బ్రిటిషు రాజకీయ ప్రముఖులను దర్శించి ఆంధ్రకు న్యాయం చెయ్యమని పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు వారు "మీకు జరిగింది న్యాయమో, అన్యాయమో మాకెలా తెలుస్తుంది? తగినంత ఆందోళన జరిగినప్పుడే కదా పరిస్థితి తీవ్రత మీకు అర్థమయ్యేను. ఇక్కడ మా వ్యవహారాలు కూడా తగిన పబ్లిసిటీ, ప్రాపగాండా లేనిదే పార్లమెంటులో పాసుకావు" అన్ని తిప్పి పంపారు.

ఈయన కన్నడ కథా, నాటక రచయిత టి.పి.కైలాసంకు సన్నిహిత స్నేహితుడు. 1933లో కైలాసం పంపిన లిటిల్ లేస్ అండ్ ప్లేస్ ప్రతి సుబ్బారావుకు బాగా నచ్చి, సొంతగా పుస్తకాన్ని అచ్చువేయించి, అన్ని ప్రతులను కైలాసానికి బహూకరించాడు.

1939లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు కర్నూలు జిల్లా, కాల్వబుగ్గలో ప్రారంభించిన రాజకీయ, ఆర్థిక శాస్త్రాల వేసవి పాఠశాలలో దేశపాండ్య సుబ్బారావు అధ్యాపకునిగా పనిచేశాడు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]