ధర్మపాలుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్రీ.శ. 6 వ శతాబ్దానికి చెందిన ధర్మపాలుడు (క్రీ.శ. 530-561) యోగాచార (లేదా విజ్ఞానవాద) సంప్రదాయానికి చెందిన గొప్ప బౌద్ధ పండితుడు. తత్వవేత్త. నలందా విశ్వవిద్యాలయానికి మొదటి కులపతి (Chancellor).[1] ప్రసిద్ధ బౌద్ధ న్యాయపండితుడు అయిన భావవివేకుని (క్రీ.శ. 490-570) సమకాలికుడు.[2] ధర్మపాలుని శిష్యులలో శీలభద్రుడు, చంద్రకీర్తి ప్రసిద్ధులు.

ప్రారంభ జీవితం[మార్చు]

ప్రసిద్ధ చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ (క్రీ.శ.650 ప్రాంతం) ప్రకారం ధర్మపాలుడు తమిళనాడులోని కాంచీపురంలో బ్రాహ్మణ [3] కుటుంబంలో జన్మించాడు. రాజాస్థానంలోని ఒక ఉన్నతాధికారి కొడుకైన ఇతనికి రాజకుమార్తెతో వివాహం నిశ్చయమైంది. కాని పెళ్ళివిందు సందర్భంలో తప్పించుకొని బౌద్ధదీక్ష తీసుకొని విద్యా నిమగ్నుడై మహా పండితుడయ్యాడు. హీనయాన, మహాయానాల నుండి అన్ని దృక్పథాలను అధ్యయనం చేసాడు.[4] నలందా విశ్వవిద్యాలయంలో చేరి విఖ్యాత బౌద్ధ తర్కవేత్త దిజ్ఞాగుని వద్ద శిష్యుడిగా విద్య అభ్యసించాడు. దిజ్ఞాగుని తరువాత నలందా మహావిహారానికి అధిపతి అయ్యాడు. జీవిత చరమాంకంలో బోధి వృక్షం చెంత గడిపి క్రీ.శ. 561 ప్రాంతంలో మరణించాడు.[5]

తాత్వికత[మార్చు]

మాధ్యమికవాడులకు జగత్తులోని సర్వ పదార్ధాలు శూన్యములు. కాని యోగాచారికులు 'బుద్ధి' వలెనే జగత్తులోని సర్వపదార్ధాలు అసత్యంగా కనిపిస్తున్నాయి కాబట్టి విజ్ఞానం (చిత్తం లేదా చైతన్యం లేదా బుద్ధి) ఒక్కటే సత్యం అంటారు. ధర్మపాలుడు బౌద్ధంలో యోగాచారం లేదా విజ్ఞానవాదం సంప్రదాయానికి చెందిన తత్వవేత్త. ధర్మపాలుని తాత్వికత ప్రకారం బాహ్య పదార్ధాలు (extenal things) ఉనికిలో లేవు. చైతన్యం (consciousness) నకు మాత్రమే ఉనికి ఉంది. చైతన్యమే (చిత్తం) జగత్తు లోని వివిధ రూపాలను చూస్తుంది. కనుక చైతన్యానికి మాత్రమే వాస్తవికత ఉంది. ఇతని ప్రకారం 8 విధాలుగా విజ్ఞానం (చైతన్యం) కలుగుతుంది.[6] అవి. 1. చక్షుర్విజ్ఞానం 2.శ్రోత్ర విజ్ఞానం 3.ఘ్రాణ విజ్ఞానం 4.జిహ్వా విజ్ఞానం 5. కాయ విజ్ఞానం 6. మనో విజ్ఞానం 7. క్లిష్ట మనో విజ్ఞానం 8.ఆలయ విజ్ఞానం.

