శ్రీబాగ్ ఒడంబడిక

వికీపీడియా నుండి
(శ్రీబాగ్‌ ఒడంబడిక నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించే ఉద్దేశంతో కుదిరిన ఒప్పందమే శ్రీబాగ్ ఒడంబడిక. 1937లో జరిగిన ఈ ఒప్పందం వీరిమధ్య సదవగాహనను పెంపొందించి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.

నేపథ్యం

[మార్చు]

ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య విభేదాలు ఉండేవి. 1926లో ఏర్పాటైన ఆంధ్ర విశ్వవిద్యాలయమును ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనే విషయంతో ఈ విభేదాలు మొదలయ్యాయి. అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి డా. సుబ్బారాయన్‌ తీసుకున్న నిర్ణయాలు ఇందుకు ఇతోధికంగా తోడ్పడ్డాయి. ఆ తరువాత, 1913నుండి, 1935 వరకు జరుగుతూ వచ్చిన ఆంధ్ర మహాసభ సమావేశాలలో, ఆంధ్ర కాంగ్రెసు కమిటీ ఎన్నికలలోను ఇవి బయటపడుతూ ఉండేవి. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశాలలో ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని ఓడించడానికి రాయలసీమ, నెల్లూరు ప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నించారు. 1924లో విజయవాడలో జరిగిన ఆంధ్ర కాంగ్రెసు కమిటీ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీచేసిన రాయలసీమకు చెందిన నాయకుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావును ఆంధ్ర నాయకులు ఓడించారు. ఆనాటి రాయలసీమ రాజకీయ నాయకత్వంలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండటం, వారు సహజంగానే ప్రత్యేకాంధ్రకు వ్యతిరేకంగా ఉండటం ఈ విభేదాలకు ఒక ప్రధాన కారణం. కేశవ పిళ్ళె, ఏకాంబర అయ్యర్ వీరిలో ప్రముఖులు.

ఒడంబడిక

[మార్చు]

1937లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభ రజతోత్సవాలలో పాల్గొన్న నాయకులు విభేదాలను తొలగించుకోవాలన్న నిశ్చయానికి వచ్చారు. మంత్రివర్గం ఏర్పాటు, నీటిపారుదల, రాజధాని మొదలైన విషయాలలో రాయలసీమకు రక్షణలు అవసరమన్న భావనను రాయలసీమ నాయకులు వ్యక్తపరచగా, ఈ విషయాలను పరిశీలించేందుకు ఒక సంఘాన్ని నియమించారు. ఈ సంఘ సభ్యులు:

ఈ సంఘంలో సభ్యులైన కె కోటిరెడ్డి, హెచ్‌ సీతారామరెడ్డి, కల్లూరు సుబ్బారావు, జి హరిసర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య, దేశి రాజు హనుమంతరావులు 1937 నవంబర్‌ 16న మద్రాసులో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లో సమావేశమై, ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఇంటి పేరుమీదనే ఈ చారిత్రాత్మక ఒప్పందానికి శ్రీబాగ్ ఒడంబడిక అని పేరు వచ్చింది.[1]

ముఖ్యాంశాలు

[మార్చు]

శ్రీబాగ్ ఒడంబడికలో కింది ముఖ్యాంశాలు ఉన్నాయి.[2]

  • విశ్వవిద్యాలయము: రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వం కొరకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద అనంతపురంలో ఒక కేంద్రం ఏర్పాటు చెయ్యాలి.
  • సాగునీటిపారుదల అభివృద్ధి: వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతంతో సమానమయ్యే వరకు సాగునీటి సరఫరా విషయంలో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  • శాసనసభ స్థానాలు జనాభా ప్రాతిపదికన కాక, ప్రాంత విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించాలి. రాయలసీమలో జనసాంద్రత కోస్తా కంటే తక్కువ కావడం వలన ఈ ప్రతిపాదన చేసారు. రాజధాని, హైకోర్టులు చెరో ప్రాంతంలో ఏర్పాటు చెయ్యాలి. ఏదికావాలో కోరుకునే హక్కు రాయలసీమకు ఉండాలి.

మూలాలు

[మార్చు]
  1. పి.రఘునాధరావు (1997). ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. న్యూఢిల్లీ: స్టెర్లింగ్ పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్. pp. 192, 193.{{cite book}}: CS1 maint: date and year (link)
  2. "ఎన్నెన్ని త్యాగాల ఫలమీ ఆంధ్రరాష్ట్రం!". ఆంధ్రపత్రిక. 1989-09-28. Retrieved 2024-04-18.