Jump to content

మల్లిపూడి పల్లంరాజు

వికీపీడియా నుండి

మల్లిపూడి పల్లంరాజు (1899 - 1962 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు. ఆంధ్ర ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రేసు పార్టీ యొక్క ప్రముఖ నాయకుడు.

పల్లంరాజు, 1899, ఏప్రిల్ 25న ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లాలోని బాలాంతరం గ్రామంలో, ఒక రైతు కుటుంబంలో వీరాస్వామి, సత్యవతి దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య పూర్తిచేసుకొని, కోయంబత్తూరులో వ్యవసాయ విద్యను అభ్యసించాడు. స్వాతంత్రోద్యమంలో మరో ప్రముఖుడైన బులుసు సాంబమూర్తి ప్రోత్సాహంతో, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు.[1] 1926లో గ్రామ మున్సిఫ్ పదవిని త్యజించి, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు, జిల్లా బోర్డు రాజకీయాలలో అడుగుపెట్టాడు.[2] ఈయన 1926 నుండి 1929 వరకు, 1939 నుండి 1940 వరకు, 1941 నుండి 1942 వరకు, మూడు సార్లు తూర్పు గోదావరి జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇది ప్రస్తుత జిల్లా పరిషత్ అధ్యక్షుడికి సమానమైన పదవి.[3] ఆ తరుణంలో ఒకసారి జిల్లా కలెక్టరు కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేసినందుకు అరెస్టయ్యాడు.[1]

స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ, ఉప్పు సత్యాగ్రహ కాలంలో, 1930 నుండి 1933 వరకు జరిగిన సేవాదళ్ క్యాంపుకు నేతృత్వం వహించాడు. తత్ఫలితంగా 1933 జనవరి నుండి డిసెంబరు వరకు పదకొండు నెలల కఠిన కారాగారశిక్ష అనుభవించాడు. ఆ తర్వాత సహకార నిరాకరణోద్యమ కాలంలో రెండు నెలల పాటు రాజమండ్రి కారాగారంలో శిక్షను అనుభవించాడు. 1940లో శాసనోల్లంఘణకు అరెస్టు అయ్యి ఒక నెల రోజులు పిఠాపురం జైల్లో గడిపాడు. 1940లో తిరిగి సంవత్సరకాలం పాటు నెల్లూరు, తిరుచ్చి కారాగారాల్లో ఉన్నాడు. ఈయన అలహాబాదు జైల్లో ఉండగా, తండ్రి చనిపోయిన వార్త అందింది. అయితే బ్రిటీషు ప్రభుత్వం తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వలేదు. దానితో అలహాబాదులోనే కర్మకాండలు నిర్వహించాడు.[1]

పల్లంరాజు 1937 నుండి 1940 వరకు వరుసగా అఖిల భారత కాంగ్రేసు కమిటీకి ఆంధ్రా నుండి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ సంవత్సరాలలో వరుసక్రమంలో 26, 29, 31, 27 మంది సభ్యులు ఆంధ్రా నుండి ఎన్నికయ్యారు[4][5][6][7] 1946లో మరలా అఖిల భారత కాంగ్రేసు కమిటీకి సభ్యుడిగాను, ఆంధ్ర ప్రాంత ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీలో సభ్యుడిగానూ ఎన్నికయ్యాడు[8]

సత్యాగ్రహోద్యమంలో 1940 డిసెంబరు 2న, యుద్ధ వ్యతిరేక నినాదాలు చేస్తూ సత్యాగ్రహాన్ని ప్రకటించినందుకు పల్లంరాజును బ్రిటీషు ప్రభుత్వం అరెస్టు చేసి, డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ సెక్షన్ 38(5), సెక్షన్ 38(1) క్రింద వెయ్యి రూపాయల జరిమానాతో పాటు, ఒక సంవత్సరకాలం కఠిన కారాగార శిక్షను విధించింది.[9]

పల్లంరాజు, స్వాతంత్రానికి ముందు, 1937లో మద్రాసు శాసనసభకు కాకినాడ నియోజకవర్గం నుండి ఎన్నికై శాసనసభ్యుడిగా పనిచేశాడు.[10] ఆ తర్వాత ఆంధ్ర రాష్ట శాసనసభలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రేసు పార్టీ అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యాడు.[1] 1952లో రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన పల్లంరాజు, 1955 ఎన్నికలలో కాకినాడ శాసనసభా నియోజకవర్గం నుండి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యాడు.[11] ఈయన 1960 నుండి 1962 వరకు దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో అటవీ, మత్స్య, పశుసంవర్ధక శాఖామంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో కూడ అటవీ, మత్స్య, పశుసంవర్ధక శాఖామంత్రిగా మరణించేదాకా కొనసాగాడు[12] 1961 నుండి 1962 వరకు పల్లంరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

పల్లంరాజు, 1962, సెప్టెంబరు 28వ తేదీన తెల్లవారుజామున 2:30 గంటలకు మరణించాడు. ఈయన రాజకీయ వారసత్వాన్ని, ఈయన కొడుకు, మనవడు, మూడు తరాల పాటు కొనసాగించారు. పల్లంరాజు కుమారుడు, మల్లిపూడి శ్రీరామ సంజీవరావు మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈయన మనవడు మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై, కేంద్ర ప్రభుత్వంలో రక్షణమంత్రిగా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Mallipudi Pallam Raju". Retrieved 30 July 2024.
  2. Baker, Christopher John (1976). The politics of South India, 1920-1937. Cambridge: Cambridge University Press. p. 136,. Retrieved 30 July 2024.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  3. "పనిచేయని జడ్పీ సెంటిమెంట్". ఈనాడు. No. 07 జూన్ 2024. 07 జూన్ 2024. Retrieved 2 August 2024. {{cite news}}: Check date values in: |date= (help)
  4. Mitra, Nripendra Nath (1937). Indian annual register: an annual digest of public affairs of India. Calcutta: Annual register office. p. 212. Retrieved 30 July 2024.
  5. Mitra, H.N (1938). Indian Annual Register, 1938. January - June. Vol. I. Annual Register Office. p. 316. Retrieved 30 July 2024.
  6. Mitra, Nripendra Nath (1939). The Indian Annual Register (jan-june1939) Vol-i. The Annual Register Office Calcutta. p. 338. Retrieved 30 July 2024.
  7. Mitra, Nripendra Nath (1940). The Indian annual register - Vol.1, No.1 (Jan.-June 1940). Calcutta: The Annual Register Office. p. 230. Retrieved 30 July 2024.
  8. Keskar, Balakrishna (1946). Congress Hand-book. p. 4,15. Retrieved 30 July 2024.
  9. Panikkar, K.N. (2009). Towards Freedom, 1940, Part 1. Indian Council of Historical Research. p. 469. Retrieved 30 July 2024.
  10. Reed, Sir Stanlay (1937). Indian year book 1937 - 38. Bombay: Bennatt Coleman. p. 93. Retrieved 30 July 2024.
  11. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 51.
  12. India A Reference Annual 1962. 1962. p. 416. Retrieved 31 July 2024.