ప్రధాన రచనలు[మార్చు]

ధర్మపాలుని గ్రంథాలు

 • ఆలంబన-ప్రత్యయధ్యాన-శాస్త్ర-వ్యాఖ్య
 • విజ్ఞప్తి మాత్రతాసిద్ధి వ్యాఖ్య: ఇది వసుబంధుని విజ్ఞప్తి మాత్రతాసిద్ధి నకు వ్యాఖ్య. దీనిని హుయాన్ త్సాంగ్ చైనా భాషలో అనువాదం చేసాడు.[7]
 • శతశాస్త్ర వ్యాఖ్య: ఇది మాధ్యమికాచార్యుడైన ఆర్యదేవుని శతకశాస్త్రమునకు వ్యాఖ్య. దీనిని హుయాన్ త్సాంగ్ చైనా భాషలో అనువాదం చేసాడు.[8]

శిష్యులు-వారసత్వం[మార్చు]

ధర్మపాలుని శిష్యులలో శీలభద్రుడు, చంద్రకీర్తి, [9] ధర్మకీర్తి. జ్ఞానచంద్ర ముఖ్య్లులు.

 • చంద్రకీర్తి: ఇతను మాధ్యమిక సంప్రదాయానికి ప్రతినిధి. గొప్ప తర్కవేత్త.
 • శీలభద్రుడు: ఇతను హుయాన్ త్సాంగ్ నకు గురువు. ధర్మపాలుని బోధనలు గ్రహించడం కోసం హుయాన్ త్సాంగ్ నలందా మహావిహారానికి చేరుకొన్నాడు. అయితే అప్పటికే ఆచార్య ధర్మపాలుడు మరణించి వుండటంతో, ధర్మపాలుని శిష్యుడు శీలభద్రుని వద్ద హుయాన్ త్సాంగ్ శిష్యుడై అతని బోధనలు గ్రహించాడు. నలందాలో శీలభద్రుని వద్ద 5 సంవత్సరములు యోగాచార సంప్రదాయంపై అధ్యయనం చేసినట్లు హుయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు. ధర్మపాలుని అనంతరం నలందా మహావిహారానికి అధిపతిగా శీలభద్రుడు వచ్చాడు.

ధర్మపాలుని గ్రంథాలు సంస్కృతంలో విలుప్తమైనప్పటికి, అతని శిష్యుడు శీలభద్రుని బోధనల ద్వారా ధర్మపాలుని సిద్ధాంతాలు చైనాలో వ్యాప్తి పొందాయి.[10] అతని రచనలు చైనీయ అనువాదాలలో నిలిచి ఉన్నాయి.

మూలాలు[మార్చు]

 1. Om, Prakash. Cultural History of India (New Delhi ed.). New Age International Pvt Ltd. p. 338. ISBN 81-224-1587-3. |access-date= requires |url= (help)
 2. Williams, Paul (1989) Mahayana Buddhism. The doctrinal foundations. London: Routledge, p.88
 3. P. 293 India - A Travel Guide By Dr. B.R. Kishore, Dr. Shiv Sharma
 4. Beal, Samuel (2001) Life of Hiuen-Tsiang , Routledge, pp 138-9
 5. Lusthaus, Dan (2002) Buddhist phenomenology, a philosophical investigation of Yogacara Buddhism. Routledge, Chap. Fifteen, p. 395
 6. Swati Ganguly, Xuanzang, et al (1992) Treatise in thirty verses on mere consciousness , Motilal Banarsidass , p.11
 7. "The Major Systems And Their Literature". Encyclopedia Britanica. Encyclopedia Britanica. Retrieved 2 July 2017.
 8. Pandita Baladevopadyaya. బౌద్ధ వాజ్మయ సర్వస్వం (తెలుగు అనువాదం) (2006 ed.). Hyderabad: భోదిశ్రీ నాగార్జునాచార్య విజ్ఞాన కేంద్రం. p. 213.
 9. Pandita Baladevopadyaya. బౌద్ధ వాజ్మయ సర్వస్వం (తెలుగు అనువాదం) (2006 ed.). Hyderabad: భోదిశ్రీ నాగార్జునాచార్య విజ్ఞాన కేంద్రం. p. 212.
 10. Williams, P.,id. p.88